*మన ఊరు*

 *మన ఊరు*



ఎమ్మా సీతమ్మ బాగున్నావా....?
ఎంత కాలమైంది తల్లి నిన్ను చూసి...!!
హా...!! బాగున్నా బాబాయ్.....!!
నువ్వు ఎలా ఉన్నావ్ బాబాయు?
ఎదోనమ్మ.....!!! ఇలా నడుస్తుంది.
మనవళ్ళ సదువులు అయ్యాయు. ఉద్యోగానికని పట్నం పోయారు.
ఆళ్ళతో పాటే కోడలు కూడా ఎల్లింది.
చాల మంచిది బాబాయు.
కస్టపడి చదివించినందుకు చక్కగా సెట్టిల్ అయ్యారు.
వాళ్ళు ఎదగాలిగా అమ్మ...!!
అందుకే మీ పిన్నిగాని,నేను గాని ఆళ్ళకి అడ్డు చెప్పలేదు.
పిన్ని ఎలా ఉంది బాబాయ్.....కనిపించట్లేదు.
లోపలే ఉంది...!! లోపలకేల్లమ్మ....!!
ఏమేవ్.....మన బెజవాడ అయ్యమ్మ కూతురు సీతమోచ్చిందే .....!!
వస్తన్నానయ్య....!!
ఓరి ఓరి ఓరి....మా సీతమ్మే...!!
మా ఎమ్మే.....!!
ఎంత కాలమైంది నిన్ను చూసి.
చానా ఏళ్ల తర్వాత వచ్చావ్ !!
ఇంతకాలానికి ఊరు గుర్తోచిందా అమ్మా ...!!
మర్చిపోతేనే కదా పిన్ని గుర్తురాడానికి
అమ్మపోయాక ఎవరి కోసం రమ్మంటావు పిన్ని....??
ఉన్న వాళ్లు ఉన్నా లేనట్టే....!!
అదేంటి తల్లి అలా మాట్టాడతావ్
మేమంతా మడుసులం కాదా?
ఏ మాకోసం రాకూడదా?
ఇంతకి నువ్వు ఎట్టా ఉన్నావ్ ....
ఎమ్మా అంతా కులాసాయేనా....!!
నాకేంటి పిన్ని మీ అల్లుడు నన్ను కళ్ళలో పెట్టుకోని చూసుకుంటున్నారు.
అల్లుడు గారు, పిల్లలు అందరు బాగున్నారా.. తల్లి??
పిల్లల్ల్ని కూడా పట్టుకురవాల్సింది. పసి పిల్లలప్పుడు చూసాను.
ఎండన బడి వచ్చింది, అమ్మయుకి చల్లగా మజ్జిగ ఈయ్యవే.
ఊకో..... పట్నం లో అలవాటు పడ్డ పిల్లకి మజ్జిగేందయ్యా
ఎల్లి సుబ్బి గాడి కొట్లో సేవనప్పు సీసా పట్టుకురాయ్య
అయ్యో...ఇప్పుడవేమి వొద్దు పిన్ని....!!
ఈ చెట్లు పొలాల మధ్యలో ఎండ అనేది తెలియట్లేదు.
ఏం వొదినా..... బాగున్నావా?
రజని ....!!
నువ్వు ఏంటి ఇక్కడ ??
మీ అన్నయ్య ఈ పక్కన పొలానికి నీళ్ళేట్టడానికి వచ్చాడోదినా...!!అన్నం కట్టుకోచ్చా...!!
ఊళ్ళో అడుగు పెట్టి పది నిముషాలు కాలేదు.
పదుల సంఖ్యలో జనం.
పలకరింపులతో ఒళ్ళు పులకరించిపోతుంది.
ఏళ్ళు గడిచాక సొంతూరులో అడుగు పెట్టె ప్రతి ఒక్కరికి ఎదురయ్యేది ఇది...!!
మెట్టినింటికేల్లిన ఆడపిల్లలైనా..!!
పెద్ద చదువులకోసం వెళ్ళిన పిల్లలైనా...!!
దేశం కోసం కాపుకాయడానికేల్లిన జవాన్లైనా...!!
ఉద్యోగాల కోసం వెళ్ళిన యువతై నా...!!
చివరికి పదవుల కోసం పరుగు పెట్టిన పెద్ద మనుషులైనా సరే...
సొంత ఊరు అంటే చంటి పిల్లలుగా మారిపోతారు.
మన కష్టాన్ని....చూసింది ఆ ఊరే.
మనo గెలిస్తే ఊరేగించింది ఆ ఊరే.
కొట్లాటోచ్చినా వెన్నంటి నిలిచింది ఆ ఊరే...!!
కాంక్రీటు కట్టడాలు....దాని రూపు రేఖలు మార్చవచ్చు.
కాలం ఆ ఊరి కట్టు బాట్లను మార్చవచ్చు.
కరెంటు దీపాలు కొత్త కాంతులే తీసుకురావచ్చు.
కొత్త బస్సు రూటు పడి ఊరి దారినే మార్చవచ్చు.
కాని
మనం ఉన్నా లేకున్నా... మన జ్ఞాపకాలు మోస్తూ...!!
మన వాళ్ళు ఉన్నా.... లేకున్నా వాళ్ళ పలకరింపులు గుర్తు చేస్తూ...!!
మన ఇల్లు ఉన్నా లేకున్నా... మనమోస్తే నీడనిస్తూ...!!
మనం వచ్చినా రాకున్న.... మనకోసమే ఎదురు చూస్తున్నట్టు..
ఎలా వచ్చినా... ఎప్పటికి వచ్చినా సాదరంగా ఆహ్వానిస్తూ...
మనం మారినా, మన రూపు రేఖలు మారినా...
తాను మాత్రం
బామ్మ మాటలా,
గుడిలో పాటలా,
గడిచిన గతంలా,
తీరిపోయున కమ్మని కలలా
ఎన్నటికి మన మనసులో నిలిచిపోయేదే మన సొంతూరు
పుట్టి పెరిగిన ఊరిలోనే మట్టిలో కలసిపోవాలని కోరుకునే వాళ్ళు కొందరు.
మట్టిలో కలిసే లోపైనా ఒక్కసారి చూసి రావలనుకునేవాళ్ళు మరికొందరు.
✍️swa'Roopa' Devarakonda

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐