బారిష్టరు పార్వతీశం -(6.)  ప్రథమ భాగము (1957) రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యాయము 5




5
సుమా రేడుగంట లైంది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వెళ్ళేవాళ్ళూ అటు వెళ్ళేవాళ్లూ; స్టీమరుమీదనుంచి దిగినవాళ్ళకోసం వచ్చిన వాళ్ళూ, ఊరికే వేడుక చూడ్డానికి వచ్చినవాళ్ళూ, కూలివాళ్ళూ; ఒకళ్లేమిటి, సముద్రము ఒడ్డంతా కిటకిట లాడుతున్నది. హార్బరు నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడి అంతా చూస్తూ నిమ్మళంగా సామాను దగ్గిరికి వెళ్ళాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపము పెట్టెకూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు, వాళ్ళ ధర్మాన్ని.
ఒక కూలివాడిని కేకవేసి సామాను వాడినెత్తిమీద పెట్టి బండ్లదగ్గిరికి వస్తున్నాను. వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినబడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్నుపిలిచేవా రెవరుంటారని ముందుకి నడిచాను. మళ్ళీ కేక విన బడేసరికి ఆగి వెనక్కిచూశాను. రాత్రిస్టీమరులో బంట్రోతు ఆదిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకుని పరుగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయము కనబడలేదు. మొదటనే రైలులోనుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది; ఇంతబాధ లేకపోయేది. పోనీవృధాగా పారేయడ మెందుకు, రైలులో విడిచిపెడితే ఎవళ్ళయినా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ ​సాగిందికాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి కూడా తరుముకు వస్తున్నది. ప్రపంచములో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివర కెప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మరచిపోతే మళ్ళీ ఇక అది దొరకడము దుర్లభమని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయము సరికాదని ఇప్పుడే తేలింది. ఏదైనా ఎవళ్ళకైనా అనుభవములోనికి వస్తేగాని తెలియదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచములో అన్యాయమూ, దొంగతనమూ ఉందని చెపితే నేను నమ్మను. ఇక ఈటోపీ ఎక్కడ మరిచిపోయినా నన్నుకూడా వెంబడించేటట్టున్నది. అందుకని మాట్లాడకుండా యీసారిమట్టుకా టోపీ తీసుకుని ఎవళ్లూ చూడకుండా ఏ అర్ధరాత్రివేళో నడిసముద్రములో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రములోనైనా, పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి తీసి మళ్ళీ తీసుకు వచ్చి ఇస్తాడేమోనని భయము వేస్తున్నది. ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహా చెడ్డ అసహ్యం! బోలెడంత ఖరీదు దాని మొహాన్ని తగలెయ్యడమే కాకుండ పైగా అది పారేసి పోతూ ఉంటే వెనుకనుంచి తీసుకువచ్చి యచ్చిన ప్రతివాడికి ఏదో బహుమతిచేసి నా కమిత ప్రియతరమైన వస్తువేదో పోకుండా తీసుకువచ్చినట్టు సంతోషము కనపరచాలి. ఇంతమట్టుకి- సహించడమే చాల కష్టము. ఈ మాటుకింక తప్పదు గనుక మళ్ళీ ఆ తెచ్చినవాడి ముఖాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండిదగ్గరకు వెళ్ళాను.
చెన్నపట్నములో వచ్చిన చిక్కే యిక్కడాను; అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను; ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడి దరిద్రులకూ రాదు తెలుగు. చెన్నపట్నములో ​కొంత అనుభవమైంది గనుక కొంచము ఇంగ్లీషు వచ్చినట్టు కనబడ్డ ముఖము గల ఒకాయన్ని పిలిచి అడగ్గా, ఇక్కడకూడా దగ్గిరలో ఒక సత్రము ఉందనీ, ఆ సత్రములోనే దుడ్డు తీసుకుని భోజనము వేస్తురనీ, తెలుసుకొని నా రధాన్ని అక్కడికి తోలమని సారధితో చెప్పాను. గదులూ, అవీ విశాలంగా ఉన్నాయి. స్నానానికీ దానికీ సౌకర్యముగా ఉంది. జనసమ్మర్ధ మట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామానందులో పెట్టించేసి బండికి సెల విచ్చాను. చెన్నపట్నములో వాడికి మల్లే వీడు అట్టే దెబ్బలాడలేదు. కొంచెము మర్యాదస్థుడులాగనే ఉన్నాడు. అయితే వీడు సాహెబు, అందుకనే అయి ఉంటుంది.
ఇక సావకాశంగా పెట్టె తీసి పండ్లపొడి వగైరా తీసుకొని దంత ధావనాదికముకానిచ్చి స్నానముచేసి కొంతసేపు కూర్చునే సరికి పదిగంట లైంది. భోజనము చేశాను. చెన్నపట్నము లోనే నవ్వినవాళ్లు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోడము మానేశాను. భోజనము చేసినంతసేపూ మనసుకు చాలా కష్టముగానే ఉంది. తర్వాత కొంచెముసేపూ విశ్రమించాను. ఇంతవరకూ బాగానే ఉంది. ఇంకముందు సంగ తేమిటో, ఏమి చేయాలో తోచలేదు. లండనుకి ఏ స్టీమరు వెడుతుందో ఎప్పుడు వెడుతుందో, ఎక్కడ టిక్కట్లు ఇస్తారో ఏమీ తెలియదు. ఎవళ్ల నడగడానికీ ఇక్కడ ఎవళ్ళనూ ఎరగనుగదా! ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండనుదాకా వెళ్ళే దేమో అడిగి తెలుసుకో నన్నా తెలుసుకున్నానుకాను. ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏమి లాభమని నాసూటు వేసుకుని తలగుడ్డ చుట్టుకుని వీధిలోకి బయలు దేరాను. ఒకదారీ తెన్నూ తెలియదు. ఎవళ్ల ​నైనా అడగడానికి వాళ్లభాష తెలియదు. ఏమైనా సరే నని దైవముమీద భారంవేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను. కొంతదూరము వెళ్లేసరికి పెద్దమనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరము చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని, మూడు గీతలో నాలుగు గీతలో కనపడేటట్టు గంధము పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశః ఈయన కింగ్లీషు వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆయన్ని ఆపి మీ కింగ్లీషు వచ్చునా అని అడిగాను. వచ్చునన్నాడు. అయితే మీ దేవూరన్నాను. కుంభకోణము అన్నాడు. కుంభకోణమనే టప్పటికి మట్టుకు కొంచెము భయము వేసింది. మన మడిగిన దానికి సరిగ్గా జవాబు చెపుతాడో చెప్పడో అని. అయినా కుంభకోణము వాళ్లంతా మోసము చేస్తారు గనుకనా, మన్ని మోసము చేస్తే మట్టు కితని కేమివస్తుందని 'అయ్యా, మీరొక్క సహాయము చేసిపెట్టా ' లన్నాను. నేనడిగిన మాటకా పెద్దమనిషి అపార్ధము చేసుకుని అనుమానముతో నాకేసి చూసి 'నేనేమి చేయగలను వట్టి బీద వాడిని ' అని వెళ్ళి పోబోతున్నాడు. ఆయన్ని మళ్లీ ఆపి నాకాయన వల్ల ధనసహాయ మేమీ అక్కర లేదని అభయమిచ్చి 'ఒక విషయము మిమ్మల్ని అడిగి తెలుసు కోవాలని ఉంది నాకు ' అన్నాను. 'ఏమిటి ' అన్నాడు. నే చెప్పబోయే విషయముమాత్రము ఎవళ్ల దగ్గిరా మట్టుకు చెప్ప వద్దన్నాను. సరే నన్నాడు. 'నేను లండన్ వెళ్ళాలని బయలు దేరాను. ఇంటి దగ్గిర మావాళ్లకు తెలియదు. అక్కడికి వెళ్లే స్టీమ రెప్పుడు బయలు దేరుతుందో టిక్కట్లు ఎక్కడిస్తారో ఈ సంగ తేమన్నా తమకు తెలిస్తే చెపితే సంతోషిస్తాను. ఇంటి దగ్గిరే ఈ సంగతి తెలిస్తే వెళ్లనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్క డెవళ్లనూ ఎరుగను ​నేను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి' అన్నాను. 'ఓ ఇంతేగదా. దాని కభ్యంతర మేమున్నది. ఇలా ఫలాని చోటికి వెళితే టామస్ కుక్ అండ్ సన్ అని బల్ల కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనబడుతుంది. తిన్నగా అందులోకి వెళితే టిక్కట్టూ, మీకు కావలసిన యావద్విషయాలూ తెలుస్తయి ' అని చెప్పాడు.
'సరే బాగుంది. ఈమాత్రము తెలుస్తే ఇంక లండన్ వెళ్ళామన్నమాటేను' అని తిన్నగా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీచూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయమువేసింది. ఇంత దేశము తిరిగినా, అంతమేడ మట్టుకు ఎక్కడా కనబడలేదు. అది గాకుండా తీరా లోపలికి వెళితే స్టీమరు ఉందంటారో లేదంటారో? ఇంకోవారము రోజులదాకా రాదంటారో? లేకపోతే అసలిక్కడినుంచి వెళ్ళడము మానేశాయి అంటారేమో? ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్ళడములేదూ అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే. ఇంకోవారము పదిరోజులు ఆలస్యమవుతుంది అంటే ఈ లోపున మావాళ్ళు నా సంగతెలాగో తెలుసుకుని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో? అంతే కాకుండా ఎవళ్ళనీ కనుక్కోకుండా ఉజ్జాయింపు నేదో కొద్దిగా తీసుకు వచ్చాను డబ్బు. ఇక్కడ తీరా చాలదంటే ఏమికాను నాగతి? ఇక్కడ మనకప్పు ఇచ్చేవాళ్ళెవరుంటారు? అని ఇన్నివిధాలుగా మనసుపోయి లోపలికి వెళ్ళడానికి కొంచెము సంకోచించాను.
ఏమైతేమట్టుకు ఇంతదూరము వచ్చినతరువాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేముందని ఏమైతే అవుతుందని లోపల దణ్ణము పెట్టుకుని కంపెనీలోకి వెళ్ళాను. అక్కడొక ​బంట్రోతు కనపడి 'ఎక్కడికి ' అన్నాడు. 'లోపలి ' కన్నాను. 'ఎందుకు ' అన్నాడు. 'ఊరకనే ' అన్నాను. 'అయితే వెనక్కు తిరగండి ' అన్నాడు. 'వెనక్కి ఎందు' కన్నాను. 'ముందు పని లేనప్పుడు వెనక్కే' నన్నాడు. 'నాకు ముందు పని ఉంది' అన్నాను, 'ఏంపని' అన్నాడు. 'ఏమైతేమట్టుకు నీతోటిచెప్పాలా ' అన్నాను. 'ఆ చెప్పా' లన్నాడు. 'ఎందు' కన్నాను. అనేటప్పటికి వాడికి కోపము వచ్చి ఒకమాటు కండ్లెర్రజేసి నాకేసి చూచి 'నిన్ను లోపలికి వెళ్ళనివ్వడాని' కన్నాడు. నీవు వెళ్ళనిచ్చే దేమిటన్నాను. 'నే వెళ్ళనివ్వక్కర లేకపోతే వెళ్ళలేదేమి ' అన్నాడు. వెడతానన్నాను. వెళ్లు చూదాము అన్నాడు. 'నా యిష్టమైనప్పుడు వెళ్ళుతాను. నీ ఆజ్ఞ ఏమిటినాకు?' అన్నాను. ఒక నిముషము వాడు మాట్లాడక ఊరు కున్నాడు. నేనూ ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి, మేడ మెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకుచూస్తూ నిలబడ్డాను. కాని లోపల మట్టుకు భయము గానే వుంది. తీరా సాహసించి ముందుకి అడుగు వేస్తే వాడు రెక్కట్టుకుని వెనక్కు లాక్కు వెడతాడేమో. ఇంగ్లండు వెడుతున్నప్పు డటువంటి పరాభవము జరగడము బాగుండదు. సరే, అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను. వెనుకనుంచి తుపాకి పేల్చినట్టు 'ఆగు' అన్నాడు. వెనక్కు తిరిగిచూసి 'ఏం అలా ఉలిక్కిపడ్డావ' న్నాను. ఇంక వాడు కోపము పట్టలేక పోయినాడు. తిన్నగా నాదగ్గిరికి వచ్చి నా బుజముమీద చెయ్యివేసి 'ఇంక నీ పెంకెవేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళ 'మన్నాడు. వాడు బుజమ్మీద చెయ్యి వేసేసరికి నాకూ కోపమువచ్చింది. బుజమ్మీద చేయి తీసి వేసి 'నీవు బంట్రోతు వన్న సంగతి మరచిపోయి నట్లున్నావు, ​ఇందాకనుంచీ పోనీయనని మర్యాదగా ఊరుకున్నాను. నీబోటి వాళ్ళను లక్షమందిని చూశాను. ఇంక అట్టే నీవు పెంకితనము చేశావంటే నీ మీద రిపోర్టు చేయవలసి వస్తుంది, తీరా ఉద్యోగముపోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభముండదు. కాబట్టి జాగ్రత్త' అని ముందుకు నడవబొయ్యాను. వాడింక ఏమీ సమాధానము చెప్పకుండా నాచెయ్యి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్ళి దిగబెట్టి 'దిక్కున్నచోట చెప్పుకో' మన్నాడు.
ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనుపించలేదు. తీరా యీ బంట్రోతు ముండావాడితోటి దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యహారము చెడుతుందేమోనని భయము వేసింది. ఇక్కడ వీడి స్నేహము చేసుకుంటేనే గాని లాభము లేదని తోచింది, అందుకని మళ్ళీవాడి దగ్గిరికి వెళ్ళి నెమ్మదిగా, వాడికో అర్ధరూపాయి చేతిలోపెట్టి 'నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేను. టిక్కట్టుకోసము వచ్చాను, లేకపోతే ఇక్కడ నాకేమిపని గనుక. కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము' అని జేబులో వున్న లెక్కతీసి వాడికి చూపించాను. వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు.
తిన్నగా లోపలికి వెళ్ళాను. ఆ గదిలో గోడలనిండా పెద్ద స్టీమర్ల ఫొటోగ్రాపులూ, మ్యాపులూ ఉన్నాయి. అక్కడొక దొరగారు కూర్చున్నారు. ఆయన దగ్గిరకు వెళ్ళి 'అయ్యా నేను లండన్ వెళ్ళాలండి. స్టీమరెప్పుడు వెళుతుంది. వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది. టిక్కట్టెంత అవుతుంది?' అని అడిగాను. ఆయన నన్ను ఎగాదిగాచూసి 'నిజంగా లండన్ వెళుతావా ' అన్నాడు. వెళుతున్నానన్నాను. ఎందుకుఅన్నాడు. చదువుకోడాని ​కన్నాను. 'ఏం చదువుతావు?' ఈ పరీక్ష వీడికెందు కనిపించింది. అయినా దొర; ఆపైన టిక్కట్టుకూడా యిచ్చేవాడాయెను. వీడితోటి దెబ్బలాట ఎందుకని 'బారిష్టరు' అన్నాను. 'మీవాళ్ళువెళ్ళడానికి కొప్పుకున్నారా' అన్నాడు. కొంచెము సందేహించి 'ఆఁ' అన్నాను. 'లేకపోతే అసలు మీ వాళ్ళతోటి చెప్పలేదా ఏమి' టన్నాడు. నేను కొంచెము భయపడుతూ, వీడి కేమన్నా తెలిసిందా ఏమిటి మనసంగతి అనుకుంటూ, ఏమీ చెప్పడానికీ తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. 'కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి! నాతోటి చెప్పవచ్చు, నీకేం భయము లేదులే. ఇలా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు' అన్నాడు. అనేటప్పటికి కొంచెము ధైర్యము తెచ్చుకుని 'అవును. చెపితే మావాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను' అన్నాను. 'అయితే కోపమువచ్చి మీవాళ్ళడబ్బు పంపించరేమో! ఆసంగతి ఆలోచించావా?' అన్నాడు. ఫరవాలేదు పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలాచిక్కుపడవలసి వస్తుంది సుమా! ముందే ఆలోచించుకో.' 'అంతా ఆలోచించు కున్నా లెండి. తప్పకుండా పంపిస్తారనే ధైర్యము ఉంది గనుకనే బయలుదేరివచ్చాను. ఇవ్వాళ బయలుదేరే స్టీమరేదైనా ఉందా!' 'ఒకవారం దినములవరకూ లండన్ కంటా వెళ్ళే స్టీమర్లేవీ లేవు. కాని రేపు ఒక ఫ్రెంచి స్టీమరు మార్సేల్సు వరకూ వెళుతుంది. అక్కడనుంచి రైలుమీద వెళ్ళవచ్చును. అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది, త్వరగానూ వెళ్ల వచ్చును, అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరము ఉందా?' 'నా కెంతమాత్ర మభ్యంతరములేదు. ఫ్రెంచి స్టీమరుకే టిక్కట్టు ఇప్పించండి.' 'ఏక్లాసులో ​వెళుతావు?' 'థర్డ్ క్లాసు సౌఖ్యంగా వుంటుందా అండి?' 'ఒక మోస్తరుగా వుంటుంది, ఫరవా లేదు వెళ్ళవచ్చును.' 'అయితే థర్డ్ క్లాసు టిక్కట్టు ఒకటి యిప్పించండి.'
సరే నని టిక్కట్టు ఇచ్చి 'మార్సేల్సులో కూడా మాకంపెనీ వుంది, అక్కడే కాకుండా ప్రతి పట్టణములో వుంటుంది. ఎక్కడే విధమైన సహాయము కావలసి వచ్చినప్పటికిన్నీ మా కంపెనీకి వెళ్ళి నట్టయితే వాళ్ళ చేతనయిన సహాయము చేస్తారు. నీవేం భయపడ నక్కర లేదు.' అని అభయ మిచ్చాడు.
సరి ఇంక మన కేం ఫరవా లేదు కదా అను కున్నాను. 'నీ దగ్గర డబ్బు చాలా వున్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది. నీదగ్గర వుంటే పోవచ్చును. నీవు దిగగానే మార్సేల్సులో మా కంపెనీ వాళ్లు నీ సొమ్ము నీకిచ్చి వేస్తారు. నీవు ఇంకా యింటికి సొమ్మూ అదీ పంపించమని మీవాళ్ళకు వ్రాసే టట్లయితే మాకంపెనీ అడ్రెసు మీవాళ్ళకు తెలియ పర్చవలసింది. నీకు సొమ్మువచ్చినా వుత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా వప్ప జెప్పుతాము' అన్నాడు. సరే, ఈ ఏర్పాటు చాలా బాగుందని నాదగ్గిరున్న సొమ్మంతా ఆయన కిచ్చాను. ఒక ఏభై రూపాయలు మట్టుకు నా దగ్గిర అట్టె పెట్టుకో మని మిగతా సొమ్ము కొక చెక్కూ, ఈ ఏభై రూపాయలూ నా చేతికి ఇచ్చి మార్సేల్సు వాళ్ళకంపెనీ విలాసము వున్న అచ్చు చీటీ కూడా ఒక టిచ్చాడు. రేపు మధ్యాహ్నము మూడు గంటల కిక్కడికి వచ్చినట్లయితే స్టీమరు దగ్గరికి పంపిస్తా మన్నాడు. ఆయన దగ్గిర సెలవు తీసుకొని 'ఆహా? ఎంత గొప్ప కంపెనీ ప్రతీపట్ట​ణములోనూ వుందంటున్నాడు. నాబోటి గాండ్లకిలా బోలెడెంత సహాయము చేస్తున్నాడు. వీళ్ళకు దీనివల్ల ఏమైనా లాభముంటుందా? లేకపోతే ఊరికేనే చేస్తున్నారా?' అని, ఆలోచిస్తూ వీధి గుమ్మము దగ్గిరికి వచ్చాను. ఇందాకటి బంట్రోతు లేచి నిలుచుని 'టిక్కెట్టు తీసుకున్నారా అండీ' అని, తీసుకున్నానని చెప్పగానే నాకు సలాము చేశాడు. వాడి పొగరుబోతుతనము కొంత అణిగిందిగదా అని సంతోషించాను.
అక్కడినుంచి బజారువైపుకు దారి అడిగి తెలుసుకొని బయలుదేరి వెళ్ళాను. ఈ పట్టణము బజారుకూడా చాలా బాగానే వుంది, చెన్నపట్నములో కంపెనీలాంటి కంపెనీ ఒకటి కనబడితే ఇది వరకు కొన్నది అక్కరకురాలేదు కనకను, మళ్ళీ ఒక టోపీ ఒకటి కొనుక్కున్నాను. తరువాత ఇంటికి వచ్చేసరికి ఇంకోసంగతి జ్ఞాపకమువచ్చింది! దీపమొక టవసరముగదా అని. స్టీమరులో దీపము లేకపోతే? ఒకవేళ వున్నప్పటికిన్నీ వాళ్ళు తెల్లవార్లూ వుంచుతారో వుంచరో చీకట్లో పడుకోడానికి నాకు భయము. నిన్న రాత్రి స్టీమరులో దీపాలు ఎక్కేటప్పటికున్నాయిగాని నాకు తలనొప్పి వికారము తోటి ఒళ్లు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెళకువ రాకపోవడమువల్ల రాత్రి తెల్లవార్లూ వున్నవో లేవో జ్ఞాపకములేదు. రాత్రి స్టీమరులో లేకపోతే అప్పుడు దొరకదుగదా! ఇంతకూ మనకోదీపము, అప్పటికైనా, అడంగుకువెళ్ళిన తరువాతనైనా కావలసిందేగదా, అందుకని ఒకస్టాండూ, రెండుడజన్లు కొవ్వొత్తులూ కొనుక్కుంటే కాలక్షేప మవుతుందిగదా అని అవి కొన్నాను. తరువాత ఇంకో సందేహము తోచింది. స్టీమరులో పాలూ మజ్జిగలూ ఏమైనా దొరుకుతాయా, దొరకవా అని. ఒకవేళఏదీ దొరక్కపోతే ఎలాగనుకుని ఇక్కడొకషాపుమీద పాలడబ్బాలు ​దొరుకుతవని వ్రాసివుంటే చూసి, ఇది కాస్తదగ్గిరుంటే నయము కదా అనుకుని రెండు డబ్బాలు కొనుక్కుని నిమ్మళంగా ఆ సత్రము చేరుకున్నాను.
రాత్రి భోజనము చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరము వ్రాదామునుకుని పెట్టితీసేసరికి కాగితముగాని కలముగాని ఏమీ కనపడలేదు. సరే ఇదొకటిబజారు వెళ్ళి కొనుక్కోవాలిగదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను.
మర్నాడు ప్రొద్దునే బజారుకు వెళ్ళి వుత్తరములు వ్రాసుకోడానికి కాకితాలూ కవర్లూ ఒక పౌంటెన్ పెన్నూ, అందులోకి సిరా, ఒక పెన్సలూ, జమాఖర్చు వ్రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సరసైజు బుక్కూ, కొనుక్కుని ఇంటికి వచ్చాను.
వచ్చి ముందు వుత్తరమువ్రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని వుత్తరము వ్రాయడ మారంభించినాను.
క్షేమముకొలంబో
శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి;
తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు, ఉభయ కుశలోపరి, పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి? ఎక్కడుంది? ఎక్కడున్నా, నేనిక్కడికి వెళ్లడానికి కారణ మేమై వుంటుందని ఆశ్చర్య పడవచ్చును. ఇది సింహళద్వీపానికి ముఖ్యపట్టణము, అనగా పూర్వము మనము రావణాసురిడి లంక అనుకునేవాళ్లమే, అదే సింహళ ​ద్వీపము. రాక్షస కులమంతా రామరావణ యుద్ధములో అంతరించింది. కనుక ప్రస్తుత మిక్కడ రాక్షసభయ మేమీ లేదు.
నేనింతకాలమునుంచీ మనదేశ దుస్థితి చూస్తూంటే నాకు చాలా విచారంగావుంది. చూస్తూ సహించి ఊరుకోలేక పోయినాను. ఈ దేశ దుస్థితి తొలిగించడము ఏలాగాఅని చాలాదూరము ఆలోచించాను. నాకు తోచిందేమిటంటే ఒక్కసారి మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ల గుట్టూ మట్టూ కొంతవరకు తెలుసుకువస్తే చాలా లాభిస్తుందనీ, అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావలెనని బయలుదేరాను. వెళ్ళేవాళ్ళము ఏలాగూ వెళ్ళుతున్నాముకదా! ఇదంతా ఒకటి రెండు పూటల్లో అయ్యేపనికాదాయెను. కొంతకాలము అనగా ఒక యేడాది రెండేండ్లో ఉండక తప్పదు. అందుకని ఈ లోపున బారిష్టరు పరీక్ష చదివి ప్యాసు అయితే మళ్ళీ స్వదేశానికి వచ్చిన తరువాత ఒకడికింద తలవంచుకొని పని చెయ్యనక్కర లేకుండా స్వతంత్రముగా జీవనము చేయవచ్చునని ఊహించి అక్కడ బారిష్టరు చదవ నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యేఖర్చు విషయము ఎంత కావలసిందీ అక్కడికి వెళ్ళిన తరువాత వుత్తరము వ్రాస్తాను.
ప్రస్తుతము ఖర్చుకోసం అయిదువందల రూపాయలు ఇక్కడ నర్సాపురము నాటకము కంపెనీలో రాజువేషము వేసే గజవిల్లి నారాయణగారిద్వారా రు 1-14-0 లు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నాయందుండే స్నేహభావము చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించా ననీ, సొమ్ము మట్టుకు త్వరగా పంపించ మనీ చెప్పారు. కాబట్టి ఆ 500 రూపాయలూ వారికి వెంటనే ఇచ్చివేసి మరో అయిదువందలు ఫ్రాన్సు దేశములోవుండే ​మార్సేల్సు అనే గ్రామానికి ధామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకిచ్చేటట్టుగా టిల్లిగ్రాపు మనియార్డరు ద్వారా తక్షణము పంపించగోరెదను. మీ రలా చేయనియెడల పరదేశములో చాలా యిబ్బంది పడవలసి వస్తుంది.
ఇదంతా తెలివితక్కువనీ ఇంత డబ్బు ఖర్చు అవుతున్నదనీ మీరనుకోవచ్చును. కాని నేను చాలా దూరాలోచన చేసే వెళుతున్నాను. బారిష్టరీ ప్యాసు అయి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏవిధమైన ప్రయత్నమూ చేయవద్దు. నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యే టంతవరకూ ఇంటికి రాను. ఈ రోజునే స్టీమరు ఎక్కుతున్నాను. మీరు వృధాప్రయాస పడవద్దు.
మీతోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇదివరకెప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకముగా నడుచుకోలేదని మీకే తెలుసును. కాని యీ విషయములో మట్టుకు తెలుస్తే వెళ్లనివ్వరని యిల్లా చేయవలసి వచ్చింది. ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారము చేయగలనని నమ్మకము ఉండడము చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీ రెంత కష్టపడేదీ నాకు తెలుసును అయినప్పటికీ యిలా చేయక తప్పిందికాదు. పరదేశములో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రముమీద ఏమి అపాయము ఉంటుందో అనీ, మ||న|| మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పగోరెదను. మీకందరికీ యింత కష్టము కలుగజేసినందుకు నన్ను క్షమించవలెను. మార్సేల్సులో దిగగానే ​ఉత్తరము వ్రాస్తాను. మ||న|| మా అమ్మకు నమస్కారాలని చెప్పవలెను.
చిత్తగించవలెను.
విధేయుడు
వే. పార్వతీశము
షరా: సొమ్ముమట్టుకు తక్షణము టిల్లిగ్రాపు మనియార్డరు ద్వారా పంపించవలెను.
ఈ ఉత్తరము వ్రాయడానికి చాలా కష్టము వేసింది. మా అమ్మమాట తలుచుకునే సరికి కండ్లవెంబడి నీళ్ళు వచ్చినాయి. చెయ్యి వణకడము మొదలు పెట్టింది. కలము ముందుకు సాగింది కాదు. ఎలాగైతే నేమి, ఉత్తరము పూర్తిచేసి కవరులో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీసుకు వెళ్ళి పోస్టులో వేసివచ్చాను. ఇంటికి వచ్చి స్నానము చేసి భోజనానికి లేచాను. అన్నము ఏమీ సయించింది కాదు. ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని రెండుగంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్ వారి కంపెనీకి వెళ్ళాను.
అక్కడనుంచి వారు నాతోటి కూడా ఒక బంట్రోతునిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రములో కొంచెము దూరములో ఉంది. మొన్న ఎక్కిన స్టీమరు కంటె కూడా చాలా గొప్పదిగా కనబడ్డది. నాతోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావదగ్గిరికి తీసుకువెళ్ళి అందులో నన్నెక్కమని తను కూడా యెక్కాడు. దాంట్లో అది వరకే చాలామంది దొరలూ దొరసానులూ ఉన్నారు. ఇలాటివే ఇంకా రెండు మూడు నావలు ​పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమరుకేసే వెళుతున్నాయి. ఈ జనమంతా మా స్టీమరులో ఎక్కే వాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి.
నిమ్మళంగా స్టీమరుదగ్గిరికి చేరాము. మొన్నటికి మల్లేనే నిచ్చన కిందికి దింపారు. ఒక్కొక్కళ్ళమే పైకి ఎక్కాము. ఒక్క పెద్దమేడ మీద నిలుచుని కిందకి చూస్తున్నట్లుగా వుంది దాని మీద నిలుచుని చూస్తూంటే. నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకు వెళ్ళి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలా మందిమి అక్కడనే నిలబడి, సముద్రముకేసి తక్కిన స్టీమర్లకేసి, దరిని ఉన్న మేడలకేసీ చూస్తున్నాము. ఇంతటిలోకే గంట వినపడ్డది. కిందకు దిగేవాళ్ళంతా దిగిపొమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది, మళ్ళీ ఆ చిన్న నావలలోకి దిగి పైనున్న వాళ్లకేసి చూస్తూ చేతులూగిస్తూ వెళుతున్నారు. వాళ్లంతా తమ వాళ్లని సాగనంపడానికి వచ్చారు గదా అనుకున్నాను. మావూరునుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే మా అమ్మా నాన్నా వద్దంటున్నా ఎంతో దూరము వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడల్లా ఎవళ్లూ లేరుగదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షివలె నూతన ప్రపంచములోకి వెళుతున్నాను గదా అనుకున్నాను. అక్కడ ఏమి చిక్కులు పడాలో కదా అనుకున్నాను. నా ఉత్తరము చూసుకుని యింటిదగ్గిర మా అమ్మా నాన్నా ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునే టప్పటికి పట్టరాని దుఃఖము వచ్చింది.
మా స్టీమరు బయలుదేరించి. చిన్న నావల్లోవాళ్లు ఇంకా స్టీమరులో వాళ్లకి మనుష్యుల ఆనవాలు తెలియక పోయినా ​జేబు రుమాళ్లు విసురుతున్నారు. మళ్లీ ఎన్నాళ్ళకో గదా ఈ దేశము రావడ మనుకున్నాను. వచ్చేదాకా మట్టు కు నమ్మకమేమిటి! పరదేశములోనే కడతేరుతా నేమో నని భయం వేసింది. భూమి కనపడీ కనపడకుండా ఉంది. తల్లీ దయవుంచమని ఒక్కదండము పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటిపిల్లవాడిలాగ రాగా లెడుతూ అక్కడే నిలబడ్డాను.

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐