🔴 -శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి బాల్యం...... 🔴 (ఆయన మాటల్లోనే…)

 --
         


♦మా బాల్య మిత్రులు..
అంటే నా చిన్నప్పటి నుంచి పుస్తక మిత్రులు..మా వీరా అభిమాని.. రమణ గారి తీపి గుర్తులు వారి మాటలలో...
♦శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారి బాల్యం...... ఆయన మాటల్లోనే….
“మా ఊరు ధవళేశ్వరం. రాజమండ్రి దగ్గర. గోదావరి ఒడ్డున. రామపాదాల రేవులో మొదటి మేడ మా ఇల్లు. పక్కనే కొండమీద జనార్ధనస్వామి కోవెల, కొండ కింద శివాలయమూ ఉన్నా వాటి కన్నా మా ఇల్లే కోలాహలంగా ఉండేది.
గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలూ, అవి లేనప్పుడు సావిట్లో జై హరనాథ జై కుసుమ కుమారి జై – భజనలూ. నట్టింట్లో దె య్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజ లూ, బైరాగులూ – పెరటి వసారాలో చుట్టాలూ – వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే (వాళ్లింట్లో వీల్లేక) తద్దినాలూ – పెరట్లో బావి అవతల పడవ వాళ్ళకి మా అమ్మమ్మ పెట్టే భోజనాలూ – బువ్వలు తిని దుంగళ్ళూ – కొట్టేవాళ్ళు.
♦మేడ వరండాలో హిందీ పాఠశాల – రాజమండ్రి నుంచి గుమ్మడిదల దుర్గాబాయమ్మ గారు జటకాలో వచ్చి మా అమ్మకీ, పక్కింటి వాళ్ళకీ" మైతోహూం తూతో హై "అంటూ చెప్పే హిందీ పాఠాలూ, పూనకాలూ, శాంతులూ, తర్పణాలూ – పూజగది పక్కన
భజగోవిందం పాడుకుంటూ మా నాన్నగారు.
.♦ఆఫీసు వేళ వంటవక ఏవిటీ జనం – ఇది ఇల్లా సంత బజారా అని ఆయన ఎప్పుడేనా ఒక్కొక్కసారి చుట్టాల మీద విసుక్కుంటే అంతవరకూ అందరికీ అన్నీ అందిస్తూ సందడిగా తిరిగే మా అమ్మకి కోపమొచ్చి, ఫిట్లొచ్చి నేలకి ఒరిగి పడిపోయేది. ఆవిడ చేతిలో ఉప్పూ తాళం చేతులు పెడితే లేచేది. మళ్ళీ మామూలే… అందుకే మా నాన్నగారు ఆదివారాలు కూడా ఆఫీసుకెళిపోయేవారు.
.
♦ఒకసారి ఆసుపత్రికెళిపోయారు. అక్కడి నుంచి ఎక్కడికో వెళిపోయారు. ఇంకరారు అని చెప్పారు. మా అమ్మమ్మ పడవెక్కి భద్రాచలం వెళ్ళిపోయింది. అప్పుడు మా ఇల్లు చీకటయిపోయింది. దేవుళ్ళు, చుట్టాలూ, బాబాలు, బైరాగులూ, భజనవాళ్ళు, ఎవరూ కనబళ్ళేదు. అందరూ పారిపోయారు. నాకు భయం వేసింది.
.
♦దుర్గాబాయమ్మ గారి స్కూలావిడ రాజమండ్రి నుంచి వచ్చి భయపడవద్దని మా అమ్మకి చెప్పారు. మెడ్రాసు వెళ్ళిపొమ్మని చెప్పారు. మా అమ్మా నేనూ మా తమ్ముడూ మెడ్రాసొచ్చేశాం. మా బావ ఇంట్లో దిగాం.
♦మెడ్రాసులో దుర్గాబాయమ్మ గారు పెద్ద సభ పెట్టారు. ఆంధ్రమహిళ సభ. “నువ్వు ధవళేశ్వరంలో నా దగ్గర హిందీ నేర్చుకున్నావు గదా. ఇక్కడ మన మహిళా సభలో వాళ్ళకి నీకొచ్చిన హిందీ నేర్పించు. నెలకిరవై రూపాయలు ఇస్తారు” అన్నారు. నెలకిరవై చాలదని తెలుసు. ఇంకో పనేదన్నా చేసి ఇంకో ఇరవై గడించు – అని చెప్పారు.
♦రెండు వందలు ఖర్చుపెట్టిన మేడలోంచి, రెండు రూపాయల అద్దెకి, ఒక మెట్ల కింద గది లాంటి దాంట్లో దిగాం. చిన్నప్పణ్ణించీ మా అమ్మనీ, చుట్టాలనీ తిట్టిపోసే , ఇన్నాళ్ళూ దూరంగా ఉన్న మా చిన్నమ్మమ్మ ఇప్పుడు సాయం వచ్చింది – ఒక చిన్న రేకుపెట్టె, తలగడా పట్టుకుని. ఆ రేకు పెట్టెకు రెండు తాళాలు వేసేది.
♦అందులో పది లక్షల రూపాయలు దాచుకుందని మా అమ్మకీ, నాకూ తెలుసు. కాని ఆవిడ – నా మొహం దమ్మిడీ లేదు పిచ్చి కుంకల్లారా అనేది.
మెట్ల మీద సామానులు సర్ది మెట్ల దారిమీదే పడుకునే వాళ్ళం. నలుగురం పడుకుంటే ఈ గోడ నించి ఆ గోడకి సరిగ్గా సరిపోయేది. అమ్మమ్మ కాశీ మజిలీ కథలు చెప్పేది. పొద్దున్న లేవగానే వీధరుగు మీద కూచుంటే ఆవిడ మెట్ల మీద – అన్నం, కూరా, చారూ, టిఫినూ వండిపెట్టేది. ఈ అమ్మమ్మ పెట్లో బోల్డు డబ్బుంది. ఇక భయం లేదు అనుకున్నాం. కాని లేదంటుంది గదా. మరి నెలకి ఇంకా పది రూపాయలు కావాలి.
♦ఓ రోజున కొట్టుమీద బియ్యం, చింతపండు, ఉప్పు తో బాటు ఓ కాణీకి కుట్టుడాకులు కొన్నాం. కాణీకి మూడు ఇచ్చాడు. కాని మేం నలుగురం. మా అమ్మమ్మ, అమ్మా తమ్ముడూ నేనూను. కాణీకి నాలుగిస్తావా అంది మా అమ్మ. నేను కొనేది కాణీకి అయిదు. మీకు నాలుగిస్తే నాకేం మిగిలేనూ, అన్నాడు కొట్టువాడు. అయితే కాణీకి అయిదాకులు నేను కుట్టిస్తా కొంటావా అంది మా అమ్మ. సరిదా అన్నాడు వాడు. ఆకు నువ్వే ఇవ్వాలి అంది మా అమ్మ. అయితే – కాణీకి ఎనిమిదాకులు ఇవ్వాలి. కుట్టుకూలే మీకు – అన్నాడు వాడు.
సందెడేసి ఆకులూ చీపురూ పట్టుకుని సంతోషంగా ఇంటి కొచ్చాం. నెలకో అయిదు రూపాయలు వస్తాయి అంది మా అమ్మమ్మ లెక్కలు వేస్తూ… రాత్రి పన్నెండు దాకా ఇద్దరూ ఆకులు కుట్టాము.
♦కొన్ని రోజులు పోయాక కొట్టువాడు బేరం మార్చాడు. మీకు నిండా లాభంగా ఉంది. కాణీకి పదాకులు ఇవ్వండి అన్నాడు. మా అమ్మ ఇవ్వలేను నాయనా అంది. అయితే ఇంకోళ్ళకిస్తాను. నిండా మంది ఉన్నారు – అన్నాడు వాడు – ఇచ్చుకో అంది మా అమ్మ. నిండా కష్టపడతావు అన్నాడు. పరవాలేదు అని వచ్చేశాం. మా అమ్మ భయపడలేదు. ఇదిగాపోతే ఇంకోటి అంది. నేనూ అదే నేర్చుకున్నాను.
♦ తరువాత  జీవితంలో పత్రికలో పని చేస్తూ ఉద్యోగం వదిలేశాను. సినిమాలో ఇద్దరు గొప్ప డైరెక్టర్లతో తేడా వస్తే ఒక్కసారి ఆరు సినిమాలు వదిలేశాను.
ఇంతలో మా ఇంటి దగ్గరే స్టార్‌ టాకీసు పక్కనే మిలిట్రీ వాళ్ళు సిపాయిల కోసం బట్టలు కుట్టే మిల్లు పెట్టారు. గేట్లో చాలా మంది ఉన్నారు. వెళ్ళి చూశాం. అక్కడ పాంటులకీ, కోట్లకీ, కాజాలు కుట్టి గుండీలు పెట్టాలి. కాజాకి అణా ఇస్తారట.
మా అమ్మ నేనూ అక్కడి పెద్దాయనతో హిందీలో మాట్లాడాం. సందెడు బట్టలూ, గుండీలూ, దారాలూ, సూదులూ ఇచ్చారు. రాత్రి పన్నెండు దాకా కాజాలు కుట్టాం. మా అమ్మ వెళ్ళి దుర్గాబాయి గారికి చెప్పింది. రెండు పనులు తప్ప ఇంక దేనీకీ భయపడక్కర్లేదు, సిగ్గు పడక్కర్లేదు అన్నారావిడ. మా అమ్మని భేష్‌ అని మెచ్చుకున్నారు. దేనికీ ఎవరికీ భయపడకు ఇలా స్వత్రంత్యం గానే బతకడం నేర్చుకో అన్నారు. అన్నట్లు – కొత్తగా హాండ్‌మేడ్‌ పేపర్‌ సెక్షన్‌ పెట్టాం. చేతులతో కాగితం తయారు చేసే కుటీర పరిశ్రమ. వారం రోజుల్లో నేర్చుకోవచ్చు – తిండి ఒక్కటే కాదు – పిల్లల్ని చదివించాలి గదా – ఇంకో విద్య చేతిలో ఉంటే మంచిది – అని కూడా చెప్పారు. నేర్చుకుంది మా అమ్మ. అంతలో ఒక వేసం కాలం వచ్చింది. హిందీ నేర్చుకునే ఇల్లాళ్ళంతా ఊటీలకీ, సొంత ఊళ్ళకీ, పెళ్ళిళ్ళకీ వెళ్ళి పోయారు. అప్పుడు ఈ విద్య అంది వచ్చింది.
♦ఏలూరులో వెంకట్రామా అండ్‌ కో యజమాని ఈదర వెంకట్రావు పంతులు గారు – కొన్ని పుస్తకాలు ఖద్దరు పుస్తకాల్లో (హాండ్‌ మేడ్‌ పేపర్‌పై) వేస్తారని తెలిసింది. దుర్గాబాయి గారి సహాయంతో ఏలూరికి పది మైళ్ళ దూరంలో – చాటపర్రు గ్రామంలో మా అమ్మ హాండ్‌ మేడ్‌ పేపర్‌ ఇండ్రస్టీ పెట్టి యజమానురాలైపోయింది. ఏలూరులో ఇంటద్దే కూరానారా ప్రియం అని చాటపర్రులో పెట్టింది. పల్లెటూళ్లో అద్దెకి ఇళ్ళుండవంటారు గాని మాకు నాలుగ్గదుల ఇల్లు – పాక దొరికింది. నెలకి రూపాయిన్నర అద్దె. అంటే ఆ ఇంటి వాళ్ళు వాళ్ళబ్బాయికి పట్నంలో ఉజ్జోగం అయితే అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇంటికి మేము కాపలా ఉన్నట్టూ ఉంటుంది. అద్దె కూడా వచ్చినట్టూ ఉంటుంది వాళ్ళకి. అద్దె ఒకటే కాదు. దోసకాయలూ చవకే. అవొక్కటే చవగ్గానూ, ఊరికేనూ దొరికేవి. అందుకని మా అమ్మమ్మ దోసకాయ కూరా – దోసకాయ పచ్చడీ – దోస వరుగులూ – దోసావకాయ – కాల్చిన దోసకాయ పచ్చడీ – దోసగింజెల వడియాలూ ఇన్ని రకాలు చేసి పెట్టేది.
రోజూ దోసకాయేనా అని గునిస్తే – చక్రవర్తీ రోజూ అన్నమే తింటున్నాం గదా అనేది మా అమ్మమ్మ. దానిక్కూడా రకం మార్చాలంటే గోధుమన్నం, జొన్నన్నం చేస్తాను అంది. వద్దులే దోసకాయే బాగుంది అన్నాను.
*** *** ***
♦చాటపర్రులో వ్యాపారం గిట్టుబాటు కాలేదు. ఒక పెద్ద రేకు టబ్బులో నానేసిన గుజ్జును కర్రతో ఝూడించి కొట్టడం – అది పలచని గంజిలా వచ్చేది. దానిని, జల్లెడతో పేపరు తెట్టులా తీయడం – పూతరేకుల్లా తీసి ఆరవేయడం ఆరాక గాజు పేపరు వెయిట్లతో రుద్ది రుద్ది గ్లేజు చెయ్యడం – దాన్ని మిషనులో వేసి అంచులు కట్‌ చేయడం బలే సరదాగా ఉండేది. వింత చూడ్డానికి వచ్చే వాళ్ళు కూడా ఓ చెయ్యి వేసేవారు. వారానికి మూడు రీములు తీస్తే ఆ కట్టలు కూడా మెడ్రాసులో విస్తళ్ళ కట్టల్లాగానే నేనూ మా అమ్మా దొడ్డమ్మా ఏలూరు నడిచి వెళ్ళి వెంకట్రామా ప్రెస్సులో ఇచ్చేవాళ్ళం. మూడు మూళ్ళు తొమ్మిది విచ్చు రూపాయలు ఇచ్చేవారు. వచ్చే వారం పద్దెనిమిది – ఆ తరువాత వంద, వెయ్యి వచ్చేస్తాయని లెక్కలు చెప్పుకుంటూ ఝూమ్మని తిరిగి వచ్చేవాళ్ళం.
దార్లో తేళ్ళూ, మండ్రగబ్బలూ కుడుతూ ఉండేవి.
♦నాకు తేలు మంత్రం వచ్చును. ఒకసారి సూర్యగ్రహణం అప్పుడు మెడ్రాసు సముద్రం బీచిలో మా అమ్మమ్మ నేర్పింది. మంత్రం ఎన్ని సార్లు వేసినా ఆ నెప్పి తగ్గేది కాదు. నేను భూతాల వాడిలా ఒక మొక్క పీకి దాంతో వాళ్ళని కొడుతూ – దిగిందా నెప్పి దిగిందా అంటూ మంత్రం మళ్ళీ మళ్ళీ చదివేవాడిని – తగ్గలేదంటే కోపం ఏడుపూ వచ్చేవి. అప్పుడు ఒరే నీది తేలు మంత్రం కదా – కుట్టింది మండ్రగబ్బేమోలే – పద ఇంటికి వెళ్తే అమ్మమ్మ మందేస్తుంది – అంటూ నాలుగడుగుల దూరం నన్నెత్తుకుని నడిచే వారు – (తేలు నన్ను కుట్టకుండా).
♦కొన్నాళ్ళు జరిగాక పద్దెనిమిది రూపాయలు కూడా రావడం మానేశాయి. ఖద్దరు పుస్తకాలు బాగా అమ్మటం లేదుట. ఓ పక్క నేను – మెడ్రాస్‌ వాడినిక్కడుండనని గోల. మా తమ్ముడు, మా బావ గారింట్లో మెడ్రాసులో ఉన్నాడు. స్కూళ్ళు తెరిచే నెల. చెడి చెన్నపట్నం చేరమన్నారు. పదండి అక్కడికే పోదాం – అంది మా అమ్మమ్మ. మళ్ళీ మెడ్రాసులో మహిళా సభకొచ్చేసాం. మహిళా సభలో పని చేసే వాళ్ళందరికీ సాయంత్రం అరటి దొప్పలలో చక్రపొంగలి, ఉప్మా ఇలాంటివి టిఫిను పెట్టేవాళ్ళు. అది మా అమ్మ నా చేతికిచ్చి కూచోబెట్టి తింటూ ఉండు. ఇప్పుడే వస్తాను అని పాఠాలకి వెళ్ళిపోయింది.
♦ఒకసారి ఒక బోయి వచ్చి (అక్కడ పనివాడిని బోయీ బోయీ అని పిల్చేవారు) నా చేతిలో పొట్లాం లాక్కున్నాడు. నువ్వు నంబరువా నీకెవరిచ్చారని – అంతలో మా అమ్మ వచ్చి అది నాదే బాబూ – వాడు మా అబ్బాయి అంది. కొంచెం దగ్గర్లో కూర్చున్న కృష్ణవేణమ్మ గారు (దుర్గాబాయి తల్లి) ఇది చూసి వాడిని కేకలు పెట్టింది. ఇంకోకటి కూడా పట్రా – రేపణ్ణించి ఆ అబ్బాయిక్కూడా ఇవ్వాలి అంది. మహిళా సభ వాళ్ళు వీపీ హాల్లో దశావతారాలు డ్రామా వేసినప్పుడు నా చేత మత్స్యావతారం వేషం కట్టించారు. ట్రాములో తీసుకెళ్ళి టిఫిను పెట్టి మా అమ్మకి రూపాయిచ్చారు.
*** *** ***
♦మా ఇంటి దగ్గరే స్టార్‌ టాకీసు ఉండేది. ఇప్పుడూ ఉంది. అమ్మా సినిమాకెళ్దాం అంటే కాజాలు కుట్టడం ఆపి తీసుకెళ్ళేది. గేటు దగ్గర నుంచుంటే సినిమాలో పాటలూ, మాటలూ, ఏడుపులూ అన్నీ వినిపించేవి. రతన్‌, దహేజ్‌ లాంటి సినిమాలన్నీ ఇలాగే వినే వాళ్ళం. ఎప్పుడేనా నేను కొంచెం గేటు దాటి తొంగి చూస్తే కొంచెం సినిమా బొమ్మ కనబడేది. గేటు వాడికి మేము అలవాటయిపోయి – ఓ సారి ఇంటర్వెల్‌ తర్వాత లోనికి వదలి తలుపు ఇవతల నుంచి చూడనిచ్చాడు. నాకప్పటికే రాజమండ్రిలో చూసిన" అబు తేర సివా కోను మొరా కిష్ణ కనయ్యా" – సునో సునో బనుకే రాణీ "పాటలు వచ్చును. గేటువాడు సెబాస్‌ అనేవాడు.
♦యుద్ధం అయిపోగానే మాకు మిలిట్రీ కాజాల ఉద్యోగం పోయింది. అప్పుడు మా అమ్మమ్మ భయపడింది. కాని అమ్మ భయం లేదని చెప్పింది. రాయపేట కేసరి కుటీరంలో గృహలక్ష్మి ప్రెస్సు ఉంది. అందులో మా అమ్మకి కంపోజిటర్‌ ఉద్యోగం ఇచ్చారు. దగ్గర్లోనే కేసరి గారు స్కూలు కూడా పెట్టారు. నన్నక్కడే చేర్చింది. ఇద్దరం పొద్దున్నే ప్రెస్సుకి వెళ్ళేవాళ్ళం. పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా నిలబడి కంపోజింగ్‌ చేసేది మా అమ్మ. నేను తొమ్మిది గంటలకు స్కూలుకు వెడితే నాకు రెండు ఇడ్డెనలు కొనిపెట్టి మిగిలిన పచ్చడి తను తినేది. సాయంత్రం నాలుగున్నరకి వెళితే ప్రెస్సు వాళ్ళు ఏదేనా పెట్టేవాళ్ళు. మేమిద్దరం తినేవాడిని. ఏడు అయ్యాక కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ ట్రిప్లికేను వెళ్ళేవాళ్ళం. ట్రాము డబ్బులు పెట్టి మషాళా దోసె కొనుక్కుని పొట్లం మా అమ్మ చేతిలో పెట్టుకుని తింటూ ఇట్టే వెళ్ళిపోయేవాళ్ళం. దోసెలో బంగాళాదుంప కూర కోసం మా వేళ్ళు పోట్లాడుకునేవి – నువ్వంటే నువ్వని – ఒరే పూర్వ జన్మలో మనం క్లాస్‌మేట్సులుగా పుట్టి ఉంటామురా అంది మా అమ్మ ఓసారి. దారిలో జాంబజారులో బంగాళదుంపలు, ఉల్లిపాయలు కొనుక్కుని వెళ్ళేవాళ్ళం. చితికిన ఉల్లిపాయలు చూట్టానికి అసయ్యంగా ఉంటాయి గాని రుబ్బి వడియాలు పెడితే ఎండకి పురుగులన్నీ ఛస్తాయి – వడియాలు బాగుండేవి – తీరా ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ బంగాళ దుంపలు రేపు – పొద్దుటి తోటకూర – అలాగే ఉండిపోయిందనేది. ఇవాళే బంగాళ దుంపలు రేపే తోటకూర అన్నా వినేది కాదు. అప్పటికి నేను ఫోర్తు ఫాం. ఇంగ్లీషులో అరిచినా వినేది కాదు.
♦అప్పుడు నేను ్రపైవేట్లుకూడా చెప్తున్నాను. పొద్దున్నే ఏడు నుంచి తొమ్మిది దాకా రెండిళ్ళు – సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది దాకా రెండిళ్ళు – నెలకి మా అమ్మకి అయిదు రూపాయలూ, నాకు రెండేసీ.
చూస్తుండగా గొప్పవాళ్ళం అయిపోతున్నాం. కాని మా అమ్మకి రోజంతా ప్రెస్సులో నిలబడి – తర్వాత నడిచి కాళ్ళు నెప్పెట్టేవి. నేను అమ్మమ్మకి నడుము తొక్కి అమ్మకి కాళ్ళు పట్టేవాడిని. ‘చక్రవర్తీ నీకేం ఖర్మ పట్టిందిరా’ అని మా అమ్మమ్మ ఏడిచేది. ధవళేశ్వరంలో చిన్నప్పుడు నన్ను బుడుగూ అనీ చక్రవర్తీ అని పిలిచేవారు. నాకప్పుడు ఇద్దరు సేవకులుండే వారుట కూడాను. అందుకని నేను పడుకోగానే వాళ్ళు నా అరికాళ్ళకు కొబ్బరి నూనె రాసి తోమేవాళ్ళు. బలేగా ‘మొగలాయీ’ గా ఉండేది.
♦ఇలా ఉండగా నిడమర్తి వారింట్లో ఒక తరుడు ఫారం అమ్మాయికి ‘రుక్మిణీ కళ్యాణం’ ప్రైవేటు చెప్పమన్నారు. ఆ నిడమర్తి వారింట్లో బామ్మగారు – నన్ను నించోబెట్టి రెండు పద్యాలిచ్చి అర్థాలు చెప్పమంది. చెప్పాక ‘పాసయ్యావురా – రేపణ్ణించి రా’ అంది. ‘ఇలా నిక్కర్లేసుకు రాకూడదు. ఇది ఆడపిల్లా – అంచేత పొడుగు లాగేసుకు రావాలీ’ అంది. జీతం అయిదు రూపాయలంది.
ఆ రాత్రి మా అమ్మమ్మా, అమ్మా నాకు పొడుగు లాగూ కుట్టేశారు. ఎమ్మెస్‌ 55 అనే సైను గుడ్డ కొన్నారు. నన్ను నేల మీద వెల్లకిలా పడుకోబెట్టారు. బొగ్గుతో నా నడుంనించి కాళ్ళ దాకా, కాళ్ళ నించి మళ్ళీ నడుం దాకా గీతలు గీశారు. దాని ప్రకారం గుడ్డ మీద గీసి కత్తిరించారు. చెరో వేపునీ కూచుని రాత్రి పన్నెండు గంటల కల్లా కుట్టేసి బొందు కట్టారు. ఇంక మనం కాజాలు మానేసి లాగూల షాపు పెట్టేద్దాం అన్నారు. కాని లాగూ సరిగ్గా రాలేదు. అందరి లాగుల్లా కాకుండా కాళ్ళ మధ్య ఆర్చిలా వచ్చింది. తొడుక్కుని నడిస్తే పడబోయాను. వాళ్ళకే నవ్వొచ్చింది. రేపొక్కరోజూ ఇలా వెళ్ళు. సాయంత్రానికి మిషను వాడికిచ్చి కుట్టిస్తాను అని చెప్పింది మా అమ్మ.
♦అప్పుడు సిగరెట్టు కాల్చాను ఒక ఫ్రెండు చెప్పితే – ఓసారి కొన్నప్పుడు కొట్టువాడు తిట్టాడు. మా నాన్నకి అని చెప్పాను. ఓసారి రోడ్డు పక్కన నుంచుని కాలుస్తుంటే చూసి ఒకాయన నోట్లో సిగరెట్టు పీకి విసిరేసి వెళ్ళిపోయాడు. అప్పణ్ణించి గంటకి అణన్నర చొప్పున సైకిలు అద్దెకు తీసుకుని అందుమీద తిరిగేవాణ్ణి సిగరెట్టు కాలుస్తూ.
♦నా కీర్తి ట్రిప్లికేను నుంచి రాయపేట, మైలాపూరు, అడయారు దాకా వ్యాపించింది. అంటే సిగరెట్లది కాదు, ప్రైవేట్లది. టంగుటూరి, నిడమర్తి, గోవిందరాజుల, కాశీనాథుని వంటి పెద్ద పెద్ద ఇళ్ళల్లో ్రపైవేటు చెప్పాను. ఇంకా బెస్టేమిటంటే మా తెలుగు మాస్టారు జనార్ధన శర్మ గారు నన్ను వాళ్ళింటికి రమ్మని వాళ్ళమ్మాయికి ప్రైవేటు చెప్పించారు. క్లాసులో కూడా ఒరే కుర్ర మాస్టారూ అని పిలిచేవారు. నాకు సిగ్గు వేసేది. ఆయన కూడా వద్దని చెప్పినా వినకుండా రెండ్రూపాయల జీతం మా అమ్మ చేతికిచ్చే వారు. మా అమ్మ కూడా వద్దంటే మనందరం టీచర్లమేనమ్మా ఫరవాలేదు అని చెప్పేవారు.
♦ఇలా నా కథంతా ప్రైవేటు మాస్టారు ధోరణిలోనే సాగింది. రచయితగా వార్తలు, కథలు, సినిమా డైలాగులు రాసి ఇంకోళ్ళకి చెప్పి వినోదమందించే సేవా భాగ్యం దొరికింది. ప్రవృత్తే వృత్తిగా లభించడం – దొరకునా ఇటువంటి సేవా? ఇన్ని ఏళ్ళు వచ్చినా ఇంకా 16 ఏళ్ళ పొగరే కాలరెత్తుకుని ఉంటుంది. నా బాల్డ్‌ హెడ్డూ తెల్ల జుత్తూ చూసి ఎవరైనా నమస్కారం పెడితే – నా వెనక్కి చూసి తప్పుకుంటాను. పెద్దవారెవరో నా వెనుక ఉన్నారనుకుని.
                  ♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐