🚩🚩 ధ్వజ స్తంభం. 🚩🚩
ధ్వజ స్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం.
ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తరువాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం.ధ్వజ స్తంభం దగ్గర కొట్టే గంటను బలి అంటారు.
ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తున కనిపించే ధ్వజస్తంభ దీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడా అవసరం లేకపోయినా కార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు.ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే, ఏమిటలా ధ్వజస్తంభంలా నిల్చున్నావు అంటుంటారు.కానీ ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు.ఆలయ ప్రాకారాలు చేతులవంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి.దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ద్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం.ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. లేకపోతే అవి మందిరాలు అవుతాయి. పూర్తయిన విగ్రహాన్ని కొంతకాలం ధాన్యంలో దాచుతారు. దానిని ధాన్యాధివాసం అంటారు. అలా కొన్నాళ్లు గడిచాక తీసి నీళ్లలో దాచుతారు. దానిని జలాధివాసం అంటారు.
మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాలైన వృక్షశాఖలను మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు.వీటిని ప్రతిష్ఠ చేసే ముందు ఈ దారువు (చెక్క) ను కూడా నీళ్లలో, ధాన్యంలో ఉంచి ఆ తరువాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు ఉంది. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణాలు, అర్చనలు జరుగుతుంటాయి.
మూలవిరాట్టుకు ఇచ్చే మర్యాద, గౌరవం మన్నన ధ్వజస్తంభానికి కూడా ఇవ్వాలి. నమస్కార ప్రదక్షిణాలు పూర్తిచేసిన తరువాతే భగవద్దర్శనం కోసం లోపలికి ప్రవేశించాలి. ధ్వజస్తంభం జీవితకాలం పూర్తయిన తరువాత మళ్లీ కొత్త దానిని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు. ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతిధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. గోపుర కలశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం, కలశంతో సమానంగా ఉంటే మధ్యమం, కలశం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అధమం . ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపులా దేవతలను ప్రతిష్ఠిస్తారు. పక్కనే బలిపీఠం పెడతారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం పూజ చేస్తారు. వైష్ణవాలయాలలో మూలవిరాట్టుకు ఎదురుగా గరుత్మంతుడు, శివాలయాలలో వీరభద్రుడు, రామాలయాలలో హనుమంతుడు విగ్రహాలు ఉంటాయి.
Comments
Post a Comment