#పండిత_పరమేశ్వర శాస్త్రి_వీలునామా.⁉️

 --


#పండిత_పరమేశ్వర శాస్త్రి_వీలునామా.⁉️
( వ్యక్తి నుండి సమాజపు లోతుల్లోకి!-#శృంగవరపు_రచన)
**పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు నవల.
*ఇందులో కథ పెద్దది కాదు.
కానీ ఈ నవలలో కథ కన్నా కూడా కథనానికే ప్రాధాన్యత ఉండటం వల్ల ఈ నవలకు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది.
ఈ నవలలో ముఖ్య పాత్ర కేశవరావు. అతను అభ్యుదయ రచయిత. అలాగే మనిషి ఆలోచనల లోతులను కూడా తన రచనల్లో ఆవిష్కరించగల సామర్ధ్యం కలవాడు.
పండిత పరమేశ్వర శాస్త్రి ధవళేశ్వరంలో ఉండేవాడు. ఆయన సదాచార సంపన్నుడు. సుజాత పుట్టగానే వదిలిస్తే, ఆమెను స్కూల్ ప్యూన్ నరసయ్య పెంచుకుంటాడు. ఆమెను ఓ స్కూల్ సమావేశంలో చూసిన పరమేశ్వర శాస్త్రి గారు ఆమెను పెంచుకోవాలని నిర్ణయించుకుని నరసయ్య దంపతుల్ అంగీకారం మీద ఆమెను దత్తత తీసుకుంటాడు. అలా సుజాత ఆయన కూతురు అవుతుంది. పరమేశ్వర శాస్త్రి కూడా రచయిత. కాకపోతే గ్రాంథిక రచయిత. ఆయన దృష్టిలో అభ్యుదయ ఆలోచనలు మనుషుల నైతిక విలువలను ధ్వంసం చేస్తాయన్న అభిప్రాయం ఉంది.
కేశవరావు కూడా అదే ప్రాంతంలో ఉండేవాడు. కేశవరావు ఎటువంటి రచయిత అంటే అతనికి అభిమానులు ఉన్నా అభిమాన సంఘాలు ఏర్పాటును కానీ, రాజకీయాలను కానీ, సిద్ధాంతాలను కానీ మోయని వాడు.
‘కళావేత్తల పని జీవన చిత్రణ గాని, సిద్ధాంత నిర్వచన కాదని అతని విశ్వాసం. అందువల్ల అతని శిష్య వర్గాన్ని కూడా పోగు జేయలేదు. అతనికి శిష్యులు లేకపోలేదు. కాని వారిని ఒక గ్రూపుగా కూడగట్టడు. గ్రూపుగా ఏర్పడటం ఎవ్వరికీ శ్రేయస్కరం కాదని అతను వాదిస్తూ ఉంటాడు. గ్రూపు నిలబడటానికి ఒకరి మీది అభిమానమే చాలదనీ మరొకరి మీద ద్వేషం కూడా అవసరమని అతను భావిస్తాడు. ద్వేషం మానవ పురోభివృద్ధికి అట్టే సహాయపడదు. అందువల్లనే ప్రతిభావంతులందరూ ఇతరులవల్ల కంటే వారి శిశి వర్గం వల్లనే ఎక్కువ మలిన పడ్డారు.
శిష్యుల్లో గురువు స్థాయిని గ్రహించి అనుసరించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. గురువుని తమ స్థితికి గుంజి ఆనందపడే వారు ఎక్కువమంది ఉంటారు. అందువల్ల తన జ్ఞానాన్ని శిష్యులకు పంచిపెట్టే దానికంటే, శిష్యుల అసహనాన్ని గురువు మొయ్యవలసి వస్తుంది. ఇది భరించటం అంత తేలిక పని కాదు”, అని కేశవమూర్తికి ఈ విషయంలో ఉన్న ఆలోచనలను స్పష్టం చేశారు రచయిత.
కేశవమూర్తి రచనల పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారు పరమేశ్వర శాస్త్రి. సుజాత కేశవరావులు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్ల , ఆ ప్రేమకు పరమేశ్వర శాస్త్రి గారి అంగీకారం లేకపోవడం వల్ల, వారిద్దరి వివాహంతో పరమేశ్వర శాస్త్రికి ఆ దంపతులకు మధ్య దూరం పెరుగుతుంది భౌతికంగా మరియు మానసికంగా. ఈ సందర్భంలో కేశవరావు రచయితగా ఎదిగాక అతని చుట్టూ తిరిగి అతన్ని మొదట్లో అభిమానించి తర్వాత వివిధ వ్యక్తిగత కారణాల వల్ల అకారణ అసూయాద్వేషాలను పెంచుకుని అతని జీవితాన్ని నరకం చేస్తూ ఉంటారు. ఆ మిత్రుల్లో ఒకరు సీమంతం. అతను మొదట సుజాతను ఇష్టపడటం, సుజాత అతన్ని ఇష్టపడకుండా ఉండటం, కేశవరావుని వివాహం చేసుకోవడం వల్ల కలిగిన కోపంతోనూ, రచయితగా అతని ఎదుగుదల పట్ల ఉన్న ఓర్వలేనితనం వల్ల అతను కేశవమూర్తి గురించి దుష్ప్రాచారము చేస్తూ ఉంటాడు. ఈ మిత్రులు మొత్తం నలుగురు సీమంతంతో కలిసి. వారి పేర్లు,ప్రవర్తన గురించి రచయిత స్పష్టం చేసిన తీరు కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది.
రెండవ మిత్రుడు శారద్వతుడు. మూడో మిత్రుని పేరు రాధారమణ. నాలుగో మిత్రుడు పురూరవుడు. వీరు కూడా రాస్తూ ఉండటం వల్ల, మొదట్లో కేశవమూర్తి పట్ల అభిమానంగా ఉన్నా, అతను కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని సమర్ధించే కథను రాసినందుకు, అలాగే అతనిలో ఏ లోపం లేకపోయినా అతన్ని తప్పు పట్టడం, ఆ చెడ్డ ప్రచారాన్ని ఆ ప్రదేశం అంతా ముమ్మరం చేయడం,అందరి మనసుల్లో అతను చెడ్డవాడన్న భావనను బలపరచడం ద్వారా ఓ రకమైన సంతోషాన్ని పొందే స్వభావం కలవారు ఈ మిత్రులు నలుగురు. ఈ నలుగురు పరమేశ్వర శాస్త్రి గారి మనసులో కేశవరావు పట్ల ఉన్న వ్యతిరేకతను వృద్ధి పరిచారు. మద్రాసులో సినిమా రచయితగా ఎదిగే అవకాశం రావడంతో భార్యతో సహా అక్కడికి వెళ్తాడు కేశవరావు భార్యతో సహా. కేశవరావు రచయితగా ఎంత గొప్పవాడో, సాధారణ విషయాల్లో లౌక్యం తెలియని వ్యక్తి. ‘అతను పైకి ఎంత నిబ్బరంగా కనిపించినా,అమిత ఆవేశపరుడు. అసూయాపరుల చౌకబారు మాటలకు అతను బాధ పడటం నిజమే’, అని కేశవమూర్తి స్వభావం గురించి ఓ చోట రాశారు.
సుజాతకు కేశవమూర్తి పట్ల కూడా దురభిప్రాయం కలిగేలా చేస్తాడు సీమంతం ఓ సందర్భంలో. పండిత పరమేశ్వర శాస్త్రి చావు సమీపంలో ఉన్న సమయంలో తన ఆస్తిని ఆయన చేత ట్రస్టుకి రాయించి దానిని సొంతం చేసుకోవాలని సీమంతం లాంటి పథకం వేస్తారు. చివరకు ఆయన మరణించడం, ఆ ఆస్తి మొత్తం కేశవమూర్తి పేరున రాయడం, తాను అతన్ని అపార్ధం చేసుకున్నానని, మారిన తన మనసును బయలు పరచడానికి తన అహం అడ్డువచ్చిందని, కేశవమూర్తి రచనలు తనకు నచ్చాయని కూడా చెప్తూ ఉత్తరం కూడా రాయడం,అలాగే సుజాత ఆయన తన వంటావిడతో పెట్టుకున్న సంబంధం వల్ల పుట్టిన అమ్మాయి అని తన నమ్మకం అని కూడా రాస్తారు. ఆ తర్వాత సుజాత తల్లి కూడా రావడం, ఆ దంపతులతో కలిసి ఉండటం, పరమేశ్వర శాస్త్రి ఆస్తిని మంచి కార్యాలకు వినియోగించడానికి కేశవమూర్తి ప్రణాళికాబద్ధంగా ఉండటంతో నవల ముగుస్తుంది.
ఈ నవలలో అరవిందుల పుస్తకాలైన ‘దివ్య జీవనం’, ‘అతీత మానవుడు’ అనే పుస్తకాల గురించి ప్రస్తావన మాత్రమే కాకుండా అరవిందులు జీవితాన్ని వీక్షించిన కోణాల గురించి చైతన్యకేంద్రంగా వివరించారు.
ఈ నవలలో కేశవమూర్తి చుట్టూ జరుగుతున్న చెడు ప్రచారం జరుగుతున్నప్పుడు పాఠకులకు ఈ వ్యక్తి ఇంత అమాయకంగా ఎలా ఉన్నాడు?మానవుని లోపలి ఆలోచనల గురించి సంఘర్షణల గురించి అద్భుతమైన పుస్తకాలు రచించే రచయితగా, ఆయన రచనల్లోని ముఖ్య అంశాలను కూడా వివిధ సందర్భాల్లో రచయిత ఈ నవలలో స్పష్టం చేశారు.మనిషికి ఓ నిర్మలమైన చిత్తం ఏర్పడే క్రమంలో లౌకికత్వం బోధపడని తనం కూడా ఉంటుందేమో అని ఈ నవల చదువుతుంటే అనిపిస్తుంది. ఏది మంచో తెలియడం ఎంత ముఖ్యమో, చెడు ఎదురైనప్పుడు దానిని ఎదుర్కునే తత్వం లేనప్పుడు ఆ మంచితనం, జీవిత ఆదర్శాలు కూడా వ్యక్తిని సమాజంలో ఇమడనివ్వవు అని గోపిచంద్ గారు ఈ నవలలో చెప్పకనే చెబుతారు.
“ప్రకృతి స్వభావానికి చెందిన ఓ ముఖ్య సూత్రం ఇమిడి ఉంది దీనిలో. డార్విన్ ప్రకారం మొక్కలలో సైతం తమకంటే అధికంగా వున్న ఒక విశిష్టతను రూపొందించుకున్న మొక్కను మిగిలినవన్నీ కలిసి చంపి వేయటానికి ప్రబల ప్రయత్నం చేస్తాయట. జంతువులలోనూ అంతే. తమ మొత్తం జాతిలోకి విశిష్టంగా కనిపిస్తున్న జంతువును మిగిలినవి బ్రతుకనివ్వవు”, అని కేశవమూర్తికి మంచి మిత్రుడైన రామమోహనశాస్త్రి అతని మిత్రులు అతని పట్ల వ్యవహరిస్తున్న ధోరణి గురించి చెప్తాడు.
కేశవమూర్తి అభిప్రాయాలు,ఆదర్శాలు ఏర్పడిన క్రమాన్ని కూడా రచయిత ఎంతో చక్కగా చిత్రీకరించారు. కమ్యూనిజంను హింసకు, ప్రతీకారానికి మార్గంగా భావించి,ఆ భావజాలాన్ని పూర్తిగా అర్ధం చేసుకోకుండా కేవలం కమ్యూనిజం అన్నది తమకు నచ్చని వారిని హింసా స్పూర్తితో నిర్మూలించడమే అని అనుకునే ఓ యువకుడిని చూశాక కేశవమూర్తి ఆ పార్టీ మీద సానుభూతి ఉన్నా అందులో చేరడు. కేశవమూర్తి వ్యక్తిత్వంలో అమాయకత్వం,నిర్మలత్వం ఉంది. అలాగే తాను తను బాధ పడుతున్న సందర్భాల్లో కూడా దానిని ఎలా నివారించాలో తెలియనితనం ఉంది.
ఈ నవలలో ఆదర్శ రచయిత ఎలా లౌకిక వాదంలో, తన స్థాయికి ఎదగని సమాజంలో ఎలా మానసికంగా ఛిన్నాభిన్నం అవుతాడో స్పష్టం చేసే క్రమం ఉంది. గోపిచంద్ గారి రచనల్లో మానవ జీవితాల్లో లౌకికంగా ఉండలేకపోవడం వల్ల తలెత్తే విషాధాన్ని చిత్రించడం ఉంది. ఇదే మనస్తత్వం మనకు ఆయన ‘చీకటి గదులు’లో క్రిష్ణస్వామి పాత్రలో కూడా కొంతమేరకు కనిపిస్తుంది. మనం పుట్టినప్పటి నుండి ఏర్పరచుకునే విలువలు,ఆశయాలు,ఆదర్శాలు సమాజంలో కనబడనప్పుడు, వాటిని వెతుక్కునే క్రమంలో మనిషి తనను తాను కోల్పోలేక, సమాజంలో ఇమిడే మరో మనిషిగా మారలేక పడే బాధ ఈ నవలలో కూడా పాఠకులకు కనిపిస్తుంది. మనిషి తన లోపలికి తాను చూసుకోవడానికి ఉపకరించే సాహిత్యం గోపిచంద్ గారిది అనడంలో సందేహం లేదు.
‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐