🍂💦😊 'సైంధవలవణం' 😊💦🍂
(ఇది నా రచన కాదు.. మీ కోసం ..నేను తెచ్చిన
...నవ్వుల నజరానాలో ప్రచురితమైన కథ.)
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
'' చూడండీ!..మీకిదే చెప్తున్నా..
నేను ఆ డాక్టర్ చెప్పిన పాపిష్టి తిళ్ళూ తినను,.అట్లాంటి డాక్టర్ చెప్పిన మందులూ మింగను. అసలు ఇంకోసారి నన్ను అలాంటి అస్తవ్యస్తపు డాక్టర్లు దగ్గరకి తీసుకువెళ్లారంటే నేను రమణమహర్షి ఆశ్రమానికి పోతా " ఇంటికి వస్తూనే విరుచుకుపడింది శాంతమ్మ గారు.
ఆ మాట అంటూనే హాల్లోనుంచి వంటింట్లోకి వెళ్ళిపోయింది ,మారుమాట్లాడే అవకాశం రామారావు గారికి ఇవ్వకుండా..
వంటింట్లోకి వెళ్లేముందు శాంతమ్మ గారు గుమ్మంలోనించే చెప్పులను కాళ్లతోనే డైరెక్ట్గా షూ రాక్ లోకి విసుగ్గా విసిరిన విసురు చూసి... మాంచి ప్రావీణ్యత గల ఫుట్బాల్ ప్లేయర్ గోల్ కొట్టే విధానం గుర్తొఛ్చి...
కొంత దిగ్భ్రాంతికి మరింత భయ భ్రాంతికీ గురయ్యాడు రామారావు గారు.
వంటిట్లోకి వెళ్లిన శాంతమ్మగారు అదే విసురుని వంటింట్లోని పాత్రలపై ప్రదర్శిస్తున్నట్లుంది ,
'ఆకాశం నుండి స్టీలుగిన్నెల వర్షం పడుతోందా' ! అన్నట్లు శబ్దం రాసాగింది వంటింట్లోనుంచి.
ఈ హడావిడికి ..ఏంజరుగుతోందా అన్న ఖంగారుతో తన గదిలోంచి అమాంతం హాల్లోకి దూకాడు, వాళ్ళ అబ్బాయి కృష్ణ ..'ఉడికే ఉడికే బాండీ లోంచి బయటకు చిందిన కూరముక్క లాగా' .
"ఏమయ్యింది నాన్నా? " అడిగాడు ఆల్మోస్ట్ అచేతనావస్థలో నిలబడ్డ తండ్రిని కుదుపుతూ..
''ఏమయ్యిందా ? మొన్ననే 70 నిండి 71వ ఓవర్లోకి ప్రవేశించిందా మీ అమ్మ, టెండూల్కర్ లాగా డబల్ సెంచరీ కొట్టింది ,బీపీ లో .. 200 130 ఉన్నది .. ఆ డాక్టర్ ఒక పక్క అర్జెంటు గా మందులు మొదలుపెట్టమని మందులు రాసిస్తే ..వద్దంటే వద్దని నా రెక్కలు పట్టుకుని లాక్కొచ్చింది . అదేమంటే ఏమీ చెప్పకుండా ఆ డాక్టర్ ని తిట్టిపోస్తోంది .. మీ అమ్మ పెంకి తనానికి తోడు ఈ బీపీ ఒకటి , అసలే కోతి- ఆపై కల్లు తాగింది అన్నట్లుంది వ్యవహారం.." వాపోయారు రామారావు గారు
"మీరు నన్ను కోతి అనుకోండి,, పిల్లి అనుకోండి,.. కానీ ఆ డాక్టర్ పేరు నా ముందు ఎత్తకండి". వంటింట్లోనుంచి రివ్వున వస్తూ అన్నది రామారావుగారి మీద ఓ చెవి వేసుంచిన శాంతమ్మ గారు.
''ఏంటి నీ గోల శాంతం? అంత మంచి డాక్టర్ నీకెందుకు నచ్చలేదు అసలు?'' విసుక్కున్నారు రామారావు గారు.
ఓయబ్బో..కాపురం చేసే కళ కాలుతొక్కినప్పుడే బయటపడింది అన్నట్లు.. ఆయన ఎంత గొప్ప డాక్టరో బీపీ తగ్గడానికి ఆయన గారు చెప్పిన చచ్చు సలహా తోనే అర్ధమయ్యింది.. మీ ఫ్రెండ్ కొడుకని మీరేమో ఆయన దగ్గరికి తీసుకెళ్లడం.., ఆ మహానుభావుడేమో చిన్నంతరం పెద్దంతరం లేకుండా అడ్డమైన పాడు తిండ్లు తినమని చెప్పడం. ఎదో అభం శుభం తెలియని అమాయకులకు చెప్పినట్లు గా పాపం పుణ్యం ఎరిగిన నా బోటివాళ్ళకీ చెప్తే ఎట్లా అంట? అసలు నాకైతే అక్కడికక్కడే ఆ డాక్టరుని నాలుగు దులిపెయ్యాలనిపించింది కానీ ఎవరిపాపాన వారే పోతారని వదిలేసా . పోనీ మీ ఫ్రెండ్ కొడుకన్నారుగా, మీరైనా ఆ అబ్బాయిని '' పెద్దావిడని అలాంటి పాపిష్టి తిండ్లు తినమనడం ఏంట"ని మందలిస్తారేమో అంటే..తానా అంటే తందానా అంటూ ఆ డాక్టర్ చెప్పినదానికల్లా గంగిరెద్దు లాగా తల ఊపి వచ్చారాయె '' దెప్పిపొడిచింది శాంతమ్మ గారు.
"అంత చెప్పరాని సలహా ఏమి చెప్పాడమ్మా "ఆ డాక్టర్ ? అడిగాడు కృష్ణ..
''ఏమి చెప్తాడురా? మార్నింగ్ వాక్ చెయ్యమన్నాడు, పచ్చి కూరలు తినమన్నాడు, పచ్చళ్ళు, ఉప్పుకారాలు తగ్గించమన్నాడు. అందులో ఏమి తప్పుంది?'' అన్నారు రామారావు గారు.
'వాటన్నిటి గురించీ ఎవరేమన్నారు "
మరి ఇంకేంటి ?
" ఇంకేంటా..ఆ ఉప్పు విషయమే ..నాకు వళ్ళు మండుతున్నది."
"ఉప్పు ఏంటి. ?తగ్గించామన్నాడు అంతేగా ..హై బీపీ వఛ్చిన వాళ్ళని ఉప్పు తగ్గించమనక పూటకో బస్తా కంచంలో గుమ్మరించుకు తినమంటారా ?"
"ఆ మాత్రం ఉప్పు తగ్గించాలని నాకూ తెలుసు,, మా వంశం లో 5 తరాలనుండీ అందరికీ రక్తపోటు ఉందట ".
"ఆ విషయం ఇందాక నువ్వు వంటింట్లో గిన్నెలతో కధాకళీ ఆడించినప్పుడే అర్ధమయ్యిందిలే.. పైగా మీ పుట్టింట్లో అన్నీసొట్టలు పడ్డ బొచ్చలేగా ? అయినా అసలు ఆ డాక్టర్ చెప్పిన వేటితో సమస్య లేదన్నదానివి ఇందాకటినుండి ఎందుకా డాక్టర్ ని ఆడిపోసుకుంటున్నట్లు శాంతం ?
"ఎందుకేంటీ? మీరూ విన్నారుగా ? ఆ డాక్టర్ ఉప్పు తగ్గించమంటే పర్వాలేదు కానీ వాడే కొంచెమ్ ఉప్పు కూడా అదేదో దిక్కుమాలిన ఉప్పు వాడమనలేదూ? అది తలుచుకుంటేనే నా వళ్ళంతా జెర్రులు పాకినట్లుంది. అంది శాంతమ్మ గారు
"దిక్కుమాలిన ఉప్పా? నీ తలకాయ. ఆయన వాడమన్నది దిక్కుమాలిన ఉ ప్పుకాదు, దిక్పాలక ఉప్పు కాదు. దాని పేరు సైన్ధవలవనం . బీపీ వఛ్చిన వాళ్లకి ఆ ఉప్పు వాడితే మంచింది.అయినా వంశ పారంపర్యంగా బీపీ తెచుకున్నదానివి మీ వాళ్ళెవరూ సైన్ధవలవనం వాడటం తెలీదా నీకు?'' అడిగారు రామారావు గారు.
తాడంత ఎత్తున లేచింది ఆ మాటకి శాంతమ్మ గారు.
''ఛీ ఛీ , మా ఇంటా వంటా లేదు అలాంటి పాపిష్టి లవణాలు గివణాలూ తినడం. ఏమనుకున్నారో మా పుట్టింటి వాళ్లంటే .నేనెప్పుడూ అసలా పేరు కూడా వినలేదు. అయినా చీర తో పాటు జాకెట్టు, నెక్లెస్ తో పాటు దుద్దులు లాగా బీపీ తో పాటే సైన్ధవలవనం ఏమైనా సెట్ ఆ ఏంటి ? బీపీ వచ్చిన ప్రతివాళ్ళు అదీ తెచ్చుకు తిని తీరడానికి? "దబాయించింది శాంతమ్మ గారు.
"అదికాదు అమ్మా . బీపీ వచ్చినప్పుడు మాములు ఉప్పు మంచిది కాదు. అలా అని అస్సలు ఉప్పు మానేస్తే అసలుకే తిండి సహించక నీరసిస్తావు. 2 రోజులకన్నా ఎక్కువ ఆ చప్పటి తిండి తినలేవు . అదే సైన్ధవలవనం అయితే బీపీ ఎక్కువ పెంచదు, రుచీ మాములు ఉప్పు లానే ఉంటుంది '' నచ్చ్చచెప్పపోయాడు కృష్ణ ,
అబ్బా పోనిరా కృష్ణా.. బీపీ ఉంటె ఉండనీ.అదే ఓ పక్కన పడి ఉంటుంది. అంతేకానీ దానికోసం ఇప్పుడీ పాపిష్టి తిళ్లన్నీ తినలేనురా '' చెప్పింది శాంతమ్మ గారు.
''ఓ పక్కన పడి ఉండటానికి బీపీ ఎమన్నా రిటైర్ అయినా మొగుడు అనుకుంటున్నావా? వళ్ళంతా పీకి పాకాన పెడుతుంది.ఏమనుకుంటున్నావో? హెచ్చరించారు రామారావు గారు.
"అయినా అమ్మా... ఉప్పు మార్చినంత మాత్రాన అది పాపిష్టి తిండెలా అయిపోతుందమ్మా? నేనేమన్నా రేపటినుంచి దారికాచి కిడ్నాపులు, హత్యలు చేసి ఆ డబ్బుతో ఆ ఉప్పు కొంటానా? వాపోయాడు కృష్ణ.
"అదికాదురా కృష్ణా.. ఊహ తెలిసినప్పటి నుంచీ రామాయణ మహాభారతాలు చదివిస్తూ పెంచింది నన్ను మా బామ్మ. సంధ్యగొబ్బెమ్మ నోము నుండి మొన్నీమధ్య చేసిన లక్ష వ్రత్తుల నోము దాకా స్త్రీల వ్రతకథల పుస్తకంలో చెప్పిన నోములన్నీ చేసుకున్న దాన్ని నేను . పూజా పునస్కారం అవ్వకుండా పచ్చి గంగైనా ముట్టుకోను.
అలాంటిది ..ఇంత బ్రతుకూ బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు చేసుకున్న పుణ్యమంతా బూడిదపాలయ్యేట్లుగా నేనిప్పుడా సైన్ధవలవనం తినాలా? ఏం.. మాములు ఉప్పు తింటే ఇప్పుడే పోతానా? ఆ పాపిష్టి లవణం తింటే మాత్రం ఇంకో వందేళ్ళుంటానా ?" చిన్నబుచ్చుకున్నారు శాంతమ్మ గారు.
ఆవిడ తీరు అర్ధం కాక అయోమయంగా ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు కృష్ణ రామారావు గారు.
" అది కాదు శాంతం..నువ్వు చెప్పిన నీ పుణ్యాల చిట్టా అంతా సరే గానీ సైన్ధవలవణానికి దానికీ ఏంటి సంబంధం?" అడిగారు రామారావు గారు.
బుగ్గలు నొక్కుకుంది శాంతమ్మ గారు. బోలెడంత ఆశ్చర్యం తో రామారావు గారిని చూస్తూ ...
"మీకింకా అర్ధం కాలేదా? నిజం గా ??"అడిగింది శాంతమ్మ గారు.
"నిజం శాంతం , ఒట్టు "అన్నారు రామారావు గారు.
"అయ్యో రామ!! "అంటూ తల బాదుకుంది శాంతమ్మ గారు.
"అందుకే.. నేను నెత్తీ నోరు బాదుకుని మరీ రోజూ చెప్పేది. ఈ వయసులోనైనా కొంచెం భక్తి, జ్ఞానం పెంచుకోండి. ఎప్పుడూ ఆ దిక్కుమాలిన న్యూస్ ఛానెల్స్ చూడకుండా అప్పుడప్పుడూ పురాణప్రవచనాలు వినండి అని. వింటారా మీరు..చూసిన వార్తలే చూసీ చూసీ బట్టికొట్టడం, పనీ పాట లేని వాళ్ళు నలుగురు చర్చ పేరుతో టీవీలకు ఎక్కి కొట్టుకు చస్తుంటే వినోదం చూడటం, లేదంటే ఎవరెవరో ఆడిన ఆటలన్నీ రోజంతా కూర్చుని చూడటం.... ఇహ మీకేమి అర్ధమౌతుంది నా బాధ?
అయినా ఎదో సామెత చెప్పినట్లు నా పిచ్చి గానీ మీకు ఆ మాత్రం పురాణజ్ఞానం ఉంటే ఇందాకటినుండి నాకీ ఘోషంతా ఎందుకుండేది? అక్కడే ఆ డాక్టరుని మీరే
నాలుగు అక్షింతలేసి, "నువ్వు వద్దు, నీ వైద్యం వద్దు" అని చెప్పే వారు కాదూ".. మొత్తుకుంది శాంతమ్మ గారు.
అటు తిరిగి ,ఇటు తిరిగి నా వార్తల మీద, స్పోర్ట్స్ మీద పడద్దులే కానీ... ఇంతకీ నీ పుణ్యానికీ ఆ సైన్ధవలవణానికి సంబంధం ఏంటో చెప్పి ఇంకొంచెం పుణ్యం కట్టుకో శాంతం . నీరసంగా అభ్యర్ధించారు రామారావు గారు.
"పుణ్యానికి కాదు పాపానికీ సైన్ధవలవణానికీ ఉంది సంబంధం. ఎంత పాపాత్ముడు ఆ సైన్ధవుడు ? మరి ఆ దుర్మార్గుడు సైన్ధవుడి లవణం తింటే పాపం రాదూ ? అయినా సైన్ధవుడి లవణాలు, జరాసంధుడి లవణాలు తిని మహా పాపం మూట కట్టుకోవాల్సిన అగత్యం ఏంటి నాకు ?మనం తినే ఆహారమే మనం ఏంటో నిర్ణయిస్తుంది అంటారు కదా.. ఇప్పుడు నేను ఆ రాక్షస వెధవ లవణం తిని వాడి లాగా రాక్షసి బుధ్ధులు తెచ్చుకుని అధోగతి పాలవ్వాలంటారా?
అయినా బీపీ తగ్గించడానికి ఆ డాక్టరుకి ఆ ముదనష్టపు సైన్ధవుడే దొరికాడా... కావాలంటే ఏ ధర్మరాజు లవణమో భీష్ముడి లవణమో ఇవ్వమనండి .. శుభ్రంగా తింటాను ''
ఉపోద్ఘాతం మొదలు పెట్టిన అరగంటకి అసలు వార్త మొదలుపెట్టే 24 గంటల వార్తా ఛానల్ న్యూస్ రీడర్ లాగా ఇప్పటికి అసలు విషయం బయటపెట్టింది శాంతమ్మ గారు
శాంతమ్మ గారి మాటలు విని ఒక్క నిమిషం మెదడు తిమ్మిరెక్కినట్లయింది రామారావు గారికి, ...
కృష్ణకైతే ఎముకల లోపల మజ్జలో ఎవరో దురదగుంటాకు పూసినట్లయ్యింది... ఎలా గోక్కుంటే ఆ దురద తగ్గుతుందో తెలియని అయోమయ అచేతనావస్థలో పడిపోయాడు కృష్ణ.
శాంతమ్మ గారితో ఇలాంటి విష'యాల్లో ఎక్కువ అనుభవం ఉన్న రామారావు గారే ముందు తేరుకున్నారు .
మెదడు తిమ్మిరి విదిలించి వదిలించుకోవడానికా అన్నట్లు తలని గట్టిగా పైకి, కిందికి ఊపుతూ పగలబడి నవ్వసాగారు . ఆలస్యంగా తెలివిలోకి వఛ్చిన కృష్ణకీ నవ్వు ఆగలేదు.
"ఓసి నీ ఇల్లు బంగారం కానూ.. అదా నీ గోల ఇందాకటినుంచీ.. సైన్ధవ లవణం అంటే మహాభారతం లో సైన్ధవుడికి సంబంధించిన లవణం అనుకున్నావా !! వాడేమన్నా సముద్రమా వాడి నుంచి ఆ ఉప్పు తయారవడానికి ? మనిషి. మోకాలికీ బోడిగుండుకీ సంబంధం పెట్టినట్లు సైన్ధవుడికీ ,సైన్ధవ లవణానికీ సంబంధం ఏంటే శాంతం ,, నీ తలకాయ కాకపోతే.." కడుపు పట్టుకు మరీ నవ్వసాగారు రామారావు గారు.
నిర్లక్ష్యంగా రామారావు గారి వైపు " మీ బొంద"అన్నట్లు ఒక చూపు విసిరి, భర్త కనుక మరీ డైరెక్ట్ గా ఆ మాట అనలేక ఓ నిట్టూర్పు విడిచి ,,ఇలా సెలవిచ్చింది శాంతమ్మ గారు.
"నా తలకాయా లేదు, మెడకాయా లేదు...ఎదో ఒక సంబంధం లేకపోతే ఆ లవణానికి అసలు వాడి పేరు ఎందుకు పెడతారు? ఇప్పుడూ... విదురుడు చెప్పిన నీతులకి విదుర నీతులనీ ,యక్షుడు వేసిన ప్రశ్నలకి యక్ష ప్రశ్నలనీ పేరు లేదూ..అలాగే... ఇదేదో ఆ సైన్ధవుడికి సంబంధించిన లవణమే అయ్యి ఉంటుంది. అందుకే ఆ పేరు.
అయినా చెల్లెలు వరస అయిన ద్రౌపదీ దేవిని చెరచడానికి చూసిన వాడు, ముక్కు పచ్చ లారని అభిమన్యుడి చావుకి కారణమైన వాడూ...అటువంటి ఆ సైన్ధవుడి ఉప్పు తినమన్న ఆ డాక్టరుని చెప్పుతో కొట్టాలి "... ఆగ్రహోదగ్రురాలయ్యింది శాంతమ్మ గారు..
బీపీ వలన ఆవిడకి ఆవేశం పెరుగుతోందని గ్రహించిన కృష్ణ కాసేపు ఆ విషయం పై వాదన వదిలెయ్యమన్నట్లు రామారావు గారికి కనుసైగ చేసాడు. సరే అని మౌనం దాల్చారు రామ రావు గారు.
వంటింట్లో వంట చేస్తూ ఉన్న శాంతమ్మ గారి కోడలు రుక్మిణికి హాల్లో అత్తా మామ భర్తల సంభాషణలో కొంతే వినబడింది. మిగిలినదంతా మిక్సీ కుక్కర్ ల శబ్దాలలో కలిసిపోయింది. తాను విన్నదాని ప్రకారం అత్తగారికి మాములు ఉప్పు పనికిరాదని అదేదో సైన్ధవలవణమనే కొత్త ఉప్పు వాడాలనీ మాత్రమే అర్ధమైంది రుక్మిణికి..
"మరి తెచ్చ్చారా ఆ సైన్ధవలవణమేదో..ఇస్తే అత్తయ్యగారికి విడిగా తీసిన పప్పు కూరల్లో కలిపేస్తా " అంటూ హాల్లోకి దూసుకొచ్చింది.
అప్పుడే శాంతమ్మ గారి ఆవేశం తగ్గిద్దామని ఓపక్క తమ నోళ్ళని పాకింగ్ పూర్తయ్యిన బస్తాల లాగా గట్టిగా కట్టేసుకు కూర్చుంటే..రుక్మిణి వలన మళ్ళీచర్చ మొదలై రచ్చ జరుగుతుందని భయపడ్డాడు కృష్ణ..
ఆ సైన్ధవలవణం విషయం మాట్లాడ వద్దనీ , అక్కడినుండి వెళ్లిపొమ్మనీ అర్ధం వచ్చేట్లుగా కళ్ళతో, నోటితో, చేతితో ,ముక్కుతో.. రకాలుగా సైగలు చేసాడు. కృష్ణ కూచిపూడి డాన్సర్ లెవెల్లో సర్వాంగాల్నీ సర్వదిశలకీ తిప్పి ఎంత అభినయించినా, రుక్మిణి కృష్ణ వైపు కన్నెత్తైనా చూడకుండా ద్రోణాచార్యుడి పరీక్షలో పాల్గొంటున్న అర్జునుడిలా లక్ష్యం మీదే ధ్యాస పెట్టి ..
" తెచ్చారా ఆ సైన్ధవ లవణం" అంది మళ్ళీ .
పళ్ళు బిగబట్టి, బండ గొంతుతో "లేదు, తేలేదు" అన్నాడు కృష్ణ..
తనలోని డాన్సర్ ని గుర్తించక పోయినా కనీసం తనలోని మిమిక్రీ ఆర్టిస్ట్ నైనా రుక్మిణి గుర్తిస్తుందేమో.. తన గొంతులోని తేడా గుర్తించి తన వైపు తిరిగితే మళ్ళీ సైగలు చేసి తరిమేద్దాం అన్న ఆశతో..
ఆడ అర్జునుడి అపర అవతారమైన రుక్మిణి దృష్టి మాత్రం చెట్టుమీద పక్షి కంటి నుండి...అదే సైన్ధవ లవణం నుండి ఏ మాత్రం చెదరలేదు.. తన ధోరణి కంటిన్యూ చేస్తూ అడిగింది..
''అయ్యో తేలేదా? పోనీ కిరణ్ ని పంపించి తెప్పిస్తాను,ఇంతకీ ఎక్కడ దొరుకుతుంది ఆ సైన్ధవలవణం?''
"కురుక్షేత్రం లో... పోయి తెచ్చుకో " అన్నాడు కృష్ణ ..వళ్ళు మండిపోయి..
అప్పటిదాకా ఎదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న శాంతమ్మగారు కృష్ణ మాట విన గానే ఎదో స్ఫూరించినట్లు ..రెండు చేతులు చరుస్తూ అదీ సంగతి అన్నారు..
రామారావు గారి వైపు తిరిగి చూపుడు వేలు గాలిలో ఊపుతూ.. చూసారా.. నా బాధ తెలిసిన భగవంతుడు నా కొడుకు నోటిద్వారానే నాకు క్లూ ఇప్పించాడు .
ఏమిటీ....నీరసంగా అడిగారు కొడుకు సైగల వాల్ల భార్యతో వాదించే అవకాశం కోల్పోయిన రామారావు గారు.
మీరే విన్నారుగా.. సైన్ధవ లవణం ఎక్కడ దొరుకుతుంది అంటే కురుక్షేత్రం లో అన్న కృష్ణ మాట.. అదే నిజం. కురుక్షేత్రంలో సైన్ధవుడిని అర్జునుడు చంపేసాక , అంత పాపాత్ముడికి కూడా అంత్యక్రియ లు ఎందుకని వదిలేసి ఉంటారు.. వాడి శరీరం నుంచి ఎముకలు బయట పడ్డాక ఆ ఎముకల పొడిని నూరి ఉప్పులో కలిపి మందు గా తయారు చేసుంటాడు ఆ కాలపు అతితెలివి అప్రాచ్యపు డాక్టర్ ఎవడో.. అదే సైన్ధవ లవణం .. తత్త్వం బోధించిన లెవెల్ లో తేల్చి చెప్పారు శాంతమ్మ గారికి...
ఐన్స్టీన్ కైనా అర్ధం కానీ , అనితర సాధ్యమైనట్టి ఆవిడ సమన్వయం కలిగించిన అయోమయానికి గుడ్లు తేలేసారు కృష్ణ, రామారావు గారు. తలకి ఎటువైపు నుండి మొదలు పెట్టి జుట్టు పీక్కుంటే ఎక్కువ రిలీఫ్ గా ఉంటుందో అన్న ఆలోచనలో నిమగ్నమయిపోయారు.
ఇంతలోకి .."అవునా అత్తయ్య గారూ, సైన్ధవుడు , అంత చెడ్డవాడా? "
అంటూ ధర్మసందేహాలు కార్యక్రమం మొదలుపెట్టింది పురాణాల్లో పాస్ మార్క్ జ్ఞానం కూడా లేని రుక్మిణి...
కోడలు ఇచ్చిన ఆ ప్రోత్సాహానికి ఇక తనని ఆపడం ఎవరి తరమూ కానంత స్థాయి కి వెళ్ళిపోయింది శాంతమ్మ గారు..నిత్యానంద స్వామి లెవెల్లో ప్రవచనం కొనసాగించింది.
"అవును రుక్మిణీ ! ఆ సైన్ధవ సన్నాసి చెల్లెలు వరుస స్త్రీని చెడు దృష్టితో చూడడమే కాకుండా అభిమన్యుడి మరణానికి కూడా కారకుడయ్యాడు.
నువ్వు చూసావుగా ఈ మధ్య మాయాబజార్ సినిమా కలర్ లో ..ఎంత ముచ్చటగా
ఉన్నారు నాగేశ్వర రావు ,సావిత్రీ..అభిమన్యుడు, శశిరేఖలుగా.. వాళ్ళిద్దరి పెళ్ళికి కృష్ణ భగవానుడు ఎన్ని పాట్లు పడతాడూ? అంతా కష్టపడి వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే సైన్ధవుడి వలన కదూ...కాళ్ళ పారాణి ఆరక ముందే అభిమన్యుడు పోయి , శశిరేఖకి అన్యాయం జరిగిపోయింది??
మొన్నీ మధ్యే నర్తనశాల సినిమా కూడా చూపించా గుర్తుందా నీకు? అందులో శోభన్ బాబు.., అదే అభిమన్యుడు... ఉత్తర ని పెళ్లాడతాడు గుర్తుందా..పాపం ఆ ఉత్తర అయితే కడుపుతో ఉంటుంది అభిమన్యుడు పోయేప్పటికి.అంటూ కళ్లు తుడుచుకుంది శాంతమ్మ గారు.
అత్తగారు చెప్పింది అంతా విన్నాక ...ఇంతకీ సైన్ధవుడి వలన చనిపోయింది నాగేశ్వర రావో, లేక శోభన్ బాబో అర్ధం కాలేదు రుక్మిణికి.
కానీ సైన్ధవుడి వలన సావిత్రికి కష్టం కలిగింది అన్న మాట బాగా బుర్రకెక్కించుకుంది రుక్మిణి. అసలే మహానటి సినిమా చూసినప్పటినుంచీ సావిత్రి కి వీర ఘోర అభిమాని అయిపొయింది రుక్మిణి. ఎంత అభిమానము అంటే వెబ్ ఛానెల్ లో ఆ సినిమా ప్రతిరోజు చూసీ చూసీ పట్టలేనంత ప్రేరణ పొందేసింది. తాను కూడా సావిత్రిలాగా చీరలమ్మి పేదలకు సహాయం చెయ్యాలని బీరువాలో 2 చీరలని పట్టుకు బయలుదేరింది. ఎలాగొ అది పసికట్టిన కృష్ణ, వెయ్యి రూపాయిలు పెట్టి కొని వెయ్యిసార్లు కట్టిన ఆ ఇమిటేషన్ పట్టు చీరలను భార్య వీధిన పెట్టకుండా ఆపి ,కుటుంబం పరువు నిలబెట్టుకున్నాడు. ఇంకా ఇలాగె వదిలేస్తే,, తనని జెమిని గణేశన్ లాగ 4 పెళ్లిళ్లు చేసుకోమనో,,, లేక రోజు ఇంటికొస్తూ తనకోసం ఒక మందు బాటిల్ తెమ్మనో అంటుందన్న భయం తో రుక్మిణికి తెలియకుండా ఆ వెబ్ ఛానెల్ ఆన్ సబ్స్క్రయిబ్ చేసేసాడు. అయినా అప్పటికే తలకెక్కిన సావిత్రీ వీరా భిమానం మాత్రం ఎక్కడికీ పోలేదు రుక్మిణిలో .అందుకే అత్తగారు చెప్పిన అంత కథలో సావిత్రీ అన్న పేరొక్కటే వినిపించుకుంది.
"వద్దత్తయ్య గారూ..వద్దు. సావిత్రిని అంత క్షోభ పెట్టిన సైన్ధవుడిని మీరసలు క్షమించొద్దు, వాడి ఉప్పే కాదు, వాడికి సంబంధించిన ఏ వస్తువూ ఇంట్లోకి రానీయద్దు''..అంటూ ముక్కు చీదుకుంటూ ,కళ్ళు ఒత్తుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించింది.
రుక్మిణి చేసిన సావిత్రి హడావిడికి శాంతమ్మ గారూ నివ్వెర పోయారు..
తనను మించి పోయిన కోడలి పురాణభాష్యం ఆవిడకీ అర్ధం కాక హతాశులై మౌనంగా కోడలు వెళ్లిన వైపే చూస్తుండిపోయారు.
భార్య మౌనం గా ఉండటం చూసి ఆవిడ మెత్తబడిందని అపార్ధం చేసుకున్న రామారావు గారు ఇదే అదను అనుకుని మళ్ళీ రంగంలోకి దిగారు.
సహజంగా ఎవరైనా మరెవరినైనా దేనికైనా ఒప్పించాలంటే సామదానభేద దండోపాయాలను అదే వరుసక్రమంలో వాడతారు.. కానీ లోకంలో చాలా మంది భర్తలు భార్యని దేనికైనా ఒప్పించాలంటే ఆక్రమంలో రారు. అరబిక్ వ్రాస్తున్నట్లు వ్యతిరేక దిశలో మొదలు పెడతారు. మొదట అధికారం ఉపయోగించి భయపెట్టే దండోపాయంతో మొదలై.. ఆవిడ మొండికెత్తిన కొద్దీ మొదటికొస్తారన్నమాట. అందుకే చివరికి బ్రతిమిలాట లోకి దిగారు రామారావు గారు..
'శాంతీ "...అని గోముగా పిలిచారు.. ఆవిడను ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు ఏకాంతంలో పిలిచే పిలుపది
కొడుకు ముందు అలా పిలిచేసరికి ఆవిడకి చిరాకుతో చిర్రెత్తిపోయింది.
శాంతీ లేదు, వాంతీ లేదు...
ఇంకేం మాట్లాడకండి అసలు. మీ మాటలతో నాకు భ్రాంతి కలిగించాలని చూడకండి , నాకసలు ఏ డాక్టర్లు అక్కర్లేదు, ఏ మందులు అక్కర్లేదు. , అంటూ అక్కడినుంచి చివ్వున లేచి తన గదిలోకి పోయి డాంమని తలుపేసుకుంది.
ఎలెక్షన్స్ లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్ధిలా ...,వరల్డ్కప్ ఫైనల్ లో డక్ అవుట్ అయిన కెప్టెన్ లా.. దిగాలుగా మొహాలు పెట్టుకు కూర్చున్నారు కృష్ణ, రామారావు గార్లు.
ఇప్పుడేం చెయ్యాలి కృష్ణా.. దిక్కుతోచక దీనంగా అడిగారు రామారావు గారు.
ఏమో నాన్నా.. ఆ సైన్ధవలవణం ఏమో కానీ దాన్ని మూలంగా ఆ డాక్టర్ చెప్పిన మందులే వాడను..ఇంకే డాక్టర్ కీ చూపించుకోను అని మొండికెత్తింది అమ్మ , ఓ పక్క బీపీ ఏమో అంత ఎక్కువగా ఉంది. ఏంచెయ్యాలో ఏంటో...
అవునురా.. వెనకటికెవరో "అల్లం అంటే నాకు తెలీదా.బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడుట,అట్లా వుంది మీ అమ్మ తెలివి. విసుక్కున్నారు రామారావు గారు.
ష్..ఊరుకోండి నాన్న.. అమ్మకి వినబడిందంటే మళ్ళీ కోపం తెచ్సుకుంటుంది..అసలే బీపీ . ఎదో ఒకటి ఆలోచిద్దాంలెండి. మీరు దిగులుపడకండి...అభ్యర్ధించాడు కృష్ణ.
తల కొట్టుకుని, గొణుక్కుంటూ ఉండిపోయారు రామారావు గారు
ప్రక్క గదిలో చదువుకుంటున్న కృష్ణ కొడుకు కిరణ్ ఈ సంభాషణ అంతా విన్నాడు. వింటూనే ఓ పక్క గూగుల్ లో సెర్చ్ చేసాడు. ఏం చదివాడో ఏం చూశాడో మరి ..
బామ్మ హాల్ లోంచి వెళ్లిపోయిందని గమనించి....మెల్లిగా హాల్ లోకి వచ్చి తండ్రినీ , తాతయ్యనీ బయటకు రమ్మని సైగ చేసాడు. ముగ్గురూ ఎదో మాట్లాడుకున్నారు.
సాయంత్రం..వస్తూనే బామ్మా బామ్మా,,నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ వచ్చాడు కిరణ్.. చేతిలో ఉన్న ప్యాకెట్ చూపిస్తూ...
ఏంటిరా అంటూ వచ్చారు శాంతమ్మ గారు..
ఇదా .. హిమాలయన్ సాల్ట్ బామ్మా.. మధ్యాహ్నం ఆ సైన్ధవలవణం గురించి నువ్వు పడ్డ బాధ అంతా విన్నా బామ్మా.. నాకూ నీ మాటే నిజం అనిపించింది. అందుకే వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నా గారు ఒక మంచి డాక్టర్ ఉంటే ఆయన దగ్గరకి వెళ్ళా . ఆయన కూడా నీలాగా ఎప్పుడూ పూజలు చేస్తూ ఉంటారు. నీలాంటి పుణ్యాత్ములు అంటే ఆయనకు చాలా గౌరవం . ఆయన కూడా నీ మాటే నిజం అన్నారు.అసలు నీలాంటి వాళ్లకి ఆయనైతే ఆ సైన్ధవలవణమే ప్రిస్క్రైబ్ చెయ్యరట. నీ లాంటి భక్తుల కోసం ఎందరో ఋషులు హిమాలయాల్లో తపస్సు చేసిన హిమాలయన్ సాల్ట్ ఉందట. అది సైన్ధవలవణం కన్నా బాగా పని చేస్తుందట, పైగా అది ఋషులు తపస్సుతో సృష్టించింది కనుక తింటే పుణ్యం కూడా. చెప్పాడు కిరణ్.
పొంగిపోయింది శాంతమ్మ గారు.. మా నాయనే మా తండ్రే.. నన్ను అర్ధం చేసుకునేది నువ్వేరా నాయనా. మీ తాతయ్యకి నా గోడు తలకెక్కితే కదా.. ఆ అయ్య కుచే మీ నాన్నానూ. ఇద్దరూ కలిసి ఆ పాపిష్టి సైన్ధవలవణం తినమని నన్ను కాల్చుకు తిన్నారనుకో.. కంప్లైంట్ చేసింది శాంతమ్మ గారు.
పోనీలే బామ్మా,, నేనున్నానుగా , దిగులుపడకు, ఇంకో విషయం. నిన్ను చూసిన డాక్టర్ గారు ఆ సైన్ధవలవణం ఒక్కటే తప్పు చెప్పాడు కానీ మిగిలిన మందులు అన్నీ కరెక్టే రాసాడుట. ఈ పూట నుండే మందులు మొదలు పెట్టమని చెప్పారు ఈ డాక్టర్గారు .చెప్పాడు కిరణ్.
తప్పకుండారా నా బంగారు తండ్రీ.. అంత మంచి డాక్టర్ చెప్పాక ఇంకా నేను ఎందుకు కాదంటాను..అంటూ సంబర పడిపోయింది శాంతమ్మ గారు.
*****
డాక్టర్ చెప్పినవన్నీ జాగ్రత్తగా పాటించడం తో త్వరలోనే బీపీ కంట్రోల్ అయిపోయి, ఆరోగ్యం గా ప్రశాంతం గా అయిపొయింది శాంతమ్మ గారు.
హిమాలయాల్లో ఋషుల తపస్సు తో సృష్టించిన హిమాలయన్ సాల్ట్ మహిమే తప్ప మనుషులు చేసిన మందులకు ఇంత ప్రభావం ఉండదని మనసారా నమ్ముతోంది. మనవడికి తన పై ఉన్న ప్రేమని తలచుకుని తలచుకుని మురిసిపోతోంది.
నెల తర్వాత ఒకరోజు ఆవిడ భాగవతం చదువుకుంటుంటే.. వచ్చి ఒళ్ళో పడుకున్నాడు కిరణ్. ప్రేమ గా తల నిమిరింది శాంతమ్మ గారు.
"బామ్మా నీ బీపీ తగ్గిపోయిందిగా" అన్నాడు కిరణ్..
"అవునురా" అంది శాంతమ్మ గారు.
"ఆ హిమాలయన్ సాల్ట్ తింటే నీకేమి ఇబ్బంది లేదుగా. నువ్వు భయపడ్డావుగా ..సైన్ధవలవణం తింటే నువ్వు కూడా సైన్ధవుడి లాగ అయిపోతావని ..అలాంటి మార్పులేం రాలేదుగా" ..అడిగాడు కిరణ్.
"చక్కగా మన కోసం హిమాలయాల్లో తపస్సు చేసి ఋషులు సృష్టించిన ఉప్పు తింటే సైన్ధవుడి గుణాలు ఎందుకొస్తాయిరా... నిజానికి ఈ ఉప్పు తినడం మొదలు పెట్టాక నాకైతే ఇంకా ప్రశాంతంగా ఉంటోంది. మీ తాతయ్య తిక్క చేష్టలని కూడా కోపం లేకుండా ఓర్చుకోగలుగుతున్నాను " అన్నారు శాంతమ్మ గారు. (" నీ మొహం, అది మందులు వాడి బీపీ తగ్గించుకోవడం వల్ల , ఉప్పు వల్ల, పప్పు వల్ల కాదు "అనుకున్నారు చాటు నుండి వింటున్న రామారావు గారు. )
"బామ్మా.. నీకో విషయంచెప్తే కోప్పడవుగా" గారంగా అడిగాడు కిరణ్.
"పిచ్చి తండ్రీ. నీ మీద నాకు కోపమేంటిరా?చెప్పు "..అన్నారు శాంతమ్మ గారు.
"నిజానికి సైన్ధవ లవణం అన్నా హిమాలయన్ సాల్ట్ అన్నా ఒకటే బామ్మా".. చెప్పాడు కిరణ్..
"హదేంటిరా...? "నివ్వెరపోయింది శాంతమ్మ గారు.
"అవును బామ్మా, హిమాలయాల దగ్గరలో సింధు నది తీరా ప్రాంతం లో దొరుకుతుంది సైన్ధవలవణం. దాన్నే ఇంగ్లీషులో హిమాలయన్ సాల్ట్ అంటారు. సింధు నది ప్రాంతంలో దొరుకుతుంది కనుక సైన్ధవ లవణం అన్నారు కానీ దానికీ భారతంలో సైన్ధవుడికీ ఏమీ సంబంధం లేదు". అన్నాడు కిరణ్
:"నిజామాట్రా ?" ..ఆశర్యపోయారు శాంతమ్మగారు.
"అవును బామ్మా .. ఆ రోజు నువ్వు సైన్ధవలవణం మూలంగా మందులే వాడనంటే భయం వేసి ఇలా చెప్పాల్సొచ్చింది. నీకు అబధం చెప్పినందుకు క్షమించు బామ్మా.".
"హారి గడుగ్గాయి, మీ నాన్నకి కృష్ణ అని పేరు పెడితే ఆ కృష్ణ మాయంతా నీకు అబ్బింది రా. నేను క్షమించడం ఏమిటిరా వెర్రి సన్నాసి. మిమ్మల్నందరినీ ఖంగారు పెట్టినందుకు మేరె నన్ను క్షమించాలి. అయినా నీ అంత తెలివి, నేర్పు మీ తాతయ్యకి ఉంటే నేను ఆయన మాటా విందును." అన్నది శాంతమ్మ గారు.
"ఆహా.. మనవడి తెలివితేటలన్నీ తాత నుండి వచ్చేవేలేవోయ్"..అంటూ నవ్వుతూ చాటునుండి వచ్చారు రామారావు గారు, ఆయన వెనకే కృష్ణా..
"అమ్మయ్య !అయితే ..ఈ ఉప్పుకీ సావిత్రి ని ఏడిపించిన సైన్ధవుడికీ ఏమి సంబంధం లేదన్నమాట" అంటూ రుక్మిణీ వచ్చింది.
నవ్వులు నిండిన ఆ లోగిలి లో ఆనందాల హరివిల్లులు విరిశాయి.
🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊🍂💦😊

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩