🚩బడ్జెట్ పద్మనాభం . కధ.!

 

 


🚩బడ్జెట్ పద్మనాభం . కధ.!
( మల్లిక్ గారి రచన..)
.
♦️డోర్ బెల్ మోగింది....
రత్నాబాయి గబగబా వెళ్ళి తలుపు తెరిచింది.
ఎదురుగా ఆయనెవరో నిలబడి ఉన్నారు.
రత్నాబాయి పైట నిండుగా కప్పుకుంది. “ఆయన ఇంట్లో లేరండీ.... ఒక అరగంటో, గంటో పోయాక వస్తారు... క్రాఫు చేయించుకోడానికి వెళ్ళారు”అని అతనితో చెప్పింది.
అది వినగానే అతను బావురుమన్నాడు. అలా ఒక నిమిషంపాటు బావురుమన్నాక, చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకున్నాడు. “పాపం..ఈయనకి ఆయనతో చాలా అర్జెంటు పని ఉన్నట్టుంది... ఎంత బాధపడుతున్నాడో! ఆయన లేరని చెప్పగానే...” అనుకుంది రత్నాబాయి మనసులో.
రత్నాబాయి కి అతని మీద జాలివేసింది.
.
"పోనీ, ఆయన వచ్చేదాకా వెయిట్ చెయ్యండి...లోపలకి రండి” అంది గుమ్మంలోంచి పక్కకు జరుగుతూ.
"చాల్లే, నోర్ముయ్!...” గట్టిగా అరిచి రత్నాబాయి ని తోసుకుంటూ ఇంట్లోకి వచ్చేసాడు అతను.
రత్నాబాయి ఉలిక్కి పడింది. ఇదేమిటితను??...నా మీద అరవడమే కాకుండానన్ను తోసుకు లోపలకు వచ్చేస్తాడేం?
రత్నాబాయి కొన్ని క్షణాల తర్వాత తేరుకుండి. “ఏయ్! ఏంటీ దౌర్జన్యం?... వెంటనే ఇంట్లోంచి బయటకు వెల్తావా? లేదా?.... నువ్వేళ్ళి-పోకపోతే కాస్సేపట్లో ఆయన వస్తారు... నీకు కాజాలు తినిపించి నీ మెడ పట్టి బయటకి గెంటేస్తారు... తెల్సా?..." అంది రత్నాబాయి మండి పడ్తూ.
అతను రత్నాబాయి వంక ఆశ్చర్యంగా చూసాడు."అయితే నువు జోకుగా అనడంలేదా? నిజంగానే అంటున్నావా?..." అన్నాడు.
.
"అవును......నిజంగానే మా ఆయన నీకు కాజాలు తినిపిస్తాడు......”
"నేను అంటున్నది కాజాలు తినిపించడం గురించి కాదు. నన్ను నిజంగానే గుర్తుపట్టాలేదా, రత్నా?"
.
రత్నాబాయి ఉలిక్కిపడింది. ఆ పిలుపు ఎంతో పరిచయమైన పిలుపు. ఆ గొంతు కూడా ఎంతో అలవాటైన గొంతు........ రత్నాబాయి మూహంలో మొహం పెట్టీ అతన్ని చూసింది.
. ఆయనే!!!!!..............."హవ్వ.... ఏంటండీ, ఇలా మారిపోయారు?" అంది రత్నాబాయి.
అతనెవరోకాదు....రత్నాబాయి భర్త పద్మనాభం.
"నిన్న మనం ఏమనుకున్నాం?... ఇంటికి చాలా కర్చు అయి-పోతోంది.... ఆదాయానికి మించి కర్చు అయిపోతోంది కాబట్టి బడ్జెట్ వేసుకుని దాని ప్రకారం పోవాలని అనుకున్నామా?...." భార్య మొహంలోకి చూస్తూ అన్నాడు పద్మనాభం.
"అనుకున్నాం....” అంది రత్నాబాయి."అందుచేత చాలా కర్చులు తగ్గించుకోవాలని అనుకున్నామా?"
"అనుకున్నాం....అయితే?"
"అందుకే ఇలా డిప్పకటింగ్ చేయించుకున్నా... ఇలా చేయించుకుంటే మూడు నెలల దాకా క్రాఫు చేయించుకోనవసరం లేదు.... అంటే రెండు నెలల కటింగ్ కర్చు మిగిల్నట్టే కదా?...." అన్నాడు పద్మనాభం హుషారుగా.
అది వినగానే రత్నాబాయి కళ్లనీళ్ళు పెట్టుకుంది. పైటకొంగుతో ముక్కు చీదుకుంది.
"బాధపడకు రత్నా.... ఇది ఎరువులు లేకుండా అన్ని కాలాల్లో పండే పంట.... క్రాఫు పెరగడం ఎంతసేపు! ఊర్కో....ఊర్కో....” అన్నాడు రత్నాబాయి తల నిముర్తూ... "నేను బాధపడుతున్నది అందుక్కాదండీ........” రత్నాబాయి ముక్కు చీదింది.
"మరి దేనికి?" ఆశ్చర్యంగా భార్య వంక చూసాడు పద్మనాభం.
"మీరు డిప్పకటింగ్ బదులు ఏకంగా గుండు కొట్టించుకొని ఉంటే మరో ఆరు నెలలు పాటు క్రాఫు చ్చేయించుకునే కర్చు మిగిలి ఉండేది కదా?" అంది కళ్ళు వత్తుకుంటూ.
"నిజమేననుకో...కాని ఇలా డిప్ప కటింగ్ చేయించుకుంటేనే నువ్వు నన్ను గుర్తుపట్టలేదు.... ఇహ గుండు కొట్టించుకుంటే తలుపు తీయగానే నన్ను చూసి మొహం మీద తలుపేసేస్తావేమో?....... అయినా కర్చులు నేనొక్కడినే కాదు.... నువ్వు కూడా తగ్గించుకోవాలి!”
"అలాగే...ఏమేం తగ్గించుకోవాలో చెప్పండీ...” "ముందు నాకు స్నానానికి నీళ్ళు పెట్టు...... స్నానం చేసి, భోజనం చేశాకా మాట్లాడుకుందాం..” అన్నాడు పద్మనాభం షర్టు విప్పుతూ......
పద్మనాభం స్నానం చేసాకా ఇద్దరూ భోజనం చేసి హాల్లో కూర్చున్నారు. రత్నాబాయి పద్మనాభాన్ని చూసి కిసిక్కున నవ్వింది.
"ఎందుకు నవ్వావ్?" కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు పద్మనాభం."ఈ డిప్ప కటింగ్ తో మీ మొహం చూస్తూంటే నాకు చచ్చేంత నవ్వు వస్తుంది” పద్మనాభం సిగ్గు పడ్డాడు.
"ఏదీ......ఓ మారు వెనక్కి తిరగండి....” అంది రత్నాబాయి వస్తున్న నవ్వును ఆపుకుంటూ. "ఏం?...ఎందుకని?" అడిగాడు పద్మనాభం.
"తిరగండి చెప్తాను..."
పద్మనాభం తిరిగాడు.రత్నాబాయి తన అరచేతిని నోటి దగ్గరపెట్టుకుని, వేళ్ళని "చుపుక్, చుపుక్" మంటూ ముద్దుపెట్టుకుని పద్మనాభం డిప్పమీద జెల్లకాయి కొట్టి, కిలకిలా నవ్వింది.
"మీ డిప్ప మీద ఇలా జెల్లకాయ్ కొడితే భలే గమ్మత్తుగా ఉంది... హిహిహి” పద్మనాభం డిప్ప తడుముకుంటూ చిరాకు పడ్డాడు.
"వేళాకోళాలు ఆపి కాస్త సీరియస్ గా మాట్లాడు!” అన్నాడు
"సీరియస్ గా ఎలా మాట్లాడను?... మీ మొహం చూస్తూంటేనే నవ్వొస్తూంటే?...."
"నవ్వొస్తూంది...ఎందుకు రాదు?..నేను ఇలా డిప్పకటింగ్ ఎందుకు చేయించుకున్నాను? ఇంటికయ్యే కర్చు తగ్గించాలనే కదా?...కర్చులు ఇలా బాగా తగ్గించి డబ్బులు కాస్త వెనకెయ్యాలి......... పిల్లలి ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి సరిపోయింది.........రేపొద్దున్న వాళ్ళు కాలేజీ చదువులకొచ్చాక ఎన్నెన్ని లక్షల డొనేషన్స్ కట్టాలో.......... పుస్తకాలకీ, ఫీజులకీ ఎంతెంత కర్చు పెట్టాలో!!... ఇప్పుడు దాచుకున్న డబ్బులే రేపు ఉపయోగపడ్తాయ్.......... లేకపోతే లక్షలకి లక్షలు డబ్బు అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతాయో చెప్పు........." అన్నాడు పద్మనాభం సీరియస్ గా.
"హి హి హి...." అంటూ నవ్వింది రత్నాబాయి. "ఏంటి?......... నేను చెప్తున్న విషయం నీకు జోకుగా ఉందా?...."
"కాదు...మీ డిప్పకాయ్ చూస్తూంటే నవ్వొస్తోంది!... హిహి..."
"ఇంక చాల్లే ఆపు! అసలు ఇందాకటి నుండీ నేను చెప్తున్నది విన్నావా? లేదా?..." అని అరిచాడు పద్మనాభం. "ఎందుకు విన్లేదు? నిన్నాను!”
"మరి అలాగైతే ఇప్పుడు చెప్పు!...ఇంటికర్చులు తగ్గించడానికి నువ్వేం చెయ్యదల్చుకున్నావు?"
"నేను రోజూ పువ్వులు కొనుక్కుంటున్నాను కదా........ రేపటినుండీ రోజు విడిచి రోజు కొనుక్కుంటాను!"
"ఏడ్చినట్లే ఉంది...ఇలాంటి చిన్న చిన్న వాటిలో మిగిలిస్తే ఎంత మిగుల్చకపోతే ఎంత......." చిరాకుగా అన్నాడు పద్మనాభం
"మీరు మాత్రం క్రాఫు చేయించుకునే దాంట్లో మిగల్చలేదా? ... పెద్ద పెద్ద వాటిల్లో ఏమైనా మిగిల్చారా?" రెట్టించి అడిగింది రత్నాబాయి. అది వింటూనే పద్మనాభం ఘొల్లున నవ్వాడు.
"నీ బుర్ర అంతవరకే పని ఆలోచించగలదు” "మరి మీ డిప్పకాయ్ బుర్ర ఎంత వరకూ ఆలోచించగలదు?" ఉడుక్కుంటూ అడిగింది.
"మరి నేను ఇలా డిప్పకటింగ్ చేయించుకున్నందు వల్ల రెండు నెలల్ కటింగ్ కర్చు తప్పింది కదా!.......... నెత్తి మీద ఇలా తక్కువ వెంట్రుకలు ఉన్నందు వల్ల తలకి స్నానం చేసేప్పుడు తక్కువ షాంపూ కర్చవుతుంది కదా!!....తలకి రాయడానికి రెండు చుక్కలు నూనె సరిపోతుంది కదా!!!” అన్నాడు గర్వంగా పద్మనాభం.
"అవునండోయ్... ఇదంతా నాకు తట్టనేలేదు” సంతోషంగా అంది రత్నాబాయి. "నువ్వు కూడా పూల కర్చు ఇలాంటివి కాకుండా కాస్త పెద్దవాటిల్లో తగ్గించు...చీరలు ఎక్కువ కొనడం మానెయ్....”
"హయ్యో రాత.... నాకు చీరలు ఎక్కువ ఎక్కడున్నయండి బాబూ?....... పక్కింటి పద్మను చూడండి... ఆమెకి ఎన్ని చీరలు ఉన్నాయో ఆమెకే తెలియదు!...”
"అదిగో అదే వద్దన్నాను!!...... వాళ్లతో వీళ్లతో పోల్చుకొని అవసరం ఉన్నా లేకపోయినా కొనెయ్యడం.......... అలాంటి కర్చులు తగ్గించుకోవాలి! సినిమాలు కూడా రిలీజైనవన్నీ చూసెయ్యకూడదు.........అసలు ఈ రోజుల్లో సినిమాలు ఏం బాగుంటున్నాయి? ఏ సినిమా చూసినా నరుక్కోవడం లేదా బూతులు! అందుకే అందరూ బావుంది అన్న సినిమాకే వెళ్ళాలి.....
అయినా టీ.వీ చానెల్సు లో రోజూ బోల్డన్ని సినిమాలు వస్తూంటాయి.... ఇంక ధియేటర్ కి వెళ్ళీ చూడాలా?"
"మీ సిగరెట్ల కర్చు గురించి యెత్తరేం....... అయినా ఆ పొగ పీల్చడం ఎందుకూ?" మొహం చిట్లిస్తూ అడిగింది రత్నాబాయి.
"దాంట్లో ఉండే తృప్తి ఆనందం గురించి నీకు తెలియదు!!"
"ఆహా!!..........అలాగా!!....... అలాగైతే నేను గ్యాస్ స్టవ్వు తీసేసి అటక మీద పారేసీ కట్టెల పొయ్యి మీద వంట చేస్తా......... చక్కగా ఇల్లంతా పొగ వస్తుంది.......... బోల్డంత పీల్చచ్చు........”
"అబ్బా..........సిగరెట్టు తాగడంలో మజా నీకు తెలియదులే...............” విసుక్కుంటూ అన్నాడు పద్మనాభం.
"పోనీ నేనొక ఉపాయం చెప్పనా? సుబ్బరంగా కాసింత కొబ్బరి పీచును కాగితంలో సిగరెట్టులా చుట్టి దాన్ని కాల్చకూడదూ?.......... మీరు పదో తరగతి చదివేటప్పుడు అలాగే దొంగతనంగా కాల్చేవారట కదా............. అత్తయ్యగారు చెప్పారు”
“అది సరేగాని.........నేను ఇప్పుడు కాలుస్తున్న సిగరెట్ట్లు కాకుండా కాస్తంత త్క్కువ రేటున్న సిగరెట్ట్లు కాల్చి కర్చు తగ్గిస్తా........ సరేనా?"
ఇలా వాళ్ళిద్దరూ ఏయే వాటిల్లో కర్చు తగ్గించాలి..........నెలకు ఎంత మిగల్చాలి అని ఓ గంటసేపు చర్చించి కచ్చితమైన నిర్ణయాలకు వచ్చారు. వాళ్ళిద్దరికీ బడ్జెట్ ప్లానింగ్ చాలా తృప్తిని ఇచ్చింది.
"మనం తీస్కున్న నిర్ణయాలని ఈవేల్టినుండే అమలు పర్చాలి!” అన్నాడు పద్మనాభం
అప్పుడే డోర్ బెల్ మోగింది.
పద్మనాభం లేచి వెళ్ళి డొర్ తీసాడు. ఎదురుగా చేతుల్లో సూట్ కేస్లతో పిన్నీ, బాబాయ్, వాళ్ళ నలుగురు పిల్లలూ కనిపించారు.
"ఎందుకో నువ్వీమధ్య చాలా గుర్తుకు వస్తున్నావోయ్..........నీతో పది రోజులు గడపాలని వచ్చాం........ ఎట్టాగూ పిల్లలకిప్పుడు శెలవలు........” అన్నాడు పద్మనాభం బాబాయ్.
కెవ్వున అరిచి మూర్చపోయాడు పద్మనాభం.
మామూలుగా ప్రతి నెలా అయ్యే కర్చుకి నాలుగు రెట్లు ఎక్కువ కర్చు అయింది్, ఆ నెల పద్మనాభానికి.
మధ్యతరగతి ఇళ్ళలో బడ్జెట్లు ఇలాగే తగలడతాయి
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐