🚩🚩-రాచకొండ విశ్వనాధ శాస్త్రి గారి పొట్టి కధలు

 


(కొన్ని కధల పరిచయాలు .)
♦️వైవిధ్యమైన కథాసాహిత్యానికి వెలిగే సూర్యుడు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆయన కథల్లో అక్షరాలకు గొంతులుంటాయి. దృశ్యాలన్నీ వాస్తవికత స్వరాల తో, గాయాలతో ఉన్న బాధల్ని గానం చేస్తాయి.
ఆయన కథల్లో పేదరికం కార్చిన కన్నీరు పాఠకుల అరచేతుల్లో దీనమైన రూపమై మిగులుతుంది. నిత్యం అచేతనంగా ఉండే మనిషి ఆలోచనలు ఆయన కథల చైతన్యంతో సరిహద్దు సైనికుల్లా తయారవుతాయి. అసంఖ్యాకమైన కథా సంపదకు దాతగా నిలిచిన రావిశాస్త్రి కలం అందించిన పదునైన సాహితీ భాండాగారం ఈ పొట్టి కథలు. 1979- 1980 ప్రాంతంలో 'స్వాతి' మాసపత్రికలో ప్రచురించబడిన ఈ కథలకు శీర్షికలు ఉండవు, కాని వాటి శిరస్సుల నిండా దట్టించిన సామాజిక ఆలోచన మన చూపుల్ని క్రొత్త మార్గాల వైపు నడిపిస్తుంది. రండి ఒక్కసారి ఆ రహదారుల దృశ్యాలలో మనం ఒక దృశ్యమై కదులుదాం.
♦️పేదరికంతో పస్తులున్న పాక అది. అందులో ఆకలితో ఒక పసికూన అలమటిస్తోంది. బువ్వకోసం అమ్మను, నాన్నను అడిగింది. కన్నీళ్ళతో ఖాళీగిన్నెలు చూపించారు. చేసేదిలేక ఆకలిని భరించలేక 'ఆకలేస్తుంది, బువ్వ పెట్టండని' ఎండిన డొక్కతో ప్రభుత్వాన్ని అడిగింది. మట్టికొట్టుకు పోయిన ఆ ముఖాన్ని చూసి ప్రభుత్వం చీదరించుకుంది.
ఆకలిని భరించలేక చివరకు తనను చంపమని బ్రతిమాలింది. మేము అహింసావాదులం, మేము చంపలేం. 'నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వే చచ్చి పోతావు' అంది ప్రభుత్వం. అన్నట్టుగానే పసికూన చచ్చిపోయింది. ఈ కథలో పేదరికం కార్చిన కన్నీరు వరదలై ప్రవహించింది. ఆకలిని తీర్చలేని ప్రభుత్వ వైఫల్యం,పేదలపట్ల చూపించే దారుణమైన నిర్లక్ష్యం, పాప శవం చుట్టూ భయంకరంగా కనిపించాయి.
ఈ స్థితి ఇప్పటికీ ప్రజాస్వామ్యం తివాచీల మీద ఆసనాలు వేస్తూనే ఉంది. ఒక పసిపిల్ల ఆకలిని తీర్చలేని సింహాసనాలు చరిత్రలో తమ ఆనవాళ్లను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ పొట్టి కథ కదిలిస్తుంది, కదిలించి ఆలోచన పడవల మీద కూర్చో పెడు తుంది. తెడ్డును మన చేతిలో ఉంచి కర్తవ్యం వైపు సాగమంటుంది.
♦️మరో కథలో తెల్లారింది. ఏమిటి తినటం అనుకుంది ఆవు. దేన్ని తినటం అనుకుంది పులి. ఏమిటి తినటం, దేన్ని తినటం అనుకునేది ఒక్క మనిషి మాత్రమే. ఈ సారాంశాన్ని కలిగిన కథలో మనిషి ఆవులా కనిపించినా, పులిలా ఎలా ఆలోచిస్తాడు, ఎలా కబళిస్తాడు, ఎలా మృగతత్వానికి తన బుద్ధిని తలపాగాలా చుట్టుకుంటాడో చాలా సూటిగా గుండెల్లో దిగిన బాణంలా పలకరిస్తుందీ కథ.
 ఈ కథముందు ఈ దేశంలో చాలామంది దోషులుగా నిలబడ తారు. సమాధానంలేని నేరస్తుల్లా తల వంచు కుంటారు. ఈ కథను చదివాక ఏ పాఠకుడు మౌనం గా శిలల్లా నిలబడడు. మార్పుకోసం తన మనసును ప్రక్షాళన చేసుకుంటాడు. పేదలు బ్రతకటానికి మార్గాలు ఇరుకై పోతున్నా, బ్రతకటం నేర్చినవాళ్లు ఆ మార్గాలను తమ వాకిళ్లముందు రహదారులుగా మార్చుకునే అతితెలివి వికారాన్ని ఒక కథ మనకు వినిపిస్తుంది.
♦️ఆ కథలో షావుకార్లంతా దైవభక్తులుగా ఉంటూ, మోసాలు చేసి ఆస్తిపాస్తులు సంపాదించుకుంటు న్నారని పేదలకు కోపం వచ్చి దేవుడి మీద దండ యాత్ర ప్రారంభించిస్తారు. తన మనవడి ద్వారా విషయం తెలుసుకున్న ముసలి షావుకారు, తన మనవడికి ఒక ఉపాయం చెబుతాడు.
''నువ్వుకూడా నాస్తికుడవైపోయి దేవుడు లేడనేవాళ్లకు నాయకత్వం వహించు. అంతా నీకు అనుకూలంగా జరుగు తుంది'' అంటాడు. తాత సలహాను తీర్థంలా కళ్లకద్దు కుంటాడు మనవడు. ఫలితంగా దేవుడు చచ్చి పోయాడు, షావుకారు బ్రతికి పోతాడు. ఇందులో అంతర్గతంగా వున్న సత్యం ఇప్పటికీ బ్రతికే వుంది. ప్రజల్లో ఒకడుగాలేని వాడు ప్రజలకు నాయకత్వం వహిస్తే నష్టాలు చివరికి ప్రజలకేనన్న వాస్తవాన్ని తన గోంతునిండా వినిపిస్తోంది ఈ కథ.
♦️ఒక కుర్రాడు కష్టపడి చదివి పరీక్షలు రాశాడు. ఆ కుర్రాడు రాసిందాన్ని చూసి కాపీకొట్టి మరొకడు పరీక్షలు రాశాడు. మరో ఘనుడు ఏకంగా పరీక్షాపత్రాలు ముందుగానే సంపాదించి పరీక్షలు రాశాడు. ఇది పిల్లల మధ్య జరిగిన వ్యవహారమైనా, నైతికంగా దిగజారిపోయిన సమాజ వ్యవస్థను చూపిస్తోంది ఈ కథ.
 కాపీకొట్టిన రెండోవాడు దొంగ యితే, ఇక ఏకంగా మూడోవాడు గజదొంగ. మరి మొదటివాడు ఏమవుతాడు.
సమాధానం మనముందు నిలబడి వుంది. మొదటివాడు కూలోడిగా మిగిలిపోయాడు.
ఈ మూడు పాయలు గానే దేశం విడిపోయి వుంది. కూలోడి పాయ మాత్రం ఇప్పటికీ కాళ్లు విరిగిన చీమలా ఊపిరిని కోల్పోతూనే వుంది. కథను చదవగానే నిప్పులేకుండనే మెదళ్ళు వేడెక్కుతున్నాయి. రావిశాస్త్రి కథల వేడి అసామాన్యం... వస్తువుల కరువును సృష్టించడం ఈ దేశ ముఖచిత్రంగా కొనసాగుతూనే వుంది.
ఇదే అంశాన్ని రావిశాస్త్రి ఒక కథలో ప్రస్తావిస్తారు.
♦️దేశంలో కరువొచ్చింది. దాచివుంచిన ధాన్యం కోసం ఆకలితో వున్న ప్రజలు ఎగబడ్డారు. ధాన్యం పంపకం జరగలేదు. ప్రజల ఆకలి మంటలు తీరలేదు. ప్రజలు తిరగబడ్డారు. అంతే పోలీసులొచ్చారు. చాలక సైన్యం దిగింది. కాల్పుల్లో చాలామంది చనిపోయారు. శాంతి భద్రతలు కాపాడబడ్డాయని ప్రశంసలతో ప్రభుత్వం పందిళ్ళు వేసుకుంది. శవాలను మోస్తున్న ప్రజల భుజాల మీద ఒకటే ప్రశ్న 'ధాన్యం తనంతట తానే ఎక్కడో దాగోదు. మరి ధాన్యం అక్రమంగా దాచినవారికి శిక్షలుండవా? ఇప్పటికీ ఆ ప్రశ్న, ప్రశ్నగా మిగిలిపోయింది.
♦️కలం పట్టుకున్న ప్రతివాడు సాహితీవేత్త కాలేడు. సాహిత్యం పట్ల ఆరాధన అంకితభావం కలిగినవారే ఆ స్థాయికి అర్హులుగా లెక్కించబడుతారు. సాహిత్యాని కి అవమానకరమైన రీతిలో ప్రవర్తిస్తూ,, హుందా తనానికి అత్యంత దూరంలో బ్రతికే కొందరు, చెల్లని నాణెల్లా ఎలా మిగిలిపోతున్నారో తెలియజేసే కథలో ఒకడు తనకుతాను గొప్ప రచయితనని ప్రకటించు కుంటాడు.
♦️ కథలు, కవితలు, నవలలు, నాటకాలు ఇలా సవాలక్ష ప్రక్రియల్లో నిత్యం రాస్తూనే వుంటాడు. ఇన్ని రచనలు ఎందుకు చేస్తున్నావని అడిగితే సమాధానంగా 'రాస్తున్నప్పుడు విస్కీ త్రాగినట్లుంటుంది. ఆ మత్తు కోసమే రాస్తున్నాను'' అంటాడు. ఉన్నట్టుండి రచనలు చేయటం ఆపేశాడు. కారణం అడిగితే 'నేను మత్తుకోసం నేరుగా విస్కీ త్రాగుతున్నాను...' అంటాడు. దాంతో కథ ముగుస్తుంది.
♦️ఇలాంటి మనస్తత్వం సాహిత్యానికి బూజులాంటిది. దీన్ని దులపటం కూడా సాహిత్యంలో ఒక భాగమని నమ్మిన మహోన్నత వ్యక్తి రావిశాస్త్రి. ఈ దేశంలో ఆకలీతీరని పేదలు ఎందుకు అలా మిగిలిపోతున్నారో ఆ మర్మాన్ని మనం ఒక పొట్టికథలో చూడవచ్చు.
 ♦️ఒక సెంటర్లో అదొక పెద్ద భోజన హోటల్‌. భారీగా జనం. మోసినంత ఆదాయం. ఎంగిలి అరిటాకులన్నీ హోటల్‌ వెనక కుప్పలుగా పడుతున్నాయి. దారినపోయే ఆవులు వాటిని తిని ఆకలి తీర్చుకుంటున్నాయి. ఆ ఎంగిలి ఆకుల్ని, ఆకులలో మిగిలిపోయిన అన్నాన్ని ఉచి తంగా వీధిలోని ఆవులు తినటం సహించలేక పోయాడు హోటల్‌ యజమాని. ఆ ఎంగిలి కుప్పలకు ధరకట్టి పాలకంట్రాక్టరు ఆవులకు లారీల్లో సరఫరా చేసి, ఆదాయం రెట్టింపు చేసుకున్నాడు. ఉసూరుమన్న ఆవులు ఆకలి చల్లార్చుకునేందుకు గోడలమీది వాల్‌ పోస్టర్లని తినటం మొదలు పెట్టాయి. అది సహించలేని సినిమా హీరోల అభిమాన సంఘాలు, కర్రలు పట్టుకుని వాల్‌ పోస్టర్ల దగ్గర కాపలా కాయటం మొదలు పెట్టారు. తిండిలేక ఆవులు చివరికి తలలు పైకెత్తి 'మా ఆకలికి బాధ్యులెవరు, మా ఆకలిని తీర్చండి' అంటూ దేశాన్ని మొరపెట్టుకున్నాయి.
♦️సరిగ్గా అదే జరుగు తోంది ఇక్కడ కూడా. అధికార లక్ష్యం అభివృద్ది కాదు, బక్కోడి ఆకలి, ఆకలిగానే వుండాలి...ఈ సూత్రమే తారకమంత్రంలా సాగిపోతూవుంది.
బలవంతుడు బలహీనుడు మీద దాడి చేయటం అనాది నుంచి జరుగుతున్న అతి సాధారణ విషయం.
 ♦️ఒక పొట్టికథలో కోడిపిల్లకు ఆకలేసి, తిండికోసం తల్లినడిగింది. అక్కడ పెళ్లి భోజనాలు జరుగుతున్నాయి. దాని ప్రక్కనున్న కుప్పతొట్టిని చేరితే భోజనానికి కొదవుండదు, కావలసినంత తినొచ్చు...దేవుడు దయామయుడు, ఆయనే ఈ మార్గాన్ని మనకు చూపించాడు, పదా...అంటూ బయలుదేరాయి.. సరిగ్గా ఆ సమయంలో ఆకలిగా వున్న తన పిల్లను వెంటపెట్టుకుని ఆకాశంలో ఒక డేగా వచ్చింది. వచ్చీరాగానే కోడిపిల్లను అమాంతం ఎత్తుకుపోయింది.
ఆ కోడిపిల్లను చంపి తన పిల్లకిస్తూ 'దేవుడు దయామయుడు నీ ఆకలిని ఇలా తీర్చాడు...' అంది. అదే సమయంలో దేవుడు ఆనందంగా గుడిలో అభిషేకం చేయించుకుంటూ మురిసిపోతున్నాడు. కాలం డప్పుమీద వాస్తవికత ఉనికిని ధాటిగా చాటింపు వేస్తున్న దృశ్యమిది.
♦️ఉన్నవాడి సంపాదనకు పెట్టుబడి, లేనోడు దాచుకున్న కష్టమే. శ్రమను దోపిడి చేసి ఉన్నవాడు మరింత ఉన్నవాడుగా ఎదుగుతున్నాడు. దోపిడీకి గురికాబడుతున్న వాడు చివరికి నేరస్థుడిగా మిగిలిపోతున్నాడు.
 ఈ వాస్తవాన్ని చెప్పిన కథలో...తన మేనత్త కొడుకు దగ్గర స్నేహితుడోకడు రెండు వేల నగదు దాచుకున్నాడు. ఆ రెండు వేలను ఆ మేనత్త కొడుకు తనకు తెలిసిన వాడికి అప్పుగా ఇచ్చి, ఆ తరువాత వడ్డీతోసహా రాబట్టుకున్నాడు. డబ్బు పెరిగిన తర్వాత ఆ డబ్బు మొత్తాన్ని తన మరదలు పెళ్ళికి మామకే అప్పుగా ఇచ్చి, ఆ అప్పును మామ తీర్చకపోయేసరికి, రెండు గదుల డాబా ఇంటిని వేలం వేయించి, ఆ ఇంటిని తానే కొన్నాడు. తన పెట్టుబడి పైసాలేకుండా ఒక ఇంటికి యజమానయ్యాడు.
మేనత్త కొడుకు దగ్గర డబ్బు దాచుకున్న స్నేహితుడు మాత్రం దివాలా తీసిన బ్యాంకు ముందు దగాపడిన కస్టమర్లలో ఒకడుగా నిలబడ్డాడు. ఇదే, ఇదే మళ్లీ మళ్లీ జరుగుతోంది. యదార్థమైన సన్నివేశాలతో మోసపోవద్దని హెచ్చరిస్తోంది ఈ కథ.
♦️కొన్ని సత్యాలు మానవజీవితాలకు కంటికి రెప్పలాంటివి. ఎవరైనా రెప్పలు అవసరం లేదనుకుంటే మొత్తం చూపు పోయే ప్రమాదం వుంది. ఈ వాస్తవాన్ని మోసుకొచ్చిన కథలో జబ్బులన్నీ పేదోళ్ల వల్లనే వస్తున్నాయని నమ్మిన ఒక రాజు తన ఏకైక కుమారుడ్ని అందరికీ దూరంగా ఒంటిస్తంభం మేడలో వుంచి పెంచాడు. అనుకోకుండా కొడుక్కి పెద్దరోగం తగులుకుంది. కారణాలు వెతికితే, కొడుకు ఒంటిస్తంభం మేడలో ఉన్నాడు కాని, అతడికి సేవలు చేసే సేవకుడు మాత్రం పూరి గుడిసెలో పెత్తల్లి దగ్గర వుంటున్నాడు. అతడి పెత్తల్లికి అ రోగం వుంది. ఆమె ద్వారా సేవకుడికి, అతని ద్వారా రాజ కుమారుడికి ఆ జబ్బు అంటుకుంది. మనం బ్రతికితే చాలదు, మన బ్రతుకు ప్రక్కవాడు కూడా బ్రతికితేనే అది రక్షణ అవుతుంది. ప్రతి బ్రతుక్కి మరో బ్రతుకు తప్పకుండా ఊపిరితిత్తులవుతాయని తెలియజేసిన కథ ఇది.
♦️కొన్ని వాస్తవాలు ఎదుటపడ్డప్పుడు వినోదంగా వుంటుంది కాని, లోపలి పొరలు పైకిలాగితే మూఢనమ్మకాల డొల్లతనం బయట పడుతుంది. ఆ దృశ్యాలను మన ముందుకు తెచ్చిన కథలో అతడు పాతిక సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. బాగా సంపాదించాడు. ముగ్గురు కూతుళ్లకు పెళ్ళి చేశాడు. నాలుగవ కూతురికి పెళ్లి చేయాలి. ఆమెకు మెల్లకన్ను, పైగా విపరీతమైన నత్తి. భారీగా కట్నం ఇవ్వడానికి పాతిక తులాల బంగారం కూడబెట్టాడు. దురదృష్టం ఖాతా పెరిగి ఒకరోజు అనుకోకుండా రాత్రి ఇంట్లో దొంగలుపడి మొత్తం బంగారాన్ని దోచుకుపోయారు. పోలీసులకు రిపోర్టు ఇచ్చాడు. అయినా దేవుడి మీద నమ్మకంతో, ఆయనే కాపాడుతాడని ఎంతో ఆయాసంగా వున్నా, ఆరోగ్యం బాగలేకపోయినా, అన్నీ భరించి కోండమీదనున్న దేవుడి దర్శనానికి వెళ్లాడు. తీరా అక్కడికి చేరేసరికి గుడితలుపులు మూసివున్నాయి. పూజలు చేసేవేళ ఎందుకు గుడి మూసారో తెలియక అక్కడి వాళ్లను అడిగితే అసలు సంగతి తెలిసింది. గతరాత్రే గుడిలో దొంగలు పడి కోటిన్నర విలువ చేసే దేవుడి నగలు దోసుకు పోయారని.
 ♦️ఈ కథ ద్వారా రచయిత మూఢనమ్మకాల నడ్డి విరిగేలా దృశ్య కల్పన చేశాడు. తెలుగు సాహిత్య అభిమానులకు కథా రచయితగా రాచకొండ విశ్వనాథశాస్త్రి ఒక మేరుపర్వతంలాంటి వాడు. అతిచిన్న పొట్టి కథల్లో దట్టమైన విషయాన్ని దట్టించిన రీతి వారికే సాధ్యమయింది. మనిషి మానసిక కల్లోలాల స్థితిలోంచి వెలికితీసిన సత్యాలు సముద్రపు అలల్లా పాఠకులను తాకుతూనే వుంటాయి. ప్రభుత్వాల వైఖరి, వైఫల్యాల చిట్టాలను ఈ పొట్టి కథలు కాగడాల్లా వెలిగించాయి. జవాబులు దొరకని ఎన్నో ప్రశ్నలను ఈ కథలు మోసుకొచ్చాయి. వెతలు, కలతలు, కన్నీళ్లు, దోపిడి, దౌర్జన్యం, దగా, మోసాలు ఏయే రూపాల్లో మనచుట్టూ ఉచ్చులు బిగిస్తున్నాయో ఈ కథల్లో మనం చూడవచ్చు. మానవ తప్పిదాలకు, బలహీనతలకు చక్కటి పాఠాలు కూడా ఈ కథల్లో వున్నాయి. ఈ కథలనిండా వాస్తవికత, సజీవత పెనవేసుకుని, ఆరోగ్యకరమైన ఆలోచనా మార్గాలను లోకానికి అందిస్తున్నాయి. ఈ పొట్టి కథలలోని పాత్రలు, వాటి బుద్ధులు అన్నీ మన రూపాలే. వాటిని కాలం కొలిమిలో సానబెట్టుకోవలసిన బాధ్యత మాత్రం ఇంకా మనకు మిగిలేవుంది.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩