🚩🚩-కాలాతీత వ్యక్తులు.!! (డా. పి. శ్రీదేవి .)

 

🚩🚩-కాలాతీత వ్యక్తులు.!!
          (డా. పి. శ్రీదేవి .)
                             (వింజమూరి .6.)      
♦️కాలాతీత వ్యక్తులు డా. పి. శ్రీదేవి రచించిన తెలుగు నవల. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది తెలుగు స్వతంత్ర మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.
♦️ఈ నవల చదువుతుంటే తొలుత ఒక్కటే అనిపించింది. 1957 లో కూడా మనుషుల మనస్తత్వాలు.. ఇంత విచిత్రంగా ఉన్నాయా..? అన్నది మొదటి ప్రశ్న. అందుకేనేమో వారు కాలాతీత వ్యక్తులు అయ్యారు. రచయిత్రి పి. శ్రీదేవి గారు విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చేశారు. డాక్టరుగా ప్రాక్టీసు చేశారు. బహుశా విభిన్న మనస్తత్వం కలిగిన ఓ స్నేహితురాలిని చాలా దగ్గరగా చూసైనా ఈ నవల రాసుండాలి లేదా పురుషాధిక్యత సమాజాన్ని ప్రశ్నించడం కోసమే కావాలనే ఇందిర పాత్రను తీర్చిదిద్ది ఉండాలి.
♦️అసలు ఎవరీ ఇందిర ? ఆమె ఆధునిక స్త్రీకి ఉదాహరణ అని మనం చెప్పగలమా. ఆమె పొగరు, మొండితనం, మొక్కవోని పట్టుదల, దీక్ష, స్వార్థం.. అన్నీ వెరసి ఆమె ఈ నవల మొత్తాన్ని ఆక్రమించేసింది. ఇలాంటి ఇందిరలు ఈ రోజు కోకొల్లలు.
♦️కానీ స్వాతంత్య్రం వచ్చి.. పదేళ్లు కూడా దాటని రోజుల్లో.. బహుశా మా తాతల, తండ్రుల కాలంలో ఇలాంటి పాత్రను రచయిత్రి సృష్టించారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ, పతివ్రత, త్యాగం.. లాంటి మాటలు ఇందిరకు పడవు. ప్రాక్టికాలిటీ ఒక్కటే ముఖ్యమని కోరుకొనే తత్వం.
♦️ఈ రోజుల్లో చాలామంది మోడరన్ ఫిలాసఫీల గురించి మాట్లాడుతూ ఉంటారు .. స్వతంత్రం, స్వార్థం, హిపోక్రసీలతో కూడిన భావజాలాల గురించి ప్రస్తావిస్తుంటారు. కానీ అలాంటి మనస్తత్వం ఉన్న మనిషిని.. అదీ ఓ అమ్మాయిని 1950 ల్లోనే ఊహించగలమా..? సంప్రదాయవాదులు విరుచుకుపడిపోరూ..? అయినా ఇందిర పాత్ర ఎందుకో నిలబడిపోయింది. ఒక వైపు పాఠకులకు కోపాన్ని, బాధను కలిగిస్తూనే.. ఆధునిక స్త్రీగా ఇంత నిక్కచ్చిగా ఉండాలేమో అనే సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చిందేమో అనిపిస్తుంది.
♦️తన స్వార్థానికి నమ్మినవారి జీవితాలను ఎందుకు ముంచావని అడిగితే, ఇందిర సమాధానం:
♦️నా ఇల్లు నేను కట్టుకుంటే పక్కనుంచి వెళ్లేవారి నెత్తిమీద ఇటుకలు పడ్డాయంటే నేనేం చేయను? ఎవరి మటుకు వారు చూసి నడిచి వెళ్లాలి.  (వింజమూరి .6.)   
♦️ఇక కథ విషయానికి వస్తే .. కాలాతీత వ్యక్తులు నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. అవే ఇందిర, ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తి పాత్రలు. ప్రకాశం ఓ వైద్య విద్యార్థి. తన ఇంటి పక్కనే ఉండే ఇందిరకు ఎంతో సహాయం చేశాడు. ఆమె తండ్రికి సుస్తీ చేస్తే వైద్యం చేశాడు. దాంతో ఆమె ప్రకాశంపై అభిమానాన్ని పెంచుకుంది. కానీ ఇందిర స్నేహితురాలు కళ్యాణి ప్రకాశానికి దగ్గరయ్యే సరికి, అదే ఇందిరలో మరో కోణం బయటపడుతుంది.
♦️ఇందిర, కళ్యాణి ముఖ్యమైన స్త్రీ పాత్రలు కాగా ప్రకాశం, కృష్ణమూర్తి, చక్రవర్తి, ఆనందరావు మగపాత్రలు.
♦️ప్రకాశం: కష్టపడి చదవటం తెలిసినా ఇష్టపడినదాని కోసం కష్టపడవలసి వస్తే జంకి బొంకే రకం.
♦️కృష్ణమూర్తి: కష్టం తెలియక పెరిగి గాలికి తిరుగుతున్నవాడి నుండి నీతి ఉనికి తనలో ఉన్నదని తెలుసుకుని, ఆ నీతి కొరకు ఎంత కష్టమైనా ఢీ కొట్టటానికి బయల్దేరిన వాడిగా మారతాడు.
♦️చక్రవర్తి: తన ప్రమేయం లేని పరిస్థితులు రుద్దిన జీవితం నుండి బయటపడి, కావలసినది సాధించుకునే రకం.
♦️ఆనందరావు: తన ప్రమేయం లేని పరిస్థితులు రుద్దిన జీవితం నుండి బయటపడటానికి భయపడి, పరాన్నజీవిలా, గాలివాటుకు ఎగిరే ఆకులా తన ఆనందాన్ని చూసుకుంటూ బ్రతుకీడ్చే రకం. ఇందిరకు తండ్రి.
♦️ఇందిర: తన ప్రమేయం లేని పరిస్థితులు రుద్దిన జీవితం నుండి తన ప్రమేయం లేకుండా ఇకపై ఏదీ జరగటానికి వీల్లేని జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నించే రకం. ఇటువంటి వారిని లౌక్యం తెలిసినవాళ్ళు, Street-smart మనుషులు అంటున్నారు. మొదట్లో మనకు శత్రువులైనా ఫరవాలేదు కానీ హితులు కాకూడదనిపించే రకం. తుదకు ఈ సంఘంలో మనిషంటే ఇలాగే ఉండాలేమోననిపించే రకం.
♦️కళ్యాణి: లోకం పోకడ అంతగా తెలియక, భవసాగరాన్ని ఈదేందుకు తోడును వెతుక్కునే అమాయకురాలి నుండి జాలి నుండి పుట్టిన ప్రేమ అత్మాభిమానాన్ని దెబ్బతీస్తుందని నిర్ణయించుకుని, ఏదైనా సొంతంగా సాధించాలన్న పట్టుదలను వంటబట్టించుకున్న ధీశాలిగా మారుతుంది.
♦️ఇందిర చేసేది తప్పు అని పాఠకులకు తెలుస్తూంటుంది కానీ అలా చెయ్యటం వెనుక ఇందిరకు ఉన్న తర్కం, ఆ తర్కాన్ని అందించే నేపథ్యం ఇందిర పనిని జస్టిఫై చేసేలా ఉంటుంది. ఇందిరది మొదటి నుండి సడలని, చెదరని, బెదరని నిగ్గు. అందరూ స్వార్థపరులే, అందులో నేనూను అనే ఆటోపం.
♦️ఇలాగే ప్రతి పాత్ర నడత వెనుక ఆ పాత్ర పడే మానసిక ఘర్షణ, చేసే పనుల పర్యవసానాలను ఎదుర్కొనేందుకు వెదికే కారణాల వర్ణన అత్యంత సరళంగా ఉంటూనే ప్రభావవంతంగా ఉన్నాయి. సాటి మనిషి కష్టంలో ఉంటే సాయపడేవారు నాడెలా ఉన్నారో నేడూ అలానే ఉన్నారు. అదే కష్టాన్ని స్వార్థానికి వాడుకునే చాకచక్యం నాడెలా ఉందో నేడూ అలానే ఉంది. స్వార్థం, సాయం, ధైర్యం, పిరికితనం కాలాతీత గుణాలు కాబోలు!
♦️విశాఖపట్నంలో ఒక మేడపైనున్న గదిలో అద్దెకుంటున్న ప్రకాశం వైద్య విద్యార్థి. కొన్నాళ్ళ క్రితం ఇందిర అనే వర్కింగ్ గర్ల్ తన తండ్రితో సహా క్రింది వాటాలో దిగింది. ఇందిర నాన్నగారు ఆనందరావుకు సుస్తీ చేస్తే ప్రకాశం ఆయనను కె.జి.హెచ్.లో అవసరమైన ప్రాథమిక చికిత్స చేయించాడు. అలా ప్రారంభమైన పరిచయంతో ఇందిర తండ్రి ఆరోగ్యం గురించి ఏదో అడగడానికని వచ్చి కబుర్లు పెట్టుకొని కదిలేది కాదు. రాత్రి గదికి తిరిగివచ్చిన ప్రకాశంతో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చుండిపోయేది. ఒక్కోసారి ఆమె రాకపోకలు చికాకు కలిగించేవి.
♦️ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తికి చదువు తప్ప అన్నీ చేతనవగా బి.ఎ. పరీక్ష తప్పి చదువున్నాడు. ప్రకాశం కోసమని వచ్చిన కృష్ణమూర్తికి ఇందిర మెరుపుతీగలాగా కనిపించి పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయినరోజునే ఇద్దరూ ప్రకాశం గదిలో ఎడతెరిపి లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. కృష్ణమూర్తికి జల్సాలకు డబ్బు ఖర్చుపెట్టడం సరదా, అమ్మాయిల మీద మోజు. ఇద్దరికీ చాలా విషయాల్లో శృతి కలిసి ఇద్దరూ బాగా తిరిగేవారు.
♦️ఇందిర స్నేహితురాలు కళ్యాణి ఇంటర్ చదువుతున్నప్పటి క్లాస్ మేట్. పరిచయమైన తర్వాత ప్రకాశానికి ఆమె మీద అభిమానం కలిగింది. కళ్యాణి ఎవరితోనైనా మృదువుగా, వినయంగా మాట్లాడుతుంది. ఆమెతో మాట్లాడుతుంటే అతనికేదో ఓదార్పు, ఊరక కలిగేవి. కల్యాణికి టైఫాయిడ్ సోకగా ప్రకాశం ఆమెను కె.జి.హెచ్.లో చేర్పించాడు. కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ నెలరోజులూ తనంటే ప్రకాశం పడిన ఆదుర్దా, చూపిన శ్రద్ధా కళ్యాణి హృదయాన్ని కృతజ్ఞతతో నింపివేశాయి. వీరిద్దరూ దగ్గరవడం ఇందిర సహించ లేకపోయింది. సూటిపోటి మాటలతో సున్నితమైన కళ్యాణి మనస్సును గాయపరిచింది. కళ్యాణి తల్లి ప్రేమ ఎరుగదు. ప్రకాశం చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. వారిద్దరూ పరస్పరం బాధాకరమైన తమ కుటుంబ నేపథ్యాలను చెప్పుకొనేవారు. ఇంతలో కళ్యాణి తండ్రి చనిపోయాడు. ప్రకాశం దారి ఖర్చులకు డబ్బిచ్చి చదువైపోయేదాకా సహాయపడతానని మాటిస్తాడు. రైల్లో క్లాస్ మేట్ వసుంధర పరిచయమై ఇందిర తన గురించి చెడు ప్రచారం గురించి తెలియజేస్తుంది. కళ్యాణి బాధలకు స్పందించి వసుంధరకు తనింట్లో నీడ ఇచ్చి సోదరిలా చూసుకుంది.
చివరకు కృష్ణముర్తి - ఇందిర, డాక్టర్ చక్రవర్తి - కళ్యాణి రెండు జంటలూ తిరుపతి కొండమీద దంపతులుగా మారతారు.
  (వింజమూరి .6.)   
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩