గోపయ్య నల్లనా.. ఎందువలనా?


.

"అమ్మా.."  

"ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని. 

"నాకు కోపమొచ్చింది"

"కోపం అంటే ఏంటి, కన్నయ్యా?"

"ఏమో! వచ్చింది. అంతే!" 

"సరే, వచ్చింది లే!"

"ఉహూ, ఎందుకూ? అని అడుగు"

"హ్మ్"

"హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి"

"అడిగాను లే , చెప్పు"

"నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు."

"పోన్లే, అన్నేగా!"

"వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు."

"నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు."

"మరి నువ్వూ తెల్లగా ఉంటావూ!"

"అయితే!"

"అందరూ తెల్లగానే ఉంటారు. నా అంత నల్లగా ఎవరూ ఉండరు." 

"నీ అంతవాడివి నువ్వే కన్నా!"

"అంటే?"

"గొప్పవాడివనీ.."

"గొప్ప కాదు నల్లవాడినట."

"అయితే ఏం? నీ కళ్ళంత అందమైన కళ్ళు ఎవరికైనా ఉన్నాయా? నీ జుత్తు చూడు ఎంత నల్లగా, పట్టు కుచ్చులా ఉందో!" 

"జుత్తు కాదు అమ్మా.. నల్ల నల్ల వాడిని ఎందుకూ? చూడు, నువ్వు తెలుపు. పాలు తెలుపు. వెన్న తెలుపు. మీగడా తెలుపు. నాకు పాలబువ్వ తినిపిస్తావే ఆ వెండి గిన్నె తెలుపు. ఆ.. పాల బువ్వా తెలుపే! చందమామా తెల్లగానే! నా ముత్యాల పేరూ, కడియాలూ కూడా తెలుపు. ఇదిగో ఈ బృంద కూడా తెలుపే." దగ్గరికి వచ్చిన పెయ్యని చేత్తో తోసేస్తూ చెప్పాడు.

"ఇన్ని తెల్లగా ఉన్నాయే! మరి పాపం నల్లగా ఎవరుంటారు నాన్నా!"

"అంటే!"

"నలుపు నిన్ను శరణంది తండ్రీ! ఇందరు వద్దన్న నలుపుకి నువ్వు వన్నెనిచ్చావు." 

"ఏమో! అర్ధం కాలేదు."

"ఇటు చూడు బంగారూ! నీకు ఇష్టమైన ఆట ఏది?"

"దాగుడు మూతలు. భలే ఇష్టం నాకు."

"కదా! మరి వెన్నెల్లో దాగుడు మూతలు ఆడితే ఎప్పుడూ ఎవరు గెలుస్తారూ?"

"నేనే! నేనే!"

"చూసావా! తెల్లని వెన్నెల్లో నువ్వు ఇంకా తెల్లగా ఉంటే, టక్కున పట్టుబడిపోవూ ఋషభుడిలాగ."

"హ్హహ్హా.. ఋషభుడు ఎప్పుడూ మొదటే బయటపడిపోతాడు. అవును."

"అందుకని, నువ్వు నల్లగా ఉన్నావన్నమాట. "

"అవునా!"

"హ్మ్.. "

"భలే! పాలు ఇవ్వమ్మా.. తాగేసి ఆడుకోడానికి వెళ్తాను."

"ఇంకా చీకటి పడలేదు కన్నా! చీకటి పడనీ. అప్పుడు వెళ్దువుగాని వెన్నెల్లో ఆటలకి."

"చీకటి అంటే ఏమిటీ?"

"చీకటి అంటే, ఏమీ కనిపించదు."

"ఓహో, ఏమీ కనిపించకపోతే చీకటా?"

"అవును."

"అయితే, నాకు ఏమీ కనిపించట్లేదు చూడూ" కళ్ళు మూసుకొని చెప్పాడు అల్లరి కృష్ణుడు.

ఫక్కున నవ్వి, వెండి కొమ్ము చెంబుతో వెచ్చటి గుమ్మపాలు తెచ్చి ఇచ్చింది అమ్మ. 

తాగేసి, పాలమూతి అమ్మ చీరచెంగుకి తుడిచేసుకొని, ఆడుకోడానికి వెళ్ళిపోయాడు కన్నయ్య.   

(మా అమ్మ చెప్పిన కథ. సంత్ సూరదాస్ కవితట.

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐