🍂🍂🍂“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.🍂🍂🍂 (-శర్మ కాలక్షేపంకబుర్లు-)



పూర్వకాలంలో సమయం తెలుసుకోడానికి పగలు సూర్యుని బట్టి,
అనగా మన నీడ పొడవును బట్టి, రాత్రి చుక్కల్ని బట్టి తెలుసుకునేవారు, సమయం చాలా ఖచ్చితంగానూ చెప్పేవారు.
రాత్రి దిక్కుల్ని ధృవ నక్షత్రం తో గుర్తించేవారు. ఆ రోజులలో ఆకాశం లో నక్షత్రాలను గుర్తుపట్టేవారు, వాటికి గొల్ల కావడి, పిల్లల కోడి వగైరా పేర్లూ ఉండేవి. గొల్ల కావడి నెత్తి మీద కొచ్చిందంటే ఒక సమయమనీ, పిల్లల కోడి ఉదయించిందంటే తెల్లవారుగట్ల అనీ గుర్తించేవారు.
ఇవి కాక ఒక చిత్రమైన విషయం కూడా ఉండేది. కోడి పుంజు, మరదేమి చిత్రమోగాని తెల్లవారు గట్ల మాత్రమే కొక్కొరో కో అని గొంతెత్తి కూస్తుంది.
అది తెల్లవారే లోగా రెండు సార్లు కూస్తుందలాగా. మొదటిసారి కూయడాన్ని ‘తొలి, కోడి’ కూతనీ, రెండవ సారి కూయడాన్ని ‘మలి,కోడి కూత’నీ అనేవారు. ఇక నిప్పు గురించి చెప్పాలంటే, అగ్గిపెట్టెలు లేవు.
నిజానికి అగ్గిపెట్టెలు మా చిన్నతనాన మాత్రమే పల్లెలలో అడుగుపెట్టేయి. అప్పటివరకు నిప్పును ఎవరో ఒకరి ఇంటినుంచి తెచ్చుకోడమే అలవాటు. నిప్పు ఎవరింటినుంచైనా తెచ్చుకునేవారు.
మిగతా వాటికి మడి, మైల అనేవారుకాని నిప్పుకు మైల లేదనేవారు.
ఇప్పుడు కత చదవండి అర్ధమవుతుంది.
అనగా అనగా ఒక పల్లెలో ఒక ముసలమ్మ గుడెసెలో కాపరం ఉండేది,
ఒకత్తీ. నాటిరోజుల్లో పల్లెటూరంటే పాతికకొంపలుండేవి. ఆ రోజుల్లో ఇప్పటిలాగా గడియారాలూ లేవు, నిప్పు తయారు చేసుకోవాలి, అగ్గిపెట్టెలూ లేవు, గేస్ మాట దేవుడే ఎరుగు. ఇసుక గడియారాలూ లేనిరోజులు. మరి అటువంటి రోజులలో, ముసలమ్మకి ఒక కోడిపుంజూ, ఒక కుంపటీ ఉండేవి. కుంపటి కూడా తెలీదా? హతోస్మి, బొమ్మలో చూడండి, బొగ్గులు నిప్పులూన్నూ. కోడి కూతతో లేచేవారు, ‘తొలికోడి కూసింది లేవండోయ్’ అనేవారు. కోడి కూత విన్నారా ఎప్పుడేనా? ఇప్పుడు నేను వినిపించలేను, ‘కొక్కు రో కో’ అని గొంతెత్తి అరచేది. ప్రయత్నించి వినండి. తొలి కోడి కూతతో లేవడం పల్లె ప్రజలకి అలవాటు, దగ్గరగా చెప్పాలంటే ఇప్పటి సమయం తెల్లవారుగట్ల నాలుగు. మలి కోడి కూతంటే అంటే ఐదు. తొలికోడి కూతకి లేచి ఇంటి పనులు మొదలెట్టుకునేవారు. వంటపనికి ముందు కావలసింది నిప్పు. అది ఉండేది కాదు. సమయమూ తెలిసేది కాదు. ముసలమ్మ దగ్గర కోడిపుంజు సమయంప్రకారం కూసేది, ముసలమ్మ లేచి కుంపటిలోకి చెకుముకి రాళ్ళతో నిప్పు తయారు చేసి కుంపటిలో బొగ్గులను అంటించి ఉంచేది. పల్లెలో వారంతా ముసలమ్మ కోడి కూతతో లేచి ఆవిడ తయారు చేసి ఉంచిన నిప్పు కణికను పిడక మీద వేసుకుని పట్టుకుపోయి పొయ్యిలో వేసుకుని నిప్పు తయారు చేసుకునేవారు, వంటా చేసుకునేవారు. నిప్పుంచుకోవచ్చుగా అనే అనుమానం వస్తుంది కదా! నిప్పుంచుకుంటే కొంప కాలిపోయే ప్రమాదమూ ఉంది, అదీగాక ఇంధనం మనలాగా అనవసరంగా పాడుచేసే అలవాటు నాడు లేదు మరి. పని కాగానే నిప్పు ఆర్పేసేవారు. నిత్యాగ్నిహోత్రులని ఉండేవారు, వారికి అగ్ని గృహమని వేరుగా ఉండేది. అందులో నిప్పును సంరక్షించేవారు.
ఇలా ముసలమ్మ కోడి సమయం తెలుపుతుండగా, నిప్పూ ముసలమ్మ ఇస్తుండగా రోజులు బాగానే గడుస్తున్నాయి, పల్లెవాసులకి. నిప్పుకొచ్చిన ప్రతిసారి పల్లెవాసులు ముసలమ్మతో మాటా మాటా కలిపి ఆవిడ చేస్తున్న సేవని పొగిడి నిప్పు పట్టుకుపోయేవారు. ఇలా పొగడ్తల నిషా ముసలమ్మకి బాగా తలకి ఎక్కిపోయింది. పల్లెవాసులకీ చిరాకొచ్చింది, రోజూ ఇలా పొగడడం చిరాకుగానూ అనిపించి, నిప్పు పట్టుకెళుతున్నారు కాని మాటా మంతీ మానేశారు, సహజంగానే ముసలమ్మకీ కోపమొచ్చింది. ‘హన్నా! ఎంత అన్యాయం నా కోడి కూతకి లేస్తున్నారా! నా కుంపటిలో నిప్పు ఉపయోగించుకుంటున్నారా? ఒక్క మాట చెప్పడానికి ఇంత బాధ పడాలా? నేనేమైనా మడులు మాన్యాలూ అడిగానా? మాటే కదా, అదికూడా మాటాడలేరా?’ అని తర్కించి, వితర్కించి చివరికి ఒక నిర్ణయం తీసుకుంది. నా కోడీ కుంపటీ లేక వీళ్ళకి ఎలా తెల్లరుతుందో చూస్తాననుకుంది,
ఎలా బతుకుతారోననుకుంది, పిచ్చిది. తనకోడి కూయక, సమయం తెలియక లేవలేరనీ, నిప్పు తయారు చేసుకోలేరనీ అనుకుంది పాపం.
ఏం చేసిందీ కోడిని ఒక గంప కింద దాచేసి దాని మీద గోనిగుడ్డలు కప్పేసింది, కోడి కూసినా వినపడకుండా. తను ఉదయమే లేచి నిప్పు తయారు చేయకూడదని నిర్ణయించుకుని పడుకుంది. ఊరిప్రజలు మామూలుగానే లేచారు కోడి కూత వినపడకపోయినా! నిప్పుకోసం వెళితే ముసలమ్మ……….
ముసలమ్మ లేకపోయినా కోడి కూయకపోయినా ఏదీ ఆగలేదు,
సమయమూ ఆగలేదు… కాదు ఆగదు.
ఆగదు ఈ నిమిషం నీ కోసమూ ఆగితే సాగదు ఈ లోకమూ ముందుకు
సాగదు ఈ లోకమూ………..ఎవరికోసమూ కాలమాగదు….అవసరానికి మరో ప్రత్యామ్నాయం దొరుకుతుందని ఈ నానుడి భావం.
అప్పటినుంచి ఇలా ‘నీకోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?’ అనగా నువ్వులేక ఏపనీ ఆగదనేందుకు ఈ నానుడి ఉపయోగిస్తారు.
మా సత్తిబాబు కూడా మీలాటి మేధావి కదండీ అందుకు నిష్కర్షగా ఇంత అర్ధమున్న ప్రశ్న వేశాడు. అందుకే నేనిచ్చిన సమాధానం,………..నేను రాకముందూ ఈ ప్రపంచం ఉంది, నా తరవాతా ఉంటుంది…ఇది సత్యం.
వస్తా వెళ్ళొస్తా!
మళ్ళెప్పుడొస్తా!!
నీపెళ్ళప్పుడొస్తా.!!!
చూస్తా ఎదురు చూస్తా అనద్దు, మీపెళ్ళి కాదు 🙂

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐