🚩🚩 ఇంద్రుని బ్రహ్మహత్యాపాతకము🌹 (పోతన భాగవత కధ .)


🚩🚩 ఇంద్రుని బ్రహ్మహత్యాపాతకము🌹

(పోతన భాగవత కధ .)

#వృత్రాసుర సంహారం చేయడం వలన మరల ఇంద్రునికి 

బ్రహ్మ హత్యాపాతకం అంటుకుంటుంది. క్రిందటి సారి ఆ బ్రహ్మహత్యా పాతకమును నలుగురికి పంచాడు. ఇప్పుడు ఈ బ్రహ్మ హత్యా పాతకం పరమ వృద్దుడయిన వ్యక్తి రూపంలో జుట్టు ఎర్రటి రంగుతో, ఒళ్ళంతా క్షయ వ్యాధి, కుష్ఠు వ్యాధి చేత పుండ్లు పడిపోయి నోటివెంట నవరంధ్రముల వెంట పుల్లటి కంపు కొడుతుండగా ఒంట్లోంచి నెత్తురు కారిపోతున్న వ్రణములతో ఇంద్రుని కౌగలించుకోవడానికని వెంటపడింది. అది బ్రహ్మహత్యాపాతక స్వరూపం. అది బాధించడం కోసమని వెంటపడితే ఇంద్రుడు పరుగుపరుగున అన్ని దిక్కులకు వెళ్ళాడు. ఎటువైపుకు వెళ్ళినా విడిచి పెట్టలేదు. అప్పుడు ఇంక దారిలేక ఇంద్రుడు ఈశాన్య దిక్కుపట్టి పరుగెత్తి మానససరోవరంలోకి దూరిపోయాడు. ఈశాన్య దిక్కుకి ఒక శక్తి ఉంటుంది. అక్కడికి బ్రహ్మహత్యా పాతకం కూడా తరిమి రాలేక పోయింది. ఇంద్రుడు వెనక్కి వస్తాడేమో అని ఎదురుచూస్తూ నిలబడింది. ఇంద్రుడు మానస సరోవరంలోకి దూకి అందులో ఉన్న ఒక తామరపువ్వు గుండా తామర నాళం లోనికి ప్రవేశించి అందులో ఉండే ఒక తంతువులోకి దూరిపోయాడు. అక్కడ ఇంద్రుడు వేయి సంవత్సరములు ఉన్నాడు. 

ఒడ్డున ఆ బ్రహ్మహత్యా పాతకం బయటకు రాకపోతాడా పట్టుకోనక పోతానా అని నిరీక్షిస్తూనే ఉంది. అలా ఇంద్రుడు నారాయణ కవచమును శ్రీమన్నారాయణుని తపమును ఆచరిస్తూ కూర్చున్నాడు. భయపడుతూ కూర్చోలేదు. ఈశ్వరారాధనం చేస్తూ కూర్చున్నాడు. 

ఈ వెయ్యి సంవత్సరములు గడిచేలోపల ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అక్కడ ఇంద్రపదవి ఖాళీగా ఉంది. ఆ పదవిలోకి తాత్కాలికముగా అనేక యాగములు చేసిన నహుషుడు అనే మహారాజును తెచ్చి కూర్చోబెట్టారు. ఇంద్రపదవిలో కూర్చోగానే ఆయనకో వెర్రి పుట్టింది. "ఇంద్రపదవి ఒకటీ ఇచ్చి వదిలిపెడితే ఎలా - శచీదేవి కూడా నాది కావాలి కదా" అన్నాడు.

 "ప్రస్తుతం నేనే ఇంద్రుడిని కాబట్టి అసలు ఇంద్రుడు వచ్చే వరకు నీవు నా భార్యగా ఉండు" అని శచీదేవికి వర్తమానం పంపడం మొదలుపెట్టాడు. ఆయన ప్రవర్తన నచ్చక శచీదేవికి ఏమి చేయాలో అర్థం కాలేదు. లలితా సహస్రంలో అమ్మవారికి "పులోమజార్చిత" అని పేరు ఉంది. పులోముడు శచీదేవి తండ్రి. పులోముని కుమార్తె అయిన శచీదేవి చేత నిరంతరం లలితా పరాభట్టారిక అర్చింపబడుతు ఉంటుంది. భార్య చేసే పూజ వలన భర్తకి అభ్యున్నతి కలుగుతుంది. అందుకని ఆయన ఇంద్రపదవి యందు ఉన్నాడు. ఈమె యందు ఏ దోషము లేదు కాబట్టి బృహస్పతి ఈమెకు దర్శనం ఇచ్చి "అమ్మా! దీనికి ఒకటే పరిష్కారం. నీ భర్త ఏ మహాత్ముడికి అపచారం చేసి ఇవాళ దాగి ఉన్నాడో ఇలాగ వీనితోను ఒక అపచారం చేయించు. కాబట్టి నహుషుడిని "సప్తర్షులు మోస్తున్న పల్లకిలో రా - నీవు నాకు భర్తవు అవుదువు గాని" అని కబురు చెయ్యి. కామోద్రేకంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి అయ్యో, ఈ పని చేయనా అని ఉండదు. "సప్తర్షులను పిలిచి మోయమని పల్లకి ఎక్కుతాడు అని చెప్పాడు.

 బృహస్పతి తెలివితేటలు వట్టినే పోతాయా! ఆవిధంగా నహుషుడు సప్తర్షులు మోస్తున్న పల్లకి ఎక్కాడు. ఆ పల్లకి మోస్తున్న వారిలో అగస్త్య మహర్షి ఉన్నారు.

ఆయన మహాశక్తి సంపన్నుడు. పొట్టిగా ఉంటాడు. ఆయన అడుగులు గబగబా పడడం లేదు. నహుషుడు లోపలినుంచి చూశాడు. తొందరగా శచీదేవి వద్దకు వెళ్ళాలనే తాపత్రయంతో "సర్ప సర్ప" "నడు నడు" అని ఆయనను హుంకరించి డొక్కలో తోశాడు. అగస్త్యునికి కోపం వచ్చింది. పైకి చూసి "చేయకూడని పని చేస్తూ మహర్షుల చేత పల్లకి మోయిస్తూ పొట్టివాడిని అడుగులు వేయలేక పోతున్న వాడిని అయిన నన్ను "సర్ప సర్ప" అన్నావు కాబట్టి నీవు సర్పమై కొండచిలువవై భూలోకంలో పడిపో" అని శపించాడు.వెంటనే నహుషుడు కొండచిలువయి క్రిందపడ్డాడు. ఇపుడు మరల ఇంద్రపదవి ఖాళీ అయింది కదా! మరల ఇంద్రుని తీసుకురావాలి. అపుడు దేవతలు, ఋషులు అందరూ కలిసి మానస సరోవరం దగ్గరకు వెళ్ళారు. వెయ్యి సంవత్సరాలు తపించిన ఇంద్రుని శక్తి చూసి బ్రహ్మహత్యా పాతకం వెనక్కి తిరిగింది. పూర్తి నివారణ కాలేదు. 

అప్పుడు ఇంద్రుని తీసుకు వచ్చి అశ్వమేధ యాగం చేయించారు. చేయిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై పాపపరిహారం చేశారు. ఏది చేసినా భగవానుడే చేయాలి. అందుచేత ఇంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహమునకు నోచుకున్నాడు. బ్రహ్మహత్యా పాతకము నివారణయై మరల వచ్చి ఇంద్రపదవిలో కూర్చుని సంతోషముగా గురువును సేవిస్తూ కాలమును గడుపుతున్నాడు.

ఇంద్రపదవిని అలంకరించిన వాడే గురువుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే కష్టములు పడ్డాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ గురువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ గురువులు మీ డబ్బు కోరుకునేవారు కారు. మీ ఐశ్వర్యమును కోరుకునే వారు కాదు. వారిపట్ల ఎప్పుడూ మర్యాద తప్పకూడదు. ఎప్పుడూ వారిపట్ల మర్యాదతో ప్రవర్తించడం, వారు చెప్పిన మాట వినడం అనే మంచి లక్షణమును కలిగి ఉండాలి. దాని చేత మీరు ఉద్ధరింపబడతారు.

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩 ఇది కథా…నిజమా…?-..ఫల ప్రదో భవేత్ కాలే.... ➖➖➖✍️

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)