చిత్రలేఖన_కళా_చక్రవర్తి! - #vaddadi_papayya

              #చిత్రలేఖన_కళా_చక్రవర్తి! - #vaddadi_papayya














**ప్రభుత్వాలకు, పరిశ్రమలకు మాత్రమే ఉండే ‘లోగో’ (010) కలిగిన ఏకైక వ్యక్తి ఆయనే!
భూత, భవిష్యత్తులకు ప్రతీకలైన రెండు సున్నాల మధ్య ఠీవిగా నిల్చున్న ఒకటి ఆయన. అదే ఆయన లోగో!
ఆయనే #అమర_చిత్రకారుడు_వడ్డాది_పాపయ్య. తెలుగు రాష్ట్రాల్లో వపా, పావనం, వడ్డాది పాపయ్య పేర్లు చెబితే గుర్తుకువచ్చేది అందమైన, ఆహ్లాదకరమైన అపురూప వర్ణ చిత్రాలు. యాభయ్యేళ్లపాటు (1942-92) తన చిత్రాలతో తెలుగు సంస్కృతిని, అపరబ్రహ్మ ఇతిహాసాలను, పురాణాలు, కాలాలు, రాగాలు, నక్షత్రాలు, పున్నములు, గ్రహాలు, కావ్యనాయకులు, పురాణ పురుషులు, ప్రసిద్ధ వ్యక్తులు, పండుగలు, ఆచార వ్యవహారాల్ని తన కళాచాతుర్యంతో కమనీయ దృశ్య కావ్యాలుగా మలచి కళాభిమానుల్ని రంగుల లోకంలో విహరింపజేసిన మహోన్నత చిత్రకారుడాయన! ఆయన చిత్రాలు తెలిసినంతగా ఆయన జీవిత విశేషాలు ప్రజలకు తెలియవు. ప్రచారం
‘**'వ.పా.’ శ్రీకాకుళంలో 1921 సెప్టెంబరు 10న మహాలక్ష్మి, రామమూర్తి దంపతులకు జన్మించారు.
భారతీయ పురాణ, ఇతిహాసాలను, సంస్కృతీ సౌందర్యాలను కేరళకు చెందిన రాజా రవివర్మ, మహారాష్ట్రకు చెందిన దురందర్‌ వర్ణచిత్రపటాల ద్వారా ఊరూరా వ్యాప్తిచేస్తున్న కాలంలో, తల్లి ఇచ్చిన డబ్బులతో ఆ బొమ్మల్ని కొనుక్కుని, దాచుకొని, ఆకర్షితుడైన నాటి బాలుడే వడ్డాది పాపయ్య! తండ్రి శ్రీకాకుళం పాఠశాలలో డ్రాయింగ్‌, డ్రిల్‌ మాస్టారుగా పనిచేస్తూ ఉండేవారు. తండ్రి చిత్రరచనను ఏకాగ్రతతో వడ్డాది గమనించేవారు. ఇంట్లో రాజా రవివర్మ చిత్రించిన ‘కోదండరాము’ని చిత్రపటం ఎప్పుడూ కనుసన్నల్లోనే మెలగుతూ ఉండేది. తండ్రి మిగిల్చిన రంగులతో వ.పా. అయిదో ఏటే తన ఇంటి ఎదుట ఉన్న హనుమ మందిరంలోని ‘హనుమంతుని’ చిత్రం తొలిసారి గీశారు. 73వ ఏట ఆయన కాలధర్మం చెందేవరకు చిత్ర రచన కొనసాగించారు. ‘చక్రపాణి’ సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్రజ్యోతి’ 1942 ‘ఉగాది’ సంచికలో వ.పా వేసిన ‘రతీ-మన్మథ’ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో గొప్ప సంచలనం రేపింది. చాలామంది దాన్ని విమర్శించారు. ‘చిలకముక్కులా గుచ్చుకొంటోంది’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. దానినే తన మొదటి చిత్రంగా వడ్డాది చెప్పుకొన్నారు. వ.పా. చిత్రాన్ని ముందుగా పెన్సిల్‌తో ‘స్కెచ్‌’ గీసుకొని తరవాత రంగులు వేసేవారు.ఎలాంటి మోడళ్లూ లేకుండా చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత!
సుమారు మూడు దశాబ్దాలపాటు ‘చందమామ’ను వ.పా. తన కుంచెతో తీర్చిదిద్దారు. చక్రపాణి సంపాదకత్వంలో వచ్చిన మరో మాసపత్రిక ‘యువ’ వర్ణచిత్రాలు సైతం వీరివే. వ.పా. రేఖాచిత్రాలతో పాటు నీలిరంగుల్లో చిత్రాలు గీసేవారు. ఆయన తొలుత జానపద రీతుల్లో చిత్రరచన ప్రారంభించి, సంప్రదాయ, ఆధునిక విధానాలతోపాటు తన సొంత బాణీలో చిత్రరచన కొనసాగించారు. వర్ణచిత్రాలు ఎంత సహజసుందరంగా గీస్తారో, నలుపు- తెలుపు చిత్రాలు సైతం అంత చాకచక్యంగా చిత్రించేవారు. చిత్రంలో నీడలు ఆయన స్థాయిలో మరొకరు చూపించలేకపోయేవారు. ఛాయాచిత్రాలకు, ‘రియలిజాని’కి అందని అత్యున్నత విషయాన్ని ఆయన చూపించేవారు. ‘రంగుల్లో ఏమీలేదు, వాటిని పట్టించుకోను, రంగుల గురించి అయితే ఫొటోగ్రఫీ అన్నింటికన్నా గొప్పది’ అన్నది ఆయన అభిప్రాయం. ఆయన బొమ్మల్లో ఉండే పదునైన అందం దివ్యమైనది. ఆ బొమ్మలను పోలిన మనుషులు భూమిపై ఉండటం అసంభవం. ఎంతోమంది చిత్రకారులు ఆయన్ను అనుకరించబోయి చతికిలపడ్డారు. అనితరసాధ్యమైన మొనలుదేరిన బలమైన రేఖా విన్యాసం ఆయనది. దానితోనే మంచి లాలిత్యాన్నీ సౌకుమార్యాన్నీ చిత్రించేవారు. రంగులు సొంతంగా తయారు చేసుకునేవారు. ఆధునిక చిత్రకళ మరీ ముఖ్యంగా సర్రియలిజం, క్యూబిజం, ఎక్స్‌ప్రెషనిజం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. ప్రతీకాత్మకత అంటే వ.పా.కు అత్యంత ప్రీతి. సంకేత కళ భారతీయల పెన్నిధి. దేవుళ్ల రూపాలన్నీ సంకేతపరమైనవే. ఆయన చిత్రాలు సంకేతాత్మకంగా పలు భావాలు వ్యక్తపరుస్తాయి. ఆయన కశింకోటలో తన స్వగృహానికి పెట్టుకొన్న ‘010’ గుర్తు సంకేతాత్మకమైనది. ఆ గుర్తులు మనిషికి సంకేతమైన రెండు కళ్లు... ముక్కు!
**ఎన్నో ప్రయోగాలు...
చిత్రాలు గీయడంలో వ.పా. ఎన్నో ప్రయోగాలు చేశారు. తన ఇంటిగోడలపై, పరిసరాల్లో లభించే జేగురు మట్టి, సున్నం, బొగ్గు వాడి అతి తక్కువ ఖర్చుతో, అజంతా స్ఫూర్తితో చిత్రాలు వేశారు. చిత్రకళా పోటీలకు చిత్రాలు పంపలేదు. పురాణేతిహాసాలు చదువుకున్న అతితక్కువమంది చిత్రకారుల్లో వడ్డాది పాపయ్య ఒకరు. కార్టూన్లు, కార్టూన్‌ కథలు, కార్టూన్‌ సీరియళ్లు సైతం వేశారాయన. ఎలాంటి అవార్డులూ తీసుకోలేదు. చిత్రకళా ప్రదర్శనలూ పెట్టలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సన్మానాలు చేయించుకోలేదు. సభలకు వెళ్ళలేదు. చివరికి తన మరణవార్తను సైతం మీడియాలో ప్రచురించకూడదన్నది ఆయన కోరిక. తాను జీవించి ఉండగా చూసుకొనేందుకు ‘చరమచిత్రం’ చిత్రించుకొని మహభినిష్క్రమణ చేసిన కళావేత్త ఆయన. భౌతికంగా వడ్డాది పాపయ్య నేడు మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన వేలాది చిత్ర కళారూపాలు మన హృదయాల్లో ఎప్పటీకీ సజీవంగా ఉంటాయి!

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐