#మట్టి తిని బ్రహ్మండం చూపుట!! (పోతన భాగవత కథలు.)


*

ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పనిచేసుకుంటోంది. బయట బలరాముడు, ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న బాలురు గబగబా పరుగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరకు వచ్చి "అమ్మా అమ్మా నువ్వు ఎన్నోమాట్లు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదా! తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడు" అని చెప్పారు.
పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారు. కృష్ణునికి అది చాలా యిష్టం. మనకి జారత్వం చోరత్వం చాలా యిష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ రెండులీలలే చేశాడు. దొంగాట ఆడేటప్పుడు ఈయన ఎక్కడో దాక్కుని ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకునే వాడు. ఈ చర్యవలన భూకాంత పొంగిపోయేది. ఈలోగా మరొకచోట దాక్కున్న వాడు కృష్ణుడు నోట్లో మట్టిపోసుకోవడం చూశాడు. గోపబాలురందరూ కలిసి కృష్ణుని చేయిపట్టుకుని లాక్కుని యశోద దగ్గరకు తీసుకువెళ్ళారు. యశోద అదృష్టమే అదృష్టం. జీవితంలో యశోద లాంటి జన్మ ఉన్నవాళ్ళు అరుదు. యశోద దగ్గరకు పరమాత్మ వెడితే ఆవిడ అంది
#మన్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద,
రన్నా! మన్నేల? మరి పదార్థము లేదే?
పిల్లలు చెప్పిన మాటలను ఆవిడ నమ్మేసింది. ఆయన ఏమీ తక్కువ వాడు కాదు. తిన్నాడు. యీలీల యశోద అదృష్టమును ఆవిష్కరిస్తోంది. పరమాత్మ లొంగిపోయినట్లుగా కనపడిన స్వరూపం ఒక్క యశోద దగ్గర తప్ప మరొకచోట లేదు. ఆయన లోకములకన్నిటికి నడవడిని నేర్పినవాడు. ప్రపంచమునకు మార్గదర్శనం చేసిన మహా పురుషుడయిన పరమాత్మని ఈవిడ మార్గదర్శనం చేస్తోంది. "ఏరా కృష్ణా! మన్ను తినవద్దని నీకు ఎన్నిమాట్లు చెప్పాను! మన్ను ఎందుకు తింటున్నావు? నేను యింతకు ముందు నీకు ఎన్నోమాట్లు యిలా తినవద్దని చెప్పాను కదా! నీవు యిలా ఎందుకు చేశావు?" అని అడిగింది.
అపుడు కృష్ణుడు మాట్లాడిన తీరును పోతనగారు ఎలా దర్శనం చేశారో చూడండి
#అమ్మా! మన్ను తినంగ నే శిశువునో ? యాకొంటినో ? వెర్రినో ?
నమ్మంజూడకు వీరి మాటలు మదిన్; నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము జేసి నా వచనముల్ తప్పైన దండింపవే !!
అమ్మా, నేను మన్ను తినడమేమిటి? నేను శిశువునా? నేను వెర్రివాడనా? వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నావని అనేస్తున్నావు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నామీద కల్పించి చెప్తున్నారు. ఆయన వేదాంతం ఎంత చెప్తున్నారో చూడండి! తన్మాత్రాలలో పృథివికి వాసన ఉంటుంది. "నేను నిజంగా మట్టిని తిన్న వాడనయితే పృథివిలో నుండి వాసన వస్తుంది కాబట్టి నా నోరు మట్టి వాసన రావాలి కదా! ఏదీ నా నోరు వాసన చూడు. వాసన వస్తే అప్పుడు కొట్టు" అన్నాడు. అపుడు యశోద "ఏమిటి వీడు యింత తెంపరితనంగా మాట్లాడుతున్నాడు. మట్టి తినలేదంటున్నాడు. నిజం ఏమిటో యిప్పుడు పరిశీలిస్తాను" అని కృష్ణుడిని నోరు తెరవమంది. ఏమి యశోదాదేవి అదృష్టం! ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరల జన్మములు ఎత్తారు. అంతటా నిండివున్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానము. ఏమీ చదువుకోని స్త్రీకి అంతటా ఈశ్వర దర్శనం చేయిస్తున్నాడు పరమాత్మ. ఈశ్వరుని యందు లోకం కనపడుతోంది. లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ యిప్పుడు ఈ తత్త్వమును ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనం. దీనినే "మృద్భక్షణమున విశ్వరూప ప్రదర్శనము" అంటారు పోతనగారు. కృష్ణుడు నోరు తెరిచాడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకంతో, నంద వ్రజంతో, నందవ్రజంలో వున్నా పశువులతో, తన యింటితో, తనతో, నందుడితో కలిసి అందరూ లోపల కనపడ్డారు. ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోటిలో కనపడుతుంటే ఆవిడ తెల్లబోయింది.
#కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర
స్థలమో బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్!!
నోరు తెరిస్తే పిల్లవాని నోట్లో వున్నవి అన్నీ చూసి యశోద "ఇది కలా? వైష్ణవ మాయా? ఏదయినా సంకల్పమా? అసలు నేను యశోదనేనా? నేను నా యింట్లోనే ఉన్నానా? వీడు నా కొడుకేనా? వీని నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తె చాలా ఆశ్చర్యంగా ఉంది. పిల్లవాడేమిటి? నోట్లో బ్రహ్మాండములు ఏమిటి?" అని ఆశ్చర్యపోయింది. యశోద కృష్ణుని కేవలము తన కొడుకుగా భావన పెంచుకుంది. ఈ ప్రేమయే భక్తి. తెలియకుండా ప్రేమించినా ఆమె ఈశ్వరునే ప్రేమించింది. ఇటువంటి భక్తికి పర్యవసానము జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శనము.
అయితే ఇక్కడ పరమాత్మ ఒకటి అనుకున్నారు. అమ్మ యిలా జ్ఞానంతో ఉండిపోతే నాకు అమ్మగా ఉండలేదు. కాబట్టి మరల వైష్ణవ మాయ కప్పాలి అనుకొని ఆమె జ్ఞానమును ఉపసంహారం చేశాడు. అంతే! ఆమె వైష్ణవమాయలోకి వెళ్ళిపోయింది. ఇదే పరమాత్మ అనుగ్రహం అంటే.⁠⁠⁠⁠
                      🔻🔻🔻🔻🙏🙏🙏🙏🙏🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩