🚩🚩-రాజశేఖర చరిత్రము. (నవల ) (కందుకూరి వీరేశలింగం.)

 

🚩🚩-రాజశేఖర చరిత్రము. (నవల )
             (కందుకూరి వీరేశలింగం.)
                           (వింజమూరి 13)

#కందుకూరి వీరేశలింగం పంతులుగారు “రాజశేఖర చరిత్రము” ఆయన సమకాలీన కాలాన్ని ప్రతిఫలించేటట్లు రాశారు. ఆయన రాసిన నవలకు "వివేకచంద్రిక" అనే పేరు కూడా ఉంది. అంధ విశ్వాసాలవల్ల, ఆవివేకఫుటాచారాలను ఉపయోగించుకొని సంఘంలోని కపటులు కల్లరులు, కుక్షింబరులు, స్తుతి పాఠకులు, దాంభికులు బాగుపడుతున్నది తెలియచేస్తుంది. ప్రతి సంఘటనా - ఒక సాంఘిక దురా చారాన్నీ, ఒక మూఢ విశ్వాసాన్నీ హేళన చేసి, వికృత పరచి, విమర్శించే ఉద్దేశంతో కల్పించబడింది. రుక్మిణి కాసులపేరు రథోత్సవంలో దొంగిలించ బడటం - ప్రశ్న చెప్పేవారి దాంభిక వర్తనను బట్టబయలు చేయటానికీ, నృసింహస్వామి మరణవార్త ఎఱుక చెప్పువాళ్ళ కాపట్యాన్ని, ఎరుక నమ్మేవాళ్ళ మూర్ఖత్వాన్నీ హేళన చేయటానికీ, నృసింహ స్వామి రుక్మిణి కలలో కల్పించటం- భూత, ప్రేత , పిశాచాదులను వేళాకోళం చేయటానికీ పంతులు గారు కల్పించారు. హరిశాస్త్రుల భూతవైద్యం, పిఠాపురంలో ఆంజనంవేసి దొంగను పట్టటం, స్వర్ణయోగం తెలుసు నన్న బైరాగి- ఇచ్చిన స్వర్ణాన్ని దొంగిలించి పలాయనం చిత్తగించటం, సిద్ధాంతి కూతురు గ్రహ బాధ, సుబ్బారాయుడి ఆతుర సన్యాసం, హరి పాపయ్య శాస్త్రుల వారి భోజన పాండిత్యం, పీఠాధిపతుల ఆర్భాటాలూ; మఠాధిపతుల కుక్షింభరత్వం, ఇళ్ళు కాలిపోతే గ్రామదేవతకు శాంతి చేయడం - ఇంకా వీధి బడుల్లోని అక్రమాలూ, వంట బ్రాహ్మలూ-శవవాహకుల మూర్ఖవర్తనలు పంతులుగారు యీ నవలలో విమర్శించారు. ఆ నవలలో అంతరించిపోతున్న రాజరిక జీవిత లక్షణాలు కనిపిస్తాయి. దాంతో పాటూ అశాస్త్రీయ విషయాలను ఖండించటం కనిపిస్తుంది. మూఢ విశ్వాసాలను కొన్ని పాత్రల ద్వారా కల్పించి వాటి వల్ల జరుగుతున్న మోసాలను కూడా వివరించారు. కానీ, ఈ నవల నిండా తెలుగు వాళ్ళ జీవితం, వాళ్ళు జీవించిన పరిసరాలూ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. పైగా కందుకూరి వారి రచనల నిండా ఆధునిక సంస్కరణ భావాలు ఉన్నాయి.
కథ
రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము వలన అతని కుటుంబం ఎన్నోకష్టాలపాలవుతుంది. రకరకాల మలుపుల తర్వాత మరల కుటుంబం ఆ కష్టాలను అధిగమిస్తుంది. రాజశేఖరుడు ఊరి పెద్దగా, తన ధనాన్ని దేవాలయం కొరకు, బంధు మిత్రుల కపట కష్టాలు తీర్చటానికి ఖర్చు చేస్తాడు. అంధ విశ్వాసాలకు లోనై బంగారం చేస్తాననే దొంగ బైరాగి దగ్గర బంగారాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తరువాత కుటుంబంతో రాజమహేంద్రవరం వెళతాడు. అక్కడనుండి కాశీ యాత్రకు బయలుదేరి, మార్గమధ్యమంలో రామరాజు అనే మనిషికి ప్రాణాలు నిలుపుతాడు కాని కూతురు కూరమృగాలపాలైందనుకుంటాడు. ఒక వ్యక్తి సహాయంతో పెద్దాపురం చేరి అక్కడ రాజ ప్రతినిధి శోభనాద్రిరాజు కపటానికి లొంగి కుమార్తె వివాహం చేయబోగా, ఒక అగంతుకుని సాయంతో ఆ ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత అప్పుతీర్చలేక కారాగార వాసం పాలవుతాడు. చివరకు కుమార్తెను ఎవరో ఎత్తుకొని పోగా, మరల మారువేషంలో వున్న రామరాజు సాయంతో రక్షించబడి, కుటుంబం సభ్యులందరూ మరల కలుస్తారు. కాశీలో అసువులు బాసాడని అనుకున్న అల్లుడు కూడా ఇల్లు చేరతాడు. రామరాజు అనే వ్యక్తే కృష్ణజగపతి మహారాజుగారని తెలిసి ఆయన సహాయంతో స్వంత ఊరు చేరి, అంధవిశ్వాసాలను విడిచి, అర్భాటలకులోనవక జీవితం గడుపుతాడు.
(వింజమూరి 13)

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐