అన్యోన్య దాంపత్యాలు - చతురోక్తులు



ఓ మారు మునిమాణిక్యం నరసింహారావు గారు తల్లావజ్జుల శివశంకరస్వామిగారిని ఇలా కదిపారు.
"అన్నగారూ! నాకు మా ఆవిడతో ఒక నిమిషం పడదు. నిత్యం దెబ్బలాడుకుంటూంటాం. ఒక్క నేనేనా? ఇతరులు కూడా అలాగేవుంటారా?"
తల్లావజ్జులవారు నవ్వుతూ "మనవాళ్ల అన్యోన్య దాంపత్యా ల గురించి చెబుతాను విను" అని ఇలా కొనసాగించారు.
"★ ముందుగా చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గురించి చూద్దాం. ఆయన ఎప్పుడూ ఇంట్లో వుండరు. నానా రాజసందర్శనం అంటూ ఎప్పుడూ దేశాలమ్మట తిరగడమే! ఇక ఇంట్లో వుండేదెప్పుడు? దెబ్బలాడుకొనేదెప్పుడు ? కాబట్టి వీరిది అన్యోన్య దాంపత్యం.
★అలాగే గిడుగు రామమూర్తి. ఆయనకు బ్రహ్మచెవుడు. ఆవిడ తిట్టే తిట్లు ఆయనకు వినిపించవు. అందువల్ల ఇరువురి మధ్యా కజ్జాల్లేవు. కాబట్టి వీరిరువురిదీ అన్యోన్య దాంపత్యమే!
★ఇక జమ్ములమడక మాధవరామశర్మ సంగతి. ఈయన దీ ఆదర్శ జీవితమే. ఏమంటారా? ఆయన సంస్క్రతంలో తప్ప మాట్లాడరు. మరి ఆమెకేమో సంస్కృతం రాదు. భాషాభేదం కారణంగా ఇద్దరిలోనూ పొరపొచ్చాలు లేవు.
★ఇంకా విను. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారేమో, ఎప్పుడూ ఊహాలోకంలో వుంటాడు. భార్యతో దెబ్బలాడ డానికి ఆయన ఎప్పుడైనా వాస్తవ జీవితంలోకి వస్తే కదా ?
★ఇక నా గురించి అంటావా, తీరా దెబ్బలాడడానికి సిద్ధం అయ్యేటప్పటికి మా ఆవిడేమో చనిపోయింది మరి. కాబట్టి ఏతావాతా చెప్పేదేమంటే మనందరివీ అన్యోన్య దాంపత్యాలే!" ఏమంటావ్! అంటూ బోసినోటితో పకపకా నవ్వారు మన శివశంకరులు

Comments

Post a Comment

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐