గజేంద్రమోక్షం!!

-


                         గజేంద్రమోక్షం!!

*భిల్లీ భల్ల లులాయక భల్లుక ఫణి ఖడ్గ గవయ బలిముఖ చమరీ

ఝిల్లి హరి శరభ కరి కిటిమల్లాద్భుత కాక ఘూక మయమగు నడవిన్

భావం : మగ, ఆడ భిల్లులు, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, పాములు, గురుపోతులు, కొండముచ్చులు, చమరీ మృగాలు, ఈల పురుగులు, సింహాలు, శరభమృగాలు, ఏనుగులు శ్రేష్ఠమైన పందులతోను, ఆశ్చర్యాన్ని కలిగించే కాకులు, గుడ్లగూబలతో ఆ అడవి నిండిఉంది. అటువంటి అడవిలో...

ఈ పద్యం పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోనిది. దట్టమైన అడవిని వర్ణిస్తూ అందులో ఉండే రకరకాల జంతువులను వివరించాడు పోతన. భిల్లీభల్ల అంటే భిల్లుజాతికి చెందిన స్త్రీ పురుషులు. లులాయకం అంటే అడవిదున్నపోతు. భ ల్లుకం అంటేఎలుగుబంటి. ఫణి అంటే పాము. ఖడ్గ అంటే ఖడ్గమృగం. బలిముఖం అంటే కొండముచ్చు. చమరీ అంటే కస్తూరీ మృగం. ఝిల్లి అంటే ఈల కోడి. హరి అంటే సింహం. శరభం అంటే శరభమృగం. కరి అంటే ఏనుగు. కిటిమల్ల అంటే మేలుజాతి పంది. కాక అంటే కాకి. ఘూక అంటేగుడ్లగూబ. ఈ పద్యంలో ఇందులో ఇన్ని కొత్తపదాలకు అర్థాలు నేర్చుకోవచ్చు. అంతేకాక ఈ పద్యం తెలుగుభాషలో ఉన్న మంచి టంగ్ట్విస్టర్.

#తలగవు కొండలకైనను

మలగవు సింగములకైన మార్కొను కడిమిం

గలగవు పిడుగులకైనను

నిల బలసంపన్నవృత్తి నేనుగు గున్నల్

భావం : గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి. అందువల్ల అవి పెద్దపెద్ద కొండలను, సింహాలను సైతం లెక్కచేయవు. వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్న కారణంగా అవి ఏ జంతువు ఎదురువచ్చినా పక్కకు తప్పుకోవు. అడవంతా నిర్భయంగా, స్వేచ్ఛగా సంచరిస్తాయి.

పోతన రచించిన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో... గున్న ఏనుగులను గురించి పోతన ఈ పద్యంలో వర్ణించాడు. ఏనుగు గున్నలు అంటే పడుచు ఏనుగులు. ఇలన్ అంటే భూమి మీద. బలసంపన్నవృత్తిన్ అంటే ఎక్కువ బలం కలిగి ఉండటం వలన. కొండలకైనన్అంటే పెద్దపెద్ద కొండలు ఎదురైనప్పుడు. తలగవు అంటే పక్కకు తప్పుకోవు. మార్కొను కడిమిన్ అంటే ఎదిరించే శౌర్యం ఉండటం వలన. సింహములకైనన్ అంటే సింహాల వంటి క్రూరజంతువులు ఎదురైనప్పుడు. మలగవు అంటే పక్కకు తప్పుకుపోయేవి కావు. పిడుగులకైనను అంటే పిడుగులు పడినప్పటికీ. కలగవు అంటే కలత చెందవు. అడవికి రాజైన సింహం వంటి జంతువు సైతం ఏనుగును ముందు వైపు నుంచి ఎదిరించలేవు. అలా ముందుకు వస్తే తొండంతో ఎత్తి కిందపడేస్తాయి. వాటికి అంత బలం ఉంది. అందుకే సింహాలుకేవలం వెనుక నుంచి మాత్రమే ఏనుగులను ఎదిరించగలవు. భూమి మీద నివసించే ప్రాణులన్నిటిలోకీ ఏనుగే బలమైన జంతువు. పోతన రచించిన ఈ పద్యం చదివితే ఆ విషయం పూర్తిగా అర్థమవుతుంది.

#తొండంబుల మదజలవృత గండంబుల గుంభములను ఘట్టన సేయం

గొండలు దలక్రిందై పడు బెండుపడున్ దిశలు, సూచి బెగడున్ జగముల్

భావం: గున్న ఏనుగులు తమ తొండాలతో కొట్టగా, చెక్కిళ్లతో రాయగా, కుంభస్థలాలతో పొడవగా పెద్దపెద్ద కొండలు సైతం తల్లకిందులవుతున్నాయి. దిక్కులు నిస్సారమైపోతున్నాయి. లోకాలన్నీ భయభ్రాంతులతో నిండిపోతున్నాయి.

పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని పద్యం ఇది.

తొండంబుల అంటే ఏనుగు తొండాల నిండా. మదజలవృత అంటే మదజలముతో కూడిన గండంబులన్ అంటే చెక్కిళ్లను, కుంభములన్ అంటే కుంభస్థలాలను ఘట్టన సేయన్ అంటే పొడవడం. కొండలు తలక్రిందై పడున్ అంటే తలకిందులవుతున్నాయి. దిక్కులు అంటేనాలుగు దిక్కులు. బెండుపడున్ అంటే బలహీనపడుతున్నాయి. జగముల్ అంటే ముల్లోకాలు. బెగడున్ అంటే భయపడుతున్నాయి. పడుచు ఏనుగులు ఒకదానితో ఒకటి ఆడుకుంటున్న విధానాన్ని పోతన ఈ పద్యంలో వివరించాడు.

ఏనుగులు తమ తొండాలతో ఒకదానిని ఒకటి కొడుతుంటే, ఒకదాని చెక్కిలిని మరొకటి రాస్తుంటే, వాటి కుంభస్థలాలతో అవతలి ఏనుగును పొడుస్తుంటే ఆ శబ్దానికి పెద్దపెద్ద కొండలు భయపడిపోయి, తలకిందులయ్యాయట. నాలుగు దిక్కులూ దిక్కుతోచకఉండిపోయాయట. మూడు లోకాలలో ఉండే వారంతా భయంతో గజగజ వ ణికిపోయారట. అంత పెద్దపెద్ద ఘీంకారాలతో, శబ్దాలతో ఒకదానితో ఒకటి ఉత్సాహంగా ఆడుకుంటూ అందర్నీ భయపెట్టాయి.

#తుండంబుల బూరించుచు

గండంబుల జల్లుకొనుచు గళగళరవముల్

మెండుకొని వలుద కడుపులు

నిండన్ వేదండకోటి నీరుంద్రావెన్

భావం: ఏనుగులు తొండాల నిండుగా నీటిని తీసుకొని పైన చల్లుకొంటూ, చెంపల మీద చల్లుకొంటూ గడగడ ధ్వనులు చేస్తూ తమ పెద్ద కడుపులు నిండేలాగ నీళ్లు తాగాయి.

ఏనుగులు మంచినీరు తాగే విధానాన్ని పోతన తన భాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలో ఈ విధంగా వివరించాడు.

వేదండకోటి అంటే ఏనుగుల సమూహం. తుండంబులన్ అంటే తొండములతో. పూరించుచు అంటే నీటిని నిండించుకొనుచు. గండంబులన్ అంటే చెక్కిళ్లపైన. చల్లుకొనుచున్ అంటే ఒకరి మీద ఒకరు పోసుకుంటూ. గళగళరవముల్ అంటే తాగుతున్నప్పుడు వచ్చే గడగడచప్పుడు. మెండుకొనన్ అంటే అధికం కాగా. వలుద కడుపులు అంటే విశాలమైన (పెద్ద) పొట్టలు. నిండన్ అంటే నింపే విధంగా. నీరున్ అంటే మంచినీటిని. త్రావెన్ అంటే తాగెను. ఏనుగు అన్నిటి కంటె పెద్ద జంతువు. వాటి కడుపులు కూడా సహజంగానే పెద్దవిగా ఉంటాయి. అంత పెద్ద పొట్టలను నింపాలంటే చిన్ననోరు చాలదు. అలాగే కొద్దిపాటి నీరు కూడా చాలదు.

అందుకే వాటి కడుపులు నిండడానికి అనువుగా పెద్దపెద్ద తొండాలు ఉన్నాయి వాటికి. ఆ తొండాల నిండా నీరు తీసుకుని పెద్ద నోటి ద్వారా కడుపు నిండేలా లోపలికి పంపి దాహం తీర్చుకుంటున్నాయి.

#కరిదిగుచు మకరి సరసికి

గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్

గరికి మకరి మకరికి గరి

భరమనుచును నతల కుతల భటులదిరిపడన్

భావం: ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రానురాను ఏనుగుకి మొసలి భారమైంది. మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో అంటే భూలోకానికి కింద ఉన్న రెండు నివసిస్తున్నవీరులు ఈ రెండిటినీ చూసి ఇవి రెండూ ఒకదానిని మించినవి మరొకటి అని భయపడసాగారు.

కరిన్ అంటే ఏనుగును. సరసికి అంటే సరస్సులోకి. మకరి అంటే మొసలి. తిగుచున్ అంటే లాగుతోంది. కరి అంటే ఏనుగు. మకరిన్ అంటే మొసలిని. దరికి అంటే ఒడ్డునకు. తిగుచున్ అంటే లాగుతోంది. కరకరి బెరయన్ అంటే క్రూరత్వం ఎక్కువ కావడంతో. కరికి మకరి అంటేఏనుగునకు మొసలి. మకరికి కరి అంటే మొసలికి ఏనుగు. భరమనుచున్ అంటే ఒకదానికొకటి భారంగా మారి. అతల కుతల భటులు అంటే రెండు లోకాల (భూలోకానికి కింద ఉన్న రెండు లోకాలు) లో ఉండే వీరులు. అదిరిపడన్ అంటే భయపడుతున్నట్టుగా.

##ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం

బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన వా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

భావం : ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి, పెరిగి, లీనమవుతోందో! ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూలకారణమైన ప్రభువు అయి ఉన్నాడో! ఎవడు ఆదిమధ్యాంతాలు మూడూ తానై ఉన్నాడో! ఎవడు తనకు తాను పుట్టినవాడో! ఈ ప్రపంచానికంతటికీ అటువంటిప్రభువైనవానిని శరణు కోరుతున్నాను.

జగము అంటే ఈ ప్రపంచమంతా. ఎవ్వనిచే జనించున్ అంటే ఎవని వలన పుట్టినదో. లీనమై అంటే కలిసిపోయినదో. ఎవ్వని లోపల అంటే ఎవనియందు. ఉండున్ అంటే ఉండునో. ఎవ్వనియందు డిందు అంటే ఎవ్వనియందు నశించునో. ఎవ్వడు పరమేశ్వరుడు అంటే ఎవడుమహాప్రభువో. ఎవ్వడు మూలకారణంబు అంటే ప్రధాన కారణం ఎవరో. అనాది మధ్య లయుడు అంటే ఆది మధ్య అంతాలు తానై ఉన్నాడో. వానిన్ అంటే అటువంటివానిని. ఆత్మభవున్ అంటే తనకు తానుగా పుట్టినవానిని. ఈశ్వరున్ అంటే సర్వలోక ప్రభువును. నేనుశరణంబు వేడెదను అంటే నేను శరణు వేడుకొంటాను.

*#కలడందురు దీనులయెడ

కలడందురు పరమయోగి గణములపాలం

కలడందురన్ని దిశలను

కలడు కలండనెడువాడు కలడో లేడో!

భావం: భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు. ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు. అన్నిదిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా?

దీనులయెడన్ అంటే దీనుల పట్ల. కలడందురు అంటే భగవంతుడు ఉన్నాడంటారు. పరమయోగి గణములపాలన్ అంటే మహాయోగుల సమూహాలందు. కలడందురు అంటే ఉన్నాడంటారు. అన్ని దిశలను అంటే అన్ని దిక్కులలోనూ కలడందురు అంటే ఉన్నాడంటారు. కలడుకలడంనెడువాడు అంటే రూఢిగా ఉన్నాడు చెప్పబడుతున్న భగవంతుడు. కలడో లేడో అంటే అసలు ఉన్నాడో! లేడో!

ఈ పద్యంలో పోతన కలడు అనే పదాన్ని ప్రతిపాదంలోనూ ఉపయోగించాడు. గజేంద్రుడు విష్ణుమూర్తిని ఎంత ప్రార్థించినా రాకపోయేసరికి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాన్ని వెలిబుచ్చుతాడు. శక్తికోల్పోయి, నిస్సహాయస్థితిలో ఉన్న గజరాజుకి దేవుని మీదకోపం కలిగి, ఆ కోపంలో అసలు దేవుడనేవాడు ఉన్నాడా? ఒకవేళ ఉండి ఉంటే నా ప్రార్థనను మన్నించి నన్ను రక్షించేవాడు కదా! అనుకుంటాడు. ఆ సందర్భంలోని పద్యం ఇది.

*#ఒకపరి జగముల వెలినిడి

యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై

సకలార్థసాక్షియగు న

య్యకలంకుని నాత్మమయుని నర్థి దలంతున్

భావం : ఒకసారి లోకాలను బయట ఉంచుతూ, మరొకసారి తన లోపల ఉంచుకుంటూ అంటే ప్రపంచాన్ని చూపటం, అంతలోనే దానిని మాయం చే యటం ఈ రెండూ తానే అయ్యి, ప్రపంచంలో జరిగే వాటన్నింటికీ తానే సాక్షి అవుతూ ఉన్న దోషరహితుడు, ఆత్మమయుడుఅయినవానిని ఆర్తితో కొలుస్తాను.

ఒకపరి అంటే ఒకసారి. జగములన్ అంటే లోకాలను. వెలినిడి అంటే బయటకు కనిపించేలా చేసి. ఒకపరి అంటే మరొకసారి. లోపలికి గొనుచు అంటే తనలోపల ఇముడ్చుకుంటూ అంటే మాయం చేస్తూ. ఉభయమున్ అంటే ఆ రెండుపనులను. తానై అంటే తానే అయి. సకలార్థ సాక్షియగు అంటే ప్రాపంచిక విషయాలకు తాను సాక్షి మాత్రమే అయి ఉండు. ఆ అకలంకునిన్ అంటే దోషం లేనివానిని. ఆత్మమయుని అంటే సర్వాంతరాత్ముని. అర్థిన్ అంటే ఆసక్తితో. తలంతున్ అంటే ధ్యానిస్తాను.

గజేంద్రమోక్షంలోని ఈ పద్యం పూర్తిగా వేదాంతాన్ని బోధిస్తుంది. దేవుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడనే విషయాన్ని పోతన తన సహజధోరణిలో వివరించాడు.

*#లోకంబులు లోకేశులు

లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వం

డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్

భావం: లోకాలు, లోకాధిపతులు, లోకులు నశించిన తరవాత, లోకమనేది లేనప్పుడు ఏర్పడే దట్టమైన చీకటికి అవతల ఏ పరమపురుషుడు ఒకే ఆకారంతో ప్రకాశిస్తాడో అతనిని మాత్రమే నేను సేవిస్తాను. లోకంబులు అంటే పద్నాలుగు లోకాలు. లోకేశులు అంటే వాటినిపరిపాలించేరాజులు. లోకస్థులు అంటే ఆ లోకంలో ఉండే చరాచరజీవులు. తెగిన అంటే నశించిన. తుదిన్ అంటే కడపట లేదా యుగాంతంలో వచ్చే ప్రళయకాలంలో. అలోకంబగు అంటే లోకములు లేనిదైన. పెంజీకటికి అంటే గాఢాంధకారానికి అవ్వలన్ అంటే అవతల. ఎవ్వండు ఏకాకృతిన్ అంటే ఒకే ఆకారంతో ఎవరైతే వెలుగున్ అంటే ప్రకాశిస్తాడో అతనిని. నే సేవింతున్ అంటే నేను కొలుస్తాను.

తెలుగుసాహిత్యంలో ఈ పద్యానికి పెద్దపీట వేశారు. ఇంతకుమించిన పద్యం మరొకటి లేదనేంత పేరున్న పద్యం ఇది. భగవంతుడు ఎక్కడ ఉంటాడనే విషయాన్ని పోతన తన మనోనేత్రంతో చూసి వివరించాడు.

*#లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్

ఠావుల్ దప్పెన ు మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్

నీవే తప్ప నితః పరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్

రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

భావం: శారీరకబలం, మనోబలం రెండూ క్షీణించాయి. ప్రాణాలు కడముట్టాయి. శరీరం అలసిపోయింది. నువ్వు తప్ప నాకు మరో దైవం తెలియదు. నన్ను దయతో ఆదరించు. ఈ దీనుడిని కాపాడు. నువ్వు వరాలిస్తావు. మంచిని కలిగించే మనసు కలవాడవు కదా స్వామీ!

లావు + ఒక్కింతయున్ లేదు అంటే ఏమాత్రం బలం లేదు. ధైర్యము విలోలంబయ్యెన్ అంటే ధైర్యం పూర్తిగా చెదిరిపోయింది. ప్రాణంబులున్ ఠావుల్ తప్పెను అంటే పంచప్రాణాలు తమతమ స్థానాలను కోల్పోయాయి.

మూర్ఛవచ్చెన్ అంటే స్పృహకోల్పోయే స్థితి వచ్చింది. తనువున్ అంటే శరీరం కూడా. డస్సెన్ అంటే అలసిపోయింది. శ్రమంబు + అయ్యెడిన్ అంటే కష్టం కూడా కలిగింది. నీవే తప్ప అంటే నీవు కాకుండగా. ఇతఃపరంబెరుగ అంటే వేరొకరిని ఎరుగను. దీనునిన్ అంటే దైన్యముపొందిన నన్ను. మన్నింపందగున్ అంటే ఆదరించు. ఈశ్వర అంటే ప్రపంచాన్ని పాలించేవాడా! రావే అంటే రమ్ము. వరద అంటే దానం చేసేవాడా (వరాలు ఇచ్చేవాడా)! కావవే అంటే కాపాడు. భద్రాత్మకాఅంటే మంచిని కలిగించే మనసు కల ఓ స్వామీ! సంరక్షించు అంటేనన్ను రక్షించు.

పోతన రచించిన మహాభాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని ఈ పద్యం గజరాజు బాధను వివరిస్తుంది. మొసలి కాలు పట్టుకుని లాగుతుంటే ఏనుగు దానినోటి నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. చివరికి దానిలోని శక్తి సన్నగిల్లుతుంది. తనను రక్షించమనివిష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. ఆ సందర్భంలోని పద్యం ఇది.

*#వినుదట జీవుల మాటలు

చనుదట చనరాని చోట్ల శరణార్థుల కో

యనుదట పిలిచిన సర్వము

గనుదట సందేహమయ్యె గరుణావార్థీ!

భావం : ఓ కృపాసముద్రుడా! నీవు అంతటా వ్యాపించి ఉండి, అన్ని జీవుల మాటలను వినగలవట. విన్నవెంటనే వెళ్లలేని ప్రదేశాలకు సైతం వెళ్లగలవట. ఆపదలో ఉండి శరణు కావాలని నిన్ను ఆర్తితో పిలిచినంతనే వారిని ఆదుకుంటావట. నీకు అన్ని విషయాలూ తెలుసట. శరణు కావాలని కోరిన నన్ను రక్షించటానికి నీవు ఇంతవరకు రాలేదు. అందువల్ల నిన్ను గురించి నాకు తెలిసిన విషయాలనన్నిటినీ సందేహించవలసి వస్తోంది.

కరుణావార్థీ అంటే ఓ కృపాసముద్రుడా! జీవుల మాటలు అంటే జీవుల పలుకులను (ప్రార్థనలను). వినుదు+అట అంటే వింటావట. చనరానిచోట్ల అంటే ఎవరూ చొరలేనటువంటి ప్రదేశాలకైనా. చనుదు + అట అంటే వెళతావట. పిలిచినన్ అంటే రక్షించమని నిన్నుపిలిచినంతనే. శరణార్థులకు అంటే శరణు కోరిన వారికి.. ఓయనుదు + అట అంటే ఓ! ఇదిగో వస్తున్నాను! అనుదు + అట అంటే అంటావట. సర్వమున్ అంటే సమస్తాన్ని. కనుదు + అట అంటే చూడగలవట అనే విషయంలో. సందేహమయ్యె అంటే అనుమానమనిపిస్తోంది.

భగవంతుడు అందరినీ రక్షిస్తాడని భక్తులు భావిస్తారు. సాక్షాత్తు విష్ణుమూర్తి శరణుకోరిన వారిని ర క్షిస్తాడ ని ఆయన ఆర్తజనరక్షకుడని పేరు. అటువంటి భగవంతుడు తనను రక్షించడానికి ఇంకా రాలేదనే బాధలో గజరాజు విష్ణుమూర్తిని అనుమానించాడు. పోతన రచించినమహాభాగవతంలోని గజేంద్రమోక్షం ఘట్టంలోని ఈ పద్యంలో ఉన్న ... వినుదట, చనుదట, యనుదట, కనుదట వంటి పదాలు వినసొంపుగా ఉంటాయి.

*#అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా

పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో

త్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి

హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై

వైకుంఠపురంలో రాజభవన సముదాయం ఉంది. అందులో ఉన్న ప్రధాన భవనానికి దగ్గరలో కల్పవృక్ష వనం ఉంది. అందులో అమృతసరోవరం ఉంది. దాని తీరంలో చంద్రకాంత శిలావేదిక ఉంది. దాని మీద కలువపూలు పరచిన శయ్య ఉంది. ఆ శయ్య మీద లక్ష్మీదేవితోఆనందిస్తున్నాడు దీనజనశరణ్యుడయిన శ్రీమన్నారాయణుడు. తన భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ... సర్వేశ్వరా, పరాత్పరా! నన్ను రక్షించు... రక్షించు అని పిలవటంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచి...

అలైవె కుంఠపురంబులో అంటే అక్కడ వైకుంఠపురంలో. నగరిలో అంటే రాజభవన సముదాయంలో. ఆమూల సౌధంబు దాపల అంటే ఆ ప్రధాన సౌధానికి సమీపంలో. మందారవనాంతర అంటే మందారవనం మధ్యభాగాన. అమృతసరస్ అంటే అమృతసరస్సు యొక్క. ప్రాంత అంటే సమీపంలో. ఇందుకాంత + ఉపల అంటే చంద్రకాంతపు రాళ్లమీద. ఉత్పల పర్యంక అంటే కలువపూల శయ్యమీద. రమావినోదియగు అంటే లక్ష్మీదేవితో వినోదిస్తున్నవాడైన. ఆపన్న ప్రసన్నుండు అంటే కష్టాలలో ఉన్నవారిని రక్షించేవాడు. విహ్వల అంటేఅదుపుతప్పిన. నాగేంద్రము అంటే గజరాజు. పాహిపాహి అనన్ అంటే రక్షించు - రక్షించు అనే. కుయ్యి + ఆలించి అంటే పిలుపు విని. సంరంభియై అంటే ర క్షించాలను ఉత్సాహం కలవాడై...

గజేంద్రమోక్షం ఘట్టంలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన పద్యం. ఈ పద్యంలో వైకుంఠంలో విష్ణుమూర్తి ఉండే ప్రదేశాన్ని చాలా స్పష్టంగా వర్ణించాడు మహాకవి పోతన. తెలుగువారందరూ తప్పక నేర్చుకోవలసిన పద్యాలలో ఇది ఒకటి.

**#సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే

పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం

తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

భావం: తనను రక్షించమని కోరిన గజేంద్రుని ప్రాణాలను రక్షించటానికి ఎంతో సంతోషంతో హఠాత్తుగా బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు. ఎందుకు వెళుతున్నాడన్నమాట కనీసం లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. రెండుచేతులలో శంఖచక్రాలు ధరించలేదు. తనపరివారంలోని వారెవరినీ సహాయంగా రమ్మనలేదు. తన వాహనమైన గరుత్మంతుని అధిరోహించలేదు. చెవుల వరకు జారిన జుట్టును కూడా సరిచేసుకోలేదు. అంతకు ముందే జరిగిన చదరంగ క్రీడలో తన చేతిలో లక్ష్మీదేవి ఓడిపోయింది. ఆ సమయంలో తన చేత చిక్కినలక్ష్మీదేవి పైట చెంగును సైతం విడిచిపెట్టలేదు.

సిరికిన్ + చెప్పడు అంటే భార్య అయిన లక్ష్మీదేవికి సైతం చెప్పలేదు. చేదోయిన్ అంటే రెండు చేతులలోనూ. శంఖచక్రయుగమున్ అంటే శంఖువు, చక్రం రె ండింటినీ. సంధింపడు అంటే చేతిలోకి తీసుకోలేదు. ఏ పరివారంబును అంటే తన అనుచరులలో ఏ ఒక్కరినీ. చీరడుఅంటే పిలవలేదు. అభ్రగపతిన్ అంటే పక్షీంద్రుడైన గరుత్మంతుడిని. మన్నింపడు అంటే సిద్ధంగా ఉండమని చెప్పలేదు. ఆకర్ణికాంతర అంటే చెవిపక్కగా ఉన్న పూవు వరకు జారిన. ధమ్మిల్లము అంటే జుట్టు ముడిని. చక్కనొత్తడు అంటే సరిచేసుకోలేదు. వివాదప్రోత్థిత అంటేఅప్పటివరకు దెబ్బలాడి అప్పుడే లేచిన. శ్రీ అంటే లక్ష్మీదేవియొక్క. కుచ + ఉపరి అంటే స్తనాల మీద ఉన్నటువంటి. చేల + అంచలమునైనన్ అంటే చీరచెంగును సైతం.

గజప్రాణ + అవన + ఉత్సాహియై అంటే గజరాజు ప్రాణాలను కాపాడాలనే సంతోషంతో. వీడడు అంటే విడిచిపెట్టలేదు.తనను రక్షించమని ఆర్తనాదం చేసిన గజేంద్రుని రక్షించాలనే ఉత్సాహంతో శ్రీమన్నారాయణుడు ఎవ్వరికీ చెప్పకుండా ఏ విధంగా పరుగుపరుగున వెళ్లాడో ఈపద్యంలో వివరించాడు పోతన. ఎవరినైనా రక్షించవలసి వ చ్చినప్పుడు ఉన్నపళంగా వెళ్లిపోతారే గాని, అందరినీ సంప్రదించి, అన్నీ సమకూర్చుకుని వెళ్లరు. ఆ హడావుడంతా ఈ పద్యంలో అర్థమవుతుంది.

**#తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్ వాని వె

న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ

క్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొ

య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్

భావం: శరణుకోరిన వారిని తక్షణమే రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు. ఆయన గజరాజు పిలుపు విని త్వరత్వరగా బయలుదేరాడు. ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరింది. ఆమె వెంట అంతఃపురంలోని స్త్రీలంతా బయలుదేరారు. వారి వెంట గరుత్మంతుడు, ఆయన వెంటధనుస్సు, శంఖ చక్రాలు, గద మొదలయిన దివ్యాయుధాలు బయలుదేరాయి. వాటివెంట నారదమహర్షి, ఆ వెనుకే విష్వక్సేనుడు బయలుదేరారు. మొత్తానికి వైకుంఠంలోని సమస్త దేవతలు కదలి వచ్చారు.

తనవెంటన్ అంటే తన వెనుకే. సిరి అంటే లక్ష్మీదేవి. లచ్చి వెంటన్ అంటే లక్ష్మీదేవి వెనుక. అవరోధవ్రాతమున్ అంటే అంతఃపురంలోని నారీజనం. దాని వెన్కను అంటే ఆ సమూహం వెనుక. పక్షీంద్రుడు అంటే గరుత్మంతుడు. వాని పొంతను అంటే అతనికి దగ్గరగా. ధనుఃకౌమోదకీ శంఖ చక్ర నికాయంబును అంటే శార్ఙ్గమనే ధనుస్సు, కౌమోదకి అనే గదాయుధం. పాంచజన్యమనే శంఖం.. సుదర్శనమనే చక్రం మొదలైన ఆయుధాల సమూహం.

నారదుండు అంటే నారదమహర్షి. ధ్వజినీకాంతుండు అంటే విష్ణుసేనాధిపతి అయిన విష్వక్సేనుడును. రాన్ అంటే రాగా. ఒయ్యన అంటే క్రమంగా. వైకుంఠపురంబునం గలుగువారు అంటే వైకుంఠంలో ఉన్న. ఆబాలగోపాలమున్ అంటే పిల్లల నుంచి పశువులకాపరులవరకుఅందరూ వచ్చారు. ఈ పద్యం చదివితే వైకుంఠంలో ఉండే పరివారమం గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. గజేంద్రమోక్షంలోని ఈ పద్యంలో పోతన వైకుంఠాన్ని కళ్లకు కట్టినట్లు వివరించాడు.

***#అడిగెదనని కడువడి జను

నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్

వడివడి జిడిముడి తడబడ

నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్

భావం: తన భర్త అయిన విష్ణుమూర్తి హడావుడిగా ఎక్కడికి వెళుతున్నాడోఅర్థం కాలేదు లక్ష్మీదేవికి. ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో త్వరత్వరగా ఆయన వెంట పరుగె త్తింది. ఆ తొందరలో విషయం ఏమిటని అడిగినా ఆయన బదులు చెప్పడని ఠక్కునఆగిపోతుంది. అంతలోనే కలవరపడుతూ ముందుకు అడుగు పెట్టింది. మళ్లీ అంతలోనే ఏ విషయమూ సరిగా చెప్పడనే భావనతో కదలకమెదలక నిలబడిపోయింది.

అడిగెదను + అని అంటే ఆ విధంగా తొందరగా బయలుదేరటానికి కారణం అడుగుతానని. కడు వడిన్ చనున్ అంటే చాలా తొందరగా భర్త వెంట వెళ్లింది. అడిగినన్ అంటే విషయం ఏమిటని అడిగినట్లయితే. తను మగుడన్ అంటే తనకు తిరిగి. నుడువడని అంటే చెప్పడని. నడ + ఉడుగున్ అంటే వెనకాల నడవటం మానుకుంది. వెడవెడ అంటే నెమ్మది నెమ్మదిగా. చిడిముడిన్ అంటే తొట్రుపాటుతో(మనసుకు సంబంధించిన). తడబడన్ అంటే తడబాటు కలుగగా (శరీరానికి సంబంధించిన). అడుగు + ఇడున్ అంటే ముందుకు అడుగుపెట్టింది. అడుగు + ఇడదు అంటే అంతలోనే అడుగు వేయదు. జడిమన్ అంటే నిశ్చలత్వంతో. అడుగిడునెడలన్ అంటే అడుగు పెట్టే సందర్భంలో.

ఈ పద్యం చదవడానికి చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి మనసు ఎంత గందరగోళంగా ఉందో ఇందులో చక్కగా వివరించాడు పోతన. ఇందులో ఒక్క దీర్ఘాక్షరం కూడా లేదు. అలాగే ఒక్క అక్షరానికి కూడా ఒత్తులు లేవు. అక్షరాలన్నీ ఒకదాని పక్కన ఒకటిపరుగెడుతున్నట్లు ఉంటాయి.

*#మకరమొకటి రవి జొచ్చెను

మకరము మఱియొకటి ధనదు మాటున డాగెన్

మకరాలయమున దిరిగెడు

మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్

భావం: మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు. ఆ దృశ్యాన్ని చూసి... ఆ భయానకమైన సుదర్శన చక్రం తన పైకి వస్తుందేమోనని భయపడి రాశులలో ఒకటయిన మకరం సూర్యుని వెనుక చేరింది. నిధులలో ఒక రకమయినమకరం కుబేరుని శరణు కోరి, ఆయన వెనుక దాక్కుంది. సముద్రంలో ఉన్న మొసళ్లన్నీ ఆదికూర్మం అయిన తాబేలు కిందకు దూరిపోయాయి.

మకరము + ఒకటి అంటే పన్నెండు రాశులలో ఒకటి అయిన మకరం. రవిజొచ్చెన్ అంటే సూర్యుని దగ్గరకు చేరింది. మకరము మరియొకటి అంటే మరొక మకరం (కుబేరుని ధనరాశులలో ఒకటి అయిన మకరం). ధనదు మాటున అంటే కుబేరుని చాటున. డాగెన్ అంటేదాక్కుంది. మకరాలయమున అంటే మొసళ్లకు నెలవు అయిన సముద్రంలో. తిరిగెడు అంటే తిరుగుతున్నటువంటి. మకరంబులు అంటే మొసళ్లన్నీ. కూర్మరాజు మరువునకు అంటే ఆదికూర్మం అయిన తాబేలు కిందకు. అరిగెన్ అంటే చేరాయి.

ఈ పద్యం చాలా చమత్కారంగా ఉంటుంది. మకరం అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ పదాలను ఉపయోగించి సాగుతుంది ఈ పద్యం. నక్షత్రమండలంలో మనకున్న పన్నెండు రాశులలో మకరం అనేది ఒక రాశి పేరు. ధనదుడు అంటే ధనాన్ని ఇచ్చేవాడు. ఆధనాన్ని ఇచ్చే కుబేరుని దగ్గర ఉన్న అపారమైన నిధులు ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు మకరం. మామూలుగా మకరం అంటే మొసలి అని అర్థం. ఈ మూడిటినీ తీసుకుని ఒకే పద్యంలో నానార్థాలు వచ్చేలా ఎంతో అందంగా రచించాడు పోతన.

*#కరమున మెల్లన నివురుచు

గర మనురాగమునమొరసి కలయంబడుచున్

గరి హరికతమున బ్రతుకుచు

గరపీడన మాచరించె గరిణులు మఱలన్

భావం: విష్ణుమూర్తి అనుగ్రహంతో మొసలి బారి నుంచి బయట పడింది గజరాజు. ఆడ యేనుగులన్నీ ఆనందంతో గజరాజు చుట్టూ తిరిగాయి. తమతమ తొండాలతో గజరాజును పెనవేసుకుని, ఇన్ని రోజులుగా దాచుకున్న ప్రేమను వ్యక్తం చేశాయి.

హరి కతమున అంటే శ్రీమహావిష్ణువు కారణంగా బతికిన గజరాజును. కరిణులు అంటే ఆడయేనుగులు. మరలన్ అంటే అంతకుముందులాగ. కరములన్ అంటే తొండాలతో మెల్లగా నిమురుతూ. కరము + అనురాగమున అంటే అధికమైన ప్రేమతో. ఒరసి కలయం బడుచున్అంటే ప్రేమతో పెనవేసుకున్నాయి. కరపీడనం అంటే తొండాన్ని తొండంతో కలుపుకుంటూ ఆనందాన్ని. ఆచరించెన్ అంటే ప్రదర్శించాయి.

ఈ పద్యంలో కరము అనే పదానికున్న నానార్థాలను ఉపయోగించాడు పోతన. కరము అనే పదానికి తొండం, మిక్కిలి అనే అర్థాలున్నాయి. వీటిని ఇక్కడ ఉపయోగించడం వల్ల పద్యానికి అందం రావడమే కాక వినసొంపుగా ఉంటుంది.

*#గజరాజ మోక్షణంబును

నిజముగ బఠియించునట్టి నియతాత్ములకున్

గజరాజ వరదుడిచ్చును

గజ తురగ స్యందనములు గైవల్యంబున్

భావం: పరీక్షిన్మహారాజా! ఈ గజేంద్రమోక్షం ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో చదివినవారికి ఈ లోకంలో సంపద, బంగారం, వస్తువులు, సకల వాహనాలు వంటి సమస్త సుఖాలు కలుగుతాయి. ఆ తరవాత శ్రీమహావిష్ణువు మోక్షాన్ని తప్పక ప్రసాదిస్తాడు.

గజరాజ మోక్షణంబును అంటే గజేంద్రునికి మోక్షం లభించిన విధానాన్ని. నిజముగ పఠియించునట్టి అంటే మనస్పూర్తిగా చదివినటువంటి. నియతాత్ములకున్ అంటే నియమబద్ధులైనవారికి. గజరాజ వరదుడు అంటే గజేంద్రునికి వరం ప్రసాదించి రక్షించినటువంటిశ్రీమహావిష్ణువు. గజతురగ స్యందనములు అంటే ఏనుగులు, గుర్రాలు, రథాలు మొదలైన లౌకిక భోగాలను. కైవల్యంబున్ అంటే మోక్షాన్ని. ఇచ్చున్ అంటే ప్రసాదిస్తాడు.

ఈ రోజుతో గజేంద్రమోక్షం ఘట్టం పూర్తయింది. ఇందులో బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని పద్యాలను మాత్రం మీకు అందించాం. వీటిని కంఠస్థం చేసి పోతన విరచిత తెలుగు పద్యాల తేనె రుచిని ఆస్వాదించండి. ఇంకా చేతనయితే పెద్దల చేత చెప్పించుకుని మొత్తం ఘట్టాన్నికంఠస్థం చేయండి. అందులో ఉండే అలంకారాలు, ప్రత్యేకతలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలుగువారికి పోతన అందించిన వరం శ్రీమద్భాగవతం. ఆ వరాన్ని కొంతయినా అందిపుచ్చుకోండి.

               🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵



Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐