🚩పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం! (రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌సె



🚩పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం!
(రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌సెప్టెంబర్ 2009.)

ఆరు  దశాబ్దాలనాటి పాటల గురించి ఇప్పుడు రాయడం, నాలుగు 
దశాబ్దా క్రితం మరణించిన గాయకుణ్ణి తలుచుకోవడం న్యాయంగా పాతచింతకాయపచ్చడి అనిపించుకోవాలి. కాని ఘంటసాల విషయంలో అలా జరగదు. ఆయన కుటుంబసభ్యులే ఆశ్చర్యంతో చెప్పుకున్నట్టుగా ఘంటసాల చివరిరోజులలో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ జనాదరణ పొందుతున్నాడు. పెద్దలు క్షమిస్తే, ఇది తరవాత వచ్చిన సంగీతం ప్రభావం అని నేననుకుంటాను.
👉🏿ఒక 78 ఆర్.పీ.ఎం. రికార్డు రెండువేపులా వినిపించే ఈ ఆరే ఆరు పద్యాల గీతావళి ఈనాటికీ అభిమానులను అలరిస్తుంది. 
నిజం చెప్పాలంటే అభ్యుదయ కవిత్వం తెలుగువారిని ఉత్తేజపరిచిన 1950లలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారివంటి కవుల రచనలకు ఇంతటి ప్రజాదరణ కలగటానికి ఏకైక కారణం ఘంటసాల స్వరపరచి పాడడమే.
ఇందులోని రాగాలన్నీ హిందూస్తానీవే. భావప్రధానంగా సాగే కవిత్వం కనక ఇది సహజమే నేమో. తక్కిన పాటలూ, పద్యాలలోలాగే ఇందులోకూడా ఘంటసాలకు రాగలక్షణాలమీద ఉన్న పట్టూ, కవి రాసిన భావాన్ని గురిగా పట్టుకోవడం, నాటకీయమైన గాత్రశైలీ అన్నీ మనం చూడవచ్చు. కుంతీకుమారిలాగే ఈ పద్యాల మధ్యలో ఆయన తాను రాసిన వచనం భావభరితంగా వినిపించారు. మోతాదు మించకుండా మోగే అర్కెస్ట్రా ఆయన ఉద్దేశించిన బరువును అందించింది. మధ్యమధ్యలో నాటకం ఫక్కీలో (సంగీతరావుగారిదా?) మంచి హార్మోనియం వినిపిస్తుంది. ఏ గమకం ఎలా పాడాలో, ఏ పదం ఎలా ఉచ్చరించాలో ఇతరులు చెప్పనవసరంలేని ఉత్తమ గాయక సంగీతదర్శకుడు ఏది వినిపించినా ఇంత అద్భుతంగా ఉంటుంది.
👉🏿మొదటి పద్యం మాండ్ రాగంలో వింటాం. ఆహ్లాదకరమైన బెల్స్ మోగుతూండగా మనం పూలతోటలోకి ప్రవేశిస్తాం. పూజ, దేవాలయం, ప్రాతఃకాలం అన్నీ స్పష్టంగా ఆడియోలో వినిపిస్తాయి. ఈనాటి వీడియో అల్బంలలో అష్టకష్టాలూ పడి ప్రయత్నించినా సాధ్యంకాని ప్రభావం సులువుగా వినిపిస్తుంది. జీనియస్ అంటే అదే. ఇందులో ‘బావురుమనడం, క్రుంగిపోవడం’ వగైరా పదాలున్న ప్పటికీ పెద్దగా విషాద రాగచ్ఛాయలు వినపడవు. చివరి రాగాలాపన క్లుప్తంగా, డిగ్నిఫైడ్‌గా ఉంటుంది.
👉🏿👉🏿నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగ నోళ్ళు విప్పి మా
ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి, క్రుంగిపోతి నా
మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై
తరవాతి పద్యం మారుబిహాగ్ రాగంలోనిది. (యమునాతీరమున అనే పాట ఇదే రాగం). తుమ్‌తో ప్యార్‌హో మొదలైన హిందీ పాటలకన్నా తేలికగా రాగభావాన్ని వాడుకోవడం చూడవచ్చు. శుద్ధ మధ్యమం వాడే సంప్రదాయాన్ని పట్టించుకోలేదు. అందుకని కాస్త కల్యాణిలా అనిపిస్తుంది. అయితే నిసగమపా అనే ప్రయోగం సంగీతదర్శకుడి ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. కొత్తరాగమని కాబోలు, చివరలో కాస్త దీర్ఘమైన రాగాలాపన ఉంది.
👉🏿👉🏿ఆయువుగల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
👉🏿👉🏿దీని తరవాతిది బసంత్ రాగం. బహుశా ఈ రాగాన్ని ఇంత ఖచ్చితంగా ఏ ఇతర తెలుగు సినీసంగీత దర్శకుడూ వాడుకోలేదేమో. జాలిని ప్రతిఫలించే స్వరసముదాయంతో చేసిన అద్భుత స్వరరచన. ప్రతిభావంతుడైన విద్వాంసుడు పద్ధతి ప్రకారం గురువు దగ్గర నేర్చుకోకపోయినా రాగాలను అర్థం చేసుకోగలడనడానికి 
ఇదొక ఉదాహరణ.
👉🏿👉🏿గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృం
గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో
తాళుము త్రుంచబోకుము తల్లికి బిడ్డకు వేరుచేతువే
ఈ గీతావళి రెండోభాగం మొదట్లో లయ వినిపించడంతో మూడ్ మారినట్టనిపిస్తుంది. ఘంటసాల తన సినిమాపాటల్లో పహాడీ రాగాన్ని వాడుకున్న సందర్భాలు గుర్తుకురావు కాని ఈ పద్యం అందులోదే. కవిత్వంలోని వెటకారానికిది సరిగ్గా సరిపోయింది.
👉🏿👉🏿ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గుచ్చి కూర్చి,
ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము
అకట దయలేనివారు మీ యాడవారు
కరుణరసాన్ని ప్రతిబింబించే మిశ్ర శివరంజని తరవాతి రాగం. పద్యాలన్నిటి తరవాతా చివరికి పాడిన ‘ప్రభూ’ అనే ‘కోడా’లో కూడా ఈ రాగచ్ఛాయలే వినిపిస్తాయి.
👉🏿👉🏿మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె మా
యౌవనమెల్ల కొల్లగొని ఆపయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారవోతురుగదా నరజాతికి నీతియున్నదా?
చివరి పద్యం రాగేశ్రీ రాగం. హాయిగా సాగే ఈ పద్యం కవిగారు చివాట్లు పెడుతున్నప్పటికీ మనకు సుతిమెత్తగా టాటా చెపుతున్నట్టుగానే ఉంటుంది.
👉🏿👉🏿బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండ
మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ!
ఇన్నేళ్ళలో ఎన్నో ఆడియో, వీడియోలు వెలువడ్డాయి. ఇంత సులభంగా భావాన్ని ఎవరైనా పలికించగలిగారా అంటే లేదనే చెప్పాలి. పేరు ప్రఖ్యాతులమీద పెట్టినంత శ్రద్ధ సంస్కారం పొందడంమీద పెడితే ఈ అవస్థలు తప్పేవేమో. అందుకే మనం ఘంటసాలకు టోపీలు తీసి సెల్యూట్ చెయ్యాలి.
(చిత్రం ..వడ్డాది  పాపయ్య గారు.)
https://www.youtube.com/watch?v=AvUFdca5ACw
🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩