🚩🚩 -'ఎసరూ- అత్తిసరూ' - 🚩🚩 (బి.వి.ఎస్. రామారావు)


🚩🚩 -'ఎసరూ- అత్తిసరూ' - 🚩🚩

(బి.వి.ఎస్. రామారావు)

#గోదావరి గాలి సోకినా , గోదావరి నీళ్ళు తాగినా , ఆ ప్రాంతపు మట్టి వాసన పీల్చినా చాలు… ఆ గోదారి కెరటాల్లా హృదయంలో ఏవేవో అనుభూతులు చెలరేగుతాయి. ఆ అనుభూతులని ఒడిసి పట్టి, వాటిని అందమైన భావాలుగా కవిత్వీకరించో, కథలుగా మార్చో ఎందరో కవులూ , రచయితలూ తమతమ సాహితీ కేదారాలను సస్యశ్యామలం చేశారు. 

నేటికీ గోదావరీ నది కేంద్రంగా తెలుగులో అనంతమైన సాహితీ రసఝరి నాలుగు దిక్కులా ప్రవహిస్తూనే ఉంది.

ఒకరా… ఇద్దరా..? ఎందరి పేర్లు చెప్పగలం? ఎన్నని రచనలు ఉదాహరించగలం? వందల సంవత్సరాలుగా వేలాదిమంది భావుకులకు గోదావరి ఆలంబనగా నిలుస్తూనే ఉంది. మధురమైన రచనలను సృష్టించడానికి స్ఫూర్తిని ఇస్తూనే ఉంది.

అలాగే ఎందరో చలనచిత్ర దర్శకులు గోదావరి అందాల్నీ, అక్కడి మనుషుల జీవితాలనీ చక్కటి దృశ్యకావ్యాలుగా మలిచి ప్రజలని పరవశింప చేశారు. ముఖ్యంగా  ఆదుర్తి, కె. విశ్వనాథ్, వంశీ , బాపు-రమణ వంటి వారలు గోదావరి నేపథ్యంగా గొప్ప చిత్రాలు నిర్మించారు.

#బాపు- రమణలకు ,  సీతారామం అని పిలుచుకునే బాల్య స్నేహితుడు ఒకాయన ఉన్నారు. ఆయన పూర్తిపేరు–  భావరాజు వెంకట సీతారామారావు.  ఈయన మద్రాసు ‘ కేసరి' హైస్కూల్లో బాపు-రమణ గార్లతో కలిసి చిన్నప్పుడు చదువుకున్నారు. ఆ స్నేహం అలా కొనసాగుతూనే వచ్చింది. ఆ తరవాత బాపు- రమణలు తీసిన చాలా సినిమాలకి కథారచనలలోనూ, కళాదర్శకత్వంలోనూ భాగస్వామ్యం వహించారు.

ప్రముఖులైన..ఇంద్రజాలికుడు శ్రీ బి. వి. పట్టాభిరాం, కార్టూనిస్ట్ శ్రీ. బి. వి. సత్యమూర్తి, రచయిత శ్రీ బి. వి. రమణారావు వీరి సోదరులే. ఈయన కూడా బి. వి. ఎస్. రామారావు పేరుతో కథలు రాశారు.

రామారావుగారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదలశాఖలో ఇంజనీరుగా పని చేశారు. ప్రత్యేకంగా గోదావరి ప్రాజెక్టులో 15 సంవత్సరాలు అనేక హోదాల్లో పనిచేశారు. అలా గోదావరినదీ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా తిరిగినప్పుడు , అక్కడి మనుషుల మనస్తత్వాలను గమనిస్తూ, ఆ పరిశీలనలను గోదావరి కథలు అనే పేరుతో అందమైన కథలుగా రాశారు.

'అద్దరి-ఇద్దరి’ , 'పుష్కరాల రేవులో పుల్లట్లు’ , ‘రాగి డబ్బు’ , ‘గంగ’ , ‘బైరాగి’, ‘గుండెల్లో గోదారి’ , ‘ఎసరూ- అత్తిసరూ' మొదలైన కథలు హృదయాన్ని హత్తుకునేలా రాశారు. వాటిలోంచి ఇప్పుడు

🚩🚩“ఎసరూ- అత్తిసరూ” అనే కథ చదువుకుందాం.

#గోదావరి గట్టుని ఆనుకుని ఉన్న ఆ వీధిలో ఓ చిన్న పెంకుటిల్లు.  ఆ పెంకుటింట్లో వర్థనమ్మ అనే ఓ బామ్మగారూ, ఆవిడకి వారసుడైన భాస్కరం అనే మనవడు, అతని భార్య కమల ఉంటున్నారు.

అప్పటికి నాలుగు రోజులుగా ఒకటే ముసురు. ఆ రోజే కాస్త తెరిపిచ్చింది. ఇంకా పూర్తిగా తెల్లారిందోలేదో , "వర్థనమ్మ గోరూ! వర్థనమ్మ గోరూ!" అంటూ ఎవరో ఆ ఇంటికొచ్చి పిలుస్తున్నారు.

“మీ బామ్మ గారినెవరో పిలుస్తునట్టున్నారు” అంటూ భాస్కరాన్ని లేపింది కమల.

"అబ్బ! నువ్వే వెళ్ళి లేపవే..” అంటూ ముసుగు మరింత బిగించాడు భాస్కరం.

“పరగడుపునే బోడి మొహం ఎలా చూడనండీ , మీరే లేపండి” అందామె.

పెంచి పెద్దచేసి, ఓ ఇంటివాడిని చేసిన బామ్మని నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళాం ‘బోడిమొహం’ అన్నందుకు భాస్కరానికి మనస్సు చివుక్కుమంది.

“వర్ధనొమ్మగోరూ! వర్థనొమ్మగోరూ” అంటూ మళ్ళీ బయటినుంచి పిలుపు.

"ఎవరు వారూ?” అంటూ ఈసారి వర్థనమ్మే పలికింది. తన స్థూలకాయాన్ని అదుపులోకి తెచ్చుకుని, కిటికీ దగ్గరకి జరిగి, చిడతని తప్పించి ఓ రెక్కని మెల్లిగా తెరిచింది.

“మామ్మగోరూ..” అంటూ కిటికీలోకి వంగి చూశాడు సత్తిగాడు.

" ఓరి… నువ్వట్రా సత్తిగా” అంది వర్థనమ్మ.

"అదేంటి మామ్మగోరూ…ఇంకా తొంగున్నారు? లెగండి…. గోదారి పొంగేసినాది. మంచి పోటుగా ఉంది” అన్నాడు సత్తిగాడు.

“అలాగట్రా , అడ్డులే..ఏదీ చూడనీ” అంటూ కిటికీ రెండో రెక్కని తెరిచింది.

గోదావరి నురగలతో పరవళ్ళు తొక్కుతోంది. గాలి హోరుకి చెవులు గింగిర్లెత్తుతున్నాయి. వర్థనమ్మకి కళ్ళు మెరిశాయి. దూరంగా సూర్యుడు ఉదయకిరణాలతో వెలుగుతున్నాడు.

"ఒరే , పుల్లలేమైనా కొట్టుకొచ్చాయిరా?” అడిగింది వర్థనమ్మ.

"అందుకే గదమ్మా నేనొచ్చింది. జాలరిపేట జనమంతా తెప్పలుచ్చుకొని గోదాట్లోకి దూకేశారు. సుక్క పొడవకుండా ఆరు నేరేడు దుంగల్నీ, మూడు మద్ది దూలాల్నీ ఆంకాలమ్మ రేవుకాడికి సేరేశారు. బొడ్డూడని కుర్రోళ్ళు సైతం కర్రకి డొంకిణి కట్టి లాగేత్తన్నారు” అన్నాడు సత్తి.

గోదావరికి వరదలొస్తే చాలు… వర్థనమ్మకి కాళ్ళు నిలబడవు. వరదలో కొట్టుకు వచ్చే కంప, కలపనీ ఈది పట్టుకోడానికి కూలీల్ని పురమాయించి ఏడాదికి సరిపడే వంటచెరకు చేరేసుకుంటుంది. పొద్దున్నే ఓ కుంచెడు బియ్యం వార్చి , పాత చింతకాయ పచ్చడో, మాగాయి పచ్చడో కూలీలకి పెట్టడం , వాళ్ళు ఈదుకుంటూ వెళ్ళి పట్టిన దుంగల్ని గట్టుకు చేరెయ్యడం , వాటిని నరికించి పెరట్లో సర్దించడం! — ఇదీ వరదరోజుల్లో ఆవిడ వ్యాపకం! కిరాయి ఎంతిస్తే అంత తీసుకుని సరిపెట్టుకునే వారు కూలీలు. 

సత్తిగాడైతే,  "నాకు అసలు కిరాయేమీ వద్దు. సందేల మరోసారి వేడిగా పట్టెడన్నం పెడితే చాలు” అనేవాడు.

"మామ్మగోరూ! అన్నం యేడిగా వండండి. మాగాయి పచ్చడి బాగా యెయ్యండి. తినేసి గొదారంతా ఈదేత్తాను. ఈ ఏడు చింత, తుమ్మ కాకుండా టేకు, ఏగిస మీ పొయ్యిలో మండాల! ఈలోగా నేను రేవు కాడికెళ్ళి కాన్ని నీళ్ళు పుక్కిలించి వత్తా” అంటూ క్షణంలో మాయమయ్యాడు సత్తిగాడు.

అప్పటికి నాలుగు రోజులుగా పట్టిన ముసురువల్ల సూర్యుడు కనిపించక , ‘పొద్దు’ నియమం గల వర్థనమ్మ పస్తులుండిపోయిండి. ఆరోజు కనిపించిన సూర్యభగవానునికి దణ్ణం పెట్టుకుని, ఆమె పనిలోకి దిగిపోయింది.

కాసేపటికి కమల నీళ్ళపొయ్యి అంటించడానికి పెరట్లోకి వస్తూ, ఆశ్చర్యంగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఇన్నాళ్లూ చిందరవందరగా ఉన్న పెరడు అద్దంలా అలకబడి ఉంది. పొయ్యి మీద కుంచం గిన్నెలో ఎసరు మరుగుతోంది. వర్ధనమ్మ కూనిరాగాలు తీస్తూ శేరు బియ్యం ఎసట్లోకి దేవుతోంది.  "నాలుగురోజుల ఉపవాసం బాపతు తిండి అంతా ఈవిడ ఇప్పుడొకసారే లాగించేస్తుంది కామోసు!” అని దవళ్ళు నొక్కుకుని లోపలికి పోయింది కమల.

పందుంపుల్లని నవుల్తూ అప్పుడే పెరట్లోకి అడుగు పెట్టిన భాస్కరం, బామ్మ ఇంత పెందరాళే వంటలోకి దిగిపోయినందుకు ఆశ్చర్యపోయాడు.

‘అవును పాపం! నాలుగు రోజులుగా పస్తుంది. ఆకలి వెయ్యదూ మరి?’ అని మనసులో జాలిపడుతూ , “బామ్మా! అసలే నీరసించిపోయావు. ఇవ్వాళ కూడా స్వయంపాకం దేనికి? కమలని మడికట్టుకోమని ఇంత అత్తెసరు వేయించుకోకపోయావా?” అన్నాడు.

ఈ మాటలు విన్న కమల ఉలిక్కిపడింది– చలిలో తనెక్కడ తల స్నానం చెయ్యాల్సివస్తుందోనని. పైగా ఆ కుంచం గిన్నె తనెక్కడ వార్చగలదు? అందుకే భర్తకి చీవాట్లు వెయ్యడంకోసం,

"ఏమండీ! ఇలా రండి కాఫీ చల్లారిపోతోంది” అని కేకేసింది….ఇంకా కుంపటి వెలిగించకుండానే!

భాస్కరం మరి మాట్లాడకుండా లోపలికి పోయాడు.

రెండుబారల అరిటాకు కోసుకొచ్చుకుని , “మామ్మగోరూ” అంటూ పెరట్లో సిద్ధమయ్యాడు సత్తిగాడు.

కొద్ది క్షణాల్లోనే వర్థనమ్మ మాగాయి పచ్చడితోబాటు సెగలు కక్కుతున్న వేడి వేడి అన్నం గిన్నెలోది సగానికి పైగా విస్తట్లో గుమ్మరించింది. ఆ ఆవిరిసెగకు ముఖం దగ్గరగా వుంచి, అన్నం ఘుమఘుమని ఓ సారి పీల్చి , ఆవురావురు మంటూ నోట్లో ముద్దను కూరుకుని , 

"మామ్మగోరూ! మీ సేతి ముద్దకోసం గోదారితల్లి ఎప్పుడు పొంగుద్దా అని కాసుక్కూచున్నాను” అన్నాడు తృప్తిగా.

"ఒరేయ్! నెమ్మదిగా తిను. ఇంకా కావలసినంత ఉంది” అంటూ నీళ్ళ చెంబు సత్తిగాడి పక్కనుంచి, వాడికెదురుగా చతికిలబడింది వర్థనమ్మ.

సత్తిగాడు తల ఎత్తకుండా విస్తట్లో అన్నం లాగించేస్తున్నాడు.

“ఆ కరుడు అలా పక్కకి లాగు. ఇంకాస్త అన్నం వడ్డిస్తా” అంటూ గిన్నెను పూర్తిగా వంచేసి పచ్చడి మళ్ళీ వడ్డించింది వర్థనమ్మ. సత్తిగాడు ఆకు మధ్యకి అన్నాన్ని తాపీగా దేవుకుని మఠం మార్చి తింటున్నాడు.

"ఒరేయ్! భుక్తాయాసంగా ఉంటే భోజనం చేశాకా అరుగుమీద కాసేపు కూర్చొని అప్పుడు ఈతకి వెళ్లు. పుల్లలు ఇవ్వాళ కాకపోతే రేపు ఏరుకోవచ్చు” అంది వర్థనమ్మ.

“తిండానికి నాకాయాసమేటి తల్లీ! ఇంకో ఇంత తినెయ్యగలను.  అవును-- ఆ సత్తుగిన్నెలో ఏముందమ్మా?” అన్నాడు సత్తిగాడు.

“వార్చిన గంజిరా..” అందామె

“అది కూడా ఇల్లా ఇచ్చేయండి. కాసింత ఉప్పేసుకుని తాగేత్తాను” అన్నాడు సత్తిగాడు.

“మా నాయనే…, ఉండు ఉప్పు తెస్తాను” అంటూ భారంగా లేచి వంటింటి కేసి వెళ్ళింది.

సరిగ్గా అప్పుడే ఏం వండాలా అని కూరగాయల బుట్ట ముందేసుకు కూచున్న కమలకి రెండు అరటికాయలు దోరగా ముగ్గి కనిపించాయి.  'ఇవి ముసలావిడ కంటబడితే ఏ దారినపోయే

దానయ్యకో ఇచ్చేస్తుంది' అనుకుంటూ ఆ రెండు బొంత అరటిపళ్ళూ చటుక్కున ఉప్పు జాడీలో పడేసి వచ్చి కూర్చుంది.

వర్థనమ్మ మెల్లగా వచ్చి జాడీలో చెయ్యి పెట్టింది. చేతికి మెత్తగా తగిలితే ఏవిటో అని తీసి చూసింది. అవి బొంతరటిపళ్ళు! ‘ఆ సత్తిగాడికి ఇప్పుడొకటి పెట్టి, మరోటి సాయంత్రం పెట్టచ్చు. అయినా ఇవి ఈ ఉప్పు జాడీలో పడేసుకుంటారా, తెలివి!’ అనుకుంటూ ఒక పండు బియ్యం డబ్బాలో పడేసి, మరోటి పట్టుకుని కొంచెం ఉప్పు తీసుకుని పెరట్లోకి నడిచింది. 

సత్తిగాడు “నాకు బొంతరటిపండంటే శానా ఇష్టం మామ్మగోరూ ” అన్నాడు అరటిపండు చూడగానే.

"ఒరేయ్! సత్తిగా , ఆయనకి కూడా ఇదంటే ఎంతో ఇష్టంరా” అంది వర్థనమ్మ.

“ఆ పెద్దాయనకా?” అన్నాడు సత్తిగాడు.

“ఛ , నీ మొహం… ఆయన పెద్దాయనేం కాదు. చాలా చిన్న వయసు” అంది వర్థనమ్మ.

“నాలా ఓ పాతికేళ్ళుంటాయాండీ?” అన్నాడు సత్తిగాడు.

“నీకన్నా నాలుగేళ్లు తక్కువే! మంచి పుష్టిగా ఉండేవారు” అందామె.

“ఆరు మిమ్మల్ని బాగా సూసుకొనేవారా?” అని పరామర్శించాడు.

“నన్నొక్క క్షణం కూడా వదిలేవారు కాదురా. ఎప్పుడూ కూడానే తిరిగేవారు” అంది కళ్ళు తుడుచుకుంటూ. “ఇదిగో ఉప్పేశాను తాగు” అంటూ గంజిగిన్నె ముందుకు నెట్టింది.

“మామ్మగారూ! ఎన్నాళ్లకో ఇలా కడుపునిండా తిన్నా. ఇయ్యాల సూడండి…. గోదారంతా గాలించి మీ జన్మలో ఇక పుల్లల్ని కొనక్కర లేకుండా సేత్తాను” అంటూ గంజి గడగడ తాగేశాడు.

కాసేపయ్యాకా, “ఉప్పు జాడీకోసం వెళ్ళింది ముసల్ది-, అరటిపళ్ళు కాజేసిందేమిటి చెప్మా ” అనుకుని జాడీలో చెయ్యి పెట్టింది కమల.

"అనుకున్నంతా అయ్యింది…దీని సిగ తరగా! దీని సిగెప్పుడో తరిగేశారు” అని మనసులో తిట్టుకుంటూ , బియ్యంకోసం బియ్యపుడబ్బాకేసి తిరిగి, దాని మూత లేకపోవడం చూసి, 

"అసలే ఇల్లంతా ఎలకల మయం! ఈ ముసల్ది మూతలన్నీ తీసేస్తుంది” అంటూ డబ్బాలో చెయ్యి పెట్టి, ఏదో మెత్తగా తగిలితే అది ఎలకేమోనని భయపడి కెవ్వుమని కేకేసి ఎగిరి గంతేసింది.

ఆ కేక విన్న భాస్కరం వీధి అరుగుమీంచి వంటింటి వసారాలోకి పరుగెత్తుకొచ్చాడు. వర్థనమ్మ కూడా కంగారుగా  “ఏమిట్రా?” అంటూ వచ్చింది. అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా భాస్కరం కూడా కమలతో పాటు చిందులు వెయ్యడం చూసి, “ఏమిట్రా… ఏమైందంటే పలకకుండా చీంబోతులా ఆ గంతులేమిటీ?” అంది.

బామ్మ చీంబోతు అన్నందుకు కాదుకానీ, ఆ మాట పెళ్ళాం విన్నందుకు కోపమొచ్చింది భాస్కరానికి. ఆ కోపం ఏదో వంకతో చూపించాలి కదా…

“ఏమిటీ బామ్మా! అడ్డగాడిదలందర్నీ పిల్చి సంతర్పణ చేస్తున్నావు. దున్నపోతులా ఉన్నాడా సత్తిగాడు. వాడికి ఎందుకు వండి వడ్డించావ్ ?” అని కేకలేశాడు.

“వాడేం అప్పనంగా తిండంలేదు గదట్రా. కూలీ డబ్బులకి బదులు ఇన్ని మెతుకులు పడేస్తే ప్రాణాలకు తెగించి గోదాట్లో ఈది మనకి ఏడాది పొడుగునా సరిపడే వంటచెరకు లాక్కొచ్చి పడేస్తున్నాడాయిరి!” అంది వర్థనమ్మ.

“అయినా రూపాయి పడేస్తే బండెడు పుల్లలొస్తాయి. వాటికోసం ఈ ఎడ్డి చాకిరీ ఎందుకూ?” అన్నాడు భాస్కరం చిరాగ్గా.

“రూపాయికో పేడు కూడా రాదురా నాయనా! నువ్వు కొనడం మొదలెడితే నీ రెండొందల జీతం పుల్లలకే సరిపోదు” అంది వర్థనమ్మ.

“ఇలా అన్నం అమ్మి పుల్లలు కొనడం మా ఇంటావంటా లేదు” అని దెప్పి పొడిచింది కమల.

ఆ మాటలు విని భాస్కరానికి అహం దెబ్బతిని, “చెబితే వినవూ , నీకు తోచదు. కావలసిన పుల్లలు డబ్బిచ్చి కొనచ్చులే” అన్నాడు విసుగ్గా.

“నే పోయాకా అలాగే చేద్దువుగానిలే నాయనా!” అంటూ వీధిలోకి నడిచింది వర్థనమ్మ. వర్ధనమ్మకి మనసు కష్టపడినప్పుడల్లా రేవుకేసి వెళ్ళి గోదావరిని చూస్తూ కూర్చుంటుంది. అలా ఆరు పుష్కరాలుగా భరించలేని కష్టాలని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఆ గోదావరే ఇచ్చింది.

పొద్దుటినుంచీ వంటచెరకు వ్యాపకంతో హైరానా పడ్డ ఆమె అలసి , తులసికోటకి జారపడింది. ఎసట్లో తనకో గిద్దెడు బియ్యం పడేసుకోడానికి కూడా ఓపిక లేకపోయిందావిడకి. ఇంతలో ,

“మామ్మగోరూ!” అంటూ పెరటి తలుపు తట్టింది పిడకలమ్ముకునే పైడమ్మ.

దిక్కెవ్వరూ లేని సత్తిగాడు ఈ పైడమ్మతోటే ఉంటున్నాడు.

“తర్వాత రావే… మడిగట్టుకున్నాను” అంది వర్థనమ్మ.

“తెల్లారనగా పోయాడా సత్తిగాడు. నాలుగు రోజులనుంచీ లంకణాలు.

నిన్న రాతిరే కాత్త జొరం తగ్గి మణిసయ్యాడు. మామ్మగారి దగ్గరికెళ్ళి కాసింత ఊరగాయ పట్రావే…నోరంతా సేదుగా ఉంది అని రాత్రంతా ఒకటే గొడవమ్మా! ఇక్కడిగ్గానీ వచ్చాడా అని సూసిపోడానికొచ్చానమ్మా. కాసింత ఊరగాయ పెట్టు తల్లీ..కాసేపట్లో వత్తాను” అని వెళ్ళిపోయింది పైడమ్మ.

“అయ్యో… పత్యం రోజునే అడ్డమైన తిండీ వాడిచేత తినిపించాను… వాడికేం బెడిసికొట్టదు కదా!” అని బాధపడింది వర్థనమ్మ. ‘తన చేతి పట్టెడు మెతుకులకోసం ఇన్ని లంఖణాలు చేసి కూడా గోదాట్లో ఈదడానికి సిద్ధమైనాడు’ అని జాలిపడింది. ‘అయినా ఓపిక లేకపోతే ఎందుకు ఈత్తాడులే?’ అని సరిపెట్టుకుంది. ‘ ఏమో! వెర్రి బాగులాడు’ అని భయపడింది.

‘సత్తిగాడికి ఏదైనా జరిగితే తనకెంత అప్రదిష్ట!’ ఊళ్ళో వాళ్ళంతా తనని నిలదీయడం , పైడమ్మ శాపనార్థాలూ, భాస్కరం కమలల దెప్పిపొడుపులూ— ఇవన్నీ ఆమె కళ్ళముందు మెదిలాయి.

‘వాడు కనపడితే ఆపుదాం. లేకపోతే నిష్కారణంగా ఓ నిండు ప్రాణం తీసినదాన్నవుతాను’ అనుకుంటూ కంగారుగా ఉన్న ఓపికని కూడగట్టుకుని పెరటి తలుపు తీసి గోదావరొడ్డుకేసి నడిచింది.

నాలుగురోజులుగా కురిసిన వర్షాలకి అడుసులా ఉన్న గట్టుమీద అడుగు తీసి అడుగు వేయడమే కష్టంగా ఉన్నా , గోదావరంతా కలయచూస్తూ బరువుగా నడుస్తోంది వర్థనమ్మ. గోదావరిలో కొన్ని వందలమంది పుల్లలకోసం ఈత్తున్నారు. ఎవడ్ని చూసినా సత్తిగాడిలాగే కనపడుతున్నాడు వర్థనమ్మకి. “సత్తిగా” అని గొంతు చించుకుని అరుస్తూ వాడికోసం వెదుకులాడుతోంది.

అలా గంటలు గడిచాయి. సత్తిగాడు ఎక్కడా కనిపించలేదు. వాడు గోదాట్లో ములిగిపోయి ఉంటాడని నిర్థారణకు వచ్చేసిందామె. నిరాశ , నిస్పృహ ఆవరించి ఇంటిముఖం పట్టింది.

పొద్దు వాలిపోతోంది. వర్థనమ్మకి నోరు పిడచకట్టి, కళ్ళు బైర్లు కమ్మాయి.

ఆమె పాదాలు భారంగా ఇంటికి లాక్కొచ్చాయి. ఆమె మనసు మనసులో లేదు. 

ఇంతలో “మామ్మగోరూ! చూశారా…ఎంత పెద్ద మద్ది దుంగని పట్టుకున్నానో!” అన్న

సత్తిగాడి కేకకు ఈ లోకంలో పడింది వర్థనమ్మ.

నవ్వుతూ తనవైపుకు వస్తోన్న సత్తిగాడిని చూడగానే వర్థనమ్మకి సంతోషం , దుఃఖం ఒకేసారి ఉప్పెనలా పొంగేయి. దిగులంతా దూదిపింజలా ఎగిరిపోయింది. మనసు తేలిక పడింది. వణుకుతున్న చేతులతో సత్తిగాడి తల నిమిరింది.

ఇంతలో ,  "ఏమైందే బామ్మా!” అంటూ అరుగు దిగేడు భాస్కరం.

“మామ్మగోరూ! మీరు బేగా యేడన్నం పెట్టాల. నేనీలోగా ఈ చిన్న చిన్న పేళ్లన్నీ నరికేత్తాను” 

అన్నాడు సత్తిగాడు.

‘అలాగే’ అన్నట్టు తల ఊపి కన్నీళ్లొత్తుకుంటూ పెరట్లోకి నడిచింది వర్థనమ్మ.

“అయ్యగోరూ! ఈ దుంగిస్తే షావుకారు రెండొందలిస్తానని బేరం పెట్టి నన్ను

అటకాయించబోయాడు. బామ్మగారి చేతి వణ్ణం ముందు అదో లెక్కా!?” అన్నాడు సత్తిగాడు భాస్కరంతో. ఈ మాటలు విన్న భాస్కరానికి మతిపోయినట్టయింది.

సత్తిగాడు చిన్నపేళ్ళని నరికి , కుప్పగా పోగేసి చెమటొత్తుకుంటూ, పెరటి గుమ్మంకేసి నడిచాడు. పెరట్లో తులసికోట వారగా చెంగు పరచుకొని పడుకుంది వర్థనమ్మ. పొయ్యి మండుతోంది. ఎసరు అత్తిసరై ఇగిరి మాడుతోంది.

“మామ్మగోరూ!” అని పిలిచాడు సత్తిగాడు. మళ్ళీ పిలిచాడు. మళ్ళీమళ్ళీ పిలిచాడు.

గంగా భాగీరథీ సమానురాలైన పర్వత వర్థనమ్మ శాశ్వతంగా కన్నుమూసిందని ఇరుగు పొరుగువారు నిర్ణయించేదాకా భాస్కరంకానీ, సత్తిగాడుకానీ నమ్మలేదు.

చిత్రం ఏమిటంటే….. ఆనాడు భాస్కరం జేబులో రూపాయి కూడా లేదు.

ఆ మద్ది దుంగని షావుకారుకి అమ్మగా వచ్చిన రెండువందల తోనూ, సత్తిగాడు కొట్టిన చిన్న పేళ్ళతొనూ వర్థనమ్మ అంత్యక్రియలు ఘనంగా జరిపించారు.

                            ———**———


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩