🌹💥 మన సత్యనారాయణపురం . 💥🌹

 🌹💥 మన సత్యనారాయణపురం . 💥🌹

♦*మా బెజవాడలో ఆ పేటలో ఉండాలనే కోరిక,చిన్నతంలో మెండుగా

ఉండేది నాకు....అక్కడి స్థానికుల్ని చూస్తే రవంత అసూయ కూడా

కలిగేది.ఏదో ఒక పని కల్పించుకొని,కాసేపు ఆ పేటలో తిరిగి,తృప్తి

పడేవాణ్ణి.


♦అలాగని,అక్కడేమీ ఆకాశ హర్మ్యాలుండేవి కావు..

నక్షత్రాల హోటళ్లసలే కనపడేవి కావు...విశాలమైన రోడ్లు మనకు

ఆహ్వానం పలుకుతాయా అంటే అదీ లేదు.

ఇంతకీ అక్కడ నాకు నచ్చిన అంశాలేమిటో తెలుసా!...

♦#నిత్యం,కళకళలాడుతూ తిరిగే మధ్యతరగతి మనుష్యులు..ఏరోజు

సరుకులు ఆరోజు కొనుక్కుని,సంతోషంగా,తృప్తిగా జీవనం సాగించే

సగటు జీవులు..

♦#అడుగడుగునా దర్శనమిచ్చే గుళ్లు,ఆ గోపురాలపై,లౌడ్ స్పీకర్లలో

ప్రాతఃకాలంలో వినిపించే భక్తి గీతాలు...ఇళ్లముందు అరుగులపై కూర్చొనిముచ్చట్లు చెప్పుకొనే ముత్తయిదువులు...వారి నుదుట రూపాయికాసంత కుంకుమ బొట్లు...ముచ్చటైన ముక్కుపుడకలు...గుబాళించేమల్లెల ఘుమఘుమలు..

♦ఇంటి తరహా భోజన,ఫలహారాలు వండి

వడ్డించే బ్రాహ్మణ హోటళ్లు..అప్పడాలపిండి ముద్దలు,ఊరగాయ

పచ్చళ్లు,వేడివేడి మిరపకాయ బజ్జీలు,పెసర పుణుగులు,మద్రాసు తరహానఖార్సయిన ఫిల్టర్ కాఫీ బడ్డీలూ....ఒకటేమిటి? అన్నీ అక్కడ

నోరూరిస్తూ పలుకరిస్తాయి.

♦#శివాజీకేఫ్ సెంటర్లో ఘాటైన గోలీసోడా, మిఠాయి కిళ్లీ ప్రత్యేకాకర్షణలు!

..

ఆప్రక్కనే #శివాలయం..బయట కూర్చొని,జంధ్యాలు అమ్మే బక్కచిక్కినముదుసలి బ్రాహ్మణులు..నుదుట విభూతి రేఖలతో,పిలక

ముడిగట్టి,సర్రున సైకిలెక్కి చక్కాపోయే యువ పురోహితులు...చేతి సంచీధరించి,పచారీ కొట్లలో గీచిగీచి బేరమాడే అతివలు,

అమ్మ ఆజ్ఞపై అరిశలపిండి మరపట్టిస్తూ,పిండిమర బయట పడగాపులు పడేపిల్లకాయలు....ఉద్యోగ బంధవిముక్తులై,విశ్రాంత జీవితాన్ని రిక్షాలోకాలుమీద కాలేసుకొని కూర్చొని అనుభవిస్తూ సాగిపోయే ముదిమివయస్కులు..

♦గోచిపోసికట్టిన చీరె కొంగు ఒకచేత్తో,విస్తరాకుల మూట ఒక

చేత్తో పట్టుకొని,రొప్పుతూ సిటీబస్సు ఎక్కేవంటలక్కలు..

#శృంగేరీపాదుకాక్షేత్రం బయట మెట్లపక్క చేరి,వచ్చిన సంభావనలను పంచుకొనేబ్రహ్మలు...

♦ఇరుకైన ఆరోడ్లపై గుంపులుగా గోమాతలు,వాటిని

తప్పించుకుంటూపోటీలుపడి పరిగెత్తే మూడు,పద్ధెనిమిది నంబరు

సిటీబస్సులు...వీటన్నిటికీ మించి...ఏపండగొచ్చినా అక్కడి సందడే సందడి!

♦.#సంక్రాంతి వచ్చిందంటే,ప్రతి ఇంటి గుమ్మానికీ మామిడి

తోరణాలు,ముంగిట ముత్యాల ముగ్గులు..గొబ్బెమ్మలు...తీరుగా తీర్చిన

బొమ్మలకొలువులు...సాయంత్రం వీధులవెంట రంగురంగుల

పట్టుచీరెలు కట్టి,కాళ్లకు పసుపు పట్టించి,సకలాభరణ

భూషితలై,తలనిండ పూదండలు దాల్చి, గుంపులు గుంపులుగా

దర్శనమిచ్చే పేరంటాళ్లతో ఒకటే కోలాహలం...

♦ఆ పేటలో అయితేనాలుగు రాళ్లు సంపాదించటం ఖాయమని తెలిసినడూడూబసవన్నలు,హరిదాసులు,పులివేషాలు,

పిట్టలదొరలు...

♦రామనవమి,దసరా,వినాయకచవితి పండగలొస్తే,రాత్రిళ్లు

#ప్రతి కూడలిలో హరికథలు,కూచిపూడి నృత్యాలు,సంగీత

కచేరీలు,పౌరాణిక నాటకాలు..దీపాలంకరణలు....ఆ పేటకే

ప్రత్యేకతలు..ఎన్నోమార్లు అక్కడి వీధులలోని పందిళ్లలో పాటకచేరీలు

చూసాను నేను!..

.

♦#శ్రావణ శుక్రవారాలలో,కార్తీక సోమవారాలలో,

వినాయక చవితి రోజుల్లోఆపేట రోడ్లపై నడవటమే దుర్లభం...అంత రద్దీగా ఉంటాయి...అక్కడి రైల్వే స్టేషన్ కళే వేరు...

♦తెల్లారగట్టే,పాలబండి కోసం,సైకిల్ కి

బిందెలుకట్టుకొని వచ్చే కోరమీసాల పాలబ్బాయిలతో నిండిపోయేది.

.రైలు పట్టాలప్రక్కగా నడుచుకొని,నల్లగేటు మీదుగా ఆ పేటలో

అడుగుపెట్టేవాళ్లం..

♦ఏకేటీపీ స్కూల్ అంటే..'ఆంధ్రకేసరి టంగుటూరి

ప్రకాశం పంతులు'స్కూల్ అని ఆరోజుల్లో తెలియదు మాకు.మాకు

తెలిసిందల్లా అక్కడి నేరేడు,మేడిచెట్ల పైకి రాళ్లేసి,కాయలు కొట్టటం

ఒక్కటే...ఇక రైల్వే కాలనీ అయితే..మామిడి కాయలు కొట్టుకోటానికి

ప్రసిద్ధి.

♦#పాతికేళ్లక్రితం,ఆపేటలోని రైల్వేలైను తొలగించినప్పుడు

చివరి 'పాలబండి'కి కన్నీళ్లతో హారతులిచ్చి,వీడికోలుచెప్పారట

ఆ పేటవాసులు!అంతగా అక్కడివారి జీవితాలతో పెనవేసుకుపోయింది ఆ రైల్వేస్టేషన్...

♦మారుతీవ్యాయామశాల,శిశు విద్యామందిర్,ప్రక్కనే కేఎల్రావు

బిల్డింగ్,రాజన్ కిళ్లీషాపు,బాబూరావుమేడ,పిల్లల జైలు,అగ్గిపెట్టెల

ఫాక్టరి,ఆంధ్రరత్న పార్కు..ఆ పార్కులో ఎత్తుగా స్తంభానికి కట్టిన స్పీకర్

నుంచి వినిపించే రేడియో 'బావగారి కబుర్లు'...మరిచిపోలేని రోజులవి...

దాక్షిణ్యంవారివీధిలో,లంకావారి 'పారుపల్లిరామకృష్ణయ్యపంతులు

సంగీత విద్యాలయం',నృత్య శిక్షణాలయాలు,జ్యోతిష,వాస్తు కేంద్రాలు

ఉన్నాయక్కడ!ఇక,ఇళ్లకొచ్చి సంగీత పాఠాలుచెప్పే పంతులమ్మలెందరో!.

..

.♦పద్మవిభూషణ్ బాలమురళీకృష్ణగారి స్వగృహం ఆపేటలోనే

ఉంది..ఆయన బాల్యమంతా ఆ వీధుల్లోనే గడిచింది

.'#సంగీత సన్మండలి' నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు

విచ్చేసి,ఉంఛవృత్తి,నగర సంకీర్తనలో పాల్గొని...చిన్ననాడు తను

నడయాడిన వీధులలో నడచి,తను ఆటలాడిన ప్రదేశాలను తనివారా

చూసుకున్నారాయాన తన డెబ్భై అయిదేళ్ల వయసులో....చివరిసారిగా...

ఇంతకీ...మీకు నేను ఆ పేటపేరు చెప్పలేదు కదూ!...

♦బెజవాడ తెలిసినవారెవరైనా ఈపాటికి ఊహించే

ఉంటారు.అదే..'సత్యనారాయణపురం'...

కుర్రకారు,సాయంత్రంపూట,'కలరింగ్' పేరుతో,బాపూబొమ్మల్లాంటి

అమ్మాయిలను చూడటానికి సత్యనారాయణపురం వీధుల్లో తిరగటం

గొప్పగా ఫీలయ్యేవాళ్లం..

♦అందంగా,లక్షణంగా ఉండే ఆడపిల్లలు వీధుల్లో

దర్శనమిచ్చేవారు.

అక్కడి వీధులపేర్లన్నీ దాదాపుగా విప్రోత్తముల ఇంటిపేర్లే!..అక్కడ

చాలావరకూ శిధిల భవనాలే...

అయితే..కాలం మారుతోంది.అక్కడా వాణిజ్య భవన సముదాయాలు

వచ్చేస్తున్నాయి.ప్రజలలో మార్పు వస్తోంది.కట్టు,బొట్టు,సంప్రదాయాలు

అదృశ్యమైపోతున్నాయి.

♦సత్యనారాయణపురాన్ని ఆనుకొని ఉండే మా

గాంధీనగర్ అయితే 'బ్రాందీనగర్' గా రూపాంతరం చెందింది.సినిమాపిచ్చి జనం పెరిగిపోయారు.ఎంతటి రోడ్లైనా

ఆక్రమిత వ్యాపారాలతో,అపరిమిత వాహన కాలుష్యాలతో నిండిపోయి

కనిపిస్తున్నాయి.

సత్యనారాయణపురంలో మాత్రం ఇంకా పాతవాసనలు

పోలేదు.

అందుకే..సత్యనారాయణపురమంటే నాకిష్టం....

-------•°○●{}●○°•------

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐