🚩యమళార్జున భంజనము.🚩🚩 (పోతన భాగవత కధ .)

🚩యమళార్జున భంజనము.🚩🚩

(పోతన భాగవత కధ .)


#యశోదాదేవి కృష్ణుని తీసుకు వెళ్ళి రోటికి కట్టేసింది. 

ఆయన విడిపించుకోవడం చేతకాని వాడిలా నటిస్తున్నాడు. కర్మపాశముల చేత లోకముల నన్నిటిని కట్టగలిగిన పరమాత్మ, తాను ఆ కట్టు విప్పుకోలేని వాడిలా నటిస్తూ పెరట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. కొడుక్కి శిక్ష వేశాను కదా అనుకొని అమ్మ తన పనిలోకి తాను వెళ్ళిపోయింది. గోపకాంతలు కూడా వెళ్ళిపోయారు. కృష్ణుడిని అలా చేస్తే గోపకాంతలు అనవసరంగా తల్లికి చెప్పి కృష్ణుడిని బాధపెట్టిన వారమయ్యామని లోపల బాధపడ్డారు. ఇప్పుడు ఆశ్చర్యకరమయిన ఒక లీల ప్రారంభం అయింది. ఆ ఇంటి ప్రాంగణంలో రెండు పెద్ద మద్ది చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అవి కొన్ని వందల సంవత్సరముల నుండి అక్కడ పెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి వాటి మానులు చాలా స్థిరమయిన స్థితిలో ఉన్నాయ్. వాటిని కూలదోయడం అంత తేలికైన విషయం కాదు. రోటికి కట్టివేయబడిన పరమాత్మ నెమ్మదిగా రోటిని ఈడ్చుకుంటూ పాకుతున్నాడు. అంత బలశాలియై ఆయన పాకుతూ వెనకాల రోలును ఈడ్చుకు వచ్చేస్తున్నాడు. ఈ రెండు మద్దిచెట్ల మధ్య నుంచి పిల్లవాడు అటువైపు వెళ్ళిపోయాడు.

 ఈడుస్తున్న రోలు అడ్డం తిరిగింది. అది రెండు మద్ది చెట్లకి అడ్డుపడింది. కృష్ణుడు రోటిని ముందుకు లాగాడు. ఆ రెండు మద్ది చెట్లు ఫెళఫెళమనే పెద్ద ధ్వనులతో పక్కకి పడిపోయాయి. ఆ రెండు వృక్షముల నుంచి మహాపురుషులు ఇద్దరు ఆవిర్భవించారు.

ఆ చెట్లలోంచి బయటకు వచ్చిన యిద్దరు కూడా యక్షులు. వాళ్ళ పేర్లు నలకూబర మణిగ్రీవులు. వాళ్ళు కుబేరుని కుమారులు. కుబేరుడు ఐశ్వర్యమునకు అధిపతి. ఆయన నవనిధులకు దేవత. ఆయనకు రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి ఆయన అపారమయిన ఐశ్వర్యమునకు ఆధిపత్యంలో ఉంటాడు. రెండు - సర్వకాలములయండు ఆయన శంకరుని పక్కన నిలబడి ఉంటాడు. కైలాసంలో పరమశివుని పక్కన నిలబడి స్వామీ ఎప్పుడయినా పని చెపుతారేమో నని ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ రెండు లక్షణములు గలిగిన కుబేరుడు అహంకరించినట్లు మీకు పురాణములలో ఎక్కడా కనపడదు. కుబేరుడు విశ్రవసువు బ్రహ్మ కుమారుడు. రావణాసురుని కన్న ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయి "ఏమి కావాలి?" అని అడిగారు. అపుడు కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. అపుడు బ్రహ్మగారు "నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను. నీవు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉంది నవనిధులకు అధిపతివై ఉంటావు. నిన్ను కుబేరుడని పిలుస్తారు" అన్నారు.

కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమవత్పర్వత ప్రాంతములో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ సౌందర్యమును చూసి తెల్లబోయి ఎవరీ కాంత అని అమ్మవారిని అమ్మ దృష్టితో కాకుండా ఒక స్త్రీ శరీరాంతర్గత సౌందర్య భావనతో చూశాడు.

 దానివల్ల కుబేరుని కన్నులలో ఒక కన్ను మెల్లకన్ను అయిపొయింది. అది తప్ప కుబేరుడు తన తండ్రిగారయిన విశ్రవసు బ్రహ్మగారు ఎలా చెపితే అలా ప్రవర్తించేవాడు. తండ్రిగారు కాంచన లంకను విడిచి పెట్టివేయవలసిందని చెపితే విడిచిపెట్టేసి తమ్ముడయిన రావణునికి ఇచ్చేశాడు. తాను ఉత్తర దిక్కుకు పోయి వేరే నగరమును నిర్మించుకున్నాడు. తన తపస్సుతో సంపాదించుకున్న పుష్పక విమానమును రావణాసురుడు ఎత్తుకు పోతే మారుమాట్లాడలేదు. అంతటి మహానుభావుడు కుబేరుడు. ఐశ్వర్యము వలన కుబేరుడు మదించినట్లు ఎక్కడా కనపడదు. భగవద్భక్తుడు కనపడితే అతని పాదములకు వంగి నమస్కరించగలడు. తండ్రి ఐశ్వర్యమునకు మాత్రమె వారసత్వమును పొంది తండ్రి సంస్కృతికి కొడుకులు వారసత్వం పొందక పొతే, వారు ప్రమాదంలో పడతారు.

 అదే యిక్కడ జరిగిన గొప్ప విశేషం.

నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. స్నాతకం చేసేటప్పుడు మామగారు పురుషుని చేత ఒక ప్రమాణం చేయించుకుంటాడు. "నీవు ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయకూడదు. అలా అయితేనే పిల్లనిస్తాను" అని. మనకి సంస్కృతం తెలియదు కాబట్టి గొడవ లేదనుకోండి! అసలు ఆయన అడిగినట్టూ తెలియదు. మనం యిచ్చినట్టూ తెలియదు. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమయిపోతుంది. నలకూబరమణిగ్రీవులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది గంధర్వకాంతలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒంటిమీద బట్ట లేదు. వారు మధువు సేవించి ఉన్నారు. తాము అలా ప్రవర్తించకూడదనే విషయమును మరచిపోయి ఉన్నారు. వీళ్ళు అటువంటి స్నానం చేస్తుండగా ఆకాశ మార్గమున నారద మహర్షి వెళ్ళిపోతున్నారు. గంధర్వకాంతలకు బుద్ధి కలిగింది. వాళ్ళు గబగబా ఒడ్డుకువచ్చి వస్త్రములు కట్టుకుని నారదమహర్షికి నమస్కరించారు. నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశమొలలతో నిలిచి నారద మహర్షికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పధ్ధతి కాదు. పెద్దల మాటల యందు, ప్రవర్తన యందు, వారియందు, గౌరవమును కలిగి వుండాలి. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదుడు మనస్సులో ఒకమాట అనుకున్నాడు.

"వీళ్ళకి కలవారి సుతులం అనే అహంకారం వచ్చింది. ఈ సంపాదన వీరి తండ్రిది. వీరు ఈవేళ మదోన్మత్తులై ఉన్నారు. తండ్రి గుణముల యందు వీరికి వారసత్వం లేదు. కాబట్టి వీరికి ఈ ఐశ్వర్యమును తీసివేస్తాను. అపుడు వీరికి దేనివలన అహంకారం వచ్చిందో ఆ అహంకారం పోతుంది. వీళ్ళ కంటికి ఇప్పుడు కాటుక పెట్టాలి. ఏ కాటుక పెట్టుకుంటే అవతలి వారిలో ఉన్న భక్తికి వంగి నమస్కరించడం అలవాటు అవుతుందో ఆ అంజనమును వీళ్ళ కళ్ళకి దిద్దుతాను. వీళ్ళకు బుద్ధి చెపుతాను" అనుకుని వారితో "మీరు కోట్ల సంపదకు పడగలెత్తిన కుబేరుని కుమారులు. మీకు బట్టకట్టుకుని ఒడ్డున నిలబడాలన్న స్పృహ లేదు. కాబట్టి అసలు బట్టలు కట్టుకోవలసిన అవసరమే లేని జన్మనెత్తితే మీకు చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి మీరు నూరు దివ్య సంవత్సరముల పాటు యమళార్జునములనే పేర్లతో మద్ది చెట్లయి నందవ్రజమునందు పడి యుండెదరు గాక!" అని శపించాడు. 

ఇప్పుడు వీరికి ఒంటికి పట్టిన మదం తీరిపోయి నారదుని కాళ్ళమీద పడ్డారు. గురువు అనుగ్రహించాలి. నారదుని అనుగ్రహం చూడండి. అందుకని ఆయన "ఇపుడు మీకు పట్టిన మదం ఇంకెన్నడూ మీ తలలకు ఎక్కకూడదు. అలా చేయగలిగిన శక్తి ముకుంద పాదారవిందముల నుండి స్రవించే రజస్సుకు మాత్రమె ఉంది. భగవంతుని పాదములను చూడగానే ఆయన పాదములకు తగిలేటట్లుగా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ పాదరేణువులు తలమీద పడాలి. భాగవతుల పాద ధూళిలోకి బ్రహ్మాండములలో ఉండే శక్తి చేరి ఉంటుంది. ఆ పాదధూళి వారి తలమీద పడగానే వారు పుణ్యతీర్థములలో స్నానం చేసినంతటి ఫలితమును పొందుతారు. అదే వారి పుణ్యమునకు, ఐశ్వర్యమునకు, వారి అభివృద్ధికి హేతువు అవుతుంది. అందుకు మీరు నందవ్రజంలో మద్ది చెట్లయి పుట్టండి. కృష్ణ పరమాత్మ పాకుతున్న రోజులలో ఆయన పాదములనుండి స్రవించిన పరాగము మీ మీద పడుతుంది. అపుడు చెట్ల రూపంలో వున్నా మీరు చెట్ల శరీరమును వదులుతారు. మీరు నా పట్ల అపచారం చేస్తే చేశారు కానీ నా అనుగ్రహము వలన ఉత్తరోత్తర మోక్షమును పొందుతారు. నారాయణ భక్తులు అవుతారు. అపారమయిన ఐశ్వర్యముతో ఉంటారు. మరల యథా రూపమును పొంది మీ యక్ష లోకమునకు చేరుకుంటారు. చేరుకొని మీ సంపత్తిని మీ సౌఖ్యమును పొందుతారు" అని అనుగ్రహించాడు. 

ఈ విధంగా నారదమహర్షి శాపావసానమును యిచ్చారు. దీనివలన యిప్పుడు పడిపోయిన రెండు చెట్లనుండి వెలుపలికి వచ్చిన మణిగ్రీవనలకూబరులు రెండు చెట్ల మధ్యవున్న ఏడుస్తున్న కృష్ణుని చూసి నమస్కరించి స్తోత్రం చేశారు.

వాళ్ళు బయలుదేరి యక్ష లోకమునకు వెళ్ళిపోయారు.

ఈశ్వరుడు ఏ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాడో ఆ భక్తులకు వంగి నమస్కరించగలగాలి. అపుడు మీరు ఎల్లప్పుడూ ఐశ్వర్యమును అనుభవిస్తూ ఆనందంగా ఉండగలరు అనే మహోత్కృష్టమైన సందేశమును ఈ లీల మనకు అందజేస్తోంది.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)