🚩🚩ధర్మజుని_రాజసూయ_యాగము.🚩🚩 (పోతన భాగవత కధ .


🚩🚩ధర్మజుని_రాజసూయ_యాగము.🚩🚩

(పోతన భాగవత కధ .)

#రాజసూయ యాగం జరుగుతుంటే భూమండలం మీద ఉన్న రాజు లందరూ వచ్చారు. రాజసూయ యాగం అంటే మాటలు కాదు. బంగారు నాగలితో భూమిని దున్నారు. వచ్చిన వారందరికీ సక్రమమయిన మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చేయాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. కర్ణుడికి ఒకరికి దానం యివ్వడం అంటే పరమ సంతోషం. ఒకరికి శ్రద్ధా భక్తులతో దానం యివ్వడానికి కర్ణుడే తగినవాడు. కర్ణుడికి, పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచిపని సక్రమంగా జరగడం కోసం, రాజసూయ యాగంలో దానములు చేయడానికి ధర్మరాజు గారంతటి వాడు కర్ణుని నియమించాడు. పదవులు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి. వంటశాలలో ఉండి రుచికరమయిన పదార్థములను తయారుచేయించమని తమ్ముడయిన భీమసేనునికి పురమాయించి భీమసేనుడిని వంటశాలలో పెట్టాడు. వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్షతలు వేయడానికి వస్తే యింటి యజమాని, వారు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోయే వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏమి కావాలో చూడడానికి బాధ్యతా కలిగిన ఒక వ్యక్తిని పెట్టాలి. ఈ పనికి కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుని పెట్టారు. యాగమునందు వైదిక క్రతువులో వాడబడే సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే సిద్ధంగా అందించడానికి వీలుగా ఆ బాధ్యతను నకులుడికి అప్పగించాడు. వచ్చిన వాళ్ళలో నారదమహర్షి, అత్రిమహర్షి వంటి దేవగురువులు ఉంటారు. వారిని పూజించడానికి తమ్ముడయిన సహదేవుడిని వినియోగించాడు. భోజనపంక్తిలో రుచులూరించే పదార్థములను తెప్పించి చక్కగా వడ్డన జరిగేలా ద్రౌపదిని నియమించాడు. అంతా అందంగా రాజసూయ యాగ క్రతువు జరిగింది. అంత గొప్ప యాగం పూర్తయిన తర్వాత చివర అక్కడ ఉన్నవారిలో జ్ఞానము చేత వృద్దుడయిన వారిని ఎంచి ఆయనకు అగ్రపూజను చేస్తారు. ఇపుడు సభలో అగ్రపూజను ఎవరికి చెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది. అక్కడ ఎందరో ఋషులు, మహర్షులు, దేవగురువులు ఎందరో రాజులు ఉన్నారు. అంతమంది గొప్పవారు వున్న సభలో అగ్రపూజ ఎవరికి చెయ్యాలి? అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తున్నారు. అపుడు వయస్సులో చిన్నవాడయినా బుద్ధిలో బృహస్పతి అయిన సహదేవుడు లేచి "అన్నయ్యా, అగ్రపూజ చేయడానికి ఎవరు తగినవాడు అని ఆలోచిస్తున్నావా? కృష్ణుడు అర్హుడు అని సూటిగా అనలేదు. కానీ సహదేవుడు కృష్ణుని ఉద్దేశించి అన్నయ్యా ఈయన ఈశ్వరుడు. ఇక్కడ నిలబడిన ఈయనే బయట వెళ్ళిపోతున్న కాలరూపము. ఒక ప్రదేశములా ఎక్కడికక్కడ కనపడుతున్న ఈ సమస్త భూమండలము ఆయనే. ఇప్పుడు నీవు చేసిన యాగము ఆయనే. ఆ యజ్ఞము ఆయనే. చేసినవాడు ఆయనే. ఇన్నిగా వెలుగుతున్న ఈశ్వరుడు యివాళ మన కళ్ళెదుట మన మాంస నేత్రముతో చూడడానికి ఎదురుగుండా వీలయిన రీతిలో రక్షకుడై, సర్వ కాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్న వాడయి యాగమునకు వచ్చి నిర్వహించి జరాసంధుని వధ చేయించిన మహాపురుషుడు ఎవడు ఉన్నాడో ఆయన యిక్కడ కూర్చుని అండగా ఉండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారు. ఆయనకు అగ్రపూజ చెయ్యండి" అన్నాడు.

ఈమాట చెప్పేసరికి ధర్మరాజుగారు పొంగిపోయారు. మాట చెప్పడం కాదు. చెప్పేమాట ఎదిరించలేనిదై ఉండాలి. అదీ ఆవిష్కరణ అంటే. కృష్ణుడు ఎవరో చెప్పాడు. కృష్ణుని సరిగా అర్థం చేసుకున్నాడు. ఎంత జ్ఞానియో సహదేవుడు చూడండి. అలా చెప్పగానే ధర్మరాజుగారు ద్రౌపదీ దేవిని తీసుకొని బంగారు జలపాత్రను చేతిలో పట్టుకొని కృష్ణుని వద్దకు వెళ్ళారు. అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదీదేవి కుంతీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ పాదముల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెమును తీసుకువచ్చి ఆయన కాళ్ళకింద పెట్టారు. ద్రౌపదీదేవి బంగారు పాత్ర లోంచి నీరు పోస్తుంటే కృష్ణ పరమాత్మ కాళ్ళను కడిగారు. ధర్మరాజు గారు కాళ్ళు కడుగుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పములు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్ళు పోస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెం లోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలమును తీసుకుని ధర్మరాజుగారు తన శిరస్సు మీద చల్లుకుని, తదుపరి కుంతీదేవి శిరస్సు మీద ద్రౌపదీ దేవి శిరస్సు మీద తమ్ముళ్ళ శిరస్సుల మీద చల్లారు. బంగారు వన్నె గల వస్త్ర ద్వయమును తీసుకు వచ్చి కృష్ణ పరమాత్మకు బహూకరించి, అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్న హారములు తెచ్చి ఆయన మెడలో వేసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయనకు తాంబూలం ఇచ్చి తమతమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్లుగా పరమ వినయంతో అయిదుగురు అన్నదమ్ములు నమస్కరించి అగ్రపూజ చేసి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కానీ మూడిన వాడు ఒకడు ఉంటాడు. వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభం అవుతుంది. అపుడు శిశుపాలుడు లేచి

"ఈయన గోపాలుర కుటుంబంలో పుట్టాడు. యథార్థమునకు ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదు. కొంతమంది యితడు దేవకీ వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలామంది యితడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఈయన కులం తెలియదు. ఈయన గోత్రం తెలియదు. వావి వరుసలు లేవు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో. ఎంతమందితో తిరిగాడో. ఇది నడువడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మానమర్యాదలు ఎరుగని వాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా! సభలో వీనికన్నా తగినవారు లేరా! కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను యిప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను" అని తన గదాదండము తీసుకుని కృష్ణుని మీదకు వెళుతున్నాడు.

కృష్ణ పరమాత్మ వీనిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రమును స్మరించి ఆ చక్రమును శిశుపాలుని మీదికి ప్రయోగించారు. అప్పటికి శిశుపాలుడు చేసిన నూరు తప్పులు పూర్తయిపోయాయి. నూరు తప్పుల వరకు కాపాడతానని మేనత్తకు మాట యిచ్చాడు. ఇప్పుడు శిశిపాలుడు చేసిన అధిక్షేపణతో నూరు తప్పులు పూర్తి అయిపోయాయి. సుదర్శన చక్రమును ప్రయోగించగానే అది శిశుపాలుని కుత్తుకను కత్తిరించి కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో హాహాకారములు మిన్ను ముట్టాయి. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తదనంతరం పాండవులందరూ అవబృథ స్నానమును చేశారు. యాగము అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలు అందరూ వెళ్లి స్నానం చేస్తారు. అలా చక్కగా వారంతా అవబృథ స్నానం చేసి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారు పరమసంతోషంగా రాజ్యం ఏలుతున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరమునకు చేరుకుంటున్నారు.

✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍


Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩