పెద్ద బేరం ....అణాలు !

 

పెద్ద బేరం ....అణాలు !
(Vinjamuri Venkata Apparao
9 June 2017)
.
ధారానగరం లో ప్రజలంతా అంతో యింతో కవిత్వం చెప్పగలిగే వారుట.
ఒకసారి కాళిదాసు,దండి కవీ యిద్దరూ సాహిత్య గోష్టి చేస్తూ వుండగా
వాళ్లకు తాంబూల సేవనం చెయ్యాలని పించింది.
చూసుకుంటే దండి దగ్గర సున్నం అయిపొయింది,కాళిదాసు దగ్గర తమలపాకులు లేవు. యిద్దరూ నడుచుకుంటూ ఒక దుకాణానికి వెళ్ళారు. అక్కడ ఒక పడుచు పిల్ల దుకాణాన్ని నడుపు తున్నది.
దండి ఆమెతో ''తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే'' అన్నాడు
(ఓ పూర్ణచంద్రుని వంటి ముఖం కలదానా కొంచెం త్వరగా
సున్నం యిప్పించవమ్మా. )
వెంటనే కాళిదాసు ''పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాన్త కీర్ణ లోచనే''
(చెవుల వరకూ వ్యాపించిన విశాల నేత్రాలు గల సుందరీ బంగారు
వన్నెగల తమలపాకులు కూడా ఆ చేత్తోనే యిప్పించు.) అన్నాడు.
.
ఆ చిన్నది ముందు కాళిదాసుకు ఆకులిచ్చి తర్వాత దండి కి
సున్నమిచ్చింది.
దండి చిన్నబుచ్చుకొని ముందు నేను కదా సున్నమడిగింది మరి ముందు కాళిదాసు కెందుకు ఆకులిచ్చావు?భోజరాజు లాగా నీవు కూడా కాళిదాసు పక్షపాతివా?అన్నాడు.
నిజానికి ఆ నెరజాణ కూడా కాళిదాసు కవిత్వమంటే చెవి కోసుకుంటుంది. అందుకే ఆయనను గౌరవిస్తూ ముందు ఆయనకు ఆకులిచ్చింది.కానీ ఆమె లౌక్యం తెలిసిన వ్యవహార దక్షురాలు ఉన్నమాట చెప్పి దండిని నొప్పించట మెందుకని తెలివిగా సమాధాన మిచ్చింది.
అయ్యా నేను దుకాణం లో సరుకు అమ్మటానికి కూచున్నాను. మహాకవుల గుణ దోషాలు నిర్ణయించటానికి నేనెంత దాన్ని?నాది చిన్న బుర్ర. కాళిదాసుగారు చెప్పిన శ్లోక పాదం లో 'పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాన్త కీర్ణ లోచనే' అంటే నా చెవికి ఐదు 'ణ' లు వినిపించాయి. వినిపించాయి.
తమరు సెలవిచ్చిన శ్లోకం లో తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణచంద్ర నిభాననే' అన్న దాంట్లో నా చెవికి మూడు 'ణ' లు వినిపించాయి.
మూడు నాణాల లకంటే ఐదు నాణాలు యెక్కువకదా! అందుకని పెద్దబేరానికి ముందు ప్రాధాన్యమిచ్చాను .
అంతే గానీ నాకు పక్షపాతం గానీ పక్షవాతం గానీ లేవు. మిమ్మల్ని నొప్పించి వుంటే క్షమించాలి. అంది.
దండికి కోపం పోయి నవ్వు వచ్చింది 'ఈ ధారానగర వాసులతో యిదే చిక్కు అందరూ కవులే అందరూ పండితులే
సమయస్ఫూర్తి కలవారే' అంటూ కాళిదాసుతో కలిసి తాంబూలం నములుతూ వెళ్లి పోయాడు

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩