🍀విధిరాతను తప్పించలేరు🍀
✍✍
దేవతల రాజైన ఇంద్రుడు ఓసారి కాశీ నగరంలో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. భూలోకంలోని రాజులు, ఋషులు, మామూలు ప్రజలు, జంతువులు, పక్షులు, కీటకాలు- అందరినీ ఆ సమావేశానికి ఆహ్వానించాడు. "అక్కడ ప్రతి ప్రాణీ తమ కష్టాల్ని నేరుగా దేవతలకు విన్నవించుకోవచ్చు" అని ప్రకటించాడు.
దాంతో చాలా మంది ఎక్కడెక్కడినుండో చేరుకున్నారక్కడికి. వరసగా అందరూ సభ లోకి వెళ్తున్నారు.
ఆ సభ వాకిలి మీద ఒక చిలుక వాలి ఉంది. ప్రతి ఒక్కరినీ మర్యాదగా పలకరిస్తున్నది అది. అందరూ దాన్ని చూసి ముచ్చట పడుతూ లోనికి పోతున్నారు.
ఇంద్రుడి పిలుపును అందుకొని యమ- ధర్మరాజు కూడా వచ్చాడు, ఆ సభకు. యముడిని కూడా మర్యాదగా లోనికి ఆహ్వానించింది చిలుక.
యముడు మృత్యువుకు అధిపతి: ఏ ప్రాణి ఎప్పుడు, ఎక్కడ చచ్చిపోతుందో ఆయనకు తెలుసు. అట్లాంటి యముడు సభలోకి పోతూ-పోతూ, వెనక్కి తిరిగి మరీ ఆ చిలుక కేసి చూశాడు. పూర్తిగా లోనికి పోబోతూ మళ్ళీ ఓసారి ఆగి, చిలుక వైపుకు తిరిగి చూసి- నవ్వాడు కూడా!
అప్పటివరకూ సంతోషంగానే ఉన్న చిలుకకు ఇప్పుడు దిగులు మొదలైంది- "ఎందుకు, ఈ యముడు నన్ను చూసి ఎందుకు నవ్వాడు?" అని బెంగ మొదలైంది.
క్షణ క్షణానికీ దాని బెంగ ఎక్కువైంది. కొద్ది సేపట్లోనే అది నీరసపడిపోయింది. దానికి కళ్ళు తిరగటం మొదలు పెట్టాయి. వాంతి వచ్చినట్లయింది- అంతలో పక్షిరాజు గరుత్మంతుడు అక్కడికి వచ్చాడు. ఆయన కూడా సభలోనికి పోబోతూ చిలుక పరిస్థితిని గమనించి పలకరించాడు- ఏం చిలకమ్మా, దిగులుగా ఉన్నావు? నీ సమస్య ఏమిటి? నాకు చెప్పు; నేను నీకు ఏ సాయం కావాలన్నా చేస్తాను" అన్నాడు.
చిలుకకు ప్రాణం లేచివచ్చినట్లయింది. "నీకు గాక ఇంకెవరికి చెప్పుకుంటాను స్వామీ! మా పక్షులందరికీ పెద్ద వాడివి నువ్వే కదా! అందుకని నా కష్టాన్ని నీకే చెప్పుకుంటాను. విను- ఇందాక యముడు సభ లోకి వెళ్ళాడు. నన్నే మళ్ళీ మళ్ళీ చూస్తూ పోయాడు. చివరికి వెనక్కి తిరిగి నావైపు చూసి నవ్వాడు కూడా! నాకు భయం వేస్తున్నది. అతని నవ్వు గుర్తుకొచ్చినకొద్దీ నాకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లనిపిస్తున్నది. లేకుంటే అంతమందిలో నన్ను ఒక్కడినే వేరుచేసి ఎందుకు చూస్తాడు యముడు? నాకిప్పుడు మనసు మనసులో లేదు. ఇక ఎవ్వరినీ స్వాగతించలేను.
ఎక్కడికన్నా వెళ్ళి దాక్కుందామనిపిస్తున్నది. నా వెంటపడి తరిమే మృత్యువుకి అందకుండా ఎక్కడికన్నా వెళ్ళిపోదామని ఉన్నది" గరుడుడికి చెప్పుకొని ఏడ్చింది చిలుక.
"ఓసి! ఇంతేనా! నువ్వు దిగులు పడకు! నిన్ను నేను కాపాడతాను. ఈ భూలోకంలో సురక్షిత స్థలాలకోసం వెతికి వేసారేదెందుకు? వేరే చోట ఎక్కడా అవసరం లేదు. మా పక్షి జాతి దానివి నువ్వు- ఎవరికీ అందకుండా నేను నిన్ను నేరుగా దేవలోకంలో విడిచి వస్తాను- పద; నీకెందుకు భయం!" అని గరుత్మంతుడు దాన్ని తన వీపు మీద ఎక్కించుకొని క్షణాల్లో దేవలోకం చేరుకు-న్నాడు. అక్కడ దాన్ని నందనవనంలో వదిలి- "బాగుందా, ఇక్కడ? ఏది కావాలన్నా ఊరికే కోరుకో చాలు- అది నీ సొంతం అవుతుంది. ఇక భయపడవుగా?! నేను సభకు వెళ్ళొస్తా మరి- ఉండు!" అని దాన్ని అక్కడ విడిచిపెట్టి పోయాడు.
సభంతా ముగిసిన తరువాత అందరూ బయలుదేరి బయటికి వస్తున్నారు. యమ-ధర్మరాజు కూడా బయటికి వస్తూ అంతకుముందు చిలుక కూర్చున్న వాకిలి వైపు చూశాడు. చిలుక అక్కడ లేదు! యముడి నొసలు ముడి పడ్డాయి. ఆయన అటు వైపు వెళ్ళి, చిలుక కోసం వెతకటం మొదలు పెట్టాడు.
అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి, యముడిని చూసి నవ్వాడు- "ఏమి యమధర్మరాజా! ఏదో వెతుకుతున్నావు?" అని అడిగాడు.
"ఈ వాకిలి మీద ఒక చిలుక ఉండింది ఇందాక- 'అది ఇప్పుడు ఎక్కడ ఉన్నదా' అని వెతుకుతున్నాను" అన్నాడు యముడు.
గరుత్మంతుడు గర్వంగా నవ్వాడు- "ఏమి, దాని ప్రాణాలను తీసుకు పోదామనుకున్నావా? అది ఇప్పుడు ఇక్కడ లేదు.
నువ్వు ఇందాకదాన్ని చూసి నవ్వావట గదా- అది చాలా భయపడింది. అందుకని నేను దాన్ని తీసుకెళ్ళి, నీకు అందని చోట- దేవలోకంలో- దాచి వచ్చాను" అన్నాడు.
"అయ్యో! ఎంత పని చేశావు!" అన్నాడు యముడు, తల పట్టుకొని.
"ఏమైంది?" అడిగాడు గరుడుడు.
"ఇందాక నేను దాన్ని చూసి, దాని మరణం ఏవిధంగా ఉండనున్నదో చదివాను- 'కొద్ది సేపటిలో ఈ చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోతుంది' అని రాసి ఉంది దాని నుదుటన! 'భూలోకంలోని ఈ పక్షి దేవలోకానికి ఎట్లా పోతుంది? -అదీ కొద్ది సేపట్లో ఎట్లా పోతుంది?- పోయి అక్కడ ఎట్లా చనిపోతుంది? -అంతా అబద్ధం; జరిగే పని కాదు!' అనుకొని నవ్వాను నేను! చూడగా నువ్వు విధివ్రాతను నిజం చేసినట్లున్నావు- ఇప్పుడు అది ఎలా ఉన్నదో ఏమో!" అన్నాడు యముడు బాధగా.
ఆ సరికి నిజంగానే చిలుక దేవలోకంలో నీటమునిగి చనిపోయి ఉన్నది!
"చేతులారా చిలుకను మృత్యువు వాకిటికి చేర్చానే!" అని బాధపడుతున్న గరుడుడిని ఓదారుస్తూ యముడు అన్నాడు-"విధిని తప్పించటం ఎవరి తరమూ కాదు గరుడరాజా, నేను కూడా విధివ్రాతకు లోబడి వర్తించాల్సిందే!" అని.✍✍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment