❤️రాధాకృష్ణుల ప్రేమగాథ!

 


♦️రాధాకృష్ణుల బంధం మనసుకు పరిమితమైనది. రాధ ప్రేమ తత్త్వం కృష్ణుడు అయితే, కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ. వీరి ప్రేమ ఇహలోకానికి సంబంధించింది కాదు, రాధాకృష్ణుల రాసలీలలు మోక్షానికి సంబంధించినవి. శ్రీకృష్ణుడిని యశోద తనయుడిగా, రేపల్లె ముద్దుబిడ్డగా, పాండవరాయబారిగా, అర్జునుడి రథసారథిగా, గీతాచార్యుడిగా.. ఇలా ఎన్నో రీతుల్లో ఆరాధిస్తాం. కానీ, కృష్ణ ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే ప్రేమిక రాధ. వారి ప్రేమతత్తం జగతికి ఆదర్శం. మరపురాని కావ్యం.
♦️రాధ ఉంటే కృష్ణుడు ఉన్నట్లే, కృష్ణుడు ఉంటే రాధ ఉన్నట్లే.. వీరిద్దరినీ వేరుగా చూడలేం. శ్రీకృష్ణుడికి అష్ట భార్యలున్నా, 16వేల మంది గోపికలు ఉన్నా రాధే ఆయన ప్రేమ సామ్రాజ్ఞి. రాధకు కూడా అంతే. ఆమె హృదయ స్పందనలో నందబాలుడే గోచరమవుతాడు. వారిద్దరిదీ ఒకటే తత్తం. అది ఏకత్వం. కృష్ణుడి స్మృతుల్లో రాధ మనసు పులకాంకితమైతే, రాధను తలచుకున్న వెన్నదొంగకు మేను రోమాంచితమవుతుంది. పొన్నలు నిండిన బృందావనం, వెన్నెల రాత్రులు, మురళీనాదం, యమునాతీరం.. వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు.
♦️కోరికను ప్రేమ అనుకుంటారు కొందరు. అభిమానాన్ని ప్రేమ అని అపోహ పడతారు మరికొందరు. మోహాన్ని ప్రేమగా భ్రమిస్తారు ఇంకొందరు. చాలామంది కామాన్ని ప్రేమ అనుకొని మోసపోతుంటారు. నిజానికి వీటన్నిటి వెనుక ఉండేది స్వార్థం మాత్రమే! బృహదారణ్యక ఉపనిషత్తులో ‘లోకంలో భర్తను ప్రేమించేది భర్త కోసం కోసం కాదు. ఆత్మ కోసం. భార్యను ప్రేమించేది కూడా ఆత్మ కోసమే.. అలాగే సంతానాన్ని ప్రేమించేది కూడా ఆత్మ కోసమే’ అని యాజ్ఞవల్క్య మహర్షి, తన భార్య మైత్రేయికి ఆత్మతత్త్వాన్ని ఉపదేశిస్తాడు. ఎవరు దేన్ని ప్రేమించినా తన సుఖం కోసమే చేస్తారు కానీ, ఎదుటివారి సుఖం కోసం కాదు. దీనిని నిజమైన ప్రేమగా పరిగణించలేం. ఇది అవసరార్థ ఏర్పాటు మాత్రమే. దీన్ని మానవులు ప్రేమగా వర్ణిస్తారు. కానీ మానవ మాత్రురాలే అయిన రాధమ్మది స్వార్థాన్ని దాటిన ప్రేమ. తనను తాను సంపూర్ణంగా అర్పించుకున్న అరుదైన వైనం ఆమెది. దేవతలు కూడా ఆత్మార్పణ చేసి శూన్యులుగా మారడానికి భయపడతారు. కానీ, రాధ ఆ భయాన్నీ అధిగమించింది. అంతటి పరమోత్కృష్ట ప్రేమోన్మత్త స్థితి ఆమెది. అందుకే ప్రేమ ఆమెను రసరాగిణిని చేసింది. సర్వదేవతా శిరోమణిగా మార్చింది. సకల లోక సామ్రాజ్ఞిగా కీర్తి కట్టబెట్టింది.
♦️శ్రీకృష్ణుడు కూడా నిరంతరం రాధ నామాన్ని జపిస్తుంటాడని, ఆమెనే ధ్యానిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు రాధకు దాసుడా? నిరంతరం రాధను ధ్యానిస్తాడా? అన్న అనుమానం రావచ్చు. కానీ ప్రేమలో సమస్తం సంభవమే! ప్రేమకు కట్టుబడినట్లుగా భగవానుడు దేనికీ లొంగడు. రాధాకృష్ణుల ప్రేమను గురించి ‘ప్రియే చారుశీలే’ అష్టపదిలో ‘స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవమ్‌ ఉదారం’ అని రాశాడు జయదేవుడు. అంటే, తన తలపై చిగురుటాకుల వంటి పాదాలను ఉంచమని రాధను కృష్ణుడు ప్రాధేయ పడుతున్నాడని దీని భావం. ‘నేనేంటి ఇలా రాశాను’ అని బాధపడుతూ రాసిన దానిని కొట్టివేసి, పాపపరిహారం కోసం స్నానానికి వెళ్లాడట జయదేవుడు. ఆ కవీశ్వరుడు వచ్చేసరికి ఇంతకుముందు రాసిన పంక్తులు మళ్లీ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడట. జయదేవుడి రూపంలో శ్రీకృష్ణుడే వచ్చి ఆ పాదాలను మళ్లీ రాసి, భోజనం కూడా చేసి వెళ్లడం.. భార్య ద్వారా తెలుసుకుని రాధాకృష్ణుల ప్రేమకు దాసోహం అయ్యాడు. రాసక్రీడ సమయంలో రాధ పాద ధూళిని శిరస్సున ధరించి కృష్ణుడు తనను తాను మరచి ఆనందలోకంలో తేలియాడేవాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడి అవతల రాధ ఉంటే.. రాధకు అవతల మాత్రం ఎవ్వరూ కనిపించరు. శూన్యం తప్ప. ఇదే రాధాకృష్ణుల ప్రేమగాథ
     ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩