🖤అరికాళ్ళకింద మంటలు-శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి!🖤

 

♦️.ఆ రోజుల్లో బాల్యవివాహాలు చేసిన ఆడపిల్లల్లో చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన దురదృష్ట వంతులైన ఆడపిల్లల దీనస్థితికి, 
ఈ కధ అద్దం పడుతుంది.వైధవ్యానికి గురైన ఆడపిల్లల్లో కొందరు పుట్టింట పెత్తనం చేపట్టి చక్రం తిప్పడాన్ని ఇల్లు పట్టిన వెధవాడబడుచు కధ వివరిస్తుంది.
♦️దానికివిరుద్ధంగాకొందరుఆడపిల్లలుతోటిఅక్కచెల్లెళ్ళు,అన్నదమ్ములు,అమ్మమ్మ చివరకు సొంత తల్లిదండ్రుల వలననే వివక్షకు గురై,రాత్రీ పగలూ ఇంటెడు చాకిరీతో దిగ్గుళ్ళిపోవటాన్ని ఈ అరికాళ్ళకింద మంటలు అనే కధ మనకు తెలియచేస్తుంది.!!
ఇది ఎంతో హృదయవిదారకమైన కధ!!
♦️బాలవితంతువైన రుక్కుమన మనసులను ఎంతగా కదిలిస్తుందంటే,మనం చటుక్కున కధలోకి ప్రవేశించి,రుక్కును వేధిస్తున్న అక్కచెల్లెళ్ళు,అమ్మమ్మ తదితర కుటుంబసభ్యుల నుండి కాపాడి,మనింట్లో దాచి పెట్టి రక్షణ కల్పిద్దాం అని ఉద్రేక పడేంతగా మన మనసులను కదిలిస్తుంది!!
సరే,కధలోకి ప్రవేశిద్దాం!!
#రుక్కుబాల వితంతువు!చిన్నతనంలోనే భర్తను కోల్పోయి
కన్నవారింట్లో జీతం,బత్తెం లేని చాకిరీ చేస్తున్దురదృష్టవంతురాలు!
♦️ఆమెమీద కనికరంలేని కుటుంబ సభ్యుల దార్టీకంతో కధ మొదలవుతుంది.ఫలనా పాత్రస్వభావం ఈ విధంగా ఉంటుంది అనే వివరణ వీరి కధల్లో మనకు గోచరించదు.సంభాషణల వలననే పాత్రల స్వభావాలు కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించడం వీరి ‌రచనలలోని ప్రత్యేకత!
♦️ఇంటెడు పనై,అందరికన్న ఆఖరుగా భోజనం చేసి రుక్కు
 కొద్దిపాటి విరామంకోసం కూర్చోవటం నచ్చని ఆమె అమ్మమ్మ రుక్కుని గంధం తీయమని పురమాయించటంతో ఈ కధ ప్రారంభమవుతుంది!
♦️రుక్కు అమాయకంగా పెద్దబావ నిన్నే వెళ్ళిపోయాడు కదా?
ఇక గంధం ఎవరికోసం అని అడగగా ఆమె కోపంతో పళ్ళు కొరుకుతూ,నా కూతురూ అల్లుడూ,(అంటే రుక్కు తల్లీ తండ్రీ) లేరూ?
వాళ్ళేమన్నా ముసలాళ్ళా,ముతకాళ్ళా?నిక్షేపంలా గంధం పూసుకుంటారు,గిన్నెడు గంధం తీయమని ఆజ్ఞాపిస్తుంది!దరిద్రజాతకురాలైన రుక్కును చేసుకోవటం వలనే నిక్షేపం వంటి రుక్కు భర్త పోయాడనీ,మనోవర్తికి కూడా గతిలేనిదనీ నిందిస్తుంది!!"గంధం పూసుకుంటే ఎంతటి సుఖం కలుగుతుందో నీకెలా తెలుస్తుంది?
♦️అలాటివి అనుభవించే జన్మేనా నీది?వెనకటి జన్మలో ఎవళ్ళని చూసి ఏడ్చావో,ఎవళ్ళ సుఖం పడగొట్టావో,ఎవళ్ళకి ఎడబాటు కల్పించావో,లేకపోతే ఇప్పుడు నీకీ రాత ఎందుకు వస్తుందీ"అని రుక్కుని మాటలతో హింసించే అమ్మమ్మ పాత్ర మనందరికీ,ముఖ్యంగా నాకు శత్రువై కూర్చుంది!!
♦️దొడ్లో గేదే ఉంది,ఇంట్లో నేనూ ఉన్నాను అని రుక్కు మాటవరసకు అనగానే,కనిపెంచే గేదెకీ,నీకూ సాపత్యమా!బిడ్డలను కనాలనే ఊహకూడా నీకు ఉందన్నమాట అని రుక్కుని కౄరంగా మాటలతో నిందిస్తుంది!!
♦️సరే అమ్మమ్మ ఆజ్ఞ ప్రకారం రుక్కు గంధం తీయటమనే పనికి తలొగ్గింది!!గిన్నెడు చిక్కని గంధం, గంధపు సాన మీద చాది తీయటం,అదీ ఒక్క మనిషి,ఎన్ని గంటల సమయం పడుతుందో ఒక్కసారి ఊహిస్తే మనకు కడుపు చెరువవుతుంది!
♦️ఇంతలో రుక్కు చిన్నక్క వస్తుంది ఆమె దగ్గరకు!"చెల్లీ!!ఒక్కపని చెపుతాను చేసి పెట్టవూ""అనే నయగారపు పలకరింపుతో!!
జాకెట్టు గుడ్డ ఇచ్చి సాయంత్రానికి రవికె కుట్టమని కోరుతుంది!ఈ రోజు నావల్ల కాదంటుంది రుక్కు!పెద్దక్క తన కూతురికి జుబ్బా కుట్టమని బట్ట ఇచ్చింది.చేతిలో ఉన్న పని అవగానే ఆ పని చేయాలంటుంది రుక్కు!!అప్పుడు రుక్కు చేతిలో ఉన్నపని కందులు బాగు చేయటం!ఈ కాసిని కందులూ చేశాక ఖాళీయే కదా అంటుంది చిన్నక్క!
కాసిని కందులేమిటీ,ఇవి నాలుగు కుంచాల కందులు,అవి బాగు చేసేప్పటికే మధ్యాహ్నం మూడు గంటలవుతుందనీ,తరువాత తల్లీ తండ్రికోసం గిన్నెడు గంధం తీయాలనీ రుక్కు వివరించటం చూసి మన నెత్తురు ఉడికిపోతుంది!!సరే ఆతరువాత తన రవిక కుట్టమన్న చిన్నక్కకు ముందు పెద్దక్క తన కూతురికి కుట్టమన్న జుబ్బా కుట్టే పనిచూస్తాను అని చెప్పగానే,ఆ చిన్నక్క ఆడిన నిష్టూరాలు చూడండి"మీ బావ నెల కిందట తెచ్చిన జాకెట్టు గుడ్డ అది.ఆయన ఇవాళో రేపో వస్తారు!నేను ఆ జాకెట్టు వేసుకోవడం చూసి ఎంతైనా సంతోషిస్తారు.నీకు కాస్తైనా సరసం తెలిస్తేనా?అయినా నీ ఇష్టం వచ్చినట్టు తగులడు!నీకు ఆ పెద్దక్క అంటేనే ఇష్టం!సరే కనీసం రేపు పొద్దునకైనా కుట్టు"అని పురమాయిస్తుంది.ఇంతకీ చిన్నక్కకు కుట్టుపని తెలియక కాదు,రుక్కు ఉన్నదే చాకిరీకి అనే భావన ఆమెది!!
ఇంతలో పెద్దక్క రంగప్రవేశం చేస్తుంది జుబ్బాపని ఎంతవరకూ వచ్చింది అని అడుగుతూ!గంధం తీస్తున్న రుక్కుని అది ఎవరికి అని అడిగి,తల్లీ తండ్రికి అని చెప్పగానే ఆశ్చర్యపోతుంది.జుబ్బా కత్తిరింపులు మాత్రం అయినాయనీ,కుట్టే పని 
♦️అవలేదనీ,భోజనాలయాక కందులు బాగు చేశాననీ,ఇప్పుడు గంధం తీస్తున్నాననీ,ఎవరూ మరోపని పురమాయించకపోతే జుబ్బాకుట్టే పనే చేస్తానని చెపుతుంది రుక్కు!చిన్నక్క రైక కుట్టమని జాకెట్టుగుడ్డ ఇచ్చిందన్న విషయం కూపీ లాగి,నీకు చిన్నక్క అంటేనే ఇష్టం లాటి నిష్టూరాలాడి,ఆ రాత్రికెలాగైనా జుబ్బా కుట్టేయమని హెచ్చరిక చేసి కదిలింది పెద్దక్క!
ఇంతలో రుక్కు దగ్గరకు చేరింది రుక్కు చెల్లెలు!తన స్నేహితురాళ్ళతో తను ఆడుకునే బువ్వాలాటలో తన వంతు బెల్లం ముక్క వచ్చిందనీ,తల్లినడిగితే తిడుతుంది కాబట్టి రుక్కునే ఇవ్వమని అడుగుతుంది.తను ఇవ్వకూడదనీ,ఇవ్వనని చెప్పిన రుక్కుమీద అక్కస్సుతో రుక్కు రెక్కలు పడిపోయేట్టు తీసిన గంధం గిన్నె ఎత్తుకుపోయి దాన్ని నేలపాలు చేసేస్తుంది!!నెత్తిన చేతులు పెట్టుకు కూలబడిన రుక్కును ఎగతాళి చేసి పారిపోతుంది చెల్లెలు!ఆ చెల్లెలు వెంటపడి,పట్టుకుని,కసితీరా నాలుగు తన్నాలనే కోరిక కలిగింది నాకిప్పుడు!!
♦️సరే,మళ్ళీ గిన్నెడు గంధమూ తీసి జుబ్బా కుడదామని కూర్చున్న రుక్కు దగ్గరకు తల్లి వచ్చింది.రాత్రికి మడిగట్టుకుని వంట చేయమన్న పురమాయింపుతో!తండ్రికి తనే తలంటాలనే మిషతో రుక్కుకి వంటపని అంటకట్టింది తల్లి‌.పెద్దక్క,చిన్నక్కలలో ఎవరినన్నా వంటచేయించమని తల్లిని కోరుతుంది రుక్కు! దానికి తల్లి చెప్పిన సమాధానం మీరుకూడా చిత్తగించండి"వాళ్ళెందుకు చేస్తారమ్మా మనకి!వాళ్ళిక్కడ పని చేస్తే వాళ్ళ మొగుళ్ళూ,అత్తగార్లూ ఏఔ దెప్పుతారో వాళ్ళని!మనకి ఓపిక ఉంటే చేసి పెట్టాలి,లేకపోతే పంపేయాలి కానీ పనులు చెప్పకూడదు మనం"ఆరైపోయింది,వంటకు లెమ్మని తరుముతూనే,ఆ తల్లి అలవోకగా చెప్పిన పనుల జాబితా చూడండి"అరటికాయ పప్పులో వేసి,వంగవరుగూ,పనసపెచ్చు,మునక్కాడలూ వేసి పులుసు పెట్టు చాలు!చద్దన్నాల్లోకి మామిడి కాయల పచ్చడి చేయటం మర్చిపోకు!అమ్మమ్మకు కొయ్యరొట్టిలోకి కొబ్బరి పచ్చడి చేసివ్వు.అన్నట్టు పొయ్యిలోకి ఒక్క చెక్కపేడైనా లేదు,చీకటి పడకుండా అటక ఎక్కి నాలుగు పూటలకు సరిపడా కట్టెలు తీసి కింద పడేయటం మర్చిపోకు"అమ్మతనానికే మచ్చ తెచ్చే ఈ మనిషి కూడా తల్లేనా?అంతకంటే బిడ్డలు లేని గొడ్రాలు నయమే అనిపిస్తుంది ఆమె పాత్రని చూస్తే!ఆపకుండా,చెవులు ఎర్రబడినా వదలకుండా చెవులు మెలిపెట్టాలనిపిస్తుంది చదువరులకు!!
♦️ఉసూరు మంటూ మడి కట్టుకుని వంట చేస్తున్న రుక్కు దగ్గరకి తమ్ముడు వచ్చాడు అర్జెంట్ గా అన్నం పెట్టు,సినిమాకు వెళ్ళాలనే డిమాండుతో!పెద్దక్క,చిన్నక్కలు అమ్మలక్కలతో గవ్వలాడుకుంటూ ఒకరు,మల్లెమొగ్గలు గుచ్చుకుంటూ ఒకరూ ఖాళీగా లేనందున రుక్కే తమ్ముడికి అన్నం పెట్టాల్సివస్తుంది.ఆ తమ్ముడు అన్నం మెక్కి సినిమాకు వేంచేస్తాడు రాత్రి పులుసులోకి ముక్కలు నాకు ఎక్కువ దాచి ఉంచకపోతే చితక్కొట్టేస్తా నిన్ను అనే హెచ్చరిక రుక్కుకి జారీ చేసి!!
♦️అన్నం పెట్టి వంట చేస్తున్న రుక్కుమీద తండ్రికి కాస్త దయ కలుగుతుంది.మడి నువ్వు కట్టుకున్నావేమమ్మా,అక్కలు,అమ్మమ్మ ఏం చేస్తున్నారు అని అడగగానే గయ్యాళి అత్తగారు అల్లుడి మీద విరుచుకు పడుతుంది!సరే రుక్కుతో అప్పుడప్పుడు మాత్రమే మడి కట్టించండి,రోజూ వద్దు అని చెప్పిన అల్లుడిని అత్తగారు మళ్ళీ నిలదీస్తుంది!జుట్టున్న విధవరాలు రుక్కు వండితే ,ఆచారవంతురాలైన తనకి తినటానికి పనికి రాదు కనక రాబోయే దశమికి కోటిలింగాల రేవులో తలవెంట్రుకలు తీయించి గుండు చేయిద్దామని చెపుతుంది.ఇంకా పదిహేడు సంవత్సరాలైనా నిండలేదు కదా అని తటపటాయిస్తాడు రుక్కు తండ్రి!
దానికి అత్తగారు,విధవలకు ఇది మంచికాలం కాదనీ, వీరేశలింగంతోటలో విధవా వివాహాలు చేయిస్తున్నారనీ,నలుగురు పెళ్ళికొడులకోసం విధవలను వెతుకుతున్నారనీ,వారు తారసపడగానే సమయాసమయాలు,ముహూర్తాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కాబట్టి,రుక్కుని తను స్వయంగా తీసుకువెళ్ళి శిరోముండనం చేయిస్తాననీ ప్రకటిస్తుంది!!
ఇవన్నీ విన్న రుక్కు మనసులో అలజడి రేగి వడ్డనలన్నీ తారుమారుగా చేస్తుంది!ఇంటిపనులన్నీ ముగించుకుని రుక్కు పక్క చేరేటప్పటికి రాత్రి పదకొండయింది.అందరూ నిద్రలో ఉంటారు.
ఆమె ఆలోచనలలో రవికలగుడ్డ చేత పట్టుకుని కొరకొరా చూస్తూ చిన్నక్క ఒకవైపు,జుబ్బాగుడ్డ చేత పట్టుకుని పళ్ళు కొరుకుతూ పెద్దక్క ఒకవైపు,రెక్కలు పడిపోయేట్టు తను తీసిన గిన్నెడు గంధంలో సెంటు కలిపి పూసుకుని సరాగాలాడుకుంటున్న తల్లిదండ్రులు మరోవైపు,కత్తినూరుతూ మంగలి వెంటరాగా స్వయంగా చేత కత్తెర పట్టుకుని తనను తరుముతున్న అమ్మమ్మ మరోవైపూ గోచరిస్తారు..
ఒళ్ళు రణకంపరమెత్తిన రుక్కు ఆ అర్ధరాత్రి తలుపు తీసుకుని వీధిన పడింది!
♦️అక్కడ ఒక జట్కావాడు,ఆమె వాలకం గ్రహించి పంతులుగారి తోటకు దమ్మిడీ డబ్బులు తీసుకోకుండా సవారీ కట్టి బండిని ఆఘమేఘాలమీద పరుగెత్తిస్తాడు.తనకీ ఒకపదిరోజుల కిందే భర్త చనిపోయిన కూతురుందనీ,ఇంకా సంసారంకూడా చేయలేదనీ,కొద్దిరోజులు పోయాక తిరిగి పెళ్ళి చేస్తా ననీ తన కధ చెప్తాడు.పంతులుగా తోటకు రుక్కుని చేరుస్తాననీ,అక్కడ రాచకొమారుడి వంటి పెళ్ళికొడుకు సిద్ధంగా ఉన్నాడనీ,రుక్కు అక్కడికి చేరగానే పెళ్ళి చేసేస్తారనీ ఇక మీకు సుఖమేకానీ కష్టం ఉండదనీ ధైర్యం చెప్తూ మేఘాలమీద జట్కా తోలటంతో కధ ముగుస్తుంది!!
♦️జట్కా అతని మాటలతో మనకూ రుక్కు భవిష్యత్తు మీద కొండంత భరోసా ఏర్పడి,అప్పటివరకూ ఆమె పట్ల ఏర్పడిన దిగులు పటాపంచలవుతుంది!
ఈ కధలో ఎన్నిసార్లు మనకు రుక్కు రక్షకుని పాత్ర ధరించి,ఆమె మీద దాష్టికం చేస్తున్న కుటుంబ సభ్యులని దండించి,రుక్కుని వారి బారినుండి కాపాడదామనే కోరిక కలుగుతుందో చెప్పలేను.కష్టంలో ఉన్న కన్నకూతురిని కడుపులో పెట్టుకుని కాపాడుకోవలసిన తల్లితండ్రులు కనికరం లేకుండా ‌దాసీదానికంటే హీనంగా చూడటం చూస్తే మనకు పేగు కదులుతుంది.కొన్నిచోట్ల కంటనీరు తిరుగుతుంది,కొన్నచోట్ల ఆగ్రహం పెల్లుబుకుతుంది.చదువులేని జట్కావాడికి తన బాలవితంతువైన కూతురి పట్ల కల వాత్సల్యం,ఒక చదువుకున్న,సంపన్నుడైన బ్రాహ్మణ కుటుంబంలో లేకపోయింది కదా అనే ఖేదం కలుగుతుంది.కధలో రెండే నిముషాలు దర్శనమిచ్చే జట్కావాడి పాత్ర కనిపించే ఉదాత్తత,భావ సంపన్నత అతనికి మనం మనసులోనే నమస్కరించేట్లు చేస్తాయి!!
పరిస్థితి చెడినప్పుడు తల్లితండ్రులు కూడా ఎంత కటువుగా,హేయంగా ప్రవర్తిస్తారో తెలియచేసే ఈ కధ తప్పక చదవదగినది!!వీలైతే చదవండి !!
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐