రుక్మిణీ కళ్యాణం.!🌹 🚩 రుక్మిణి గౌరీ పూజ - కోన సాగింపు- 8- (పోతనామాత్యుడు )

🔔🔔



.

🔴

కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ సర్వం మరచి మన్మథతాపంతో వేగిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకంగా ఎడంకన్ను, ఎడంభుజం, ఎడంకాలు అదిరాయి; అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుడు పంపగా వచ్చేడు; అతని ముఖకవళికలు చూసి మిక్కలి ఉత్సుకతతో రుక్మిణి చిరునవ్వుతో ఎదు రెళ్ళింది; అప్పుడా బ్రహ్మణుడు ఇలా అన్నాడు. . .

🔔🔔.

♦"మెచ్చె భవద్గుణోన్నతి; కమేయ ధనావళు లిచ్చె నాకుఁ; దా

వచ్చె సుదర్శనాయుధుఁడు వాఁడె; సురాసురు లెల్ల నడ్డమై

వచ్చిననైన రాక్షసవివాహమునం గొనిపోవు నిన్ను; నీ

సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించెఁ గన్యకా!"❤

.

(“నీ సుగుణాల్ని మెచ్చుకున్నాడమ్మా. అంతులేని ధనాన్ని

నాకిచ్చాడు. చక్రి తానే స్వయంగ వచ్చేడు. దేవదానవు లడ్డమైనా సరే నిన్ను తీసుకువెళ్తాడు. నీ మంచి తనం అదృష్టం ఇవాళ్టికి ఫలించాయమ్మా.” అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త చెప్పాడు.)

.

అలా శుభవార్త చెప్పిన విప్రునితో విదర్భ రాకుమారి రుక్మిణి ఇలా అంది.

.♦"జలజాతేక్షణుఁ దోడితెచ్చితివి నా సందేశముం జెప్పి; నన్

నిలువం బెట్టితి; నీ కృపన్ బ్రతికితిన్ నీ యంత పుణ్యాత్మకుల్

గలరే; దీనికి నీకుఁ బ్రత్యుపకృతిం గావింప నే నేర; నం

జలిఁ గావించెద; భూసురాన్వయమణీ! సద్బంధుచింతామణీ!"❤.

🔔🔔

(“ఓ సద్భ్రాహ్మణ శ్రేష్ఠుడా! ప్రియబాంధవోత్తముడా! నా సందేశం అందించి పద్మాక్షుడిని వెంటబెట్టుకొచ్చావు. నా ప్రాణాలు నిలబెట్టావు. నీ దయ వలన బతికిపోయాను. దీనికి తగిన మేలు చేయలేనయ్య. నమస్కారం మాత్రం పెడతాను.”)

.

ఇలా రుక్మిణి, విప్రునికి నమస్కరించింది. 

ఈలోగా భీష్మకుడు బలరామ కృష్ణులు తన పుత్రిక పెళ్ళికి వచ్చారని 

విని మంగళవాద్యాలతో ఆహ్వానించాడు. 

తగిన మర్యాదలు చేసి మధుపర్కాలు ఇచ్చాడు. అనేక రకాల వస్త్రాలు, ఆభరణాలు మొదలైన కానుకలు ఇచ్చాడు. వారికి వారి బంధువులకి సైన్యానికి తగిన నిండైన విడిదులు ఏర్పాటు చేసాడు. వారివారి శౌర్య బల సంపదలకి వయస్సులకు అర్హమైన కోరిన పదార్ధాలన్ని ఇప్పించి మర్యాదలు చేసాడు. అప్పుడు చక్రి వచ్చాడని విదర్భలోని పౌరులు వచ్చి దర్శనం చేసుకొని, అతని మోము తిలకించి ఇలా అనుకోసాగారు.

🔔🔔

.♦తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం

దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱం

దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియై

మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."❤.

(“ఈ చక్రాయుధుడైన శ్రీకృష్ణుడు మా విదర్భరాకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం. ఈమె అతనికి తగినామె. ఈ రుక్మిణీ కృష్ణులు ఒకరికొకరు సరిపోతారు, ఎంత మంచి జంటో. వీరిద్దరిని కూర్చిన బ్రహ్మదేవుడు కడు సమర్థుడే మరి. మా పుణ్యాల ఫలంగా ఈ వాసుదేవుడు పగవారి పీచమణచి మా రుక్మిణిని పెళ్ళాడు గాక.”)

.

అని పలికి రా సమయంబున.

🔔🔔

.♦సన్నద్ధులై బహు శస్త్ర సమేతులై; 

బలిసి చుట్టును వీరభటులు గొలువ

ముందట నుపహారములు కానుకలు గొంచు; 

వర్గంబులై వారవనిత లేఁగఁ

బుష్ప గంధాంబర భూషణ కలితలై; 

పాడుచు భూసురభార్య లరుగఁ

బణవ మర్దళ శంఖ పటహ కాహళ వేణు; 

భేరీధ్వనుల మిన్ను  పిక్కటిలఁగఁ ❤

.♦దగిలి సఖులు గొల్వఁ దల్లులు బాంధవ

సతులు దోడ రాఁగ సవినయముగ

నగరు వెడలి నడచె నగజాతకును మ్రొక్క

బాల చికుర పిహిత ఫాల యగుచు.

❤.

🔔🔔

(అప్పుడు, రుక్మిణి గౌరీ పూజ చేయడానికి నగరం బయటకి బయలు దేరింది; ఆమె నుదిటి మీద ముంగురులు ఆవరించాయి; సర్వాయుధాలతో సర్వసన్నధంగా ఉన్న శూరులు చుట్టు కొలుస్తున్నారు; 

వారవనితలు ఫలహారాలు కానుకలు పట్టుకొని వరసలు కట్టి ముందర నడుస్తున్నారు; 

సర్వాలంకార శోభిత లైన విప్రుల భార్యలు పాటలు పాడుతు వస్తున్నారు; మద్దెలలు, తప్పెట్లు, శంఖాలు, బాకాలు, వేణువులు, భేరీలు మొదలైన మంగళవాయిద్యాల చప్పుళ్ళు మిన్నంటుతున్నయి; 

చెలికత్తెలు చేరి కొలుస్తున్నారు; తల్లులు, బంధువులు, అంతఃపుర స్త్రీలు కూడా వస్తున్నారు;)

.

అక్కడక్కడ సూత వంది మాగధులు వంశకీర్తి, పరాక్రమం వర్ణిస్తున్నారు స్తోత్రాలు చేస్తున్నారు, గీతాలు పాడేవాళ్ళు పాడుతున్నారు, పద్యాలు చదివేవాళ్ళు చదువుతున్నారు. స్వయంవర పెళ్ళికూతురు, రుక్మిణి మెల్లగా నడుస్తూ చక్రి పాదాలు స్మరిస్తూ ఉమాసతి గుడికి చేరింది. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని, గౌరీదేవి దగ్గరకు వెళ్ళింది. బ్రాహ్మణ ముత్తైదువలు శివపార్వతులకు అభిషేకం చేసి, అక్షతలు పూలమాలలు వస్త్రాభరణాలు అలంకరించారు. కానుకలు దీపాలు నివేదించారు. రుక్మిణిచేత మొక్కించారు, అప్పుడు.

🔔🔔

.♦#"నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్

మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె

ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని

న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!"❤.

(“తల్లుల కెల్ల పెద్దమ్మ! పార్వతీదేవి! ఆదిదంపతులు పురాణదంపతులు ఐన ఉమామహేశ్వరులను మిమ్మల్ని మనస్పూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నా కదమ్మ. ఎంతో దయామయివి కదమ్మా. నిన్ను నమ్మినవారికి ఎప్పటికి హాని కలుగదు కదమ్మ. నాకు ఈ వాసుదేవుణ్ణి భర్తని చెయ్యి తల్లీ!” అంటు గౌరీపూజచేసిన రుక్మిణీదేవి ప్రార్థించుకుంటోంది. రుక్మిణికి కృష్ణుడు వచ్చేడని తెలుసు కాని ఇంకా కలవలేదు.)

.

రుక్మిణిదేవి దుర్గమ్మకు అలా మొక్కింది. బ్రాహ్మణదంపతులకు ఉప్పు, అప్పాలు, తాంబూలాలు, మెడలో వేసుకొనే తాళ్ళు, పళ్ళు, చెరకు గడలు దానం చేసి పూజించింది.❤

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩