గాత్రధర్మం - ముసలితనం - పాట రికార్డింగ్!

 గాత్రధర్మం - ముసలితనం - పాట రికార్డింగ్!






#ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "లతా మంగేష్కర్ ఇంకా అప్పుడు పాడుతున్నట్టే పాడుతున్నారు. జానకి గారు ఇంకా పదహారేళ్ల వయసులో ఉన్నప్పటిలాగే పాడుతున్నారు అనేది పొగడ్త మాత్రమే. వయసుతోపాటు గాత్రంలో మార్పులు వస్తాయి. వాటిని అంగీకరించాలి" అన్నారు. 

దీనికో ఉదాహరణ చూద్దాం..

♦️1998లో మణిరత్నం గారి దర్శకత్వంలో హిందీలో వచ్చిన 'దిల్‌సే' సినిమాలో #జియాజలే' పాట చాలా పాపులర్. ఆ పాటని మూడు భాషల్లో ముగ్గురు ప్రముఖ గాయకులు పాడారు.

 హిందీలో #లతా మంగేష్కర్ పాడితే, తమిళంలో #ఎస్.జానకి, తెలుగులో #చిత్ర పాడారు. 

ఈసారి మీరు ఆ మూడు పాటలు కళ్లు మూసుకుని వినండి. హిందీ, తమిళ వెర్షన్లలో పాట ముసలి వయసులో వ్యక్తులు పాడినట్లు అనిపిస్తుంది. 

♦️తెలుగులో మాత్రం పాతికేళ్ల అమ్మాయి పాడినట్లు ఉంటుంది. ఎందుకంటే లతా మంగేష్కర్‌కు అప్పటికి 70 ఏళ్లు. జానకి గారికి 60 ఏళ్లు. సినిమాలో ఆ పాట వినడానికి బాగానే ఉన్నా, ఆ పాత్ర పోషించిన హీరోయిన్ వయసుకు తగ్గట్టుగా అనిపించదు. చిత్ర గారికి అప్పటికి 35 ఏళ్లే కాబట్టి ఆమె గొంతు హీరోయిన్ వయసుకు సరిపోతుంది.

♦️అలా అని సీనియర్ గాయకులు తక్కువా? కాదు. వాళ్ల ఘనత వారిదే! లతా మంగేష్కర్ 61వ ఏట పాట పాడి జాతీయ ఉత్తమ గాయనిగా ('లేకిన్' సినిమాకు) అవార్డు తీసుకుంటే, ఎస్.జానకి 55వ ఏట నాలుగోసారి జాతీయ అవార్డు ('దేవర్ మగన్' సినిమాకు) అందుకున్నారు. అత్యధిక వయసులో ఈ అవార్డులు అందుకున్నది వారిద్దరే! అయితే వయసుతో వచ్చే మార్పులు ఉంటాయన్నది మనం గ్రహించాలి. 

#ఏఆర్ రెహమాన్ సీనియర్, జూనియర్ గాయకులతో కలిసి పనిచేశారు. వారి గాత్రధర్మం ఆయనకు తెలుసు. పైగా 1990లో కొత్తగా వచ్చిన టెక్నాలజీని ఆయన త్వరగా ఆకలింపు చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా సీనియర్ గాయకులు పాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలా? దీనికీ ఉదాహరణ ఉంది.

2000లో తమిళంలో 'అలైపాయుథే' అనే సినిమా వచ్చింది. తెలుగులో దాన్ని 'సఖి' పేరిట డబ్ చేసినప్పుడు తమిళంలో ఆశాభోంస్లే పాడిన 'సెప్టెంబర్ మాదం' పాటను తెలుగులో ఎస్.జానకి 'సెప్టెంబర్ మాసం'గా పాడారు. ఆ పాట ఒకసారి వినండి. 20 ఏళ్ల అమ్మాయి పాడినట్లే వినిపిస్తుంది. జానకి గారికి అప్పటికి 62 ఏళ్లు. కానీ ఆ పాట వింటే అదేమీ తెలియదు. ఆవిడ అంత బాగా పాడటం ఒక ఎత్తయితే, దాన్ని రికార్డు చేసే సమయంలో రెహమాన్ తీసుకున్న జాగ్రత్తలు మరో ఎత్తు. ఆ పాటని చాలా వినసొంపుగా వినిపించేలా రికార్డు చేశారు. సంగీత దర్శకుడికి ఆ రికార్డింగ్ జ్ఞానం ఉండటం అవసరం. కాబట్టే ఆయన ఏఆర్ రెహమాన్.

#యాభై ఏళ్ల తర్వాత గాత్రంలో తేడాలు వస్తాయి. 20-30ల మధ్య వినిపించినట్లు గొంతు వినిపించదు. అందుకే చాలా మంది సీనియర్ గాయకులు 45 ఏళ్లకే పాటలు తగ్గించేశారు. దక్షిణాదిలో#పి.సుశీల 1995లో 60 ఏళ్ల దాకా ఉదృతంగా పాడారు. ఆ తర్వాత తగ్గించేశారు. #ఎస్.జానకి 2000 దాకా ఉదృతంగా పాడారు. 1997, 1998, 2000 సంవత్సరాల్లో ఉత్తమ గాయనిగా 60 ఏళ్లు దాటాక కూడా నంది అవార్డులు అందుకున్నారు. చాలా హిట్ సాంగ్స్ ఆ వయసులోనూ పాడారు. 'విఐపీ'( తెలుగులో 'రఘువరన్ బీటెక్')లో ధనుష్‌తో కలిసి పాట పాడారు. ఆ తర్వాత 2018లో 'పన్నాడి' అనే తమిళ చిత్రంలో 'ఉన్ ఉసుర కాత్తులే' అనే పాట పాడారు. తన 80వ ఏట సినిమా కోసం పాట రికార్డ్ చేసిన ఏకైక దక్షిణాది గాయని ప్రస్తుతానికి ఆమే అనుకుంటా!(2012లో 'మిథునం' సినిమా కోసం జమునా రాణి ఓ పాట పాడారు. అప్పటికి ఆమె వయసు 74).

♦️గాత్రధర్మాన్ని అనుసరించి చాలా మంది గాయకులు ఒక వయసు తర్వాత పాడటం తగ్గించారు. 50 దాటాక పాట పాడితే బాగానే ఉన్నా, హీరోయిన్‌‌కి ఆ గొంతు సూట్ కాక సినిమాలో ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ కారణంగా సినిమాల్లో అవకాశాలు కూడా వారికి తగ్గిపోయాయి. ♦️గాయకులు కెరీర్ కంటిన్యూ చేసినా గాయనీమణులు  చాలా త్వరగా రిటైర్ అయిపోయారు. ఆడవాళ్ల గొంతు త్వరగా మారుతుందా అనేది తెలిసిన వారు చెప్పాలి. 

♦️ఇటీవలి కాలంలో చిత్రగారు కూడా సినిమాల్లో పాడటం అరుదైపోయింది. కొత్త గాయకులు రావడం ఒక కారణమైతే,

 58 ఏళ్ల వయసులో గొంతు మారి హీరోయిన్లకు ఆమె గాత్రం గంభీరంగా మారడం మరో కారణం అనిపిస్తుంది.

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐