🚩గజేంద్ర మోక్షము -- తత్వవిచారణ --పరిశీలన.🚩



💥తత్వవిచారణతో సద్యోఫలితం అందుకున్న వారిలో
గజేంద్రుడు అగ్రగణ్యుడు. ఆయన లాగ తత్వవిచారాన్ని చేసి ఉన్న ఫళంగా పరమాత్మ సాక్షాత్కారం పొందినవారిలో మొదటివాడు.
మిగతా అందరికి ఆదర్శప్రాయుడు.
💥గజేంద్రుడి పేరుతో శ్రీ వ్యాసుల వారు, శ్రీ పోతన గారు మనకు తత్వవిచారాన్ని పరిచయం చేసి, ఏవిధంగా దాన్ని చేయాలి, ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి, ఏవిధమైన జవాబులు రాబట్టుకోవాలి, మన ఆలోచనలని, భావాలని ఏవిధంగా మలచుకోవాలి, ఏవిధమైన భావపరంపరలతో ముందుకు సాగితే గమ్యమైన పరమాత్మను చేరుతాము అన్న విషయాలను చాలా చక్కగా తెలియ జేసారు.
💥ఇప్పుడు మనం శ్రీమద్భాగవతంలో గజేంద్రుడు పేరుమీద వ్యాసులవారు, పోతనగారు మనకు ఇచ్చిన తత్వవిచార భాండాగారాన్ని ఒక క్రమంలో పరిశీలిద్దాం. వారిద్దరూ ఒకే భావాన్ని ఏవిధంగా వ్యక్త పరిచారు, వ్యాసులవారు చెప్పినవాటిలో పోతనగారు వేటిని చెప్పారు, వేటిని వదిలివేసారు, ఇంకా వేటిని చెప్పారు, వీటన్నిటిని కూడా పరిశీలించి, వారి దృక్పధాన్ని తెలుసుకొంటూ తత్వవిచారాన్ని మన మనస్సులలో నాటుకొనేటట్లు చేసుకొందాం. ముందరగా వ్యాసభాగవతంలోని శ్లోకాలను చెప్పుకొని, వాటిని పోతనగారు ఏవిధంగా తెనిగించారు, ఆభావాలను ఏవిధంగా చెప్పారో పోల్చి చూసుకుందాం.
💥"యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదంస్వయం,
 యో-స్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం"
"ఎవని ఆధారమున విశ్వంబు నిలిచియున్నదో,
ఎవ్వనినుంచి ప్రభవించినదో, ఎవరు దానిని సృజించిరో,
ఎవరు స్వయముగా తానే విశ్వమై ప్రకటితమయ్యెనో, ఎవరీ దృశ్యప్రపంచముచే, దాని కారణభూత ప్రకృతిచే విలక్షణమై
శ్రేష్టమై తనంతతా కారణరహితుడై ప్రభవించునో అట్టి భగవానుని
శరణము నొందుచున్నాను."
దీని అర్ధం చాల తేటతెల్లంగా వుంది.
వేరే వివరణ అవుసరం అక్కరలేదు. కాని చివర ఒక విషయం చెప్పారు.
అన్నీ తానే అవుతూ, మళ్లీ కారణరహితుడై ఉంటాడట. అంటే అన్నీ తానేచేస్తాడు, చేయిస్తాడు. మళ్ళా దేనితోను సంబంధంలేకుండా, దేన్నీఅంటుకోకుండా ఉంటాడు.కాబట్టి మనంకూడా ఈ విషయాన్నే అనుసరించాలి.ఈపదార్ధపూరితమైన ప్రకృతిలో వుంటూ, దీనికి సంబంధించిన పనులు, ఇంకా మిగతావి వాటిని అంటుకోకుండా అంటే నిష్కామంగాచేయాలి. .
 ఈశ్లోకాన్ని పోతనగారు తెనిగిస్తూ ఇంకొక విధంగా చెప్పారు.
💥"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై, యెవ్వని యందుడిందు, బరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా, డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్."
💥తత్వవిచారణాక్రమంలో యీపద్యం చాలా విలువైనదీ,
ముఖ్యమైనది. ఒక దాన్ని గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే దాన్నిఎన్నికోణాల్లోంచి, ఎన్నివిధాలుగా ప్రశ్నించి పరిశీలించాలో యీ పద్యంలో పోతనగారు చెప్పారు.
💥ఆయన స్వయంగా ఒకయోగి. యోగ తత్వరహస్యాలెన్నింటినో ఆయన భాగవతంలోచొప్పించారు.ప్రస్తుతం యీపద్యాన్ని నాలుగుముక్కలుగా విడదీసుకోవాలి.మొదటిది ప్రశ్నా భాగం.
 రెండవది ఒక్క "వానిని" అన్న మాట మాత్రమే.
మూడవది "ఆత్మభవునీశ్వరు". మిగతాది నాల్గవది.పోతనగారు
ఇక్కడ మంచిగమ్మత్తు చేసారు. ముందర మనకి ఎలాప్రశ్నలు వేయాలో నేర్పారు. తర్వాత ఆప్రశ్నలు వేసుకొని, వాటికి సమాధానాలు రాక మనం ఇబ్బందులు పడతామని గ్రహించి, "వానిని" అంటే ఆ ప్రశ్నలకు సమాధానమైన వానిని అని, మళ్లీ వాడెక్కడ ఉన్నాడో తెలియక కలవరపడతామని, "ఆత్మభవుని" అంటే మనఆత్మలోనే, మనకు చాలాదగ్గరలోనే ఉన్నాడని విశదీక రించారు.
చూసారా!తత్వవిచారణాపధ్ధతిలో యీపద్యాన్ని అనుసరించినట్లయితే, పరబ్రహ్మస్వరూప జ్ఞానం కోసం ఏవిధమైన పరిశోధన జరపాలి, వాడెక్కడవున్నాడు, వాడిని పట్టుకోవాలంటే ముందర దేన్ని తెలుసుకొని దర్శించాలి, దేన్నిపట్టుకొంటే ఆపరమాత్మ దొరుకుతాడు మొదలైన విషయాలన్నీ చాలా తేలికగా తెలుస్తాయి. ఇదీ పోతనగారి గొప్పతనం.గజేంద్రుడి మిషతో మనకు ఇంతటి గొప్ప విషయ పరిజ్ఞానాన్ని అందించారు. ఇక తర్వాతి శ్లోకానికి వెళదాం.
💥"యః స్వాత్మనీదమ్ నిజమాయయార్పితం,
 క్వచిద్విభాతం క్వచతత్తిరోహితం
అవిద్ధదృక్ సాక్ష్యుభయం తదీక్షతే,
స ఆత్మ మూలో-వతు మాం పరాత్పరః"
ఏ ప్రభువు తన సంకల్పశక్తిచే తన స్వరూపముగా రచింపబడి సృష్టికాలమందు ప్రకటితమై ప్రళయ కాలమందు అప్రకటితమైయుండునో, ఆ శాస్త్ర ప్రసిద్ధ కార్యకారణరూపజగత్తు అకుంఠిత దృష్టి కల్గియుండు కారణముచే సాక్షీరూపమై చూచుచుండునే గాని దానితో నేకీభావము పొందకయుండునో అట్టి ప్రభువు, చక్ష్యాది ప్రకాశకములకు ప్రకాశమైనవాడు, నన్ను రక్షించుగాక.
యీ శ్లోకాన్ని పోతనగారు ఈవిధమగా తెనిగించారు.
💥"ఒకపరి జగములు వెలినిడి యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై,
సకలార్ధ సాక్షి యగు నయ్యకలంకుని నాత్మమూలు నర్థి దలంతున్"
ఒకసారి లోకాలను సృష్టిచేసి, ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ, ఆలోకాలు రెండూ తానేయై, అన్ని విషయాలనూ ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మయైన ఆ పరమాత్ముని ఆసక్తితో ధ్యానం చేస్తాను.
ఆ ఇరువురూ ఇక్కడ పరబ్రహ్మము యొక్క క్రియా, నిష్క్రియాపరత్వాలను, ఆయనయొక్క సాక్షీభూత తత్వాన్ని, తేజః స్వరూప పరాచైతన్యాన్ని తెలియజేసారు. ఇక తర్వాత శ్లోకానికి వెళదాం.
💥"కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు
తమసతదా--సీద్ గహనం గభీరమ్ యస్తస్య పారే-భివిరాజతే విభు:"
కాలప్రవాహమునుండి సంపూర్ణలోకములు, మరియు బ్రహ్మాదిలోకపాలకులు పంచభూతముల ప్రవేశించిన తర్వాత, ఆ పంచభూతముల నుండి మహాత్తత్త్వపర్యంతము సంపూర్ణకారణములు వాని పరమకారణరూపప్రకృతిలో లీనమై పోయినప్పుడు దుర్గమమైన అపారఅంధకార ప్రకృతి యుండును. అట్టి అంధకారంబునకావల తనదౌ పరమధామమున ఏసర్వవ్యాపక భగవానుడు అన్నిదిక్కుల ప్రకాశించుచుండునో, ఆప్రభువు నన్ను రక్షించుగాక.
💥"లోకంబులు లోకేశులు, లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నేవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్"
లోకాలూ, లోకాలను పాలించేవారూ, లోకాలలో ఉండేవారూ, అందరూ నశించిన అనంతరం, ఆ కారుచీకట్లకు అవతల అఖండమైన రూపముతో ప్రకాశించే వాడిని నేను భావించి సేవిస్తాను.
💥ఇక్కడ వారిరువురూ ఒకే భావాన్ని చెప్పారు. మహాప్రళయకాలంలో మన భూమి మొదలుకొని సృష్టికారకుడైన చతుర్ముఖబ్రహ్మ వరకూ అంతయూ పంచభూతాలలోను, ఆపంచభూతాలు 'విరాట్' లోను, ఆవిరాట్ 'మహత్తు' లోను ఆమహత్తు 'పరబ్రహ్మ' లోను కలసి పోయినప్పుడు ఇక అంతులేని దుర్గమమైన అంధకారం మాత్రమే వుంటుంది. దానినే పోతనగారు 'పెంజీకటి' అన్నారు. ఆ చీకటికి అవతల ఆసమయములో ఒక్క పరబ్రహ్మ మాత్రమే వుంటాడు. ఆపరబ్రహ్మస్వరూపాన్ని నేను సేవిస్తా నన్నారు ఆ ఇరువురూ. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం చెపుతాను. కళ్ళుగట్టిగా మూసుకోండి. ఏంకనపడుతుంది? అదే పెంజీకటి. దానికవతల చూడగలిగితే, మనకు కనపడేది పరబ్రహ్మ స్వరూపమే!
యీ విషయాన్నే వ్యాసులు, పోతన లిరువురూ మనకు తెలియజేసారు.
🙏🏿🙏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!