🚩🚩నాకు నచ్చిన పోతన పద్యం.!


 🚩🚩నాకు నచ్చిన పోతన పద్యం.!

(వామనావతారం)

♦️ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై♥️

♦️ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను.

ఒక సామాన్యుడిగా బ్రతుకు ప్రారంభించి. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించో, అలాగే సన్నగా ప్రారంభమై క్రమక్రమాభివృద్ధి పొంది మిన్నగా రూపొందిన దాన్ని గురించో చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా ప్రజల నాలుకల మీద – కనీసం మొదటి లైను ఐనా – నిలిచిపోయింది ఈ పద్యం. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.

బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.

♦️ఇంతైనాడు, మరింకింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినంతైనాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా అజాండభాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి చూస్తున్నారు.క్షణం పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పదపదానికీ పెరుగుతూ పోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి.

ఈ పద్యం మనసులో పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక సినీమాటిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది.

♦️ఇంతేకాదు. ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది.

క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది.

ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట.

♦️వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, నగగానూ, బంగారు జాజుబందీ లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.

♦️రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్♥️

మహానుభావుడు పోతన. కథ పాటికి కథ నడిచిపోతున్నా, భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనకి ఒళ్ళు తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు గుండెలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ వాటి ప్రాథమ్యాన్ని కోల్పోయి, ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం. దీనికి రెండోమాట లేదు.

♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐