🚩🚩క్షీరసాగర మథనం.🚩🚩

🚩🚩క్షీరసాగర మథనం.🚩🚩

♦️దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణం లోని బాలకాండ లోను మహాభారతం లోని ఆది పర్వము లోను కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలు లలో కూడా చెప్పబడింది. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది,



♦️క్షీరసాగర మథనానికి పూనుకోవడానికి కారణం

రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి "ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి" అని చెబుతాడు. "ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి. త్రాడు గా వాసుకి ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి" అని విష్ణువు సెలవిస్తాడు.

ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే బలి చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.

♦️క్షీరసాగర మథనం ప్రారంభించడం

♦️మందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరములో వదిలాడు. వాసుకిని ప్రార్థించి వాసుకికి అమృతంలో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరితో మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది. ఆరొదకు ఎన్నో జీవరాశులు మరణించాయి.

🤎ఎడమ గుడు మనువు దిరుగుచు

గుడి నెడమను వెనుక దిరుగు కులగిరి కడలిన్

గడ వెడాల సురలు నసురులు

🚩🚩హాలాహలం పుట్టడం- శివుడు ఆ మహావిషాన్ని సేవించడం.

♦️అలా చిలుకుతుండగా ముదు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలంగా స్వీకరించుమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కాని, గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవదం కోసం నిత్యం నెత్తి పైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు. అక్కడికీ తాపం అణగడానికి క్షీరసాగర మథనం లోనుంచి పుట్టిన చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకొన్నాడు; గంగమ్మతల్లిని నెత్తిపైన ఉంచుకొన్నాడు. అయినా తాపం ఇబ్బంది పెడుతోనే ఉంటుందిట శివుడిని. కనుకనే, భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు.

🤎దొడితోడొ ఫణిఫణము మొదలు దెది యును దిగువన్

భూతాత్మ!భూతేశ!భూతభావనరూప!దేవ!మహాదేవ! దేవవంద్య

యీలోక ములకెల్ల నీశ్వరుండవు నీవ బంధ మోక్ష ములకు బభ్రడ వీప

యార్త శరణ్యండదగు గురుండవు నిన్ను గోరి భజింతురు కుశలమతులు

సకల సృష్టి స్థితిసంహార కర్త వై బ్రహ్మవిష్ణు శివాఖ్య బరగు దీవు

పరమ గుహ్యమైఅన బ్రహ్మంబు సదసతామంబుయ్ నీవశక్తి మయుడవీవ

శబ్ధ యోని విపరీత జగదంతరాత్మవు నీవ ప్రాణ మరయు నిఖిలమునకు

🤎నీయందు సంభవించును

నీయందు వసించి యుండు నిఖిల జగంబుల్

నీయంద లయము బొందును

నీయుదరము సర్వభూత నిలయము రుద్రా

🤎శిక్షింతు హాలహలమును

భక్షింతును మధూర సూక్ష్మ ఫలరసము క్రియన్

రక్షింతు బ్రాణికోట్లను

వీక్షింపుము నేడు నన్ను వికచాబ్జముఖీ

🤎మ్రింగెడివాడు విభుండని

మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్

మ్రింగుమనె సర్వమంగళ

మంగళసూత్రమ్ము నెంత మది నమ్మినదో



♦️ఆ తరువాత దేవదానవులు మళ్ళీ క్షీరసాగర మథనం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా కామధేనువు పుట్టింది. తరువాత ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, మహాలక్ష్మి పుడతారు. కామదేనువును, కల్పవృక్షాన్ని, ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకొంటాడు. ఉచ్చైశ్రవాన్ని బలి చక్రవర్తికి ఇస్తారు.

♦️క్షీరసముద్రంలో లక్ష్మీదేవి .

♦️తొలుకారు మెఱుఁగు కైవడి

తళతళ యని మేను మెఱయ ధగధగ యనుచున్

గలుముల నీనెడు చూపుల

చెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టె నృపా!

పాలమున్నీటిలోపలి మీఁది మీగడ మిసిమి జిడ్డునఁజేసి మేనువడసి

క్రొక్కారుమెఱుఁగుల కొనల తళుక్కుల మేనిచేగల నిగ్గుమెఱుఁగు చేసి

నాఁడునాఁటికిఁ బ్రోది నవకంపుఁ దీఁగెల నునుఁబోద నెయ్యంబు నూలుకొలిపి

క్రొవ్వారు కెందమ్మి కొలఁకులఁబ్రొద్దునఁ బొలసిన వలపులఁ బ్రోదివెట్టి

పాలసముద్రపు మీది మీగడతో బ్రహ్మ లక్ష్మీదేవి శరీరాన్ని చెసాడట...క్రొమ్మేఘపు మెరుపులు ఆమె మేను మెఱుగుగా కుర్చడట..

పసిఁడిచంపకదామంబు బాగుఁ గూర్చిబ్రాలు క్రొన్నెల చెలువున వాఁడి దీర్చి

జాణతనమునఁ జేతుల జిడ్డివిడిచి నలువ యీ కొమ్మనొగిఁజేసినాఁడు నేడు

మహాలక్ష్మి పుట్టినవెంటనే ఆమెకు మంగళస్నానము చేయిస్తారు.

♦️కట్టంగ పచ్చని పట్టుపుట్టము దోయి ముదితకుఁ దెచ్చి సముద్రుఁడిచ్చె

మత్తాళినికరంబు మధు వాన మూఁగిన వైజయంతీమాల వరుణుఁడిచ్చెఁ

గాంచన కేయూర కంకణ కింకిణీ కటకాదులను విశ్వకర్మ యిచ్చె

భారతి యెక మంచితారహారము నిచ్చెఁబాణిపద్మము నిచ్చెఁబద్మభవుఁడు

♦️సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు. విశ్వకర్మ సువర్ణ అలంకారలు ఇస్తాడు. ఆమె వైపే ఓర చూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి (శ్రీదేవి), దేవదానవులతో, "మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు. శ్రీమహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళి గా ఉంటాను" అని చెప్పి మహావిష్ణువు మెడలో పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు కౌస్తుభమణిని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభమణితో పాటు మహాలక్ష్మిని తన వక్ష స్థలం పై విరాజిల్లచేశాడు.

♦️మ్రోసెన్ శంఖ మృదంగ వేణు రవముల్ మున్నాడి పెంజీఁకటుల్

వాసెన్ నర్తన గానలీలల సురల్ భాసిల్లిరార్యుల్ జగ

ద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ దల్లింగమంత్రంబులం

బ్రాసక్తిన్ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచున్

♦️దేవదానవులు మళ్లీ మథనం ఆరంభించారు. అప్పుడు వారుణి (సుర లేదా కల్లు) పుట్టింది. వారుణి తమకు కావాలని రాక్షసులు అడుగగా వారుణిని దానవులకు ఇస్తారు. క్షీరసాగర మథన సమయంలో ఎన్నో అనర్ఘమైన వస్తువులు ఉద్భవించాయి. అన్నింటినీ దేవతల లోని ముఖ్యులు పంచుకున్నారు. రాక్షసులకు మాత్రం సురాభాండాన్ని ఇచ్చారు, స్వేచ్ఛగా సురను త్రాగి, సాగర మథనం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి (కాబోలు) .

♦️క్షీరసాగర మథన సమయం లో పుట్టిన అనర్ఘ రత్నాలు

సురాభాండం, కల్లుకు అధిదేవత

అప్సరసలు - రంభ, మేనక, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోష

కౌస్తుభము, అమూల్యమైన మాణిక్యం

ఉచ్చైశ్రవము, ఏడు తలల దేవతాశ్వము

కల్పవృక్షము, కోరిన కోరికలు ఇచ్చే చెట్టు

కామధేనువు, కోరిన కోరికలీడేర్చే గోమాత, సకల గో సంతతికి తల్లి

ఐరావతము, ఇంద్రుని వాహనమైన ఏనుగు

లక్ష్మీదేవి, ఐశ్వర్య దేవత

పారిజాత వృక్షము, వాడిపోని పువ్వులు పూచే చెట్టు

హాలాహలము, కాలకూట విషము

చంద్రుడు, చల్లని దేవుడు, మనస్సుకు అధిదేవత

ధన్వంతరి, దేవతల వైద్యశిఖామణి

అమృతము, మరణము లేకుండా చేసేది.

ధన్వంతరి అమృత కలశం తో పుట్టడం-మహావిష్ణువు మోహిని అవతారం దాల్చడం

♦️ఆ తరువాత ధన్వంతరి అమృత కలశంతో ఆవిర్భవిస్తాడు. అమృతాన్ని చూడగానే దానవులు ఒకరి మీద మరొకరు పడి కొట్టుకోవడం ఆరంభించారు. దానవులు కొట్టుకోవడంతో అమృతం చేతులు మారి పోతోంది. దేవతలు దీన వదనులై శ్రీమహావిష్ణువుని ప్రార్థించారు. శ్రీమహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారం ఎత్తి ఆ దానవుల వద్దకు వస్తాడు. జగన్మోహినీ రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు ఒలక పోసుకొంటూ అటు ఇటు తిరుగుతుంటే రాక్షసులు ఆ జగన్మోహిని వెంటబడి అప్పటి వరకు జరిగిన గాథ చెప్పి దేవదానవులు అన్నదమ్ములు అవుతారని, సాగర మథనం వల్ల అమృతం వచ్చిందని, ఆ అమృతాన్ని వారిద్దరకి పంచమని కోరుతారు. అప్పుడు ఆ జగన్మోహిని దేవదానవులను రెండు పంక్తులలో కోర్చోబెట్టి, దర్భలమీద అమృతకలశాన్ని పెట్టి, దేవతలకు అమృతం పోస్తూ, దానవులను తన వయ్యారాలతో మభ్యపెట్టింది. రాహువు అనే రాక్షసుడు అది గ్రహించి దేవతల పంక్తిలో కూర్చొంటాడు. ఆ విషయాన్ని సూర్యచంద్రులు సంజ్ఞ ద్వారా మహావిష్ణువు (జగన్మోహిని) కి తెలుపగా విష్ణువు సుదర్శన చక్రముతో వాడి తల తెగ నరికాడు. ఆ విషయం ప్రక్కన ఉన్న దానవులకు తెలియలేదు. అమృతం పంచడం అయిపోయింది. జగన్మోహిని అదృశ్యమై పోయింది.

♦️సూర్య, చంద్ర గ్రహణాలు

కాని అప్పటికే అమృతం తీసికొని ఉన్నందున రాహువు చావలేదు. తల, మొండెము విడిపోయి, తల రాహువు గాను, మొండెము కేతువు గాను పిలువబడుతూవచ్చారు. సూర్య, చంద్రులు అపకారం చేశారనే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం రాహు, కేతువులు సూర్య, చంద్రులను మ్రింగటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనినే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం అంటాము.

♦️పాములకు రెండు నాలుకలు

జరిగిన విషయం అంతా చూసి, వాసుకి తెల్లపోయాడు. క్షీరసాగర మథన సమయంలో, కవ్వానికి త్రాడుగా ఉన్నందుకు తనకు వాటాగా ఇస్తానన్న అమృతం రాకపోయేసరికి, ఏమీ చెయ్యలేక, అమృత కలశం పెట్టిన చోటికి వెళ్లి, దర్భలను నాకేడు, వాటిమీద ఏమైనా అమృతం పడిందేమోనని. అమృతం దక్కలేదు కాని, దర్భల పదునుకి నాలుక నిలువునా చీరుకు పోయింది. అప్పటినుంచీ, వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువునా చీరుకుని ఉండి, రెండు నాలుక లున్నట్లుగా అనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩