బారిష్టరు పార్వతీశం - (4.)-ప్రథమ భాగము (1957)  రచించినవారు మొక్కపాటి నరసింహశాస్త్రి అధ్యాయము 3

 



3
రైలు బయలుదేరింది. ఇంకో పది నిమిషాలకు 'ఎగ్మూరు' స్టేషనులో ఆగింది. అక్కడ బంట్రోతు నడిగితే, ఇదంతా చెన్నపట్నమే నన్నాడు. ఎంత గొప్ప పట్న మని ఆశ్చర్య పోతూ, ఊరు మధ్యనుండి కూడా రైలు వేశారు, ప్రజలకేమీ ప్రమాద ముండదుగదా అనుకున్నాను.
ఇంతట్లోకే నా పెట్టెలోకి, నలుగురు అరవవాళ్ళు రాబోయారు. 'చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలికి దయ చెయ్యం' డన్నాను. వాళ్ళు నామాట వినుపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. 'అబ్బాయి, మీకు తెలియదు. ఇది సెకండుక్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలికి వెళ్ళి యింకో పెట్టిలో ఎక్కం' డన్నాను. అందులో ఒకడు నా ముఖముకేసి చూసి 'నువ్వు ఇక్కడున్నావే. ఫోర్తుక్లాసు పెట్టెలో ఎక్కవలసిన మనిషివలె వున్నావు, దయ చేయ' మని వచ్చీ రాని తెలుగులో అన్నాడు. వాళ్ళ సాహసము చూస్తే నా కాశ్చర్యము వేసింది. 'చిత్తము, పెంకెతనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు. ఇంక కబుర్లకేమి లోటు గనుక, అధిక ప్రసంగము చెయ్యకు. దయ చెయ్య' మన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థము కాలేదని తోస్తుంది. అందుచేత నామాట వినిపించుకోనట్టు నటించారు. ​'సరిగదా అయ్యా, నీవు జాస్తి వాయాడకయ్యా, మాకు తెల్సును' అన్నాడొకడు. ఇంతట్లోకే గార్డు అలా వెడుతున్నాడు. వీళ్ళ నవతలకి గెంటి వెయ్యమని చెపుదామని కేకవేశాను. వాడు నామాట వినిపించుకో కుండా చక్కా పోయాడు.
ఇంతట్లోకే వీళ్ళకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనతోటి వాళ్ళీసంగతంతా చెప్పారు. నాకింగ్లీషు రాదనుకున్నారు కాబోలు వాళ్ళు, 'వట్టి పల్లెటూరి దద్దమ్మలా ఉన్నాడు. గార్డుకి ఒక రూపాయో, రెండో చేతులో పెట్టినట్టున్నాడు. ఇంక పాపము పెట్టె అంతా తనదే ననుకుంటున్నాడు' అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. నేను గార్డుకు రూపాయ యిచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకుని, 'అనవసరంగా అట్టే మాట్లాడకండి. చెన్నపట్నమంత ఊరు కాకపోయినా నేనూ నర్సాపురంలో చదువుకున్నాను. నేను గార్డుకేమీ ఇవ్వలేదు. మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున సెకండుక్లాసులోకి వస్తున్నారేమో ననుకొని మీ మేలు కోరే చెప్పాను. యీ టిక్కట్లే కొనుక్కున్నట్టయితే ఇందులోకే రావచ్చు. నా అభ్యంతర మేమీ లేదు' అన్నాను దర్జాగా. గార్డు రూపాయి పుచ్చుకుని మోసము చేశాడుగదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్ళతోటి పేచీకూడా ఎందుకనుకున్నాను. పేచీపెట్టినా ఏమీ లాభించేటట్టు కనుపించదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావము కలవాణ్ణికాను. అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తరువాత అసలే పేచీలోకిదిగను. ఒకవేళ పొరబాటున దిగినా, తక్షణము గౌరముగా ఇంగ్లీషు వాళ్ళు యుద్ధములో తమ పని మరోలా గవుతుం దనుకొన్నప్పుడు మర్యా​దగా, యుక్తిగా, వెనక్కు తగ్గుతారని మా మేష్టారు చెప్పినట్లు - నేనూఅటువంటి సందిగ్ధ సమయంలో వెనకంజ వేస్తాను.
కాని రూపాయి అనవసరముగా గార్డు కిచ్చినందులకు మాత్రము చాలా విచారంగా ఉంది. ఏమీ అంటే పైకి మరో లాగు కనబడ్డా నేను బహు జాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టములేదు. అలా అని సమయము వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కాని మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి గనుక ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను. ఒకటి వేసి పది లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడే మనుకున్నా, నేను వట్టి వెర్రివాణ్ని అనుకున్నా గార్డు కొకరూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా, దూరపు ప్రయాణము గనుక ఇరుకులేకుండా సౌఖ్యంగా నలుగురెక్కే పెట్టెలో నేను ఒక్కణ్ణే కూర్చోవచ్చుగదా అనుకున్నాను. కాని నా జన్మలో ఈ ఒకసారి మట్టుకు మోసపడ్డాను. అదివర కెప్పుడూ ఇంత దొంగని చూడలేదు.
ఇప్పుడు పెట్టెలో ఇంకొకళ్ళెక్కారనే విచారము లేదు, నాకు పట్టుకున్న దేమిటంటే, నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహము చెయ్యాలని. కావాలంటే దేహి అని చెయ్యి జాస్తే లే దంటానా? నేనంత కష్టసుఖా లెరుగని వాడినా? కాదే! మానవ స్వభావములో ఎంత దుర్మార్గముంది. అందులోనూ వాడు దొర కూడాను. అంత మోసగాళ్ళు గనకనే వాళ్ళింతటి రాజ్యము సంపాదించ కలిగారు. లేకపోతే వాళ్ల అబ్బ తరమా? తాత తరమా? అందుకనే గొప్పగొప్ప వాళ్ళంతా బోడి నారాయణరావు ప్రభృతులు వీళ్ళను దేశములో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తూ వున్నారు. ​పోనీ మన బోటివాళ్ళే వాళ్లూను. నాపెట్టెలో ఎక్కినందువల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదు. గార్డుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కినవాళ్ళు ఏ తెలుగువాళ్లో అయితే కాస్త మాటా మంచీ ఆడడానికీ, కష్టమూ సుఖమూ చెప్పుకోడానికి వీలుగా ఉండేది; అదేదీ లేకుండా, కలలోకి వచ్చేరూపూ, గ్రామసింహములు వాదించు కుంటున్నట్లు సంభాషణా వీళ్ళూనూ. ఈ అరవ వాళ్ళు వచ్చారేమా అని మట్టుకు మహా కష్టముగా ఉంది నాకు, చెప్పవద్దు మరి.
ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈలవేశాడు. ఈ వచ్చిన నలుగురైదుగురిలోనూ ఆఖరునవచ్చి నాయన ఒక్కడే లోపలికి వచ్చాడు. తక్కినవాళ్ళంతా ఊరికే ఈయన్ని సాగనంపడానికి వచ్చినట్టు తోస్తుంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు గదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైనా, ఫరవాలేదనుకున్నాను.
రైలు బయలుదేరింది. చాలాదూరము వరకూ, చిన్న చిన్న స్టేషన్లు దగ్గిర దగ్గిరలో చాలా ఉన్నాయి. అక్కడెక్కడా రైలు ఆగలేదు. రైలాగనప్పుడు మధ్యనిన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకొన్నాను. పెట్టెలో కూర్చున్నాయన నడుగుదా మనుకుని, ఇదివరకే పల్లెటూరు దద్దమ్మన్నాడు. ఈ ప్రశ్నవేస్తే యింకా ఏ మంటాడో అనుకుని ఊరుకున్నాను. కాని చెన్నపట్నము పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండని కోరాను.
ఈ చిన్న చిన్న స్టేషను లన్నీకూడా చెన్నపట్నములో చేరి ​నవే అని చెప్పాడు. ఇంగ్లండుకంటెకూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులూ, స్నేహితులూ, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే పొరుగూరు ప్రయాణములాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరి కొక చివర ఉద్యోగస్థులు, రెండోచివర ఆఫీసు ఉంటే, అక్కడికి వెళ్ళడమెలాగా అనుకున్నాను. పోనీ ఇన్ని స్టేషన్లు ఉన్నయికదా అని రైలు ఆగదు. ట్రాముకార్లయినా ఊరంతా ఉన్నట్టు కనుపించదు. ఇంక వీళ్ళు, ఏ ఎద్దుబండో జట్కా బండోఎక్కితే, ఆఫీసుకు వెళ్ళడ మెప్పుడు. అక్కడ పనిచెయ్యడ మెప్పుడు, మళ్ళీ ఇంటికి రావడమెప్పుడు? రాకపోకలకే వీళ్ళ జీతములోనూ, జీవితములోనూ సగము సరిపోతుందే, ఏలాగా అనుకున్నాను. పోనీ పనిపాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్థులూ, చిన్న ఉద్యోగస్థులూకూడ ఉంటారాయను. నెలకు ఏ పదిహేను రూపాయలో సంపాదించుకునే గుమాస్తా బతకడమేలాగు? ఇంతదూరము వాడు రోజూ రెండుసార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్లయితే వాడు నెలరోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుందే! పొద్దున నాదగ్గిర బండివాడు మైలుకి రూపాయి చొప్పున గూబలు వడేసి పుచ్చుకొన్నాడే! ఇంక వీళ్ళు తెచ్చింది కాస్తా బండికే పెడితే పెళ్ళాలకీ, పిల్లలకీ ఏమి మిగులుతుంది అనుకున్నాను. కావడము వాళ్ళు తినడము పులుసూ, చారు మెతుకులూ అయినా దానికికూడా కొంత కావాలికదా. ఎంతసేపాలోచించినా నా కేమీ ఉపాయము తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే కాని యీ సమస్య మాత్రము విడగొట్టలేక పోయినాను. ​ఏమీ తోచక నా తోటిప్రయాణము చేస్తున్న పెద్ద మనిషెవరో ఒకసారి చూద్దామనుకుని అదివరకు చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు. మాయిద్దరి కండ్లూ కలుసుకున్నాయి. 'మీ దేవూరండి ' అని అడిగాడు ఆయన. నర్సాపురమన్నాను. మా ఊరు నర్సాపురము కాకపోయినా, మొగిలితుర్రు అని చెప్పితే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడని అడగడము, నేను చెప్పడము, ఇదంతా ఎందుకని నర్సాపురమంటే చులాగ్గా తెలుస్తుందని యిలా చెప్పాను. మీ రెందాకా వెళ్ళుతున్నారన్నాడు. ఏదో సామాన్యంగా తరచు వెడుతూనే వుంటాననే భావము కలిగేటట్టు, 'ఇక్కడికే కొలంబోదాకా వెడుతూ ఉన్నాను ' అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి 'కొంపతీసి ఇంగ్లండు వెళ్ళడములేదుకదా? వాలకముచూస్తే అలా కనుపించదు కాని అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పనేమో కనుపించదు' అన్నాడు. 'అలాగా అండి, నా వాలకము ఎందుచేత అలా కనిపించడము లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టా' రన్నాను. 'అబ్బాయి, మీ తెలుగుదేశములో ఒక చిన్నకథ ఉంది. ఒక శాస్తుర్లుగారు ఊరికి వెడుతున్నారట. ఆయన్ని చూసి ఒక తుంటరి కుర్రవాడు 'ఏమండోయ్, తిమ్మన్నగారూ, ఎందాకా దయచేస్తున్నారు' అన్నాడట. 'నాయనా, నీవెవరో జ్ఞాపకము రాకుండా ఉంది. నన్నెక్క డెరుగుదువు? నాపేరెవరు చెప్పారు?' అని అడిగా డటాయన. అడుగుతే వాడు నవ్వుతూ ' అయ్యా నేనిదివర కెప్పుడూ తమదర్శనము చెయ్యలేదు. అయినా తమ ముఖము చూస్తే తమపేరు తిమ్మన్నగారే అయి వుంటుందని ఊహించాను. నా ఊహ నిజమే అయిం' ​దని చక్కాపోయాడట. అలాగ్గా నువ్వు వేరే అడగాలనా నాయనా.'
'సరే దాని కేమిలెండి. అసలేమి కనిపెట్టా రేమిటి?' అన్నాను, 'చెప్పనా, నిజము చెపితే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో' నన్నాడు. 'పరవాలేదు చెప్పండి,' అన్నాను. 'నీ పెట్టెచూస్తే పల్లెటూరనీ, ఎప్పుడూ దూరపుప్రయాణము చేసి ఎరగవనీ తెలుస్తున్నది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడము చూచి నీవు ఎప్పుడూ రైలుప్రయాణము చెయ్యలేదనీ, ఒకవేళ చేసినా, ఎప్పుడూ సెకండుక్లాసులో ఎక్కలేదనీ, ఎప్పుడూ పెద్ద మనుష్యులతో సంచరించలేదనీ తెలిసింది. అందుచేత ఇంతపల్లెటూరివాడవు నిజంగా ఇంగ్లండు వెళ్ళుతున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణమేమీ కనుపించదు. ఆపైన నాటుకోటిసెట్టి తలలా వున్న నీ తలకాయ చూస్తే నీకు క్రాపింగ్ అలవాటు లేదనీ, జుట్టు వుండేదనీ, అది ఇవ్వాళే తీసివేయించావనీ తెలుస్తూవుంది. కొలంబో దాకానే ప్రయాణ మైనట్లయితే జుట్టు తీసివేయించవలసిన అవసరములేదు. అందుచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢి చేశాను. ఇంట్లోకూడా చెప్పకుండా వెళ్ళుతున్నావని నా అనుమానము. లేకపోతే బొంబాయి వెళ్ళకుండా కొలంబో ఎందుకు వెళ్ళుతావు? ఏమంటావు, నేచెప్పింది నిజమా అబద్ధమా? వున్నమాట చెప్పు. మీవాళ్ళతో చెప్పనులే' అన్నాడు.
ఆయన మాట లొక్కక్కటే వింటూంటే నాపై ప్రాణాలుపైన ఎగిరిపోయినయి. ప్రపంచములో ఇంతమందిని చూశాను కాని ఇలాటివాడిని మట్టు కెప్పుడూ చూడలేదు. ఈయన అరవ ​వాడైనా అఖండుడులా ఉన్నాడు. తెలుగుకూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగు దేశములో ఉన్నాడేమో కొంతకాలము! లేకపోతే సెకండుక్లాసులో ప్రయాణము చెయ్యతగినంత డబ్బెక్కడిది అరవవాళ్లకు, తెలుగు దేశములో సంపాదించకపోతేను? అనుకున్నాను. ఏమైతే నేమి అఖండమైన తెలివి తేటలు. మన గుట్టంతా తెరచిన పుస్తకములో చదివినట్టు నిమిషములో కనిపెట్టేశాడు. ఈయనవల్ల ఏమీ ప్రమాదము రాదు కదా అనుకుని, అయినా ఈయనెవరో, ఈయన సంగతేమిటో, సందర్భమేమిటో, అడిగి తెలుసుకుందాము. ఏలాగైనా ఈయనతోటి కొంత స్నేహముగా ఉంటేనే నయమనుకున్నాను. లేకపోతే ఇంటికి మనమీద కోపంచేత ఉత్తరము వ్రాస్తే చిక్కు. ఎందుకయినా కొంచెము జాగ్రత్తగా ఉండడమే మంచిదని 'చిత్తం తమ రూహించినది చాల భాగము వాస్తవమే. నేను ఇంగ్లండే వెడుతున్నాను. తమ దే వూరు? తెలుగుకూడా బాగా మాట్లాడుతున్నారు, తెలుగుదేశములో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి ' అన్నాను. అనేటప్పటికి ఆయన కొంచము నవ్వి 'అబ్బాయీ! మాది తిరుచినాపల్లి. నేను చిన్నప్పటినుంచీ తెలుగుదేశములోనే ఉండేవాడిని. మాతండ్రి స్టేషను మాష్టరు పనిచేసి చాలాకాలము రాజమహేంద్రవరము, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళల్లో ఉండేవారు. నేను ఇంగ్లండులో చదువుకున్నాను. ఇంజనీరు పరీక్ష అయి నేనూ చాలాకాలము మీ ధవిళేశ్వరములోనూ, సెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు ' అన్నాడు.
దానితోటి నాకాళ్ళు చల్లబడ్డయి. అదివరదాకా తొందరగా ​కొట్టుకుంటూ ఉన్న గుండె ఒక్కక్షణ మాగిపోయింది. ఇంక మా యింటిపేరు, మానాన్నపేరూ అడిగి తెలుసుకొని ఇంటికి ఉత్తరము వ్రాస్తాడు, నాకొంప మునిగిందనుకొన్నాను.
మరొకళ్ళయితే గుడ్లు మిటకరించేవాళ్ళే! నీనింకా కొంచెము ధైర్యము కలవాణ్ని గనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్ళీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. 'చిత్తము, అలాగా అండి. ఇంగ్లండు దయచేశారా అండి. అక్కడ మనవాళ్ళెవరైనా ఉంటారా అండి. బసా అదీ దొరికి భోజనము అదీ సదుపాయంగా వుంటుందా అండి' అన్నాను. 'ఆ, ఉన్నారు. ఏదో కొద్దిమంది మనవాళ్ళు ఉన్నారు. మొత్తముమీద సౌఖ్యంగానే ఉంటుంది ' అని, 'అబ్బాయి, నీకక్కడ స్నేహితు లెవరైనా ఉన్నారా? అక్కడెలా నడుచుకోవాలో. ఆ దేశాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా?' అన్నాడు. అనేటప్పటికి పోనీ పెద్దమనిషిగదా, అని కొంచెము గౌరవముగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడికింద కట్టివేసి, మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ, ఏమిటో దర్జాకు పోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి నా తక్కువేమిటి? ఈయనింగ్లండు ఇదివరకు వెళ్ళాడు; నే నిప్పుడు వెడుతున్నాను. అంతే తేడా. ఈమాత్రము దానికి నన్నింత అగౌరవపరచవలసిన అవసరములేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంక కట్టిపెడితే బాగుంటుందని ఆయన అడిగినదాని కంతా 'ఆ' అని 'ఊ 'అనీ ఏకాక్షరముతోటి సమాధానము చెప్పి, ఆయనింకా ఏమిటో అడుగుతూంటే వినిపించుకోకుండా కండ్లు మూసుకుని నిద్దరపోతున్న వాడివలె వెనక్కి జార్లపడి కూచున్నాను. ​దానితో ఆయనకు కొంచెము కష్టము తోచింది కాబోలు, ఒక్కక్షణ మూరుకున్నాడు. కాని పాపము ఎంత సే పూరుకోగలడు? ఆడేనోరు, తిరిగేకాలు, ఒక్కమాటూ ఊరుకోలేవంటారు పెద్దలు. ఆమాట నిజమే. ఆయ నొక నిమిష మూరుకుని 'అబ్బాయీ, పాపము చాలా నిద్దర వస్తున్నట్లున్నది. పడుకో నాయనా ' అన్నాడు. 'ఏమిటి మీ అభిప్రాయము? నే నేమన్నా చంటిపిల్ల వాడి ననుకున్నారా? అని అడుగుదా మనుకొని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానము చెప్పకుండా నా బొంత తీసి పక్కవేసుకున్నాను. అది చూచి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడము మొదలుపెట్టాడు. ఎవళ్లు నవ్వుతే లెక్కేమిటి మనకు? నవ్వినవాళ్ళమూతే వంకర పోతుందనుకొని, పోనీ మనకు మడత మంచముకూడా ఉందని చూపించడానికి అదికూడా పైకి తీద్దామా అనుకుని, అయినా కొద్దిగా ఇరుకుగా ఉంటుందేమో నని ఆ ప్రయత్నం మానేసి నా పక్కమీద కూచున్నాను. 'నాయనా, ఈ బొంత నీతోకూడా అడంగుకు తీసుకువెళ్ళుతావా?' అన్నాడు. 'ఆ తీసుకు వెళ్ళుతాను. తీసుకు వెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారవెయ్యడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమ రంత ఆశ్చర్యపోవడానికి కేమీ కనుపించదు ' అన్నాను. ఆయన నాకేసి సూటిగా చూచి 'ఎక్కడయినా పొరపాటున మరిచిపోతావేమో సుమా! ఎక్కడా మరిచిపోకు. ఆ దేశములో ఏ జమీందారైనా ఇది చూడడము తటస్థించి బహుమతి చేయమంటే ప్రాణము పోయినా, ఎవళ్ళకీ యివ్వకు. ఇటువంటివి వాళ్ళ కుండవు. అందుచేత చాలామంది అడుగుతారు. జాగ్రత్త సుమా, ప్రాణప్రదముగా కాపాడుకో. పోగొట్టుకోకు. నీ కిష్టమయితే మళ్ళీ యింటికి వచ్చే ​టప్పుడు బ్రిటిషు మ్యూజియముకు బహుమతి చెయ్యవచ్చు' నని నాకు సలహాయిచ్చి మళ్ళీ నవ్వడ మారంభించాడు. 'చిత్తము, ఈ విషయములో తమ హితోపదేశ మనవసర' మని ఆయన్ని మాడ్చాను.
ఆయన అలాగే గుడ్లు మిటకరించి నాకేసి చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిని నేను పడుకుని సుఖంగా నిద్రపోయినాను. కాని లోపల మట్టుకు బెదురుగానే ఉంది, ఆ మడతమంచమో, పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడు తున్నట్లు కనిపించగూడ దనుకొని నిద్దరపోతూ, మధ్యమధ్య మెళకువ తెచ్చుకుంటూ, సామానుకేసి చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసే టప్పటికి ఆయనెక్కడ దిగాడోకాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడయించి కదా అనుకున్నాను. మళ్ళీ ఎవళ్లూ ఆపెట్టెలో కెక్కలేదు.
నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతధావన ప్రయత్నము చేశాను. నీళ్ళ సంగతెలాగా అనుకున్నాను. నేను కూచున్న గదిలో ఒక మూల 'లావెటరి ' అని తలుపుమీద వ్రాసి ఉంది. అదేమిటో చూద్దాము. అందులో ఏమైనా నీళ్లుంటాయేమో నని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను.
గది బహు పరిశుభ్రంగానే ఉంది. గోడకి చిన్న కుళాయి ఉంది. ఆ నీళ్లు కింద పడకుండా దానికింద ఒక చిన్న చక్కని కంచు బూర్లు మూకుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రమున్న కుర్చీ పీట ఉన్నది. ఏ విధమైన దుర్వాసనా లేదు. ఏర్పాటంతా చాలా బాగా ఉంది. ఇంగ్లాండు నుంచి వచ్చిన తరు ​వాత మాయింట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని నిశ్చయించాను. కుళాయిదగ్గరికి వెళ్ళి తిప్పబోయాను. ఎంత సేపు తిప్పినా తిరగలేదు. ఏలాగా అని ఆలోచిస్తూ మరొకమాటు గట్టిగా తిప్పవలెనని ప్రయత్నము చేశాను. చెయిజారి ముందుకు కుళాయిమీద పడ్డాను. అదివరదాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చెయి జారి పడడము తోటే జయ్యని నీళ్ళు వచ్చి నావంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను లేవడముతోటే ఆగిపోయాయి. ఏమిటీ మాయ అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్ళువస్తయి కదా అని తెలుసుకున్నాను.
దంత ధావనాది కాలకృత్యములు తీర్చుకుని స్టేషనులోకి అమ్మతెచ్చిన నాలుగిడ్లీముక్కలు తిని కాసిని కాఫీ నీళ్ళు తాగి రైలురోడ్డు పక్కనవున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను.
అరవదేశము కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా వుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలూ, పంటభూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగ వుంది. ఇంత తృణ కాష్ఠ జల సమృద్ధిగల దేశస్థులు అంత దరిద్రులుగా వుండి ఎనిమిది రూపాయలకూ, పదిరూపాయలకూ ఆశించి దేశాలుకాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను.
మధ్యాహ్నము ఒక స్టేషన్ లో గార్డువచ్చి భోజనము కావాలా అని అడిగాడు. నా భోజనము సంగతి వీడికెందుకు, వీడేమన్నా పెడతాడా ఏమన్నానా? పెడితేమట్టుకు మనము తింటాము గనుకనా అని 'అక్కర్లేదు' అన్నాను. 'అయితే మరేమి ​చేస్తారు? అన్నాడు. 'సరే ఏదో చేస్తాలే ' అన్నాను. వాడు నా ముఖముకేసి చూసి పెదవి విరిచి కనుబొమలూ బుజాలూ ఎగరవేసి చక్కా పోయినాడు. భోజనముసంగతి ఏమి చేయడానికీ తోచక మళ్ళీ ఏదో కాస్త చిరితిండి కొనుక్కుని కాస్సేపు పడుకుని నిద్రపోయినాను. సాయంత్రము సుమా రైదు గంటలయ్యే సరికి 'ట్యూటికొరిన్ ' చేరాను.

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐