🔴-గద్యానికి చిన్నయ-🔴

 

--

#సన్నని
యంచు పంచయును చక్కని కోటును ఉన్న శాల్వయున్‌
తిన్నని ఊర్ధ్వపుండ్రములు నేత్రములందు సులోచనమ్ములున్‌
చెన్ను వహింప ఛత్రమును చేత ధరించి సశిష్యుడౌచు యా
చిన్నయ సూరి నిత్యమును చెన్నపురిన్‌ జను పాఠశాలకున్‌!! ❤
🔔 సన్నని అంచు పంచె, కోటు, పైన శాలువా,
నుదుట ఊర్ధ్వపుండ్రాలు, కళ్లద్దాలు అందంగా అలరారుతుండగా
చేతిలో గొడుగుతో శిష్యులు వెంటరాగా... రోజూ మద్రాసు నగరంలో బడికి వెళ్తాడని వర్ణించాడో కవి.
ఈ పద్యంలోని వర్ణన చూస్తే తెలుగు వచన రచనకు ఆదిగురువుగా నిలిచిన చిన్నయసూరికి అతికినట్టే సరిపోతుంది కదా!
🔔నన్నయకు ముందే తెలుగులో పద్యకవిత్వం ఉంది. అయితే అది గాసటబీసటగా ఉంది. అలాంటి దానికి నిర్దిష్టమైన రూపురేఖలు సంతరించి పెట్టింది నన్నయ. అందుకే ‘పద్యానికి నన్నయ’! అలాగే చిన్నయసూరికి ముందే తెలుగులో గద్యకావ్యాలు ఉండి ఉండొచ్చు. కానీ వచన రచనకు పెద్దపీట వేసింది మాత్రం చిన్నయే. అందుకే ‘గద్యానికి చిన్నయ’ అంటాం.
చిన్నయ పూర్వీకులు ఉత్తరాంధ్ర నుంచి బతుకు తెరువుకోసం తమిళనాడు వలస వెళ్లారు. పరవస్తు రంగరామానుజాచార్యులు వైష్ణవ మతానుయాయి. చెన్నై నగరంలో ట్రిప్లికేన్‌ ప్రాంతంలో ఉంటూ బోధకులుగా జీవనం సాగించేవారు
1840లో ఆదీ ఆప్టన్‌ పాఠశాలలో క్రైస్తవ మత బోధకులకు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసే అవకాశం లభించింది చిన్నయకు. ఆయన విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవడంతో చిన్నయ ప్రతిభ వెలుగులోకి వచ్చిందితర్వాత చిన్నయ పచ్చయప్ప కళాశాలలో (1845- 1848) తెలుగు పండితుడిగా నాలుగేళ్లపాటు ఉద్యోగం చేశాడు. బోధనలో పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా, ప్రాచీన సాహిత్యం గురించి విశదీకరించేవాడు.
పేరు తెచ్చిన పంచతంత్రం
దూబగుంట నారాయణ కవి ‘హితోపదేశం’, విష్ణుశర్మ ‘పంచతంత్రం’ కథల ఆధారంగా చిన్నయసూరి ‘నీతి చంద్రిక’ను రాశారు. 1834లో రావిపాటి గురుమూర్తి ‘నీతి చంద్రిక’ను రాశారు. దీనిని సెయింట్‌ జార్జి ఉన్నత పాఠశాలలో పాఠ్యపుస్తకంగా చిన్నయసూరి బోధించారు. చిన్నయసూరి తాను రాసిన ‘నీతి చంద్రిక’ను ‘మిత్రలాభము’, ‘మిత్రభేదము’, ‘సంధి’, ‘విగ్రహము’ అని నాలుగు భాగాలుగా విభజించారు. మిత్రలాభం, మిత్రభేదం రచన చేసి సొంత ప్రింటింగ్‌ ప్రెస్‌ ‘వాణీ దర్పణం’లో అచ్చొత్తారు. మిగిలిన రెండు రాయక ముందే మరణించారు. సంధి, విగ్రహాలను 1871లో కొక్కొండ వెంకటరత్నం పంతులు, 1872లో కందుకూరి వీరేశలింగం పంతులు పూర్తి చేశారు. ఆ తర్వాత చాలా మంది పంచతంత్ర కథలను రాశారు. నీతిచంద్రికలో ఆంగ్ల రచనా విధానం కనిపిస్తుంది. అంతవరకు తెలుగులో పేరాల విభజన లేదు. చిన్నయసూరి నీతిచంద్రికను పేరాలుగా విభజించి రాశారు. విద్యార్థులకు పేరాలుగా రాయటం నేర్పించారు. అలా తెలుగు రచనాశైలిలో నూతన సంప్రదాయాన్ని నెలకొల్పారు.
చిన్నయసూరి వచన శైలి ఒకే విధంగా ఉంటుంది. కఠిన పదాలు ఉండవు. అలాగని తేలిక పదాలూ కనిపించవు. సంస్కృత పదాలు, అచ్చ తెలుగు పదాల సమన్వయంతో సమపాళ్లలో ఆయన రచన సాగుతుంది. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని నీతి చంద్రిక రచన సాగించారు. 1853 మొదలు ఇప్పటివరకు ఏదో ఒక తరగతిలో నీతి చంద్రికను ఒక్క పాఠంగానైనా చదువుకొంటున్నాం. నీతిచంద్రికలోని మిత్రలాభంలో స్నేహం వల్ల లాభాలు, అత్యాశ వల్ల నష్టాలు, తొందరపాటు పరికిరాదని ప్రబోధించారు. మిత్రభేదంలో కరటక, దమనకులు అనే నక్కల పాత్రలతో సామాజిక న్యాయం, రాజకీయ నీతిని తెలియజేశారు. వాటిలో స్నేహంలో గల కష్టనష్టాలు వివరించారు. ఉపకారం చేయడం వల్ల కలిగే లాభం, స్వార్థం వల్ల దుష్ఫలితాలు, పరుల చెడు కోరేవాళ్లకే చెడుపు జరుగుతుందని నీతిచంద్రికలో అద్భుతంగా మలచారు.
చిన్నయసూరి చదివారా?
చిన్నయసూరి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది బాల వ్యాకరణం. నన్నయ ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రచించినట్లు తెలుస్తోంది. కేతన రచించిన ‘ఆంధ్ర భాషా భూషణం’ తెలుగులో రాసిన మొదటి వ్యాకరణ గ్రంథం. క్యాంబెల్, కేరి, బ్రౌను వంటి ఆంగ్ల పండితులు తెలుగు వ్యాకరణాన్ని సులభ శైలిలో రాశారు. అయితే చిన్నయసూరి బాల వ్యాకరణం తరతరాలు నిలిచే రచన. మొట్టమొదట ఆయన సంస్కృత, తెలుగు భాషలలోని సారాంశాలు తీసుకొని పుస్తకాలు రచించారు. ఆ అనుభవం బాల వ్యాకరణం రాయడానికి ఎంతో ఉపయోగపడింది. ఇది 1858లో వెలుగు చూసింది. బాలవ్యాకరణం ఎంత ప్రసిద్ధి చెందిందంటే... బాల వ్యాకరణం చదివారా అనేందుకు బదులుగా చిన్నయసూరిని చదివారా? అని అడిగేంత.
పద్య రచన స్థానంలో వచనం అభివృద్ధి చెందడమూ ఈ కోవలోదే. అలాంటి సమయంలో ‘నీతిచంద్రిక’ను వచనంలో రాసి తెలుగులో వచన రచనకు ఆద్యుడయ్యాడు చిన్నయసూరి. కాలానికి తగినట్లు భాష కూడా మారాలి. దీనికి ముందుండి మార్గనిర్దేశం చేసిన సూరిని ‘గద్యానికి చిన్నయ’ అనడం స్వభావోక్తే కానీ అతిశయోక్తి కాదు!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐