🍂 ❤ 🌹 -కృష్ణం వందే జగద్గురుమ్,- 🌹 ❤ 🍂



♦శ్రీకృష్ణుడి జీవితాన్ని అనుశీలిస్తుంటే మనం ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం. కళ్లు తెరిచింది కటకటాల్లో... ఊపిరి పీల్చింది అపాయాల్లో... బతుకు గడిచింది గండాల్లో... చివరకు చరమ దశా పరమ చేదే! కాలి బొటన వేలికి వేటగాడి బాణం నాటుకొని ప్రాణాలు తోడేస్తుంటే... బొట్టు బొట్టుగా నెత్తురు స్రవించి కడకు దేహం నిర్జీవంగా నేలకూలిపోవడమంటే- బతుక్కి ఎంత విషాదభరితమైన ముగింపు! ఏమనాలి ఆ జాతకాన్ని?

♦చిత్రం ఏమంటే- అదే జాతకుడి చిరు కర స్పర్శ మృతశిశువు పరీక్షిత్తుకు ప్రాణం పోసింది. కురూపి కుబ్జను అద్భుత సౌందర్యరాశిని చేసింది. కన్ను తెరవలేని స్థితిలో అంపశయ్యపై మేను వాల్చిన భీష్మ పితామహుడి చేత గొప్పగా ధర్మబోధ చేయించి లోకం కళ్లు తెరిపించింది.

♦ఆశ్చర్యం ఏమంటే- ఆయనను నమ్ముకున్న వారంతా రకరకాల చిక్కుల్లోంచి, అపాయాల్లోంచి, పెను గండాల్లోంచి ఆయన అండతోనే క్షేమంగా బయటపడ్డారు. ‘నీలో లేని చోద్యాలు ఈ లోకంలోనే ఉండవు సుమా! అసలు చోద్యం అంటే నువ్వే...’ అని ఆశ్చర్యపోయాడు భాగవతంలో అక్రూరుడు. కోరికతో, భయంతో, భక్తితో, బంధంతో, ప్రేమతో, కోపంతో, స్నేహంతో... ఏదో రకంగా తనను పొందమని ప్రోత్సహించాడాయన. అలా పొందినవారందరినీ అందలాలెక్కించాడు. ముక్తిని ప్రసాదించాడు.

♦భాగవత కృష్ణుడు రసజ్ఞ మనోజ్ఞ మూర్తి. 

♦భారత కృష్ణుడు (అ)లౌకిక విశేష ప్రజ్ఞానిధి. 

♦రెండూ సర్వ సమగ్ర వ్యక్తిత్వాలే! ‘కృష్‌’ అనే ధాతువుకు ఆకర్షించేదని అర్థం. కృష్ణుడి భారత భాగవత వ్యక్తిత్వాలు రెండూ పరమ ఆకర్షణీయమైనవే. భారత కృష్ణుడు ధీరోదాత్తుడు. సమీపించాలంటే సందేహం పుట్టించే గంభీరమూర్తి. మొదట్లో రాజనీతిజ్ఞుడిగా, వ్యూహ చతురుడిగా... గీతాచార్యుడిగా మారాక, అనన్య సామాన్య వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, స్ఫూర్తిదాతగా, నేతగా ప్రౌఢమైన వ్యక్తిత్వం భారత కృష్ణుడిలో మనకు పరిచయం అవుతుంది. ముక్క చెక్కలైన చిన్ని చిన్ని రాజ్యాలను ఒక్క ఛత్రం కిందకు తెచ్చి, కేంద్ర రాజ్య వ్యవస్థను నిర్మించి, దేశాన్ని బలోపేతం చేసిన రాజ్యాంగ నాయక నిర్మాతగా భారత కృష్ణుడి పాత్ర ఆలోచనా రమణీయం.

♦నీలి వెన్నెలలు, వేణుగానాలు, వన విహారాలు, దాగుడు మూతలు, రాసలీలలు... వీటి అన్నింటి రమణీయ రసానుభూతులను గోపికలకే కాదు, మనకూ పంచిన ఆర్ద్ర మనోహర ఆప్తసఖుడు భాగవత కృష్ణుడు. చిలిపి చేష్టల ముసుగులో అఖండ చిన్మయ తత్త్వాన్ని ఆవిష్కరించి ‘కృష్ణమాయ’లో ముంచెత్తిన చిత్తచోరుడు, ధీర లలితుడు. భాగవత కృష్ణుడు. ధీరోదాత్తుడైన భారత కృష్ణుణ్ని అధ్యయనం చేయడమంటే- విశ్వరూప సందర్శన భాగ్యాన్ని అన్వేషించడం. ధీర లలితుడైన భాగవత కృష్ణుణ్ని ఆస్వాదించడమంటే- మనిషి తన అంతర లోకాల్లోకి ప్రయాణించడం. ఇవి విభిన్న అభిరుచులకు చెందిన సంస్కార విశేషాలు. మనిషిలోని స్త్రీ ప్రకృతి- భాగవత కృష్ణుణ్ని ఆరాధిస్తుంది. పురుష ప్రకృతి- భారత కృష్ణుణ్ని ఆవాహన చేసుకోవాలని ఆశిస్తుంది.

♦కృష్ణాష్టమిని- గోకులాష్టమిగాను, కృష్ణజయంతిగాను రెండు రకాలుగా వ్యవహరించడంలో రహస్యం ఏమంటే- మొదటిది భాగవత కృష్ణుడికి చెందినది. అది అనుభూతి ప్రధానం. రెండోది, భారత కృష్ణుడికి సంబంధించినది. అది ఆలోచనామృతం. ఆలోచన, అనుభూతి ఏకమైన మనిషికి ‘రాసయోగం’ సిద్ధించడమే కృష్ణ ఆరాధనకు పరమ గమ్యం!

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐