🌹💥మనుచరిత్ర💥🌹 ❤️ ❤️ ప్రవరాఖ్యుడు ❤️ ❤️




🌹💥మనుచరిత్ర💥🌹

❤️  ❤️  ప్రవరాఖ్యుడు ❤️  ❤️

♥️♦️

ఉ. ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్‌

జక్కఁదనంబునన్‌ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం

బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్‌

డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్‌.♥️.

🌺🌺🌺🌺🌺

♦️ఆంధ్ర సాహిత్యములో రామాయణ, మహాభారత, భాగవతముల

తర్వాత అత్యధిక ప్రాచుర్యమును పొందిన కావ్యము,

ఆంధ్రకవితా పితామహుడుగా పేరు గడించిన అల్లసాని పెద్దనగారి 

అద్వితీయ ప్రబంధంమనుచరిత్రము.

♦️ఈ కావ్యము తదనంతర కాలములో వెలువడిన అనేక ప్రబంధములకు మార్గదర్శకమై, తలమానికంగా అలరారింది.

మనుచరిత్ర 6 ఆశ్వాసాల మహాప్రబంధం అయినప్పటికీ,

మొదటి 3 ఆశ్వాసాలే సారస్వతాభిమానులను అమితంగా ఆకట్టుకుని, వారిని రసజగత్తులో ఓలలాడించినవని చెప్పుటలో ఏమాత్రం

సందేహం లేదు.

♦️పెద్దన కవీంద్రుల లేఖినిలో ప్రాణం పోసుకున్న 2 అద్భుతమైన సజీవపాత్రలు మన కనుల ముందు కదలాడుతూ, తమతో పాటు మనలను కూడా హిమాలయసానువుల్లోకి లాక్కెళతాయి.

ఆ 2 పాత్రల్లో మొదటిది -ప్రవరుడు;రెండవది -వరూధిని.

♦️ఆర్యావర్తములోని అరుణాస్పదపురము అనే గ్రామములో నివసిస్తున్న బ్రాహ్మణ యువకుడు ప్రవరుడు. నియమబద్ధంగా పరమ నైష్ఠిక జీవితాన్ని గడుపుతున్న ఒక ఆదర్శ గృహస్థు. ...

.♦️ఇక - వరూధిని ఒక అప్సరస. అద్భుత సౌందర్యరాశి, 

అపురూప లావణ్య వారాశి.

విధివైచిత్రి వలన వీరిద్దరూ అనూహ్యమైన రీతిలో, మనోహరమైన మంచుకొండల మధ్యలో, అనగా మనోజ్ఞమైన హిమగిరుల సుందరసీమలో పరస్పరం తారసిల్లుతారు. అతిలోకసుందరియైన ఆ అచ్చర ప్రవరాఖ్యుని సౌందర్యవిభవం చూసి, అతనిపై మనసుపడుతుంది..... ప్రవరుడు అందములో ఆమెకు ఏమాత్రమూ తీసిపోడు మరి!

♦️ప్రవరుణ్ణి మనకు పరిచయం చేసే ప్రారంభపద్యములోనే

పెద్దనగారు అతణ్ణి ఆలేఖ్య తనూవిలాసుడు అనీ,మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి అనీ వర్ణిస్తారు. ఆలేఖ్య తనూవిలాసుడు అంటే లిఖించడానికి లేదా చిత్రించడానికి అలవికాని రూపసంపద కలవాడని అర్థం.

ఇకపోతే, మకరాంకుడంటే మన్మథుడు; శశాంకుడంటే చంద్రుడు. వారిద్దరితో సరితూగగల సుందరాకారుడని అర్థం.

♦️కనుకనే వరూధిని అతణ్ణి చూసి

ఎక్కడివాడొ ! యక్షతన యేందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువజాలినవాడు! అనుకుని, అతనిపై మరులుగొంటుంది. ( యక్షతనయుడు అనగా యక్షులకు రాజైన కుబేరుని పుత్రుడు నలకూబరుడు.

ఇతడు చాలా సౌందర్యవంతుడని ప్రసిద్ధి. ఇందుడంటే చంద్రుడు. జయంతుడు దేవేంద్రుని కుమారుడు. ఇతడు సైతం చాలా అందగాడని చెప్తారు. వసంతుడు మదనుని చెలికాడు.

ఇక కంతుడంటే సాక్షాత్తూ మన్మథుడే ! )

♦️ప్రవరుడు మాత్రం వరూధిని వన్నెలకు, వయ్యారాలకు ఏమాత్రం విచలితుడు కాకుండా, ఆమెను సమీపించి,

తాను ఆ పర్వతాలలో దారి తప్పాననీ, తమ ఊరికి త్రోవ చూపి పుణ్యం కట్టుకోమనీ ఆమెను అర్థిస్తాడు. వరూధిని ఎన్నో రకాలుగా అతణ్ణి తనవైపు ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని, నియమ నిష్ఠలతో జీవితం సాగించే ఆ బ్రాహ్మణుడు ఆమె దారికి రాడు.

♦️అపురూప సౌందర్యరాశి, అపరరంభయైన వరూధిని ఆనాటి పాఠకులను వెఱ్ఱెత్తించి వుండాలి...... పురుషుడు స్త్రీవెంట పడటమేగాని, స్త్రీ పురుషునివెంట పడటం చూసివుండని అప్పటి రసికులు అంతులేని తమకముతో వరూధిని వెంట పడివుండాలి.

♦️వరూధిని కేవలం విలాసిని మాత్రమే కాదు. వివేకవంతురాలు కూడా! మంచి మాటకారి. తన అందచందాలన్నీ ప్రవరుడిని ఆకర్షించడంలో విఫలం కాగా, తన వాదనాపటిమతో అతణ్ణి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నములో సైతం ఆమెకు సాఫల్యం సిద్ధించదు. ఇంక చివరి ప్రయత్నంగా సిగ్గువిడిచి, అతణ్ణి కవ్వించి రెచ్చగొట్టడానికి అమితమైన మోహముతో అతని పైనబడి కౌగిలించుకుంటుంది. పరమ నైష్ఠికుడైన ఆ బుద్ధిమంతుడు హా శ్రీహరీ ! అని ఓరమోమిడి, ఆమెను తొలగద్రోస్తాడు........ అటుపిమ్మట, అగ్నిదేవుని ప్రార్థించి, ఆయన కరుణతో తన స్వగ్రామానికి వెడలిపోతాడు.

♦️పై ఘట్టములు చదువుతున్నంతసేపు పాఠకులు ఎంతో ఉత్కంఠకు లోనవుతారు. ఆ ఇరువురిలో ఎవరిది పైచేయి అవుతుందోనని ఉద్విగ్న హృదయాలతో మనస్సును ఉగ్గబట్టుకుని కావ్యాన్ని పఠిస్తారు. వరూధిని ఎంత కవ్వించినా, ఆమె శృంగారచేష్టలకు అణుమాత్రమైనా చలించని ప్రవరుని నిగ్రహాన్ని చూసి నిర్ఘాంతపోతారు. ఎందుకంటే, ఆనాటివరకు వారు చూసిన కావ్యనాయకులందరూ శృంగారపురుషులే ! ఇంతటి విచిత్రప్రవృత్తికలిగిన నాయకుణ్ణి వారు ఎప్పుడూ కనీ, వినీ యెరుగరు.

చివరకు శాంతమే జయించినది. శృంగారం పరాజయం పొందినది. ధర్మం ముందు కామం తలవంచినది. ధర్మవీరుడైన ప్రవరుని స్థైర్యం చెక్కుచెదరలేదు. అతని ధర్మనిష్ఠ మొక్కవోలేదు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐