🌹మనసు కధలు--కొడుకు కోపం🌷



(♥నాకు చాలా ఇష్టమైన కధల్లో ఈ కధ కూడా ఒకటి .♥)

🚩🚩

ఒక బాబు, తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవటం చూసాడు..అమ్మ వల్లే నాన్న ఇల్లు వదిలివెళ్ళిపోయాడు అనుకున్నాడు..

ఇప్పుడు నేను, అమ్మతో అనుబంధాన్ని ఇంకా పెంచుకోనా లేదంటే నాన్నని దూరం చేసిందని అమ్మతోనూ దూరంగా ఉండనా అని ఆలోచించాడు..అతనికి రెండో ఆలోచనే నచ్చింది..అంతే ఇల్లు వదిలి, అమ్మనొదిలి వెళ్ళిపోయాడు..వెళ్ళొద్దు నాన్నా అని అమ్మ వెనకనుంచీ చెబుతున్నా వినిపించుకోలేదు..

అప్పుడతనికి 16 యేళ్ళు..ఏదో ఒక పని చేసుకుంటూ తనని తాను గట్టెక్కించుకుంటూ పెద్దవాడయ్యాడు..ఉద్యోగం , పెళ్ళి..అలా అలా జీవితంలో స్థిరపడ్డాడు..మధ్యలో రెండు మూడు సార్లు తల్లి తన ఇంటికి వచ్చినా, కొడుకు కోసం తల్లి, కొడుక్కి ఇష్టమైనవి, వండుకుని తెచ్చినా, ఎందుకొచ్చావు నువ్వంటూ, తల్లిని గుమ్మంలోంచే పంపించేసాడు..

చిన్నప్పటి దిగుళ్ళకి దూరంగా బతకాలని అతని ప్రయత్నం, అందుకే తాను వదిలిపెట్టి వచ్చేసిన తల్లిని, తమని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తండ్రిని అతను వీలయినంత గుర్తు తెచ్చుకోడు,

ఆ అలజడి జ్ఞాపకాలు, అతని మనసుని పాడుచేస్తుంటాయి, అందుకే అలా..

అతనికి ఓ బిడ్డ పుట్టాడు ..బిడ్డని చూసుకునే క్రమంలో భార్యకి పని ఒత్తిడి ఎక్కువై , అతనిని నిలదీసేది..ఒక్కదాన్ని నేను చేసుకోలేను, నువ్వెందుకు సాయం చెయ్యవని గొడవ చేసేది..అతను కూడా ఎదురు పోట్లాడేవాడు..కుటుంబం తాలూకూ తలనొప్పులు, తలబొప్పి కట్టడాలు అతనికి అర్ధం అవుతున్నాయి..

ఒకరోజు తల్లి పిలిచింది, కన్నా ఇంటికి రండిరా, నిన్ను చూడాలని ఉంది అని..సమయం లేదమ్మా, చాలా పనులతో సతమతమవుతున్నాను, నాకు రావటం కుదరదు అన్నాడు..ఫోన్ పెట్టేసాడు, తల్లి ఇంకా ఏదో చెప్పబోతున్నా వినిపించుకోలేదు..

సంవత్సరం తరువాత ఒక హాస్పిటల్ నుంచీ ఫోన్ వచ్చింది, మీ అమ్మగారికి ఆరోగ్యం అస్సలు బాలేదు, ఇవాళో రేపో అన్నట్లున్నారు అని పిలుపొచ్చింది..ఎక్కడో ప్రేమపాశం పీకింది, పేగుబంధం కదిలింది..పరుగున వెళ్ళాడు..అమ్మా అని ప్రేమగా పలకరించబోయాడు..బాబూ నేను పోయిన తరువాత నువ్వు నేనున్న ఇంటికి రోజూ వెళ్ళు అలా ఒక ముప్ఫయ్యి రోజులు వరుసగా వెళ్ళాలి, రోజూ పదిహేను నిముషాలు తప్పకుండా ఇంట్లో ఉండాలి, అంతే..అనేసింది..బాబుకి తల్లి మీద కోపం వచ్చింది, అమ్మ బతికున్నప్పుడే తనకి సమయం చాలలేదు..ఇక తనే లేనప్పుడు నేనెందుకు వెళ్ళాలి, ఎందుకు 15 నిముషాలు అక్కడే ఉండాలి అని నెత్తి పట్టుకున్నాడు..

తల్లి చనిపోయాక ఇంటికి వెళ్ళాడు..మొదటిరోజు చాలా అసహనంగా అనిపించింది..ఒక్కో నిముషం ఒక్కో యుగంలాగా అనిపించింది..ఎందుకు అమ్మ నాకు ఇలా చెప్పి చేయిస్తోంది..తను పిలిచినప్పుడు రాలేదని పగ తీర్చుకుంటోందా..అని అన్నిరకాల పిచ్చి ఆలోచనలు చేసాడు..ఒక నాలుగు రోజుల తరువాత నెమ్మదిగా అలవాటుపడ్డాడు , తప్పదు కదా అన్నట్టు సర్దుకుపోతున్నాడు..తల్లి పడుకునే మంచం మీద వాలి కిటికీ బయటకు చూస్తూ ఉంటే అతనికి అనిపించింది..నాన్న వెళ్ళిపోవటానికి కారణం అమ్మ అనుకున్నాను, నాన్న నన్ను వదిలేసింది అమ్మ వల్లనే అనుకున్నాను, ఒకరకంగా చెప్పాలంటే నాన్న నన్నే కాదు అమ్మను కూడా వదిలేసి వెళ్ళారు..ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా నాన్న నాకోసం రాలేదు, నన్ను చూడను కూడా చూడలేదు, మరి అమ్మ ఎన్నోసార్లు నన్ను చూడాలని వచ్చింది, నాకిష్టమైనవి తెచ్చింది..ముప్ఫయేళ్ళు అమ్మకి దూరంగా నేనుంటే తను నాకోసం ఆలోచిస్తూ ఒంటరిగా ఉంది పాపం అని మొదటిసారి తల్లి స్ధానంలో ఉండి తల్లికోసం ఆలోచిస్తున్నాడు..అయ్యో అమ్మా అని బాధేసింది..

భార్యకి తనకి మధ్య బాధ్యతల ఒత్తిడి వల్ల పెరుగుతున్న గొడవలు గుర్తొచ్చాయి..భార్యకి ఎక్కువ బాధ అనిపిస్తే తనను వదిలివెళ్ళిపోతుందేమో అని భయమేసింది..ఇకనుంచీ తాను భార్యకు తోడూనీడగా ఉండాలి, తన కష్టాన్ని పంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు..బహుశా సరైన అంతర్మధనం అతనిని ఎదిగేలా చేసినట్టుంది..రోజురోజుకి పరిణితి చెందుతున్నాడు..

భార్యతో ఇంటి అవసరాల గురించి వివరంగా చర్చించుకుని అవసరమైన మార్పులు చేసుకున్నారు..చాలారోజుల తరువాత భార్య మనసారా నవ్వింది, అతనికీ ప్రశాంతంగా అనిపించింది...

చివరి రోజు, 30 వ రోజున తలుపు తీసి అమ్మ ఇంట్లోకి వెళుతుంటే మనసుకి తెలియని దిగులేసింది..ఇల్లంతా తిరుగుతుంటే ఒకచోట ఉత్తరం ఉంది..అమ్మ హాస్పిటల్ లో చేరేముందు రాసినట్టుంది..కన్నా నీకు తెలిసీతెలియని కోపం నామీద...నీకెలా సర్ది చెప్పాలో కూడా నాకు తెలీలేదు, కానీ ఈ ముప్ఫయ్యి రోజులూ నేనెలానూ లేను కాబట్టి కోపం ప్రదర్శించాలనుకున్నా, లేని నామీద ఎంతవరకు కోపంగా ఉంటావు, ఏదో ఒక క్షణంలో నాగురించి ఆలోచిస్తావని నాకు తెలుసు,

ఈ రోజు నామీద నీకు కోపం ఉండదనే నా నమ్మకం, ఇప్పటినుంచీ నీ పూర్వ అనుభవాల ఆధారంగా మనుష్యులని సరిగ్గా అంచనా వేసుకుంటావని, అనవసరంగా ఎవరినీ దూరం చేసుకోవని ఆశిస్తున్నాను, అమ్మగా నువ్వెప్పుడూ ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను..అని రాసిన పిచ్చితల్లి వాక్యాలు చదువుతుంటే అతని కళ్ళు మసకబారాయి, అతని కళ్ళనీళ్ళు అమ్మ రాసిన అక్షరాల మీద జలజలా రాలిపడ్డాయి, తల్లిపాదాలకు ప్రేమతో నిండిన కన్నీళ్ళతో వందనం చేసినట్లుగా అనుకున్నాడు..వ్యక్తిత్వం ఎదిగిన మనిషిగా బయటకు బయలుదేరాడు..

.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩