🚩🚩-మహాత్తరు సాయిబు!


🚩🚩-మహాత్తరు సాయిబు!

     

 ♦️ఆయన కంటే ముందే ఆయన అత్తరు వాసన ముక్కులకు తగిలి ,అత్తరు సాయిబు గారు వస్తున్నాడని తెలిసి పోయేది .సందు చివర్నించే ఆ సువాసన ముక్కులను తాకేది .అదీ ఆయన ప్రత్యేకం .భారీ పర్స నాలిటి .గళ్ళ లుంగి ,పొడవైన అంగరఖా ,మెడకు అటు ఇటు ,వేలాడే సత్తుతో చేసిన ,బుల్లి మూతి తో పెద్ద  ,  అత్తరు బుడ్లు,ఇవి కాక రంగుల పూసల గొలుసులు ,చంకలో సెంటుసీసాలు వున్న చెక్క పెట్టె ,అందులో సుర్మా సీసా ,కళ్ళ లో సుర్మా పెట్టె చిన్న  ఇనప కడ్డి.ముందు ఖాళీ గా వున్న బూట్లలాంటి చెప్పులు .చేతిలో కర్ర .ఇదంతాచూస్తే  ఒక కాబూలీ వాలా లాగ అని  పిస్తాడు .ఆకారం లో మాత్రమే .స్వభావం లో మాత్రం కాదు .గంభీర మైన స్వరం ,  .తెల్ల ,నల్లా వెంట్రుకల పొడవైన  చిక్కని గడ్డం  .గల గలా మాట్లాడే చురుకు దనం .”సుర్మా ,అత్తరు,మందార నూనె , సెంటు ”అని అరుస్తూ వచ్చే వాడు .అప్పటికే ఆయన వయసు అరవై పైనే వుండేది .పేరు ఎవరికీ తెలీదు .అత్తరు సాయిబు అనే అందరం పిల్చే వాళ్ళం .మాకే కాదు వూళ్ళో అందరికి అత్తరు సాయిబే ఆయన .ఆయన అత్తరు మాత్రం మహత్తరం .

♦️సాదారాణం గా మా ఇంటికి పది హీను రోజులకో సారి రావటం అలవాటు .ఆది వారాలే వచ్చే వాడు .ఆయన రాగానే మా సావిట్లోకి వచ్చే వాడు .అక్కడే చాప వేసే వాళ్ళం .దాని మీద తన సరంజామా అంతా దింపి కూర్చునే వాడు .వరుసగా తాను తెచ్చిన వివిధ రకాలైన అత్తరులు వాసన చూపించే వాడు .మా చొక్కాలకు ,ఆడ వాళ్లకు చీర చెంగులకు రాసి, వాసన చూడ మనే వాడు .అన్నిటి కంటే ఆయన ”మందార నూనె ”కు మంచి గిరాకీ వుండేది .మా అమ్మతప్పక మందార నూనె కొనేది -మా అక్కయ్యల కోసం .మేము రాసుకొనే వాళ్ళం .సెంటు సీసాల మూతలు తీసి ,రాసే వాడు .మొగలి సెంట్ ,గులాబి సెంట్ ,మల్లె సెంట్ వగైరా ఉండేవి .కొంటె వాటిని చిన్న సీసాలో పోసి గట్టి మూత పెట్టి ఇచ్చే వాడు .అతను వచ్చాడంటే అందరికి సందడే .ఆయన కేక విని ,పక్కింట్లో వుండే మా మామయ్య గుండు గంగయ్య గారు వచ్చే వాడు .వాళ్ళిద్దరూ తురకం లో మాట్లాడు కొనే వారు .మామయ్యకు అ భాష బాగా తెలుసు .సాయిబు గారు మాత్రం తురకం ,తెలుగు మిశ్రమ గా మాట్లాడే వాడు . మామయ్య నాతొ ”ఒరేయ్ !అత్తరు కొనాలి” రాచిప్ప” తీసుకూరా పోయిన్చుకొందాం”అనే వాడు .నవ్వు కొనే వాళ్ళం .సాయిబు గారు కూడా ”క్యా సాబ్ -అత్తరికీ రాసిప్పా ఏంటి శాస్త్రి జీ ”అని నవ్వే వాడు .అతనితో సరదా చేయటం మామయ్యకు హాబి .నేను సెంటు కొంటాను వాసన  చూపించమనే  వాడిని . పాపం అన్నీ మూతలు తీసి నా చొక్కాకి పూసే వాడు .ఏదీ బాగా లేదనే వాడిని .కొనటం కన్నా ,పూయిన్చుకోవటం సరదా ”.వాసన ఎలా వుంది ”?అని అడిగే వాడు ”.ఏం బాగా లేదు”

అనే వాణ్ని .ఇంకోటిచూపించే వాడు .దానికీ అదే సమాధానం .కోపం వచ్చేది సాయిబు గారికి ”అరె భాయ్  !నీ ముక్కుల్లో సొరకాయల వాసన ,బీర కాయల వాసన ,తప్పా ఇంకే వాసనా లేదు .నీకూ సెంటూ వాసనా యెట్లా తెలుస్తుందీ -అరె క్యా !ఇన్ని సేంట్లల్లో ఒఖాటి కూడా నీకు నచ్చటం లేదా ?.కొనే బేరమేనా ఇది ?”అని కోప్పడే వాడు .నవ్వుకోవటమే మా పని .ఏదో కొంత అమ్మా వాళ్ళు తెసుకొనే వారు .

♦️అత్తరు సాయిబు కే ”సుర్మా సాయిబు ”అనే పేరుంది .నల్లటి బరక గా వుండే సుర్మా ఆయన దగ్గర వుండేది .కళ్ళల్లో కొయ్య గండలు వస్తే ,ఆ కాలమ్ లో సుర్మా పెట్టు కొనే వారు .సాయిబు రాగానే ఇంటిల్లి పాదికి తన దగ్గర వున్న సుర్మా ను చిన్న కడ్డీ తో కళ్ళల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి కింద రెప్ప లోపల లాగుతూ పెట్టె వాడు .అలాగే పై రెప్పకు పెట్టె  వాడు .కళ్ళు మండేవి .నీళ్ళు ధారా పాతం గా కారేవి .బాగా కారాయి అంటే కంట్లో దోషం బాగా ఉందన్న మాట .విసుగు అను కోకుండా అందరి కళ్ళల్లో సుర్మా పెట్టె వాడు .అందరు ఏడుపు సీన్ లో వున్నట్లు వుండేది .రూపాయకో ,రెండు రూపాయలకో సుర్మా కొనే వాళ్ళం .చిన్న సీసా లో పోసి ఇచ్చే వాడు .మనం పెట్టు కుంటే చేతి తోనే పెట్టు కోవటం .ఆయన మాత్రం చాలా నాణ్యం గా ,మెలకువ గా కళ్ళ కేమీ ఇబ్బంది లేకుండా కడ్డీ తో పెట్టె వాడు .నాకు మాత్రం పెడుతుంటే భయం వేసేది .అది కళ్ళలో ఎక్కడ గుచ్చు కుంటుందో నని భయం .అయినా చాలా సరదాగే వుండేది .కొన్న సుర్మాని రాత్రుల్లలో నిద్ర పోయే ముందు అమ్మ మా కళ్ళలో పెట్టేది .మా అమ్మ కూడా చూపుడు వేలి మీద సుర్మాను తీసుకొని ,అతి జాగ్రత్తగా కళ్ళలో పెట్టేది .సుర్మా పెట్టిన తరువాత ,కళ్ళు మూసు కోవాలి .నీళ్ళు అన్నీ కారేదాకా  రెప్పలు తెరువ రాదు .తెరిస్తే వూరు కొనే వాడు కాదు    .నీళ్ళు అన్నీ కారిన తర్వాత కళ్ళు చాలా చల్లగా ఉండేవి .కళ్ళలోని దుమ్ము , సుర్మా తీసేసి కళ్ళను శుభ్రం చేసే దేశీయ మైన మందు .సాయిబు గారే దాన్ని ఇంటి దగ్గర తయారు చేసే వాడట .అలాగే అత్తరులను కూడా ఇంటి దగ్గర కార్ఖానా లో తయారు చేసే వాడట .గులాబి రేకులు ,మందార పూలు ,మల్లె పూలు ,మొదలైనవి సేకరించి చక్కగా వీటిని వండి తయారు చేసే వాడట .అదొక కుటీర పరిశ్రమ గా ఆయన నిర్వహించే వాడన్న మాట .ఆ రోజుల్లో బందరు లో కోనేరు సెంటర్  దగ్గర చుట్టూ ,అత్తరు, సెంట్లు అమ్మే దుకాణాలు ఉండేవి .ఒక వేళ ఎవరైనా,అక్కడ కొని తెస్తే ,మా సాయిబు గారి సరుకు ముందు బలాదూరు గానే ఉండేవి .మాకు నచ్చేవి కావు . .దాదాపు ఎనభై  ఏళ్ళు వచ్చేదాకా సాయిబు గారు ఇంటింటికీ తిరుగుతూ అత్తరు సెంటు ,పన్నీరు సుర్మా ,అమ్ముతూనే వుండే వాడు .వీటితో పాటు అగరు వత్తులు ,తయారు చేసి అమ్మే వాడు .కొనే వాళ్ళం .ఆయన ఇల్లు ఎక్కడో మాకు తెలీదు . .

ఈ ఆర్టికల్ రాసే ముందు ఆయన గురించి ఇంకేమైనా వివరాలు తెలుస్తాయేమో నని ప్రయత్నించాను .కాని ఎవరికి తెలీదన్నారు .నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ,వాళ్ల అబ్బాయిలకు మార్కెట్ లో కూర గాయల కొట్టు వుండేది .ఒకతను పహిల్వాన్ గా కుస్తీ పోటీలలో పాల్గొనే వాడని జ్ఞాపకం .ఇంకో అతను వెడల్పు ముఖం తో కొట్లో కూచుని కూర గాయలు అమ్మే వాడు .నేను వెళ్తే చాలా మర్యాద గా మాట్లాడి ,అందరి కంటే తక్కువ ఖరీదుకే కూరలు ఇచ్చే వాడు . ఇప్పుడు ఉయ్యూరు లో వాళ్ల వాళ్ళెవరు లేరని తెలిసింది ..పేరుతెలీక   పోయినా సాయిబు గారి అత్తరు ఇంకా ముక్కుల్లో గుబాళి స్తూనే వుంది .ఆయన  పెట్టిన సుర్మా ఇంకా కళ్ళలో నీరు కారిస్తూ ,చల్లదనం కలిగిస్తూనే వుంది . ఇంకా ఆయన రూపం కళ్ళకు కట్టి నట్లు కని పిస్తూనే వుంది . ఆయన మాటలు జ్ఞాపకం వస్తూనే ఉనాయి .మామయ్యా ,ఆయన మేల మాడుకోవటం గుర్తు వస్తూనే వుంది .మా ఇంటిల్లి పాదికి అత్తరు సాయిబు గారు మహత్తరం గా జాపకం వున్నారు . .ఆయనను గుర్తుంచుకొనే అదృష్టం నాకు కల్గినందుకు ఆనందం గా వుంది …

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –08 -01 -12 .


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐