🔻🔻సురవరం ప్రతాపరెడ్డిగారు.🔻🔻



♦తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ నిర్మాత సురవరం ప్రతాపరెడ్డిగారు  
♦సురవరం ప్రతాపరెడ్డి రచయితగా, పండితుడిగా, చరిత్ర పరిశోధకుడుగా, పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా, కార్యకర్తలకు ప్రేరకుడుగా, స్వాతంత్య్రోద్యమకారుడిగా అన్ని రంగాలలో తనదైన ప్రత్యేక ముద్రను వేసి భావి తరాలవారికి ఆదర్శంగా నిలిచాడు.
♦సురవరం వారి జన్మస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బోరవెల్లి గ్రామం. 
క్రీ.శ. 1896లో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, చిన్నాన్న ప్రోత్సాహంతో స్వగ్రామంలో ప్రాథమికవిద్యను కొనసాగించి, హైద్రాబాద్‌లో ఇంటర్మీ డియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ, తిరువాన్‌కూరులో లాయర్‌ విద్యను అభ్యసించాడు. నిజాం రాష్ట్రంలో ఉండడం వల్ల ఉర్దూ తప్పనిసరిగా వచ్చేది. తెలుగు, సంస్క తం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పాండిత్యం సంపాదించినాడు. సురవరం రచనల్లో వారి బహుభాషా పటుత్వం మనకు కన్పిస్తుంది.
♦1916లో పద్మావతిని పెండ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. సురవరం వారు చదువు పూర్తి గానే జీవనాధారం వెతుక్కుంటూ హైద్రాబాద్‌ వచ్చారు. ఆనాటి హైద్రాబాద్‌ కొత్వాల్‌ రాజా బహదూర్‌ వెంకటరామారెడ్డి రెడ్డిహాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. కొత్వాల్‌ కోరిక మేరకు రెడ్డిహాస్టల్‌కు 10 సంవత్సరాలు పనిచేశారు. 
♦ఆ సమయంలో ఉన్న విద్యార్థులందరిలోను దేశభక్తి భావాలను పెంపొందించి, ఇక్కడి నిజాం రాష్ట్ర ప్రజల దుస్థితిని మార్చాలన్న సంకల్పంతో పనిచేశారు. కార్యదర్శిగా రెడ్డిహాస్టల్‌ నిర్వహణలో పూర్తిస్థాయి శక్తిని వినియోగించారు. హాస్టల్‌కు అనుబంధంగా ఉన్న లైబ్రరీలో పుస్తకాల సంఖ్యను వెయ్యినుండి పదకొండు వేలకు పెంచి, విద్యార్థులు భాషాజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో కషిచేశారు.
♦తెలంగాణ తొలితరం ‘కథకుడూ, విమర్శకుడూ, 
కవీ, పండితుడూ, చరిత్రకారుడూ, పరిశోధకుడూ, పత్రికా సంపాదకుడూ, గ్రంథాలయ ఉద్యమ నాయకుడూ, అరుంధతీయ ఉద్యమ భాగస్వామీ, నాయకుడూ, భాషాభిమానీ, తొట్టతొలి నైజామాంధ్ర మహాసభ అధ్యక్షుడూ’ ప్రతాపరెడ్డిగారే. ఇంత వైవిధ్యాన్ని, ఒక మాటతో సూచించడం కష్టమే మరి! ఉన్నంతలో, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ నిర్మాత అనే మాటే సమగ్రమయిందని అనిపిస్తోంది.
♦తెలంగాణ విషయానికి వస్తే, ప్రతాపరెడ్డిగారే కందుకూరి - 
ఆయనే గురజాడ - గిడుగూ ఆయనే. ఆయనే కాశీనాథుని నాగేశ్వరరావూ. ఆయనే టంగుటూరి ప్రకాశం కూడా. మల్లంపల్లి సోమశేఖర శర్మ చేసిన పనీ, అయ్యంకి వెంకట రమణయ్య చేసిన పనీ కూడా సురవరం ప్రతాపరెడ్డే చెయ్యాల్సి వచ్చింది. ఆ మాటకొస్తే, ప్రతాపరెడ్డి చేసిన చాలా పనులు - అభివృద్ధి చెందిందనుకునే - ఆంధ్ర ప్రాంతంలోని పెద్దలు కానీ, వేరే ప్రాంతాల్లోని ప్రముఖులు కానీ చెయ్యనే లేదు. 
♦ఉదాహరణకి, ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ లాంటి పుస్తకం మరొకటి ఏ భాషలోనూ లేదు! సాహిత్య చరిత్రకయినా, ప్రధాన స్రవంతి చరిత్ర రచనకయినా, ప్రజాజీవనమే ప్రాతిపదిక కావాలని అలనాడే ప్రకటించిన చారిత్రాత్మక రచన ‘సాంఘిక చరిత్ర’. వాస్తవానికి అలాంటి రచనల్ని ఏదో ఒక ప్రాంతం ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడిన రచనలుగా చూడ్డం తప్పు. 
♦‘సాంఘిక చరిత్ర’లో కేవలం శిల్పవాదులకి ప్రతాపరెడ్డి వేసిన మొట్టికాయలు చాలాచాలా అవసరమయినవి; సమాజ ఆరోగ్యానికి ముఖ్యమయినవి కూడా. అనేక సాహిత్యాంశాలపై ఆయన రాసిన వ్యాసాలు కూడా తెలుగు జాతి సర్వతో ముఖాభివృద్ధికి దోహదం చేసినవే. అంచేతనే, ప్రతాపరెడ్డి కృషి ఒక్క ప్రాంతానికి పరిమితమయిందేం కాదనేది.
♦ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ సంకలనం 1935లో వెలువడగా, 
అంతకు ఓ యేడాది ముందే ‘గోలకొండ కవుల సంచిక’ వెలువరించారు ప్రతాపరెడ్డి. వాస్తవానికి ఈ రెండింటికీ పోలిక లేదు. 
‘గోలకొండ కవుల సంచిక’ తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో ప్రచురంగా ఉండిన సాహిత్య దోరణులన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించింది. కానీ, ‘వైతాళికులు’ కేవలం భావకవుల కవితల్ని మాత్రమే సంకలించిన సంగతి అందరికీ తెలిసిందే. పైగా, కళింగాంధ్రులకీ, సీమాంధ్రులకీ అందులో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న విమర్శ ఉండనే ఉంది. కథకుడిగా ప్రతాపరెడ్డి విశిష్టమయిన పాత్ర పోషించారు. ఆయన ‘గోలకొండ’ పత్రికలో ప్రచురించిన చాలా కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా రాసినవేనట. 
♦ముఖ్యంగా, ‘వింత విడాకులు’ కథానిక వాస్తవ జీవితానే్న కాకుండా,
 జీవిత వాస్తవాన్ని కూడా చిత్రించింది. కమలమ్మకి బాల్య వివాహం జరిగివుంటుంది. అప్పటి చట్టాల ప్రకారం, ఆమె హిందువుగా 
కొనసాగినంత కాలం, విడాకులు తీసుకునే అవకాశం లేదు.
 నంబి నరసింహులు సలహా మేరకి, ఆమె మతం మార్చుకుని 
‘కమాల్ బీ’ అయిపోతుంది. విడాకులు పొంది, తనకి నచ్చిన రంగనాయకులుని పెళ్లాడుతుంది. 
♦ఈ కథ చదవగానే, 1934లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ రాసిన 
‘ఇలాంటి తవ్వాయి వస్తే..’ కథ గుర్తుకు రాకపోదు. 
మండువేసవిలో గొంతు తడుపుకోడానికి కూడా గతిలేకుండా 
పోయిన మాదిగపల్లి యువకుడు విస్సయ్య మతం
 మార్చుకుని ఇస్మాయిల్ అవుతాడు. 
జటకా సాయిబుతో కలిసి జబర్దస్తీగా పట్టపగలు పదకొండు 
గంటలకి ఊరి చెరువులో దిగుతాడు. అ
ది చూసి - గుక్కెడు నీళ్ల కోసం ఊరి జనాన్ని ముష్టెత్తిముష్టెత్తి 
గొంతెండిపోయిన - మాదిగపల్లి జనమంతా ఆ వెనకే పెద్ద చెర్లోకి 
దిగిపోతారు. 
♦ప్రతాపరెడ్డిగారి కథలోని కమలమ్మ మతం మార్చుకుని సొంత సమస్య పరిష్కరించుకోగా, శ్రీపాద కథలోని విస్సయ్య అదే పని చేసి మొత్తం మాదిగపల్లి సమస్యను పరిష్కరించాడు. 
♦ఒకటి రెండు సంవత్సరాల ఎడంలో ఈ రెండు కథలూ ఒకే సమయంలో అచ్చుకావడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే, ప్రతాపరెడ్డిగారిలో
 ఓ శ్రీపాద కూడా దాగివున్నాడని అర్థమవుతుంది. 
♦నాకు తెలిసి ఇంత వైవిధ్యం కలిగివుండిన సాంస్కృతిక జీవి 
మరొకరు మన దేశంలోనే లేరు!
ఇంతటి వైవిధ్యం, వైశిష్ట్యం, ఆయా వ్యక్తుల సొంత కృషి మీద మాత్రమే సంతరించుకోవడం బహుశా అసాధ్యం. ఇది, చారిత్రిక పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన వైలక్షణ్యమే అయివుండాలి. అదే మాట చెప్పారు మిత్రులు కె.శ్రీనివాస్. ‘రాజకీయవాదులూ, సాహిత్య సాంస్కృతిక కార్యకర్తలూ, సంస్కర్తలూ, వేరువేరుగా ‘అవతరించేంత’ వ్యవధి కానీ, వెసులుబాటు నుంచి అంగలతో పరుగులెత్తడం దాకా శీఘ్రంగా వేయవలసి వచ్చిన అవసరం అది’ అన్నారాయన. అదేదో వ్యక్తిగతమయిన, కుటుంబపరమయిన అవసరం కాకపోవడం ప్రత్యేకంగా దృష్టిలో వుంచుకోవలసిన విషయం. అలాంటి అవసరాలు తీర్చడానికి ఎవరో ఒకరు పూనుకోకపోతే, ఆ లోటును మొత్తం జాతి అంతా భరించవలసి వస్తుంది. 
♦ఆ విషయం బాగా తెలిసిన బాధ్యతాయుతుడు కావడంవల్లనే, సురవరం ప్రతాపరెడ్డి బహుపాత్రలు నిర్వహించడానికీ, విభిన్న కర్తవ్యాలను ఏకకాలంలో నిర్వర్తించడానికీ పూనుకున్నారు. రాజబహద్దూర్ వెంకటరామారెడ్డి ఆయనకి ఆయా బాధ్యతలు అప్పచెప్పడం లాంఛనం మాత్రమే!
♦మనుషులు ‘కాల శిశువు’లని ఎవరో పెద్దాయన చెప్పాడు. ఆయనకి, సురవరం ప్రతాపరెడ్డిగారు బాగా తెలిసి వుండాలి!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩