🍂🍂--మార్పు చూసిన తరం.-🍂🍂

 


*సాధారణంగా ఒక తరానికి మరో తరానికి మధ్యలో
కొన్ని మార్పులు రావడం సహజం
కాని ప్రస్తుతం డెభ్భై సంవత్సరాలు పైబడి నాట్ అవుట్ లో
ఉన్న తరం మాత్రం, ఖచ్చితంగా చాలా మార్పులే చూసింది.
ఒక్కసారి వెనక్కెళదాం తప్పదు, మా చిన్నప్పుడూ అనక తప్పదు……
దారీ తెన్నూ లేని పల్లెలలెరుగుదుం, పట్నాలెరుగుదుం, నగరాలూ ఎరుగుదుం, ఇప్పుడు అంతర్జాతీయ మహా నగరాలూ చూశాం…చూస్తున్నాం, ఒకప్పుడు పల్లెదాటి ఎరగనివాళ్ళం…..ప్రయాణానికి నటరాజా సర్విస్,ఒంటెద్దు బండి, కొంకాపల్లి జట్కాబండి, (గూడు బండి)రెండెడ్లబండి.
కాలువలు నదులున్నచోట పడవ, ఆతరవాత కాలం లో లాంచీ, సైకిలు చదువుకో, టైపు నేర్చుకోడానికో సైకిల్ మీద రోజూ కనీసం పది కిలోమీటర్లు వెళ్ళిరానివారు లేరు
ఆడపిల్లలతో సహా, చిన్నప్పుడు నా శ్ర్రీమతి సైకిల్ తొక్కేది,అప్పుడు అదో వింత. సైకిల్ కి లైసెన్స్ ఉండేది, పంచాయతీలో తక్కువా, మునిసిపాలిటీ లో ఎక్కువా, పంచాయతీ నుంచి మునిసిపాలిటీ కెళితే లైసెన్స్ కోసం పట్టుకునేవారు, సంవత్సరానికోసారి రెన్యుయలూ.ఆ తరవాత రోజుల్లో బొగ్గు బస్సులు,పెట్రోల్ బస్సులు ఇవి ఐలేండ్ కంపెనీవి వచ్చేవి, ఇంగ్లండు నుంచి, తదుపరి డీజిల్ బస్సులు, రైళ్ళుకి రిసర్వేషన్లు లేవు,
తరవాత కాలంలో రిసర్వేషన్లు, ఒక బెర్త్ మీద ముగ్గురికి రిసర్వేషన్ చేసిన రోజులు, రయిల్లో ఇంటర్ క్లాస్ అని ఉండేది తెలుసా? అప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇంటర్ క్లాస్, తర్డ్ క్లాస్ ఇలా నాలుగుండేవి.చిన్నప్పుడు ఎప్పుడేనా విమానం పైనుంచి వెళుతుంటే నోరొదిలేసి చూసినవాళ్ళం ఇప్పుడు వారానికోసారి విమానం లో ఖండాంతరాలు, వేసవిలో స్విజర్లేండ్ ప్రయణాలు ఎన్ని మార్పులు ఇన్ని మార్పులు మరేతరం చూసింది, మేము గాక…
పూరిపాకల్లో ఉన్నాం,పెంకుటిళ్ళూ ఎరుగుదుం, మండువాలోగిళ్ళలో నివాసాలున్నాం, పిచిక గూళ్ళలో సద్దుకున్నాం, ఇప్పుడు విల్లాలలో పిలిస్తే పలికేవారు లేక బిక్కుబిక్కుమని కాలమూ గడుపుతున్నాం……
మనిషికనపడినా మనసారా పలకరించే సావకాశం లేక లబలబలాడుతున్నాం….చద్దన్నం తిన్నాం, తరవాణీతో, కాఫీలు తాగడం మొదటి లేదా రెండో తరం.పళ్ళు, తేగలు,ముంజికాయలు, సీమ చింతకాయలు, దొంగతనంగా లంకల్లో పుచ్చకాయలు, దోసకాయలు
కోసుకుని తిన్నాం, పట్టుబడితే ఫలానా వారబ్బాయిలమని చెప్పి బయటా పడ్డాం…..,ఈ విషయాలు ఇంటిదగ్గర తెలిస్తే పేకావరమ్మయితో పెళ్ళీ చేయించుకున్నాం…
చిన్నప్పుడు చెట్టులెక్కేం, కొండలూ,గుట్టలూ ఎక్కేం,
గోదారిలో, చెరువులో, కాలవల్లో ఈతాలూ ఆడేం, తెప్పకట్ల కిందకి పోబోయి బతికేం, ఎవరో పైకి లాగిపడేస్తే, గోదారమ్మ తోసేస్తే…… ఇప్పుడో మనవలు నీళ్ళలో దిగితే భయపడుతున్నాం, మొలతాడట్టుకుని స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టిస్తున్నాం..ఎంత తేడా… అసలు కంటే వడ్డీ ముద్దు కదూ….
తాతల్ని, మామ్మల్నీ, ఆమ్మమ్మలని కూడా ఎరగని వాళ్ళమే ఎక్కువ. పెదనాన్నలు, పెద్దమ్మలు, పిన్నమ్మలు, బాబాయిలు, అత్తలు, మామలు, మేనమామలు, మేనత్తలు, బావలు, వదినలు, మరదళ్ళు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, కూతుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు, వేలు విడిచిన మేనమామలు, తాతా సహోదరులు…ఇలా ఎంతమంది బంధువులు, పెళ్ళయితే బంధువులందరూ కలిస్తే పెద్ద తిరణాల కదా! అందరూ కలిసి బూజం బంతి వేస్తే, ఎకసెక్కాలు, మూతి విరుపులు, హాస్యాలు,మెటికలవిరుపులు, ఎన్ని అందాలు, ఎన్ని అలకలు, ఎన్ని బుజ్జగింపులు…ఎన్ని ఆప్యాయతలు..ఏవీ…ఇప్పుడు పలకరిద్దామంటే ఎవరూ దొరకరే…. మనవలికి బంధువుల్ని చూపిస్తే వారెవరో తనకేమవుతారో తెలిసిన పిల్లలెంతమంది? తెలిసినవి రెండే పిలుపులు అంకుల్,ఆంటీ అదండి మార్పు, చూసింది ఈతరమే….అబ్బాయి/అమ్మాయి నీకు తగిన వరుడు/వధువు నచ్చారా అని అడిగితే బుర్రూపిన తరం, కొడుకులు, కూతుళ్ళూ, మనవలు, మనవరాళ్ళూ ఇదిగో తాతా నా పార్ట్నర్ అని చూపిస్తే బుర్రూపి పెళ్ళి చేసిన తరం ( బుర్రూపకపోతే పరువు నిలవదని తెలిసిన తరం…)
పల్లెలో కరంట్ ఎరగనిది,పేపర్ కూడా తెలియనిది ఈతరం. స్కూళ్ళు కట్టుకున్నది శ్రమదానం తో ఈ తరం. డిగ్రీలు పుచ్చుకుని పొట్టచేత పట్టుకుని ప్రతిభకు దేశంలో గుర్తింపులేకపోతే విదేశాలకి ఎగిరుపోయినదీ ఇదే తరం. అక్కడ గుర్తింపబడి బలం పుంజుకుని మళ్ళీ అదే పేరున మనవలు నరసింహారావులు, సుబ్బారావులు, సుబ్బమ్మలు, జానికమ్మలు తాతతండ్రుల గడ్డమీద అభిమానం పోక తిరిగొస్తున్నవాళ్ళని చూస్తున్నదీ ఇదే తరం. ఏంటీ నువ్వు మా నరసయ్య మనవడు నరసయ్యవా? నువ్వు మా సుబ్బమ్మ మనవరాలు సుబ్బలక్ష్మివిటే అంటూ పల్లెలలో ఉంటున్నవారందరూ పలకరిస్తుంటే..పల్లెకు జవజీవాలకోసం పాటుపడుతున్న మూడవతరాన్ని ఆనందం గా చూస్తున్నదీ ఇదే తరం……
బుడ్డి దీపాలదగ్గర చదువుకున్నాం, నేడు కరంట్ విన్యాసాలూ చూస్తున్నాం.మొదటిరోజుల్లో పేపరు, ఆతరవాత వీక్లీలు, లైబ్రరీలు, కాగితం ముక్క కనపడితే చదివేసే పెద్ద అలవాటూ, కరంజియా బ్లిట్జ్, బాబూరావు పటేల్ సమాధానాలూ ఎరిగినవాళ్ళం. కొక్కోకం, మధు, కొవ్వలి,జంపన నవలలు క్లాసుపుస్తకాల్లో పెట్టుకుని దొంగచాటుగా చదువుకున్న తరం. కాగడా శర్మ, కలైనేషన్, హిందూ నేశన్ పత్రికలనెరిగున్న తరం.. . ఇప్పుడో నెట్ లో బ్లాగుల్లో దున్నేస్తున్నాం, ఈ పుస్తకాలూ రాసేస్తున్నాం, అనుభవాలు-జ్ఞాపకాలని, ఎంత మార్పు….
ఎవరికేనా టెలిగ్రాం వస్తే ఎవరో బాల్చీ తన్నేసినట్టే, ఫోన్ ఎరగం… ఆ తరవాత కాలంలో ఇంట్లో ఫోన్ ఉంటే గొప్ప, మరి నాకు ఫోన్ ఉండెది, ఇంట్లో, ఎవరితో మాటాడాలి? మా వాళ్ళెవరికి ఫోన్ లేదు, అప్పటికి. ఆ తరవాత రోజుల్లో లేండ్ పోన్లూ, సెల్ ఫోన్లూ ఇచ్చేసేం, నేనే వేల కనెక్షన్లు ఇవ్వడానికి చేతులు పడేలా సంతకాలెట్టేను, అది కూడా ఏ రోజో తెలుసా? జనవరి వొకటో తారీకు రెండు వేల సంవత్సరం. ఆ తరవాత ఇంటర్నెట్ ఎరుగుదుం, ఇప్పుడు చేతిలోనే ఇంటర్ నెట్టూ,సెల్ ఫోనూ అందులో కెమేరా, కొన్ని గంటలు నెట్ లేకపోతే ఉండలేకపోతున్నాం, ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా కావలసినవారెవరినీ పలకరించక వదిలేసిందీ లేదు, మరి నేటి తరం కావలసినప్పుడు మాటాడి ఆ తరవాత మొహం చూపించకపోయినవారెంతమంది? మొదటగా టేప్ రికార్డర్,వి.సి.పి, వి.సి.ఆర్ లు ఉపయోగించిన తరం… ఎంత మార్పు…..
రేడియో ఎరగం,కొత్తగా వచ్చిన రేడియోకి లైసెన్సు ఉండేది, ప్రతి సంవ్త్సరం కట్టాలి, చివరగా నేను కట్టిన లైసెన్స్ ఫీ పదిహేను రూపాయలు.కొత్తగా వచ్చిందే బేటరీ రేడియో,వాల్వు రేడియో, మద్రాస్ కేంద్రం, ఎప్పుడో ఒక గంట తెనుగు కార్యక్రమం, ఆ తరవాత బెజవాడ రేడియో స్టేషను, తెనుగువార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య నుంచి పన్యాల రంగనాథరావు,చివరగా శాంతి స్వరూప్, మంగమ్మ గార్లు, చిన్నక్క, బందా, ప్రత్యేక వార్తలు చదివే బండారు శ్రీనివాసరావు, ఇంకాలోపలికెళితే అబ్బో అదో గుప్తులకాలం స్వర్ణయుగమే…. ఆదివారం వస్తే పన్నెండయితే రోడ్లమీద కర్ఫ్యూ ఉండేది తెలుసా? ఎందుకూ? మాటల మాంత్రికుడు ఉషశ్రీ గారు తెనుగులోకాన్ని ఆనంద డోలికలలో ఓలలాడించిన సమయం, బేటరీ రేడియో కాలంలో బుధవారం రాత్రి అమీన్ సయానీ మాటలకోసం బినాకా గీత్ మాలా వినడంకోసం, ఎవరి అరుగుమీదో రేడియో వినడానికి పడిగాపులు పడిన తరం. ”ఛీ! మన రేడియోవాళ్ళు కూడా, రేడియో సిలాన్ లా ఎందు చెయ్యరూ?” అని విసుక్కున్నరోజులు. సి.రామచంద్ర సంగీతాన్ని తెలియకపోయినా ఆస్వాదించిన రోజులు. ఆ తరవాత ట్రాన్సిస్టర్ వస్తే ఒకడు చెవిలో పెట్టుకుంటే వాడినోటినుంచి కామెంటరీ స్కోరు వినడానికి తహతహలాడిన తరం, ”ఛీ ఇప్పుడే కదురా క్రీజ్ లోకి వెళ్ళేడు అప్పుడే తెడ్డూపేసేడా?మనవాళ్ళుట్టి వెధవాయలోయ్” అని తిట్టుకున్న తరం. ఆ తరవాత టి.వి ఏంటెన్నా ఇంటిమీద కనపడితే, ఫోన్ కనక్షనుంటే గొప్పైన రోజులు, పాటలెప్పుడో ఒక గంట వస్తే దానికోసం వారమంతా ఎదురు చూసిన తరం, అదీ పక్కింటివాళ్ళ టి.వీ లో. రామాయణం టి.విలో వచ్చినంత కాలం రైళ్ళు కూడా ఆపుచేసి రామాయణాన్ని చూచిన తరం. అరుణ్ గోవిల్ రాముడిగా జీవించించడం చూసిన తరం, సీతగా వేసినమ్మాయి నిజంగా సీత అలాగే ఉండేదేమో అన్నట్టు ఉన్నదే, పేరు మరిచిపోయా సుమా…ఇలా ఎన్ని ఎన్నెన్ని అనుభూతులు ఆనందాలు, ఇబ్బందులు చూసిన తరం ఇది…
బళ్ళోకి పోడానికి చొక్క నిక్కరూ వేసుకు పరుగెట్టిన రొజులు,కాళ్ళకి చెప్పులు లేకుండా, అమ్మ వెనకనుంచి ”తలదువ్వించుకోరా” అంటున్నా వినకుండా పరుగెట్టిన రోజులు, వర్షం వస్తే చినుకుల్లో పుస్తకాలు, తల, తడవ కుండా చొక్కా తలమీదకి లాక్కుని, పుస్తకాలు చొక్కాలో గుండెలకి అదుముకుని ఏక బిగిని ఇంటికి పరుగెట్టిన తరం, ఇప్పుడో మనవలకి షూ, టై, స్కూల్ బేగ్ వగైరా ఎన్నో ఎన్నెన్నో. బూట్లు అనకూడదట వాటిని షూ అనాలని మనవరాలు క్లాసుపీకిందో రోజు. ఆరోజుల్లో ఆడ, మగ పిల్లలందరికి అనగా నేటి బామ్మలు తాతలకి రెండు చేతులమీద రెండు గాని నాలుగుగాని మచ్చలుంటాయి చూడండి, అవేంటో తెలుసా? స్మాల్ పాక్స్ రాకుండా టీకాలు. ఆరునుంచి ఎనిమిది పుష్కరాలు చూసినవాళ్ళం, పుష్కరాలకెళ్ళేందుకుగాను కలరా ఇంజంక్షన్లు పొడిపించుకుని కాగితం ముక్కలుచ్చుకుపోయిన తరం. తీర్ధాలలో కరకజ్జం, జీళ్ళు కొనుక్కుని తిన్నవాళ్ళం. స్నేహితులతో కాకెంగిలితో జీళ్ళు పంచుకున్న తరం….. ఎన్ని ఎన్ని ఎన్నెన్ని అని చెప్పను ఒక జీవితకాలపు మార్పును మొదటగా చూసిన తరం
♥♥♥♥♥♥♥♥♥♥♥

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐