🚩🚩-శ్రీకృష్ణ లీలలు – ప్రలంబాసుర వధ (శ్రీగర్గభాగవతము లోని కథ)



♦️యమునాతీరములో ఉన్న పొగడ చెట్టు మీదకూర్చుని మధుర వేణుగానముతో శ్రీకృష్ణపరమాత్మ సామవేదసారాన్ని బోధించెడివాడు. ఎంతో ప్రియముగా లేలేత పసిరికను మేస్తున్న గోమాతలు ఆ మధుర వేణురవం వినగానే పసిరికను వదిలి నిశ్చేష్టులై బొమ్మలవలె నందబాలునివైపు చూస్తూ వేణుగానమును ఆస్వాదించెడివి. హంసలు బెగ్గురుపక్షులు సమాధినిష్ఠులవలె వేణుగానమును గ్రోలుచుండెడివి.
♦️పరమాత్మ గోపబాలులతో ఆడుచు పాడుచు నృత్యములు చేసెడివాడు. వారు గంతులువేస్తూ పరుగులెడుతూ పందెములు వైచుచూ కలహములాడుచూ క్రీడించుచుండ
♦️ఒకసారి వారు రెండు పక్షములుగా బారులుదీరి ఒకపక్షమునకు బలరాముని రెండవ దానికి శ్రీకృష్ణుని నాయకులుగా ఎంచుకొని ఆడుచుండిరి
♦️గెలిచిన పక్షమువారిని ఓడినవారు భాండీరకమను వటవృక్షము కడకు మోయవలెనని పందెము. ఆటలో శ్రీకృష్ణుని పక్షము ఓడిపోయెను. భక్తుల వద్ద ఓడిపోవుట భగవంతునికి పరిపాటి కదా! పరమాత్మ ప్రియసఖుడైన శ్రీధాముని మోసెను. మారువేషములో వచ్చి శ్రీకృష్ణుని పక్షాన ఉన్నట్టు నటించి కంస ప్రేరితుడైన ప్రలంబాసురుడు అవతల పక్షములో ఉన్న బలరామదేవుని మోసెను.
♦️ప్రలంబుని కపటము గ్రహించి బలరామస్వామి తన బరువు పెంచుకొనెను. మోయలేక దానవుడు నిజరూపము దాల్చెను. ప్రలంబుని బ్రహ్మరంధ్రము చిట్లునట్టు ఒక్క ముష్టిఘాతమిచ్చెను బలరాముడు. తల రెండు వ్రక్కలయి ప్రలంబాసురుడు ప్రాణములను విడచెను. వాని తేజము పరమాత్మలో లీనమయ్యెను.
ప్రలంబాసురుని వృత్తాంతము
♦️పరమశివుని ప్రియసఖుడు దిక్పాలకుడు యక్షేశ్వరుడు త్రిలోకపూజ్యుడు అయిన కుబేరుకి చైత్రరథము అను ఉద్యానవనము కలదు. పరమ శివభక్తుడైన కుబేరుడు చైత్రరథములోని పుష్పములన్నిటిని మహాదేవుని పూజకోసమే వినియోగించెడివాడు. కానీ కావలివాళ్ళు ఎంత అప్రమత్తులై ఉన్నా ఎవడో ఆ ఉద్యానవనములోని పుష్పములను అపహరించుచుండెడివాడు. అది తెలిసి కుబేరుడు పుష్పచౌర్యము చేసినవాడు రాక్షసుడై జన్మిస్తాడని శపించెను.
♦️ఒకసారి హూహూ అను గంధర్వుని కుమారుడైన విజయుడు ఎన్నో తీర్థయాత్రలు చేసి కుబేరుని ఉద్యానవనము వద్దకు వచ్చెను. కుబేరుని అనుమతి గ్రహింపకనే ఉద్యానవనములోకి వెళ్ళి కొన్ని పువ్వులను గైకొనెను. యజమాని అనుమతి లేకనే పుష్పములు స్వీకరించిన కారణముగా విజయునికి పుష్పచౌర్య దోషము వచ్చెను. కుబేరుని శాపప్రభావముచే ప్రలంబాసురునిగా మారెను.
♦️పశ్చాత్తాపముతో కుబేరుని శరణువేడగా అభయమిచ్చి కుబేరుడు “నాయనా! తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్నిహోత్రము వలన చేయి కాలక మానదు కదా! అట్లే పాపము కూడా. కానీ పరమ భక్తుడవైన నీకు కడకు మేలు జరుగును. పాపఫలితమును అనుభవించిన తరువాత బలరామస్వామిచే సంహరించబడి ముక్తుడవు అవుతావు” అని ఆశీర్వదించెను. (హాహా హూహూ అను గంధర్వులు శాపగ్రస్తులై గజేంద్ర మకరములుగా జన్మలెత్తి శ్రీహరికృపచే కైవల్యమును పొందినవారు.)
          🌹❤🌹❤🌹❤🌹❤🌹❤🌹❤🌹❤🌹

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐