ఒక కుమారి జాలి కధ !



❤️పదారేళ్ల వయసులో జయలలిత ఇలానే కల కంది.
ఓ మామూలు ఆడపిల్లలా కలల రాకుమారుడు వస్తాడని,
పెళ్లి చేసుకుంటాడని, ఓ మంచి గృహిణిగా బతకాలనీ కోరుకుంది...!
♥️♦️"ఆజా సనమ్‌.. మధుర చాందినీ మె హమ్‌..
తుమ్‌ మిలే తో విరానే మే భీ ఆ జాయేగీ బహార్‌..
జూమే లగేగా ఆసమాన్‌..’ అంటూ ఇష్టంగా, తన్మయత్వంతో పాడేది.
♦️ఆ క్షణంలో... ఆ కళ్లల్లో గతం తాలూకు కలల మెరుపులు. బహుశా ఈ కల నిజమై, ఆమె కోరుకున్న మనిషితో పెళ్లి జరిగి, ఓ మంచి గృహిణిగా స్థిరపడి ఉంటే... భారత చరిత్రలో నిలిచిపోయే నాయకురాలు పుట్టేది కాదేమో!
‘♥️ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి?’ అని అడిగితే
‘అన్‌కండిషనల్‌ లవ్‌ అనేదే నిజమైన ప్రేమ,
ఎలాంటి షరతులు లేని ప్రేమ,
అలాంటి ప్రేమ ఉందంటే నేను నమ్మను’ అని అంటారామె.
♦️ఎలాంటి నిజాన్నయినా చెప్పగలిగే ధైర్యం ఆమె సొంతం.
‘నారీ కాంట్రాక్టర్‌ అంటే నాకు ఇష్టం, అతన్ని చూడ్డం కోసమే మ్యాచ్‌లకి వెళ్లేదాన్ని. తర్వాత షమ్మీ కపూర్‌ మీద ఓ బలమైన ఆకర్షణ. జంగ్లీ సినిమాను ఎన్నిసార్లు చూశానో..
అన్ని పాటలు నోటికి వచ్చేవి అప్పట్లో’ అని
జయలలిత చెప్పేవారు.
♦️‘అమ్మ నన్ను వదిలి వెళ్లిపోతుందేమో అని,
ఆమె చీర చెంగుని నా చేతికిచుట్టేసుకుని పడుకునే దాన్ని.. అమ్మ నన్ను వదిలి వెళ్లక తప్పని పరిస్థితుల్లో నా చేతికి చుట్టుకున్న తన చీరని విప్పి, వేరే చీరని కట్టుకుని, ఆ చీరను మా అత్తకు కట్టించి అలాగే నా పక్కన పడుకోమని చెప్పి వెళ్లేది.. పొద్దున లేచి చూస్తే మా అమ్మ చీరలో మా అత్త నా పక్కన పడుకుని కన్పించేది..’ అని జయలలిత అన్నప్పుడు జయ కనుపాపల్లో ఆమె తల్లి ప్రతిబింబం కనిపిస్తుంది.

♦️చిన్నప్పుడు తనకి ఎదుటివారి కోపం అంటే భయం, ఒకరితో గొడవ పడటం అంటే భయం, వాదనలంటే భయం, ఎదిరించడమంటే భయం.. అసలు పదిమందిలో ప్రముఖంగా కన్పించాలంటేనే భయం.. ఉన్న చోటు తెలీకుండా బతకాలనుకునేది. కానీ విధి ఆమె కోసం వేసుకున్న ప్రణాళిక వేరు.
♥️జయలలిత అన్నాడీఎంకే పార్టీలో సభ్యత్వాన్ని పొందిన సందర్భంలో ఒకసారి ఇలా అన్నారు.. ‘ఈ సమాజమే నాయకుడి జన్మకు కారణమవుతుందని నమ్ముతున్నా. ప్రతి మనిషిలోనూ అన్యాయాన్ని ప్రశ్నించే ఓ స్వభావం ఉంటుంది. ప్రతిస్పందించే ఒక నిజాయతీ ఉంటుంది. వాటిని ఎవరన్నా తట్టిలేపితే నాయకుడవుతాడు’ అని పేర్కొన్నారు.

♦️ఒక మామూలు ఆడపిల్లగా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రోడ్డుమీద కనిపించే చిన్న చిన్న ఘటనలు ఆమె మనసుని కలచివేసిన సందర్భాలెన్నో. చెన్నై మౌంట్‌రోడ్‌లో బస్టాపుల దగ్గర బిక్షాటన చేస్తున్న చిన్నపిల్లల్లి చూస్తూ తన పాటికి వెళ్లలేక, ఆగి.. తనదగ్గర దాచుకున్న డబ్బుతో వాళ్లకి పుస్తకాలు కొనిచ్చి, చదువుకోమని చెప్పిన రోజుల్లో ఆమె అనుకొని ఉండదు.. తాను ఓ రాష్ట్రాన్ని శాసించే శక్తిగా ఎదుగుతానని!
ఆమెలో ఇతరులకి సేవ చేయాలనే తపన చిన్నప్పుడే మొలకెత్తిందని చెప్పడానికి ఇలాంటి ఆధారాలెన్నో. అయితే అది రాజకీయంగా ఎలా రూపాంతరం చెందింది అనేది తరచి చూస్తే దానికి కూడా ఆమెలో దాగి ఉన్న ప్రశ్నించే స్వభావాన్ని తట్టిలేపిన ఘటనలే కారణమని చెప్పొచ్చు.
♦️లైమ్‌లైట్‌లో ఉండడానికి ఇష్టపడని ఒక సాధారణ అమ్మాయి.
. అమ్మ ఆదేశానుసారం నటిగా కొత్త జీవితం ప్రారంభించింది. అమ్మచాటు బిడ్డగా నటిగా ఎదుగుతున్నప్పుడు, అమ్మ చనిపోవడంతో ఒంటరిగా జీవితంతో పోరాడాల్సి వచ్చినప్పుడు ఎమ్జీఆర్‌ ఆమెకు అండగా నిలిచారు. ఆయనకి చేదోడు వాదోడుగా ఉండటం కోసం పార్టీలో చేరారు జయ. ఎంతో నమ్మకంగా పనిచేశారు. అయితే అసెంబ్లీలో కరుణానిధి అవమానించడమే ఆమె రాజకీయ జీవితంలో మలుపు అని అందరూ అనుకుంటారు కానీ.. అది నిజం కాదు....
ఎమ్జీఆర్‌ చనిపోయినప్పుడు అంతిమ యాత్రలో జయలలిత పాల్గొనడానికి వస్తుంటే ఆమెని కిందికి దింపేశారు.. నీ అవసరం లేదంటూ. అంతవరకూ ఆమెకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఆమెకి ఆ సమయంలో ఉన్న ఆలోచనంతా, తనెంతో గౌరవించిన ఎమ్జీఆర్‌కి చివరి దాకా వెంట ఉండాలి అన్న వేదన తప్ప వేరే ఏ ఆలోచనా లేని నిష్కల్మషమైన అభిమానం ఆమెది. అంతిమ యాత్రలో పాల్గొనలేని పరిస్థితులకు ఆమె ముందు బాధపడింది. ఆ తర్వాత ప్రశ్నించడం మొదలుపెట్టింది.
♦️ఫలితంగా అన్నాడీఎంకేలో రెండు శాఖలు ఏర్పడ్డాయి. కోడిపుంజుని తన శాఖకి గుర్తుగా ఆమె ఎంచుకుంది. నిజానికి ఆమె జీవితంలో ఒంటరి పోరాటం అప్పట్నుంచే ప్రారంభమైంది. ఆమె వేసిన ఒక్క ఒంటరి అడుగు వెనక వందల వేల లక్షల అడుగులు తోడుగా పడ్డాయి అతి తక్కువ కాలంలో. ఆ తర్వాత ఆమె ఎంత శక్తిమంతంగా పనిచేసిందంటే.. చివరికి‘నువ్వు అవసరం లేదు’ అన్న వాళ్లే ‘ఈ పార్టీకి రెండు శాఖలు అవసరం లేదు, పార్టీకి నువ్వే అవసరం’ అని శరణు కోరి, పార్టీ గుర్తు రెండాకుల్ని, పార్టీ వారసత్వాన్ని కూడా ఆమె పరం చేశారు.
ఆ రోజు ఆమెని అంతియ యాత్ర నుంచి పంపేయకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలీదు.. కానీ ఆమెలో నిద్రిస్తున్న పులినీ, ప్రశ్నించే స్వభావాన్ని తట్టిలేపి నాయకురాలిని చేసింది ఆ ఘటన!
♦️ఎలాంటి ఉద్వేగమైనా.. అది కోపం కానివ్వండి, సంతోషం కానివ్వండి.. వెంటనే వ్యక్తం చేసే సహజసిద్ధమైన స్త్రీత్వం ఆమె సొంతం ఒకప్పుడు....
సినీ నటి సూర్యకాంతం షూటింగ్‌లకి ఏదో ఒక ఫుడ్‌ ఐటమ్‌ ఇంట్లో చేసుకొని వచ్చే వారు. అయితే ఆమె వండే పులిహోర అంటే జయకి చాలా ఇష్టం. ఒకరోజు షూటింగ్‌లో సూర్యకాంతం పులిహోర తీసుకొచ్చారు. పొద్దున షూటింగ్‌ మొదలైనప్పట్నుంచీ జయ కళ్లన్నీ ఆ పులిహోర మీదే. ఎప్పుడెప్పుడు బ్రేక్‌ ఇస్తారా.. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. బ్రేక్‌ రానే వచ్చింది వెంటనే పులిహోర బాక్స్‌ తెరిచి ఆవురావురుమని తింటుంటే ఎక్కిళ్లు వచ్చాయి. వెంటనే నీళ్లిచ్చి ప్రేమగా తడ్తున్న సూర్యకాంతం వైపు జయ ప్రేమగా చూసింది. ‘ఆ సమయంలో ఆమెలో అమ్మ కనిపించింది’ అని ఓ ఇంటర్వ్యూలో జయ చెప్పారు....
♦️సూర్యకాంతం చనిపోయినప్పుడు ఆ రోజు ఉదయం కుటుంబసభ్యులు ఆమె చుట్టూ ఉన్నారు. ఉన్నట్టుండి ఓ వార్త.. ‘ముఖ్యమంత్రి వస్తున్నారు’అంటూ! క్షణాల్లో అక్కడికి సీఎం జయలలిత చేరుకున్నారు. సూర్యకాంతం చూపించిన మాతృప్రేమని మర్చిపోకుండా, పదిలంగా గుండెల్లో దాచుకుని, ఆమె ఇక లేరు అన్న వార్త తెలియగానే.. ఉన్న పనులన్నీ పక్కనపెట్టి ఆమె భౌతికకాయం వద్ద మౌనంగా, బాధగా గడిపిన జయలలితను ఏమని వర్ణించాలి? జయ మాటల్లోనే చెప్పాలంటే.. ‘నా మనసుని కదిలించిన సంఘటనలను, మనషులనూ నేనెప్పటికీ మర్చిపోను. నాలో ఒకరి పట్ల ఉన్న ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, కృతజ్ఞత కానీ పోతాయి అంటే అది నా తుదిశ్వాసతోనే!’.
♦️ఒకానొక సమయంలో జయని చో ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ చోకి ఒంట్లో బాలేదంటే, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి ‘యు విల్‌ కమ్‌ అవుటాఫ్‌ దిస్‌ వెరీసూన్‌’ అని అన్నారు. అదే నిజమైతే నాకు మరింత షాక్‌ అని చో బలహీనమైన స్వరంతో జోక్‌ వేశారు. జయ మాత్రం.. అలా అనకండి. మీకేం కాదు. అని ధైర్యంగా చెప్పారు. ఆ మాట ఏదో మాటవరసకి అన్నది కాదు. ఆమె మొహమాటం కోసం మనుషుల్ని చూడటం, మాట్లాడం చేయరని ప్రతీతి.
♦️ఆమె కనుచూపు మేరలో కన్పించే వాటినన్నింటినీ మనస్ఫూర్తిగా చూస్తారు. ఒకరోజు ఆమె పోయస్‌ గార్డెన్‌లోకి రాగానే.. తన సెక్యూరిటీని పిలిచి గార్డెన్‌కి రావటం కోసం తిరిగే మలుపులో ఓ కొట్టు ఉంటుంది, అక్కడ రోజూ ఓ ముసలాయన ఉంటాడు. రెండ్రోజుల్నించి చూస్తున్నా. కొట్టు మూసేసి ఉంది. అతనికి ఏమైందో కనుక్కోండి అని ఆదేశించారు. రెండు నిమిషాల్లోనే వార్తను మోసుకొచ్చారు సిబ్బంది. ముసలాయనకి జ్వరం, లేవలేకుండా ఉన్నాడు అని. వెంటనే ఆయన తరఫు వాళ్లని తీసుకురండని చెప్పడం.. వాళ్లకి వైద్యం కోసం డబ్బు ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయి.
ఆమెలోని గాంభీర్యానికి!
♦️కరుణానిధి వల్ల ఆమె రెండు ప్రధానమైన అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకటి, 1989లో అసెంబ్లీలో జరిగిన అవమానం, రెండోది కరుణానిధి అధికారంలోకి వచ్చాక ఆమెపై కేసులు పెట్టి జైలుకి పంపడం. ఈ రెండు అవమానాల మధ్య ఆమె చేసిన ప్రయాణంలో ఆమె వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించారు. జైలుకి వెళ్లినప్పుడు ఆమె ప్రతిస్పందించిన తీరులో ఉన్న గాంభీర్యం ఎంతటివారికైనా మతిపోగొడ్తుంది.
♦️ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ‘జైలులో అడుగుపెట్టిన ఆ రోజుని నేను మరిచిపపోలేను. జీపులో ఎక్కుతున్నప్పుడే మానసికంగా ఏం ఎదురైనా స్వీకరించాలని సిద్ధపడే ఎక్కాను. చాలాకాలం మూతపడి ఉన్న పాత బిల్డింగ్‌ని నా కోసం గౌరవనీయులైన కరుణానిధి ప్రత్యేకంగా తెరిపించారు. లోపల దుమ్ము, ధూళి, ఎలుకలు, పందికొక్కులు, తేళ్లు, జెర్రులు.. ఒక చిన్న జువాలజీ క్లాస్‌ తీసుకోవచ్చు అక్కడ. కటిక నేలమీద పడుకున్నాను. నెల్రోజులు గడిపాను. ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. రాలేదంటే నేను రానివ్వలేదని కాదు అర్థం. నిజంగానే రాలేదు. ఇలా నేను మారడానికి ఒకటే కారణం. మనల్ని అవతలి వారు వ్యక్తిగతంగా గాయపరిచినప్పుడు మనం బాధ పడతాం. ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే.. మన ముందు ఉన్న పరిస్థితిని మనం అంగీకరించకపోవడం వల్లే. నేను జైల్లో బాధపడితే చూడాలని అనుకున్నారు. సిబ్బందిని అడిగారట ఆమె ఏడుస్తోందా? అని. లేదు సార్‌ ఆమె ఏడవలేదు అని అంటే వాళ్లు నిరాశ చెందారని విన్నాను. నిజానికి వారి నిరాశ నన్ను ఆనందపరిచింది’ అని ఆమె చెప్పారు.
సవాలుని స్వీకరించడం ఇష్టం!
♦️బాధపెట్టిన వాళ్లకి.. ఈమె జోలికి ఎందుకు వెళ్లామా అని బాధపడేలా బుద్ధిచెప్పడం ఇష్టం.. భయపడని, మడమతిప్పని, కార్యదక్షత ఇష్టం.. ‘ఉన్నై నాన్‌ సందిత్తేన్‌ నీ ఆయిరత్తిల్‌ ఒరువన్‌’ అనే ఎమ్జీఆర్‌ పాట ఇష్టం.. సూర్యకాంతం అమ్మ వండే పులిహోర అంటే ఇష్టం.. ఈ ప్రపంచమంతా తన బంధువర్గమే అన్న భావన ఇష్టం.. ముదురు ఆకుపచ్చ రంగు ఇష్టం. మాటలు కాదు చేతల్లో అనుకున్నది చేసి చూపడం ఇష్టం.. వీటన్నింటితోపాటు ఆమెకి తన ఆరోగ్యం తన వ్యక్తిగత విషయంగా ఉంచడమే ఇష్టం.
‘మన కోసం మనం బతకాలనుకున్నప్పుడు ఒకలా ఉంటాం. ఇతరుల కోసం మనం జీవించాలి అనుకున్నప్పుడు మనకే తెలియకుండా ఒక అనూహ్యమైన పరిణతిని పొందుతాం. మనం వూహించని విధంగా రూపాంతరం చెందుతాం. నేను ఇలా అవుతానని ముందే వూహించి ఉంటే బహుశా భయపడి వుండేదాన్నేమో. పార్టీలో చేరడమే మానుకునే దాన్నేమో. పార్టీలో చేరేనాటికి నేను మామూలు ఆడపిల్లని మరి. భయస్తురాల్ని కూడా. ఒక మామూలు అమ్మయి నుంచీ.. ఇలా మారటం నా డెస్టినీ’ అని అన్నారామె.
ఆమ్మ లేని తమిళనాడు!
♦️పెద్దదిక్కు పోయిన కుటుంబంలా.. మొదలె తెగిన చెట్టులా.. పునాదులు కూలిన కోటలా.. తల్లిలేని పిల్లల్లా.. అనాథలా.. అయోమయంగా.. భవిష్యత్తు లేనట్టుగా.. ప్రశ్నలా.. ఆమె అభిమానులు తల్లడిల్లుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఎటువంటి వారసత్వం లేకుండా.. ఒంటరిగా, పోరాడి, ఎదిరించి, గెలిచి నిలిచిన స్త్రీ శక్తి.. జె. జయలలిత..!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐