🚩🚩-గుర్రం జాషువా -పాపాయి పద్యాలు.❗️

 


❤మహాకవి గుర్రం# జాషువా రచించిన నాలుగు పాపాయి పద్యాలను సంగీత దర్శకుడు, ఆంధ్రుల అమర గాయకుడు శ్రీ #ఘంటసాల వెంకటేశ్వరరావు నాలుగు విభిన్న రాగాల్లో స్వరపరచి గానం చెయ్యటం తెలుగువారి అరుదైన అదృష్టమే. అప్పుడే పుట్టిన పాపాయిపై ఇంత రసాత్మకంగా కట్టిన పద్యాలు బహుశా తెలుగులో మరింక లేవేమో!
ఈ పాపాయి పద్యాలలో ఇంత మంచి సాహిత్య సృష్టి జరిగింది. కానీ, ఆ సాహిత్యాన్ని అనుభవించి, పలవరించకపోతే అద్భుతమైన సంగీత సృష్టి అసాధ్యం. ఆ పని చేసి ఘంటసాల ఈ పద్యాలకు చిరాయువు కల్పించాడు.
❤మొదటి పద్యం: #నవమాసములు .!
(నాయనా! పురిటింటి తెరువరి! కులజ్యోతి! నీకు దీర్ఘాయువురా!)
♥️రాగం: హిందూస్తానీ సంగీతంలో దుర్గా
   (కర్నాటక సంగీతంలో శుద్ధ సావేరి)
♦️#నవమాసములు భోజనము నీరమెరుగక,
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి చిమ్ము జానెడు పొట్టలో,
నిద్రించి లేచిన నిర్గుణుండు
నును చెక్కిళుల బోసినోటి నవ్వులలోన,
ముద్దులు చిత్రించు మోహనుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిథీ
♦️#బట్ట కట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలో చేరినాడు, (కానీ)
వారమాయెనో లేదో మా ప్రకృతి కాంత
కరపి యున్నది వీని కాకలియు నిద్ర!
----
❤రెండవ పద్యం: #బొటవ్రేల ముల్లోకములు జూచి!
రాగం: హిందూస్తానీ సంగీతంలో శుద్ధ సారంగ్
(మా చిట్టి పాప నా ఒళ్ళో ముత్యాలు పోశాడు. నెలబాలుడై ఆనందాన్ని కుప్పవోశాడు. చిట్టిబాబూ!)
♦️#బొటవ్రేల ముల్లోకములు జూచి లోలోన
నానందపడు నోరులేని యోగి
తల్లి తండ్రుల తనూ వల్లరీ ద్వయికి వ
న్నియ పెట్టు తొమ్మిది నెలల పంట
అమృతంబు విషమను వ్యత్యాస మెరుగ
కాస్వాదింప చను వెర్రిబాగులాడు
అనుభవించు కొలంది నినుమడించుచు మరం
దము జాలువారు చైతన్య ఫలము
♦️#భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,
నిద్రపోవు, లేచి నిలువలేడు .. (చిన్ని నాన్న)
ఎవ్వరెరుంగ రితని దేదేశమో గాని,
మొన్న మొన్న నిలకు మొలిచినాడు!
❤మూడవ పద్యం: #గానమాలింపక!
రాగం: ఆభేరి (హిందూస్తానీ సంగీతంలో భీంపలాస్)
(కౌగిట్లో కదలి గారాలు కురుస్తాడు! ఉయ్యేల్లో, ఉల్లంలో ముద్దులు మురిపిస్తాడు!)
♦️#గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలక
కొదమ కండలు పేరుకొను పిల్ల వస్తాదు,
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
♦️#ఉ ఊ లు నేర్చిన యొక వింత చదువరి,
సతిని ముట్టని నాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించ వచ్చిన పరదేశి,
తన ఇంటి క్రొత్త పెత్తనపుదారి
♦️#ఏమి పనిమీద భూమికి నేగినాడొ,
నుడువ నేర్చిన పిమ్మట నడుగవలయు
ఏండ్లు గడచిన ముందు ముందేమొకాని,
ఇప్పటికి మాత్ర మేపాప మెరుగడితడు!
❤నాలగవ పద్యం: ఊయేల తొట్టి
రాగం: బాగేశ్వరి లేదా బాగేశ్రీ (కర్నాటక సంగీతంలో ఇందుకు పోలిన రాగం లేదు)
(పిచ్చి తండ్రి! ఏమా ముచ్చట్లు! ఎవరితో ఈ కేకిసలు! లేదు! లేదు! ఏడవకు తండ్రి! ఏడవకు! పిచ్చితండ్రి!)
♦️#ఊయేల తొట్టి ఏముపదేశ మిచ్చునో,
కొసరి నొంటరిగ నూ కొట్టుకొనును
అమ్మతో తనకెంత సంబంధమున్నదో,
ఏడ్చి యూడిగము చేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో,
బిట్టుగా కేకిసల్ కొట్టుకొనును
మూనాళ్ళలోన ఏప్పుడు నేర్చుకొనియెనో,
పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును
♦️#ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి,
చదువు సంధ్య నేర్చి బ్రతుకునపుడు
నాదు పసిడికొండ, నా రత్నమని, తల్లి
పలుకు పలుకులితడు నిలుపుగాక!
(#వింజమూరి సేకరణ )
❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐