🔺🔻శ్రీకాళహస్తీశ్వర శతకం. !🔺🔻 (ధూర్జటి మహా కవి.)

 

                                          🔺🔻శ్రీకాళహస్తీశ్వర శతకం. !🔺🔻
                                                      (ధూర్జటి మహా కవి.)
.
♥️♦️తెలుగుసాహిత్యంలో శివునిపై కావ్యాలకీ, పద్యాలకీ కొదవలేదు. వాటన్నిటిలోనూ మకుటాయమానమయింది శ్రీకాళహిస్తీశ్వర శతకం. భక్తిశతకాలలో సాధారణంగా దేవుడి గూర్చి స్తోత్రం తప్ప మరేమీ కనిపించదు.
♦️శ్రీకాళహిస్తీశ్వరశతకం వాటికన్నా భిన్నమైనది. ప్రత్యేకమైనది. ఇందులో కవి వ్యక్తిత్వం మనకి వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. అతను పడే తపన, ఆర్తి హృదయానికి హత్తుకుంటుంది. దానికి కారణం కవి పలుకులలోని మాధురీమహిమ!
❤️శ్రీవిద్యుత్కలితాజవంజవమహాజీమూత పాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జసముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్
దేవా! నీ కరుణాశరత్సమయ మింతేఁ జాలుఁ జిద్భావనా
సేవం దామరతంపరై మనియెదన్ శ్రీకాళహస్తీశ్వరా!‼️
.
♦️ఇది యీ శతకంలో మొట్టమొదటి పద్యం.
🚩శ్రీ, విద్యుత్ (మెరుపు) కలిత, ఆజవంజవ (సంసారం), మహాజీమూత, పాప, అంబుధారా, వేగంబున, మత్, మనః అబ్జ, సముదీర్ణత్వంబు, కోల్పోయితిన్.
సంపద అనే మెరుపుతో కూడుకున్న పెనుమేఘం సంసారం.
అది నిరంతర ధారగా కురిసేది పాపాల జడివాన.
తన హృదయమనే పద్మం ఆ వానలో తడిసిపోతూ వికాసాన్ని కోల్పోయింది, అంటే కుంచించుకుపోయింది.
అది మళ్ళీ వికసించాలంటే వానకారు పోవాలి. పోవాలంటే వెన్నెల ఋతువు శరత్తు రావాలి. అందుకే ఆ శ్రీకాళహస్తీశ్వరుణ్ణి యిలా కోరుకుంటున్నాడు కవి.
🚩 "ఓ దేవా! నీ కరుణ అనే శరత్కాలాన్ని ప్రసాదించవయ్యా,
అంతే చాలు. అప్పుడు వికసించిన నా మనస్సులో నిరంతరం నిన్నే భావన చేస్తూ, ఆ సేవలో తామరతంపరగా నా బతుకు వెళ్ళదీస్తాను"
.🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩