🚩🚩=అసమర్ధుని జీవయాత్ర నవల సమీక్ష=🚩🚩 ( త్రిపురనేని గోపీచంద్ .)






 🚩🚩=అసమర్ధుని జీవయాత్ర నవల సమీక్ష=🚩🚩
             ( త్రిపురనేని  గోపీచంద్ .)
                                   (వింజమూరి .5.)             
♦️ప్రముఖ నాస్తిక వాది, హేతు వాది అయిన త్రిపురనేని రామ స్వామి చౌదరి గారి కుమారుడు గోపీచంద్ 1945--46 మధ్య ఈ నవల రచించాడు.ఇది అసమర్థుడు,అసమర్థుని భార్య, అసమర్ధుని మేనమామ, అసమర్థుని ప్రతాపం, అసమర్ధుని అంతం అనే అయిదు ఉప శీర్శికలతో రాయబడిన మనో వైజ్ఞానిక నవల.తెలుగు నవలా సాహిత్యం లో ఒక ప్రసిద్ధ రచనగా కొనియాడబడుతోంది.
♦️ప్రతి మనిషికి తనదైన ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ నవలలో కథా నాయకుడు సీతా రామారావు పాత్ర తన ఆదర్శాలకు ఊహలకు,వాస్తవ జీవితానికి మధ్య సమతుల్యత కోల్పోయి ,పరి స్థితులకు తగిన సర్దుబాటు చేసుకోలేక తనను తాను అంతం చేసుకునే విచిత్రమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలబడింది. ప్రతి మనసులోనూ ఇలాంటి సీతారామారావులు ఉంటారు.ఆ విషయాన్ని ఈ నవల చాలా బలంగా చెప్పింది.
                                  (వింజమూరి .5.)
♦️"సీతారామారావు జీవితం విచిత్రమైనది.ఉన్నత శిఖరాగ్రం నుండి స్వచ్ఛ మైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని మురికి కూపం లోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది" అనే మాటతో ప్రారంభమైన ఈ నవల అచ్చం నాటక లక్షణ మైన 'నాంది' ని గుర్తుకు తెస్తుంది.కావ్యాలు నాటకాలలో సంప్రదాయమైన ఈ నాంది లో భావి కథార్ధ సూచన ఉంటుంది.నవల ప్రారంభంలో సీతారామారావు గురించి చేసిన పై పరిచయ వాక్యాలలో భావి కథ గర్భితమై ఉంది. కథా నాయకుడు కులీనుడు జమీందారు బిడ్డ.బాగా చదువు కున్నవాడు.అతని ఉన్నతమైన జీవితం స్వచ్ఛమైన సెలయేరు లాంటిది. కాని పరిచయ వాక్యాలలో చెప్పినట్టు ఉన్నతమైన శిఖరాగ్రం నుండి మురికి కూపం లోకి చేరిన సెలయేరులా అతని ఆలోచనలు, అతని స్వభావం అతని అధ:పతనానికి కారణమయ్యాయి.
♦️అతడు ఆగర్భ శ్రీమంతుడు.అతని తాత ముత్తాతలు వంశ పేరు ప్రతిష్టల కోసం చుట్టు పక్కల వారికి ఎన్నో దానాలు త్యాగాలు చేశారు.ఆ ఊరి చెరువు,సత్రం ముత్తాత కట్టించాడు.అతని తాత దేవాలయం కట్టించాడు.దేవుని పెళ్లికి పీటలపై కూచొని కల్యాణం జరిపే హక్కును అతని తండ్రి ముప్పై వేలు ఖర్చు పెట్టి కోర్టుకు వెళ్లి సాధించాడు.వాళ్ల కమతాలలోకి పనికి రావాలని ఊళ్లో అందరూ ఉవ్విళ్లూరు తుంటారు.సరైన అజమాయిషీ లేక పోవడం వల్ల వీలైనంత కాజేయవచ్చు అని కొందరు బాహాటంగా అంటుంటారు.
సీతా రామారావు కూడా తాత తండ్రుల వంశ ప్రతిష్ట నిల బెట్టాలని భావిస్తాడు.ఉదార స్వభావంతో అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తాడు.' వాళ్ల వంశంలోనే ఆ గొప్ప తనముంది.ఎముక లేని చెయ్యి ' అని ముఖ స్తుతి చేసి చాలా మంది అతని ద్వారా లబ్ధి పొందుతారు.అతని తండ్రి దగ్గర కొందరు అప్పులు తీసుకున్నారు కాని తండ్రి చని పోయాక చాలా మంది అప్పులు ఎగ్గొట్టారు. సీతారామారావు కూడా వారి దగ్గర డబ్బు వసూలు చెయ్యడు.పోనీలే వాళ్ళు కూడా బతకాలి కదా అని డాబు చూపిస్తాడు.మేనమామ అత్త కూడా అతన్ని పోగొడ్తలతో ఉబ్బించి లౌక్యం చూపి అతనికివ్వాల్సిన డబ్బు ఎగ్గొడతారు. డబ్బు నష్ట పోయినా 'నువ్వెంత మంచి వాడివి బాబూ' అనే మాటకు పొంగి పోతాడు. 'బతికినన్ని నాళ్లు ఇలా బతికితే చాలదా, పది మంది తో మంచివాడనిపించు కొని పొమ్మన్నారు పెద్దలు' అని ఠీవి గా చెప్తాడు.అతని స్వభావాన్ని గమనించిన రామయ్య తాత చెప్పిన మాటలు అతని తలకెక్కవు.ఇప్పటికే సమాజంలో మనల్ని పొగిడి ఉబ్బించి పబ్బం గడుపుకునే వాళ్ళున్నారు.ఎవరు ఎందుకు మాటాడుతున్నారో,ఎలా నటిస్తారో తెలుసుకోక పోవడం అసమర్ధుల లక్షణమే.లక్షలు లక్షలు దానాలు చేసిన అతడు చివరకు వంద రూపాయలు లేక తల్ల డిల్లడం అతని దుర్భర దారిద్ర్యానికి, ఆర్థిక క్రమ శిక్షణ లేక పోవడం వల్ల కలిగే నష్టానికి నిదర్శనంగా నిలుస్తుంది. (వింజమూరి .5.)
                                              (వింజమూరి .5.)
♦️పెళ్ళి పట్ల కూడా అతనికి ఆదర్శ భావాలున్నాయి.పెళ్ళి చేసుకోను అని అతడు చెప్తుంటాడు.చివరకు చేసుకోక తప్పని సరి అయినపుడు పెళ్లికి ఒక మహత్తర అర్థం కల్పిస్తాను అని అంటాడు.నిజానికి అతడు కాలేజీలో చదువుతున్నపుడు ఇందిర అనే అమ్మాయిని ప్రేమించాడు.పెళ్ళి చేసుకోకపోతే ఆమె అతన్ని దగ్గరకు రానివ్వదు.అందుకే పెళ్లి కొడుకయ్యాడు.తన ఊహల ఊబిలో ఇరికి ఇబ్బందుల పాలయ్యాడు.ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి.ఉద్యోగం చేయక తప్పలేదు." ఉన్నన్ని రోజులు కన్ను మిన్ను కానక ఖర్చుపెట్టాడు.ఇపుడు అనుభవిస్తున్నాడు,అయినా మన కోసం అతడు ఏమైనా చేశాడా, మంచివాడు అనిపించు కోవడానికి చేశాడు"అని చుట్టు పక్కల వాళ్ళు ఈస డించుకున్నారు.చులకనగా నవ్వారు.లోకం తీరు ఇంతే.ఉన్నప్పుడు పొగిడి పొందడం,లేనపుడు ఎగతాళి చేయడం.ఇది తెలుసుకోని వారే అసమర్ధులు.
ఈ ప్రపంచంలో జ్ఞానం ఉన్నవాడు సుఖ పడలేడు.అజ్ఞాని మాత్రమే సుఖ పడతాడు, అఙ్ఞానిని ఆలోచనలు వేధించవని అందని ఆదర్శాల కోసం హైరానా పడడని చుట్టూ ఉన్న వారికి చెప్పడం మొదలు పెడతాడు.అతని తల ఆలోచనల పుట్ట అయింది.అతడు ఏ పని పాటా లేని అసమర్ధుడయ్యాడు.అన్నం కోసమే ఈ జీవితం,ఇంతమంది దేశాధి నేతలున్నారు.అందరికీ అన్నం దొరికే మార్గం కనుక్కో లేక పోయారు అని తను సంపాదించడం చాత కాక తన వైఫల్యాన్ని ఇతరుల మీదకు నెట్టేసాడు.తను మంచి వాడని ఇతరులు దుర్మార్గులు మోసగాళ్ళు అని నిందిస్తాడు.మనం కూడా ఇతరులే మన కష్టాలకు కారకులని పలాయన వాదం చూపిస్తాం.ఈ సన్నివేశాలు చదివినపుడు మనసు బరువెక్కుతుంది.ఏదో ఒక సందర్భంలో ఎవరయినా ఇలాంటి భావ జాలం కలిగి ఉంటే వారి హృదయం విచిలితం అవుతుంది.
♦️నలభై వేల రూపాయల అప్పు ఎగ్గొట్టిన మేనమామకు ఒక వంద రూపాయలు సహాయం చేయమని ఉత్తరం రాస్తాడు.మేన మామ పట్టించుకోడు.నీకు సహాయం చేసిన డబ్బుతో వంద కుక్కలు కొనుక్కుంటే అవి విశ్వాసం చూపేవని మరొక ఉత్తరం రాస్తాడు.మేనమామ చాలా ఘాటుగా జవాబు ఇస్తాడు.'బాబూ మీరు కీర్తి మనుషులు, డబ్బులేక పోయినా బతగ్గలరు మేము అలా కాదు డబ్బు లేక పోతే బతక లేము, అందుకే నీకు వంద రూపాయలు ఇవ్వలేను'అనే అతని ఉత్తరానికి ఇతని హృదయం గాయ పడుతుంది.ఎవరి అజ్ఞానా నికి వారే బాధ పడాలి.ఎవరి చర్యల ఫలితం వారే అనుభవించాలి.ఇతరులను నిందించి ప్రయోజనం లేదు.జీవిత ప్రవాహం మహా వేగంతో వెళ్లి పోతోంది.ఇదొక మహా సంగ్రామం ,ఇందులో పిరికి వాళ్లకు చోటు లేదు అనే అతని మేనమామ మాటలకు సీతారామారావే కాదు మనం కూడా విల విలలాడుతాం.
ఎవరి మీదో కలిగిన కోపాన్ని ఇంకెవరి మీదో చూపినట్టు నిష్కారణంగా తన కోపాన్ని కూతురు పై చూపిస్తాడు.ఎన్నో తిప్పలు పడి ఏదోలా సంపాదించి భార్య వండిన అన్నాన్ని తిట్టుకుంటూ తిని భార్యను కొట్టి బయటకు వెళ్లిపోతాడు.అత్త మీద కోపం దుత్త మీద చూపిన సామెత చందంగా మన లోని ఈ అసమర్థ లక్షణం ఉంటుంది.మానవ వ్యక్తిత్వంలో ఈ స్వభావాన్ని సహజ సిద్ధంగా చిత్రించిన గోపి చంద్ మనల్ని ఆలోచనల్లో పడేస్తాడు. ప్రేమించి పెళ్లాడిన అతని భార్య అతని ద్వారా నరకం చూస్తుంది.అతని కోపం అతని నవ్వు అతని మాట అతని ఉద్రేకం ఇవేవీ ఆమెకు రుచించవు.యాంత్రికంగా బతుకుతుంది.ఇప్పటికీ ఒకే ఇంట్లోని దంపతులు యాంత్రికంగా బతుకుతున్నారు అనిపించి ఇలాంటి సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తామో ,.ఇంట్లోని సమస్యలకు ఎలా స్పందిస్తున్నామో తెలిసి ఆలోచనలో పడతాము.
♦️అసమర్ధుని చివరి భాగం అసమర్ధుని అంతం.తన ఊహలకు వాస్తవానికి మధ్య వైరుధ్యం ఎక్కువై, ఎలా ఉండాలో అర్థం కాక,అర్థం అయినా అలా ఉండలేక ఎడతెగని పాముల్లా కాటేస్తున్న ఆలోచనల నుండి తప్పించుకోలేక అద్దం ముందు నిలబడి తన గుండెను తాను బాదు కోవడం,లోకం మంచిదారిని వదిలేసి తన లాంటి మంచి వాళ్ళతో ఆడుకుంటోంది అని తీవ్ర వ్యాకులతకు గురై పలాయన వాదియై పోతాడు.తను ఎలా ఉండాలని కలలు కన్నాడో, వేటిని గొప్ప ఆదర్శాలుగా భావించి బతకాలనుకున్నాడో అలా బతకలేక, సంఘంతో సర్దుబాటు చేసుకోలేక ఉన్మత్త స్థితి ఆవరించి తన గొంతు తానే నులుము కొని, తన శరీరాన్ని తానే హింసించుకొని మరణిస్తాడు.ఈ చివరి ఘట్టంలో సీతారామారావు పరిస్థితికి మనసు ద్రవిస్తుంది.నవల పూర్తయ్యే సరికి ప్రతి పాఠకునిలోను ఒకో సీతారామారావు ఉన్నాడని, తనది అసమర్ధుని జీవయాత్ర అని అనిపిస్తుంది.
♦️వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజానికి మధ్య సమన్వయం కొన్నిసార్లు లోపిస్తుంది.దీని సర్దుబాటుకు వ్యక్తులు మానసికంగా సిద్ధం కాక పోతే, ముందు చూపు లేక పోతే మనం కూడా సీతారామారావులా 'ఇన్ఫీరియారిటీ కాంప్లెక్ష్ కు గురై కుంగిపోతాము. పరిస్థితులతో సర్దుబాటు చేసుకొంటూ తన స్వభావాన్ని ఆదర్శాలను వదలక పోవడం సమర్ధుల లక్షణం.
"జీవితం ఒక మహా సంగ్రామం. ఇందులో అసమర్ధులకు పిరికి వాళ్లకు చోటులేదు.ఎటువంటి గడ్డు పరిస్థితి లోను మన వ్యక్తిత్వం చెడి పోకుండా గట్టి పట్టుదల, మానసిక స్థైర్యం కలిగి ఉండాలని ,మనది అసమర్ధుని జీవయాత్ర కాకూడదని "ఈ నవల చెప్తుంది.డెబ్బయి అయిదేళ్ళు కిందట రాసిన నవల అయినప్పటికీ ఇప్పటికీ ఇందులోని పలు అంశాలు ,ఇందులోని సీతారామారావు ఆలోచనలు మనల్ని వెంటాడుతాయి. సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తూ భావి కాలానికి కూడా మార్గ నిర్దేశం చేసే ఈ నవల, తెలుగు నవలా సాహిత్యంలో ఒక క్లాసికల్ నవలగా పేరు పొందింది. కావ్య ప్రయోజనాలుగా చెప్ప బడిన లక్షణాలలో ఒకటైన వ్యవహార దక్షత (జ్ఞానం)మనలో నిండాలని చెప్పిన రచయిత శ్రీ త్రిపురనేని గోపిచంద్ ఉత్తమ రచయితగా పేరు పొందడానికి అతను ఎంచుకున్న కథ, అతని రచనా విధానమే కారణం.
 (వింజమూరి .5.)
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩♦️♦️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐