#రేచుక్క


 #రేచుక్క

. ఘంటసాల బలరామయ్య .1952లో  ‘చిన్నకోడలు’ .అనే

 సాంఘిక సినిమాను నిర్మించారు. 

ఆయన తీసిన ఒకే ఒక సాంఘిక చిత్రం ఈ ‘చిన్నకోడలు’ సినిమా. తర్వాత అక్కినేనితో ఒక జానపద చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు. 

బలరామయ్య చేయూతతో తారాపథం చేరుకున్న అక్కినేని ఈ సినిమా తీసే రోజుల్లో మంచి డిమాండులో వున్నారు. ఆయన ఒప్పుకున్న ‘పరివర్తన’, ‘విప్రనారాయణ, ‘మిస్సమ్మ’, ‘అర్ధాంగి’, ‘రోజులుమారాయి’, ‘వదిన’ వంటి సినిమాలు వివిధ నిర్మాణ దశల్లో వున్నాయి. బలరామయ్య అక్కినేనిని పిలిపించి ‘రేచుక్క’ సినిమా గురించి చెప్పి అందులో నటించమని కోరారు. 

అక్కినేనికి కాల్షీట్లు సర్దుబాటుచేసే అవకాశం లేక డేట్లలో కొంత సడలింపు కోరారు. 

బలరామయ్యకు కోపమొచ్చి #ఎన్టీఆర్‌ని హీరోగా బుక్‌ చేశారు. అంజలిదేవి, ముక్కామల, సదాశివరావు, పేకేటి, నాగభూషణం ప్రధాన తారాగణంగా సినిమా మొదలుపెట్టి మూడు రీళ్లు తీశారు. జిక్కి ఆలపించిన #‘సంబరమే’...పండుగలే...చినదానా వన్నెదానా’ అనే పాట చిత్రీకరణ కూడా పూర్తయింది. 

కానీ 29 అక్టోబరు 1953 అర్ధరాత్రి గుండెపోటుతో బలరామయ్య అర్థాంతరంగా మరణించారు.

#ఘంటసాల బలరామయ్య మొదలుపెట్టిన రేచుక్క సినిమాని ఎలాగైనా పూర్తిచేసి అతనికి అంకితమివ్వాలని ప్రతిభాశాస్త్రి నడుం బిగించారు. బలరామయ్యకు అత్యంత సన్నిహిత మిత్రుడు పి.పుల్లయ్యను సంప్రదించి దర్శకత్వ బాధ్యతల్ని స్వీకరించమని కోరారు. 

చమ్రియా సంస్థ ఈ సినిమాకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. అయితే ఆర్థిక వనరుల లేమిని అర్థం చేసుకున్న ముఖ్య నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా పూర్తయ్యాక పారితోషికాలు తీసుకుంటామని పత్రాలు రాసి పంపిణీదారునికి సమర్పించారు. దాంతో ఇబ్బందులు లేకుండా సినిమా పూర్తయింది. ఉగాది కానుకగా సినిమా విడుదలయింది. సినిమాకు అద్భుతమైన టాక్‌ వచ్చింది. మూడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది కూడా.

#కథ సంవిధానం.

దేవరాయ మహారాజు (ముక్కుమల) తన ఐదేండ్ల రాకుమారుడు కుమారారాజా (మాస్టర్‌ నాగేశ్వరరావు) జన్మదిన వేడుకలు ఘనంగా జరిపిస్తాడు. మంత్రి (సదాశివరావు) మహారాజుతో తనకూతురు లలితాదేవి (బేబీఅమ్మలు-పెద్దయ్యాక దేవిక)ని కోడలుగా స్వీకరించమని ప్రతిపాదిస్తాడు. రాజు ఆగ్రహోదగ్రుదౌతాడు. మంత్రి తనకు అనుకూలంగా వ్యవహరించే సేనాపతి నాగులు (వైవిరాజు) సహకారంతో దేవాలయానికి వెళ్తున్న రాజును బందీ చేస్తాడు. రాజు అంతరంగికుడు చిటి వీరయ్య (నాగభూషణం) యువరాజును కాపాడి, ఒక మర్రిచెట్టు వద్ద విడిచి తను వేరే దారి పడతాడు. యువరాజును సర్పం కాటువేయగా జోగులు (గాదేపల్లి), కోనమ్మ (కాకినాడ రాజరత్నం) దంపతులు సంరక్షించి అతనికి కన్నయ్య (ఎన్టీఆర్‌) అనే పేరుపెట్టి మంచి సాహసవంతుడుగా పెంచుతారు. ఆటపాటలతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం సాగించే నానా (అంజలీదేవి)తో యువరాజు ప్రేమలో పడతాడు. ఈలోగా దేవరాయ మహారాజు చెరనుంచి తప్పించుకొని నానా ఆదరించగా ఆమె ఇంటిలో తలదాచుకుంటాడు. నానా చిటి వీరయ్య కూతురనే విషయం రాజుకు తెలియదు. సినిమా అనేక మలుపులు తిరిగి దేవరాయ మహారాజు కన్నయ్యను యువరాజుగా గుర్తించడం, క్రూరుడైన మంత్రిని యుక్తితో యువరాజు చంపించేయడంతో కథ సుఖాంతమౌతుంది.

#ఆసక్తికర అంశాలు!

మహారాజు దేవరాయల కొలువులో మహామంత్రి కూతురు లలితాదేవి పాత్రకు బలరామయ్య మరణించే నాటికి ఎవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి ఆ పాత్రను ఎవరైనా కొత్త అమ్మాయి చేత నటింపజేయాలని బలరామయ్య ఆశ. బలరామయ్య అభీష్టానికి అనుగుణంగా ప్రతిభాశాస్త్రి అన్వేషణ జరుపుతున్నప్పుడు నిశ్చల ఛాయాగ్రాహకుడు జైహింద్‌ సత్యం ఒక అమ్మాయి ఫోటో చూపించారు. తమిళ నటుడు యస్వీ సహస్రనామం ప్రదర్శించే నాటకాల్లో ఆ అమ్మాయి వివిధ పాత్రలు పోషిస్తూ వుండేది. వాకబు చేస్తే ఆ అమ్మాయి తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య మనవరాలని తెలిసింది. ఆ అమ్మాయి పేరు #‘ప్రమీల’. మద్రాసు నగర మేయరుగా ఉన్న వాసుదేవనాయుడు దర్శకుడు పుల్లయ్యకు అత్యంత సన్నిహిత మిత్రుడు. ఈ ప్రమీలకు ఆయన బాబాయి. ఆ విధంగా తొలిసారే ఎన్టీఆర్‌ సరసనగా నటించే అవకాశం ప్రమీలకు దక్కింది. ఈ సినిమా ప్రీవ్యూకి ప్రమీల హాజరైంది. ధరించింది ముఖ్యపాత్రే అయినా టైటిల్స్‌లో ఆమె పేరు కనిపించలేదు. పుల్లయ్యకు విషయం అర్థమైంది. ప్రమీలను పిలిచి ‘నీ పేరు #దేవికగా మార్చాం. అదే పేరు టైటిల్స్‌లో వేశాం ఇకపై నీ వెండితెర పేరు దేవిక’ అన్నారు. ప్రమీల ఆపై దేవికగానే నటించి మంచి పేరు తెచ్చుకుంది.

#అక్కినేనిని హీరోగా తీర్చిదిద్దిన ఘనత బలరామయ్యదే. రేచుక్క సినిమాలో చిన్ననాటి లలితాదేవిగా బలరామయ్య చిన్న కూతురు బేబీ అమ్మలు నటించింది. ఆయన అకాల మరణంతో కలతచెందిన అక్కినేని, బలరామయ్య ఆఖరి సినిమా ‘రేచుక్క’లో చిన్నపాత్రలోనైనాకనిపించఆయనఋణతీర్చుకోవాలనుకున్నారు.

 ఇందులో నానా పాత్ర ధరించిన అంజలీదేవికి

‘#ఎటుచూచిన బూటకాలే...ఎవరాడిన నాటకాలే’’ అనే పాట వుంది. నాట్యం చేస్తూ, ఆ నాట్యం చూడవచ్చిన వారివద్ద వున్న ద్రవ్యాన్ని దొంగలిస్తూ వుంటుంది. అక్కినేని ఆ సీనులో ఒక బాటసారి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు. ఆ పాట ఒకానొక చరణంలో ‘‘పాగా చుట్టావ్‌, పగిడీ పెట్టావ్‌-వేషం కట్టావ్‌, మీసం మెలేశావ్‌... దొరకొడుకా అడవుల్లో పులికి ఆకలేసి నీ మీదికి ఒక దుముకు దుమికితే...నిలబడి కలబడతావా... లాలించి లంచం పెడతావా’ అంటూ అంజలీదేవి అక్కినేనిని ఉద్దేశించి అడుగుతూ, సొమ్మున్న సంచిని తస్కరిస్తుంది. అప్పుడు ఎన్టీఆర్‌ కల్పించుకొని ఆ సొమ్మును అక్కినేనికి తిరిగి ఇప్పిస్తారు.

అలా అక్కినేని తన ఆశయాన్ని నేరవేర్చుకున్నారు. అక్కినేని ఎన్టీఆర్‌తో కలిసి నటించిన 15 సినిమాల్లో ‘రేచుక్క’ మూడవది. ఎన్టీఆర్‌కు ఈ సినిమాలో నటించినందుకు ఇచ్చిన పారితోషికం పదిహేను వేలు. కేవలం నలభై రోజుల్లోనే రేచుక్క నిర్మాణం పూర్తి చేసుకోవడం వెనుక ప్రతిభాశాస్త్రి ప్రణాళిక, సుందర్లాల్‌ నహతా వేగం వున్నాయి.

💥💥💥💥💥💥💥💥💥💥


Comments

Post a Comment

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!