🚩 🚩-రామదాసు కీర్తన.(2) #ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె..!

 


పల్లవి:
❤️♦️ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్ను
రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా ఇ..
చరణము(లు):
♦️చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రా
ఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
గోపురమంటపాలు కుదురుగ గట్టిస్తి రామచంద్రా నను
క్రొత్తగ జూడక నిత్తరిబ్రోవుము రామచంద్రా ఇ..
♦️భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా
ఆ పతకమునకుబట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
♦️శత్రుఘ్నునకు నేను చేయిస్తి మొలత్రాడు రామచంద్రా
ఆ మొలత్రాడునకు బట్టె మొహరీలు పదివేలు రామచంద్రా ఇ..
♦️లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
♦️సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ..
♦️వాహనములు మీకు వరుసతో జేయిస్తి రామచంద్రా జగ
న్మోహన సంకెళ్ళు వేసిరి కాళ్ళకు రామచంద్రా ఇ..
♦️కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని రామచంద్రా ఇ..
♦️మీ తండ్రి దశరథమహారాజు పెట్టెనా రామచంద్రా
లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ఇ..
♦️అబ్బా తిట్టితినని యాయాసపడవద్దు రామచంద్రా
ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా ఇ..
♦️సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా
దెబ్బలకోర్వను యప్పుదీర్చుమయ్య రామచంద్రా ఇ..
♦️ఏటికి జల్లిన నీళ్ళాయె నా బ్రతుకు రామచంద్రా
నేను అధములందరికంటె అన్యాయమైతిని రామచంద్రా ఇ..
♦️కౌసల్యపుత్రుడ దశరథతనయుడ రామచంద్రా
కావు క్షేమముగ భద్రాద్రి నెలకొన్న శ్రీరామచంద్రా ఇ..
♦️భక్తులందరిని పరిపాలించెడి శ్రీరామచంద్రా
నీవు క్షేమముగ రామదాసుని నేలుము రామచంద్రా ఇ..
'♦️ఏమయ్యా ! నీకు నేను ఇన్ని చేసాను. నాకు ఈ మాత్రం చేయవా!' అని లోకంలో మనకు బాగా ఆత్మీయులైనవారితో దబాయిస్తాం. నాలుగు మాటలంటాం. పడతాం. అందులో ఒక కమ్మదనముంది.’ ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్నురక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా’అను ప్రసిద్ధమైన రామ కీర్తనలో కూడా ఈ సొగసైన దబాయింపు ఉంది. రాములవారి వంశంలో ఇక్ష్వాకు, రఘువు మొదలయినవారు సుప్రసిద్ధులు. వారి వల్ల రాములవారి వంశానికి ఇక్ష్వాకు వంశం ,రఘు వంశం అని పేర్లు వచ్చాయి. ‘ఇక్ష్వాకు వంశం మొత్తానికి గొప్పవాడా ! నువ్వు నాతో మాట్లాడకపోతే, సాయం చేయకపోతే నీకున్న పేరు మొత్తం పోతుంది.. ఏమనుకొన్నావో.. ఏమో.. అయినా రామచంద్రా ! నువ్వు రక్షించకపొతే, ఇంకెవరు నన్ను రక్షిస్తారు..చెప్పు..’ ఇలా సాగే ఈ పల్లవి మొదటి పంక్తిలో బెదిరింపు ఉంది.
♦️రెండవ పంక్తిలో శరణముంది. ఇది భక్తకవులకు మాత్రమే సాధ్యమైనది. తను ఒక మంచి పని చేస్తే, చెడ్డపని చేసావని నిందారోపణ వచ్చింది. కొడుకు భరించలేకపోయాడు. తన కష్టాన్ని తండ్రికి చెబుతున్నాడు. ‘ఏమయ్యా రామయ్యా ! నీగుడికి ప్రాకారాలు (చుట్టు గోడ) ఎంత బాగా చేయించాను. దానికి పదివేల వరహాలు (వరాహముద్రగల బంగారునాణెములు) ఖర్చయింది. నేను తినేసానని చెబుతారేమిటి? నువ్వే చెప్ప’మని ఆత్మీయంగా రామునితో పోట్లాడాడు భక్తరామదాసు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి రాములవారికి నగలు, కిరీటాలు, శఠారి, ఛత్ర, చామరాలు, వస్త్రాలు మొదలైనవన్నీ రామదాసు చేయించాడు.
♦️చింత చిగుర్లాంటి ఎర్రని రాళ్లను పొదిగిన నగను- చింతాకు పతకాన్ని -సీతమ్మకు, రాముని అలంకరణకు కలికితురాయినీ (కొంగతల యీకలతో చేసిన శిరోభూషణం) లక్ష్మణునికి ముత్యాల పతకం, భరత శత్రుఘ్నులకు వరుసగా పచ్చల పతకం, రవ్వల మొలతాడు చేయించాడు. వీటన్నింటికి ఒక్కొక్కదానికి పదివేల వరహాలు అయిందని ఈ కీర్తనలో రామదాసు మొరపెట్టుకొన్నాడు. దెబ్బ మీద పడుతుంటే అమ్మా అని సామాన్యంగా నోటినుంచి పిలుపు వస్తుంది. కాని రామదాసు ఒంటి మీద దెబ్బ పడుతుంటే ‘ అయ్యా.. రామయ్యా !’ అనే పిలుపువచ్చింది. ఎవరబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు అనే స్థాయిని’ ఆ బాధ చేరింది.’
♦️మీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా ! లేక మీమామ జనకమహారాజు పంపెనా రామచంద్రా ‘అని దెప్పిపొడుపు అన్న భక్తుడు అంతలోనే లెంపలు వాయించుకొని ‘’ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్యా.. నన్ను క్షమించు’అన్నాడు. ‘ఇవన్నీ నీకు నేను అప్పు ఇచ్చాను, తీర్చు’ అంటూ నా బతుకు ఏటిలో చల్లిన నీళ్ల లెక్కయిందని రామదాసు వాపోయాడు. ఏటిలో చల్లిన నీళ్లను గుర్తించి తిరిగి తీయటం అసాధ్యం. నీకు, నీవాళ్ళకు నేనుఖర్చు చేసిన డబ్బును తిరిగి ఇవ్వటం అసాధ్యం. నన్ను క్షేమంగా చూడు’ అని రామదాసు ఈ కీర్తన ముగించాడు. బాధలోనుంచి పుట్టిన ఈ కీర్తనను ఎప్పుడు చదువుకొన్నా- బాధను మరిపిస్తుంది. అది ఈ కీర్తన ప్రత్యేకత.
♐️♐️♐️♐️♐️♐️♐️♐️♐️♐️♐️♐️♐️♐️♐️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐