🚩🚩మాలపల్లి (నవల)! (ఉన్నవ లక్ష్మినారాయణ.(1922 .))


🚩
🚩మాలపల్లి (నవల)!
(
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఉన్నవ లక్ష్మినారాయణ.(1922 .))
♦️శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణ రాయవెల్లూరు జైలులో వుండగా ఈ నవలను దేశభక్తి పూరితంగా సంఘసంస్కరణాభిలాషతో రచించారు.
ఉన్నవ లక్ష్మి నారాయణ (1877-1958) గుంటూరులో జన్మించారు.
డబ్లిన్ యూనివర్సిటీ (ఐర్లాండ్) లో బారిస్టర్ చదివేరు వేరు . మద్రాసు హైకోర్ట్ లో చేపట్టిన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి తొలుత అతివాదిగా జాతీయోద్యమంలో ప్రవేశించినప్పటికి క్రమేణా గాంధేయవాదిగా మారారు.
♦️అకుంఠీత దీక్షతో సంఘ సంస్కరణాభిలాషతో ఉన్నవ విధవలకు, అనాధలకు, అణగారిన వర్గాల ఉన్నతికై పాటుపడ్డారు. తన సామాజిక వర్గం నుండి ఎదురైన నిరసనలను లెక్కచేయకుండా గుంటూరులో 32 వితంతు వివాహాలు జరిపి “గుంటూరు వీరేశలింగం’గా పేరుపొందారు. గుంటూరులో వితంతు శరణాలయం (1902), కార్వే మహాశయుని స్ఫూర్తిగా స్త్రీలకు వృత్తి విద్య కోసం ‘శారదా నికేతన్’ (1922) ల వంటి అనేక సంస్థలను స్దాపించారు. దళితుల అభ్యున్నతిని దళితుల ఆలయ ప్రవేశాలు, సహపంక్తి భోజనాల వంటి కార్యకలాపాలకే పరిమితం చేయకుండా నిర్మాణాత్మక రీతిలో పాటుపడ్డారు.
కుల భేదాలు లేని సమ సమాజాన్ని ఆశించి కుల వ్యవస్ధను ప్రశ్నిస్తూ సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకొని అసమాన సామాజిక స్పృహతో దళితుల సమస్యలను కుల, ఆర్థిక కోణంలోనూ విస్తృతంగా పరిశీలించి మాలపల్లి అనే సుదీర్ఘ నవల (762 పేజీలు) ను రాయవెల్లూరు జైలులో వుండగా 1922 లో రచించారు.
(వింజమూరి 11)
♦️.మాలపల్లి లో ప్రధాన పాత్రలు
రామదాసు - ‘మాలదాసరి’ కులస్థుడైన రామదాసు సాత్వికుడు.గాంధేయవాది.
మహాలక్ష్మీ - రామదాసు భార్య
జ్యోతీ - రామదాసు కూతురు
సంగ దాసు - రామదాసు చిన్న కొడుకు. నవలలో మొదటి నాయకుడు. భూస్వామి చౌదరయ్య వద్ద పాలేరు. సంఘ చైతన్య స్ఫూర్తి కలిగిన నాయకుడిగా సంగ దాసు సమాజంలో కులపరమైన భేదాలు పోవడానికి, దళితాభ్యుదయానికి నిర్మాణాత్మకరీతిలో పాటుబడుతూ భూస్వామి చేతిలో మరణిస్తాడు.
వెంకట దాసు - రామదాసు పెద్ద కొడుకు. నవలలో రెండవ నాయకుడు. తమ్ముదు ‘సంగ దాసు’ మరణానంతరం అడవులకు పోయి తక్కెళ్ళ జగ్గడు అనే మారు పేరుతొ ‘ధర్మ కన్నాల ఉద్యమానికి (ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమం) నాయకత్వం వహిస్తాడు. వర్గచైతన్య స్పూర్తి నిండిన కలిగిన నాయకుడిగా సమాజంలో ఆర్ధిక అంతరాల నిర్మూలన కోసం విప్లవకారుడై సాయుధ పోరాటమార్గం అవలంబిస్తాడు. పోలీసులకు పట్టుబడి జైలు పాలై చివరకు మరణిస్తాడు.
అప్పాదాసు – రామదాసు మేనల్లుడు (చెల్లెలు కొడుకు). దళిత బడికి టీచర్ గా సేవల నందిస్తాడు.
చౌదరయ్య – ఊరికి మోతుబరి. నిరంకుశ భూస్వామి. మార్పుకి వ్యతిరేకి
వెంకటయ్య నాయుడు - భూస్వామి చౌదరయ్య పెద్ద కొడుకు
రామానాయుడు – భూస్వామి చౌదరయ్య చిన్నకొడుకు. సంగ దాసు సదాశయాలతో ఏకీభవిస్తూ అతనికి సాయంగా మంచి మిత్రుడుగా ఉంటాడు. దళితాభ్యదయానికి చక్కని కృషి చేసిన దళితేతరుడు.
కమల - రామానాయుడు భార్య. మోహనరావు తో లేచిపోతుంది.
తక్కెళ్ళ జగ్గడు - వెంకట దాసు మారుపేరు. ఈ పేరుతొనే వెంకట దాసు ‘ధర్మ కన్నాల’ ఉద్యమానికి (ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమం) నాయకత్వం వహిస్తాడు.
♦️కథా సారాంశం!
♦️దళితులలో అట్టడుగు వర్గాలకు చెందిన ‘మాలదాసరి’ కులస్థుడైన రామదాసు సాత్వికుడు. సాంప్రదాయ పరాయణుడు. గాంధేయవాది. కథంతా అతని కుటుంబం, సమాజాన్ని అల్లుకొని సాగుతుంది. రామదాసు భార్య మహాలక్ష్మి. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు వెంకట దాసు, చిన్న కొడుకు సంగ దాసు, కూతురు జ్యోతి. పెద్ద కొడుకు వెంకట దాసు తండ్రికి సాయంగా సేద్యం చేస్తుంటాడు. చిన్నకొడుకు సంగ దాసు ఒక భూస్వామి వద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. పొలం పనులలో కూతురు జ్యోతి సాయం చేస్తుంటుంది. రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి. ఆమె కొడుకు అప్పాదాసు కూడా తండ్రి లేకపోవడం చేత రామదాసు ఇంటిపట్టునే పనులు చేస్తూ పెరుగుతుంటాడు. ఈ విధంగా తమకున్న కొద్దిపాటి భూమితో ‘మాలపల్లి’లో రామదాసు కుటుంబమంతా శ్రమిస్తూ జీవనం సాగించేది.
ఆ వూరి మోతుబరి, 800 ఎకరాల ఆసామి అయిన చౌదరయ్య కొడుకులైన రామానాయుడు, వెంకటయ్య నాయుడు అనే అన్నదమ్ములు కూడా ఈ నవలలో ముఖ్య పాత్రలుగా వుంటారు. సంగ దాసు ఈ చౌదరయ్య వద్దనే పాలేరుగా పనిచేస్తుంటాడు. పనివాడైన సంగ దాసు, యజమాని కొడుకైన రామానాయుడుల ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో స్నేహంగా సఖ్యతగా వుంటారు.
♦️ఒక విధంగా రామదాసు కుటుంబంలోని వాళ్ళంతా కులమతాల పట్టింపుల్ని దుయ్యబట్టినవాళ్ళే. కొడుకులు వెంకట దాసు, సంగ దాసులు సంస్కరణ భావాలు కలిగినవాళ్ళు. కరడుగట్టిన భూస్వామి చౌదరయ్య చేసే అత్యాచారాలను ప్రతిఘటించేందుకు సంగం దాసు తోటి దళిత కూలీలను సంఘటితపరచి, వారిలో చైతన్యం కలిగించి, సమ్మెలకు నాయకత్వం వహిస్తాడు. దళితులకు విద్య నేర్పడం కోసం బడులు తెరుస్తాడు. దళితుల జీవితాలను సంస్కరించడానికి ఆతను చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ కృషిలో రామానాయుడు అతనికి సాయంగా వుంటూ ఆర్థికంగా చేయూతనిస్తాడు. ఇది భూస్వామికి కంటగింపుగా వుంటుంది. ఒకనాడు భూస్వామి సంగ దాసు తలపై పనిముట్టుతో గట్టిగా మోదడం వల్ల సంగ దాసు మరణించడం జరుగుతుంది. భూస్వామి పోలీసులకు లంచం ఇచ్చి విచారణ పరిది నుండి తప్పించుకొంటాడు. నష్టపరిహారంగా భూస్వామి ఇవ్వబోయిన ధనాన్ని నిరాకరించి తమ కొడుకు చంపబడ్డ విషాదాన్ని రామదాసు దంపతులు మౌనంగా భరిస్తారు. దీనితో రామానాయుడు పేద రైతులకు మరింత దగ్గరై, దళితాభ్యున్నతికి పూర్తిగా అంకితమవుతాడు. సంగ దాసు ఆదర్శభావాల వ్యాప్తి కోసం అతని స్మృతి చిహ్నంగా “సంగ పీఠం” గ్రామంలో నెలకొల్పబడుతుంది. క్రమేణా ఈ సంగ పీఠం కృషిలో దళితేతర అగ్ర కులాలు కూడా చేరతాయి.
♦️వెంకట దాసు (రామదాసు రెండవ కొడుకు) అడవులలో నివసిస్తూ తక్కెళ్ళ జగ్గడు అనే మారు పేరుతో ‘సంతాను’ లనబడే రహస్య కార్యాచరణ దళాలను ఏర్పాటు చేస్తాడు. ఈ నవలలోని ‘సంతాను’ల ప్రసక్తి బంకిమచంద్రుని ఆనందమఠం నవల లోని ‘సంతాను’లను జ్ఞప్తికి తెస్తుంది. ‘ధర్మ కన్నాలు’ వేయడం ద్వారా ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమానికి వెంకట దాసు నాయకత్వం వహిస్తాడు. అయితే పోలీసులతో జరిగిన సాయుధ ఘర్షణలో వెంకట దాసు గాయపడి పట్టుబడి చివరకు జైలు పాలవుతాడు. ఒక వ్యాజ్యంలో ఓడిన రామదాసు తన యావదాస్తిని భూస్వామి చౌదరయ్యకు స్వాధీనం చేయవలసి వస్తుంది. తన పొలం నుండి, ఇంటి నుండి వెళ్ళగొట్టబడిన రామదాసు చివరకు ఒక సంపన్నుడి ఇంటిలో పనికి కుదురుతాడు. తక్కెళ్ళ జగ్గని సహచరులు ఆ సంపన్నుని ఇంటిని కొల్లగొట్టడంతో, ఆ “ధర్మ కన్నం”తో సంబంధం ఉందనే నెపంతో రామదాసును, అతని భార్య మహాలక్ష్మిని పోలీసులు అరెస్టుచేసి సెటిల్మెంటులో నిర్బంధ కూలీలుగా పనిచేయిస్తారు. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పెద్దకొడుకు వెంకట దాసుకు పరిచర్యల కోసం తల్లీ, తండ్రీ కొంతకాలం అక్కడుండటం జరుగుతుంది. వెంకట దాసు మరణిస్తాడు. ఈ విధంగా ఇద్దరు కొడుకులుతో పాటు కూతురు జోతి దుర్మరణం పాలవ్వడంతో అ బెంగతో భార్య మహాలక్ష్మికూడా చనిపోవడం జరుగుతుంది. ఈ బాధలన్నింటిని రామదాసు సహనంతో తన సహజ వేదాంతధోరణిలో శాంతంగానే స్వీకరిస్తాడు. క్రమేణా సంగపీఠం కృషి దినదిన ప్రవర్ధమానమవుతుంది. సహాయనిరాకరణోద్యమాలు, కార్మికోద్యమాలు, ధర్మకన్నాల వంటి ప్రజాఉద్యమాల ఫలితంగా స్వాతంత్ర్యం లభిస్తుంది. ఖైదీలు విడుదలవుతారు. వయోజన వోటింగు ద్వారా ప్రజాప్రతినిధుల ఎన్నికవుతారు. రామదాసు కూడా జైలు నుండి విడుదలై తన గ్రామానికి వస్తాడు. రామానాయుడు తన యావదాస్తిని దళితుల అభ్యుదయానికి సమర్పించి రామదాసుని గ్రామంలోనే వుండి సంగ దాసు చేసిన కృషిని కొనసాగించమని కోరతాడు. కాని రామదాసు నిరాకరించి అడవుల కేగుతాడు. ఈ విధంగా అనేకానేక అంశాలు అల్లుకుపోయిన నేపద్యంలో చివరకు భూస్వాముల మదం అణిగిపోయి వారు తమ సర్వస్వాన్ని దళితుల అభ్యుదయానికి, గ్రామాభ్యుదయానికే సమర్పించుకొని, గ్రామసేవకి అంకిత మయినట్లుగా చెప్పబడింది.
(వింజమూరి 11)
- - - - -🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

 

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐