🚩బ్రహ్మ ఐదో తల ఏమయ్యింది!


🚩బ్రహ్మ ఐదో తల ఏమయ్యింది!

🍂☘️🍂

సృష్టికారుడైన ఆ బ్రహ్మను తలుచుకోగానే నాలుగు తలల రూపమే గుర్తుకువస్తుంది. ఈ నాలుగు తలలూ నాలుగు వేదాలకి ప్రతిరూపం అని కొందరంటే, నాలుగు దిక్కులకీ ఆధారం అని కొందరు భావిస్తుంటారు. కానీ ఈ నాలుగు తలలకీ సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. అదేమిటంటే...

శతరూప-

పూర్వం బ్రహ్మ, శతరూప అనే ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. వంద రకాలైన రూపాలను ధరించగల ఆ శతరూపని చూడగానే సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవునికే మతి చలించింది. తన కూతురితో సమానురాలు అన్న విషయాన్ని కూడా గ్రహించకుండా బ్రహ్మ చూపు ఆమె మీదే నిలిచింది. ఆమె నాలుగు దిక్కులా సంచరిస్తుంటే ఆమెనే గమనించేందుకు బ్రమ్మకు నాలుగు తలలు ఉద్భవించాయి. వీటికి తోడుగా శతరూప ఊర్ధ్వముఖంగా పయనించేటప్పుడు, ఆమెనే చూస్తూ ఉండేందుకు ఐదో తల కూడా ఏర్పడింది. ఈ దృశ్యాన్ని చూసిన పరమేశ్వరుడు, బ్రహ్మ చపలచిత్తానికి తగిన దండన విధించాలని అనుకున్నాడట. ఫలితం! శివుడు తన త్రిశూలంతో బ్రహ్మదేవుని ఐదో శిరసుని ఖండించివేశాడు. అలా ఖండించబడిన బ్రహ్మకపాలం బదరీనాధ్‌ క్షేత్రం దగ్గర పడిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆ స్థలంలో కనుక పూర్వీకులకు పిండప్రదానాలను చేస్తే అధిక ఫలితం వస్తుందని భావిస్తారు.

మరో కథ!

శతరూపకి సంబంధించిన కథ విస్తృత ప్రచారంలో ఉన్నప్పటికీ, బ్రహ్మ ఐదో తల గురించి మరో కథ కూడా చెబుతారు. ఒకనాడు బ్రహ్మవిష్ణువులలో ఎవరు గొప్ప అన్న వాదన బయలుదేరింది. ఆ వాదానికి విరుగుడుగా, శివుడు ఒక పరీక్షను పెట్టాడట. తాను ఒక లింగ రూపంలో ఉంటాననీ, ఎవరైతే ఆ లింగపు అంచుని చేరుకోగలుగుతారో వారు గొప్పవారన్నదే ఆ పరీక్ష సారాంశము. ఆ పరీక్షకు బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ కూడా సరేనన్నారు. పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆద్యంతరహితమైన ఒక లింగరూపంలో వెలిశాడు. అంతట బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆ లింగాకారపు పైభాగాన్ని గుర్తించేందుకు ఎగిరిపోగా, విష్ణుమూర్తి వరాహ రూపంలో నేలని తవ్వుకుంటూ లింగపు అడుగుభాగాన్ని చేరుకునేందుకు సిద్ధపడ్డాడు.

ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించనేలేదు. కానీ సృష్టికర్త అయిన తాను ఓటమిని ఒప్పుకోవడం ఏమిటన్న అహంకారం కలిగింది బ్రహ్మదేవునిలో. దాంతో తాను లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానని అబద్ధం చెప్పేశాడు. అంతేకాదు! తన మాట నిజమేనంటూ ఒక మొగలిపూవు (కేతకి) చేత కూడా సాక్ష్యం చెప్పించాడు. కానీ లయకారుడైన శివుని ముందు ఈ అబద్ధం చెల్లలేదు. పైగా తననే భ్రమింపచేయాలని చూసినందుకు ఆ పరమేశ్వరునికి పట్టరాని కోపం వచ్చింది. అంతే! శివుని మూడో కంటికి బ్రహ్మకు ఉన్న ఐదో తల భస్మమైపోయింది. పైగా అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన దైవమే అబద్ధాన్ని పలకడంతో, ఇకమీదట బ్రహ్మ పూజలందుకునే అర్హతను కోల్పోతాడంటూ శపించాడు శివుడు. బ్రహ్మకు సాక్ష్యంగా నిలిచిన మొగలి పూవు కూడా ఇక మీదట పూజకు పనికిరాదంటూ శాసించాడు.

బ్రహ్మ సంగతేమో కానీ మొగలి పూవుని పూజలకు వాడకూడదని ఆక్షేపించడం వెనుక ఒక శాస్త్రీయమైన కారణం కనిపిస్తుంది. గుబురుగానూ, పదునైన అంచులతోనూ ఉండే మొగలి పొదలు ఏమంత క్షేమమైన ప్రదేశాలు కావు. పైగా పాములు తమ కుబుసాన్ని విడిచేందుకు మొగలి రేకుల వంటి గరుకైన చెట్లని ఎన్నుకొంటాయి. ముఖ్యంగా మన దేశంలో కనిపించే రక్తపింజరి అనే విషసర్పం, మొగలి పొదల చుట్టుపక్కల సంచరించేందుకు ఇష్టపడుతుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధరించారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో భక్తులు చిక్కుకోకుండా ఉండేందుకు పెద్దలు మొగలి పూలను పూజలకు నిషేధించి ఉంటారు.

🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️🍂☘️

Comments

Popular posts from this blog

🚩🚩ఉషా పరిణయం.🚩🚩

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

🚩🚩శివరూపాలు..లింగరూపాలు..!💐