🚩🚩గోపికా వస్త్రాపహరణం: ! (పోతన భాగవత కధ .)



🚩🚩గోపికా వస్త్రాపహరణం: !

(పోతన భాగవత కధ .)

#భగవానుడు కృష్ణుడిగా అవతరించిన తరువాత, చేసిన లీలలు, అనేకము ఉన్నాయి. అందులో గోపికా వస్త్రాపహరణ ఘట్టము, పరమ ప్రామాణికమయినది. బృందావనంలో వుండే గోపకాంతలు అందరూ కూడా, కృష్ణ భగవానుడినే పతిగా పొందాలని, నిర్ణయం చేసుకున్నారు. గోపకాంతలు, పూజనొక దానిని చేశారు. వారు కృష్ణుడిని భర్తగా పొందడానికి, కృష్ణుడి వ్రతం చేయలేదు. ఇది వ్యాసుని సర్వోత్క్రుష్టమయిన ప్రతిపాదన. వారు మార్గశీర్ష మాసములో, ఒక వ్రతము చేశారు. యథార్థమునకు, భాగవతంలో, గోపకాంతలు, మార్గశీర్ష మాసంలో చేసిన వ్రతం, కాత్యాయనీ వ్రతం. వీరందరూ కలిసి, కాత్యాయనీ దేవిని, ఉపాసన చేశారు. కాత్యాయన మహర్షి కుమార్తెగా జన్మించి, ఆయనను ఉద్ధరించింది కాబట్టి , పార్వతీ దేవికి, కాత్యాయని అని పేరు. పార్వతీదేవిని ఉపాసన చేశారు. కృష్ణుడిని ఉపాసన చేసి, కృష్ణుని భర్తగా పొందాలి. కానీ, మధ్యలో కాత్యాయనీ దేవి పేరుతొ, పార్వతీదేవిని ఉపాసన చేస్తే, కృష్ణుడు ఎలా భర్త అవుతాడు? ఇందులోనే ఒక చమత్కారం ఉంది. ఇందులోనే ఒక రహస్యం ఉంది. శాస్త్రంలో మనకు శ్రీమన్నారాయణుడే, నారాయణిగా ఉంటాడు. నారాయణి అని, పార్వతీదేవిని పిలుస్తారు. నారాయణ, నారాయణి, వీరు భార్యాభర్తలు కాదు. అన్నాచెల్లెళ్ళు. అందుకే వీరిద్దరూ, అలంకార ప్రియత్వంతో ఉంటారు. పరమశివుడు, అభిషేక ప్రియత్వంతో ఉంటాడు. కృష్ణుడికి, కళ్యాణం జరగడానికి ముందు గోపకాంతలు అందరూ, కాత్యాయనీ వ్రతం చేస్తారు. గోపకాంతలు, ప్రతిరోజూ, ఇసుకతో, కాత్యాయనీ దేవి మూర్తిని చేసేవారు. కాత్యాయని మహామాయే మహాయోగే నదీశ్వరి నందగోపసుతం దేవీ పతిం మే కురుతే నమః!! అదీ వాళ్ళు చేసిన సంకల్పం. వారందరూ, లౌకికమయిన భర్తను అడగడం లేదు. వాళ్ళు అడుగుతున్నది, ఈ మాయ అనబడే తెర తొలగి, జీవ బ్రహ్మైక్య సిద్ధి కొరకు, పరాత్పరుని యందు, ఐక్యము అవడం కోసమని," అమ్మా నీ అనుగ్రహం కలగాలి. మాకు కృష్ణుడిలో కలిసిపోయే అదృష్టం కలగాలి" అని, దానిని భార్యాభర్తృ సంబంధంగా మాట్లాడుతున్నారు. ఆ వ్రతమును, ముప్పది రోజుల పాటు, మార్గశీర్షంలో చేయాలి. అమ్మవారికి, కదంబ వనవాసిని’ అని పేరు. హేమంతఋతువు మొదటి నెల మార్గశీర్షంలోని తొలి రోజున నందుని మందలో ఉన్న గోపకన్యలు వేకువనే నిద్ర లేచారు; కాళిందీ నదికి వెళ్ళి స్నానాలు చేసారు; నది గట్టున గౌరీదేవి ప్రతిమను రూపొందించారు; సురభి కుసుమాలతో అలంకరించారు; చందనం పూసారు; ధూపదీపాలు, రకరకాల నైవేద్యాలు సమర్పించారు. “భగవతీ కాత్యయని! దయతో మా కందరికీ శీఘ్రంగా శ్రీకృష్ణుణ్ణి పతిగా ప్రసాదించమ్మా. ఓ తల్లీ! శ్రీకృష్ణుడు మాకు ప్రాణేశ్వరుడు అయిన రోజు మే మందరమూ నేతివసంతాలు ఆడుతూ పరమ భక్తితో నీకు జాతర చేస్తాం.” అని దేవికి నమస్కరించి, హవిషాన్నాలు భుజించారు. మార్గశిరమాసం నెలరోజులూ ఆ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించాలి. వ్రతాన్ని ఆరంభించారు గోపికలు. అలా కొద్దిరోజుల గడిచింది. ఒకరోజు గోపికలు తెల్లవారగట్ల మేల్కొన్నారు. “రండి రండి” అని తమ స్నేహితురాళ్ళను పేరు పేరున పిలుచుకుంటూ, చనుగవ బరువుకి నడుములు ఊగిస లాడుతూ ఉండగా, ఒకరి చేయి మరొకరు పట్టుకుని బయలుదేరారు కమలాక్షుని మీద పాటలు పాడుతూ సమద గజేంద్ర గమనులై యమునానదీ తీరానికి చేరుకున్నారు. ఇలా ఆ గజగమనలు కాళిందీనదీ తీరాన చేరి ఒక ఏకాంత స్థలంలో కోకలు విడిచిపెట్టారు. కళంకరహితలు అయిన ఆ కలువకన్నుల సుందరాంగులు జలకాలాడటం కోసం మనసులో ఏ జంకు లేకుండా పట్టుదలతో నదిలో నీటిలోకి దిగారు. వారు అలా స్నానం చేస్తున్న సమయంలో, కృష్ణ పరమాత్మ ఈ విషయమును తెలుసుకున్నారు. ఇప్పుడు గోపకాంతలు, కాత్యాయనీ దేవి ఉపాసన చేసి ఫలితమును అడుగుతున్నారు. ఫలితము ఇవ్వడానికి, కృష్ణుడు వస్తున్నాడు. వాళ్ళ భక్తి అంత గొప్పది. కానీ వారు చేసిన కర్మయందు తేడా వచ్చింది. ఆ దోషము ఉన్నంత సేపు, అది ప్రతిబంధకంగా నిలబడుతుంది. ఫలితమును ఇవ్వడం కుదరదు. ఈశ్వరానుగ్రహం కలిగితే, ఏది ప్రతిబంధకంగా ఉన్నదో, దానిని ఈశ్వరుడు తీసివేస్తాడు. ఈ ప్రతిబంధకమును, కాత్యాయనీ దేవి తియ్యాలి. కానీ యిక్కడ ప్రతిబంధకమును తొలగించడానికి, కృష్ణుడు వస్తున్నాడు. దీనిని బట్టి కాత్యాయని, కృష్ణుడు, వేర్వేరు కాదని, మనం అర్థం చేసుకోవాలి. కాత్యాయని ఆడది, కృష్ణుడు పురుషుడు. "అదెలా కుదురుతుంది?" అని, మనకి అనుమానం రావచ్చు. కానీ పరమేశ్వరుడికి రూపం లేదు. ఆయన జ్యోతి స్వరూపము. కంటితో మేము చూడకుండా ఉండలేము, అన్నవారి కోసమని, ఒక సగుణమయిన రూపం ధరించి, పరమాత్మ, ఈ భూమిమీద నడయాడాడు తప్ప, అదే ఆయన స్వరూపo అంటే, అది ఎప్పుడూ, ఆయన స్వరూపం కాదు. ఇప్పడు ఇక్కడ అంతటా వున్నవాడు, సాకారత్వమును పొంది, ఫలితమును యివ్వడానికి, కృష్ణుడిగా వస్తున్నాడు. కృష్ణుడు, గోపాల బాలురందరినీ పిలిచి, మీరందరూ నిశ్శబ్దంగా, ఇక్కడినుండి వెళ్ళిపొండి" అన్నాడు విశ్వవిభుడూ, ఆది దేవుడూ అయిన ఆ చిన్ని కృష్ణుడు. చిన్న పిల్లవాడి లాగ తోటిపిల్లలతో కూడి పరిహాసానికి ఆడువారి అంబరములు అపహరించి మత్తగజేంద్రుడిలా యమునానది జలకణాలచే చల్లపడిన పిల్లవాయువుల వలన కలిగే ఆనందంతో నడచి ఒక కడిమిచెట్టు ఎక్కాడు. అతడు ఎక్కగానే ఆ చెట్టు వృక్ష జన్మం వల్ల తనకు కలిగిన సంతాపాన్ని అంతా వెంటనే పోగొట్టుకుంది. ఇంతలో స్నానాలు పూర్తయ్యాయోమో! చీరెలు కోసం ఒడ్డుకేసి చూశారు గోపికలు. లేవక్కడ. ఆందోళన చెంది, అటూ ఇటూ చూశారు. చెట్టుమీద చీరెలు పట్టుకుని కూర్చున్న చిన్నికృష్ణుడు కనిపించాడు. నవ్వుకున్నారు. అలా కృష్ణుడు బట్టలు పట్టుకుపోడం చూసిన ఆ యాదవ యువతులు ఇలా అన్నారు. "మామా వలువలు ముట్టకు మామా! కొనిపోకుపోకు మన్నింపు తగన్ మా మాన మేల కొనియెదు? మా మానసహరణ మేల? మానుము కృష్ణా! "నాయనా! కృష్ణా! మా బట్టలు తాకవద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు. గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్ధమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం “మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది కృష్ణా! మా మనసులు దొంగిలించావు; మా మానాలు అపహరించావు; మా సిగ్గులు దోచావు; మా వస్త్రాలు పట్టుకుపోయావు; ఇంకా ఏమి చేయబోతున్నావో ఏమిటో తెలియము; ఓ కొంటెగోపాలా! నీ గుట్టు కనిపెట్టేసామయ్యా! రాజీవలోచనాల నల్లనయ్యా! రాజుల మర్యాదలంటే ఏమో నీకు తెలిసినట్లు లేదు. బలవంతుడై నట్లు ప్రవర్తిస్తున్నావు. మేము అబలలము మా వలువలు మాకు ఇయ్యకున్నావు. మేము నందరాజుకు ఈ విషయం చెప్తాము. నీవేమైనా ఈ దేశానికి రాజువా, ఏమిటి?” ఇలా గోపికలు అంటున్న మాటలు శ్రీకృష్ణుడు విన్నాడు. ఆయన ముఖపద్మం ముసిముసి నవ్వులతో చక్కగా అయింది. తోటి గొల్లపిల్లల చేతులతో చేతులు కలిపినెరజాణలలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ వనితలతో ఇలా అన్నాడు. “నిండుజాబిలి లాంటి గుండ్రటి మోములు కల ముగుదలులారా! ఆడువారు అవనీపతులతో మీలా ప్రవర్తిస్తారా? కొంచెము కూడా మొహమాటం లేకుండా నన్ను నిందిస్తున్నారే; కానీ, మీ తప్పు మీరు చూసుకోడం లేదు; నీటిలో నుండి వెంటనే బయటకు వచ్చి, నా దగ్గరకు రండి; మీ వలువలు తీసుకోండి; ఇదిగో ఇప్పుడే మీ కిచ్చేస్తాను.” శ్రీకృష్ణుని పలుకులు వినిన అభిమానవతులైన ఆ గొల్లస్త్రీలు ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు మనసు మర్మాలను హరించే మాధవుని మాటలకు బదులు పలకడానికి వారు లజ్జితులయ్యారు. ఎక్కుగా ఉన్న చలికి గడగడ వణుకుతూ గొంతు లోతు నీళ్ళలో నిలబడి వెనుక ముందుకు ఊగిసలాడుతున్న మనసులతో వారు ఇలా అన్నారు. “అల్లరివాడివై మా వలువలు ఎందుకు దోచాసావు? అందరిలోకి నువ్వే మహా గొప్ప ధర్మపరుడవు కదా. నీవు ఏమన్నా తక్కువవాడవా ఏమిటయ్యా? నీకు తెలియనిది ఏముందిలే. కృష్ణా! ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు. మగవాళ్ళు ఆ ఛాయలకు వస్తారా? వచ్చారే అనుకో దయలేకుండా ఎక్కడైనా ఇలాంటి అల్లరి పనులు చేస్తారా? ఔరా! ఈ విచిత్రమైన చర్యలు నీకే సరిపోయాయిలే. మరింక ఎక్కడా ఉండవు. నీకు బానిసలై ఉంటాము కాని మా కోకలు మాకిప్పించు. కృష్ణా! నీవు పిలవగానే వస్తాము. నీ వేది కోరినా ఇస్తాము. నీ వెక్కడికి పొమ్మన్నా పోతాము. ఇప్పుడు మా చీరలు మాకిచ్చేసి దయతో మమ్మేలుకో.” గోపికల మాటలువిని చిరునవ్వుతో శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు. . . “ఓ పడతులారా! ఏ పడచువాడిని పతిగా కోరి మీరు ఈ వ్రతం చేస్తున్నారో నిజం చెప్పండి, అసత్యమాడితే మీ మీద ఒట్టు సుమా. ఈ వలపు మీకు మాత్రమే పుట్ట లేదు లెండి. లోకంలో సర్వత్రా ఉన్నదే కదా. మీరు ఎవరిని చూసి మోహించారు? మీ మానధనం అపహరించిన ఆ మగవాడు ఎవరు? ఎవరి మీద మీకు ప్రణయం నెలకొన్నది? నేనేమైనా పరాయివాడనా! నిజం చెప్పండి. అని కృష్ణు అడిగిన మాటలు విని గొల్లచెలియలు ఒకరి నొకరు చూచుకున్నారు. వారి హృదయపద్మాలలో మరులు హెచ్చాయి. వారు నవ్వుతూ మిన్నకున్నారు. అప్పుడు లోకమాన్యుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు “ఓ వనితలారా! నా ఇంటిదాస్యం చేస్తూ నా అజ్ఞ ప్రకారం మీరు నడచుకుంటామంటే, మీ చీరలు మీకిస్తాను. నీటిలో నుండి బయటకు రండి.” ఆ కృష్ణుడి మాటలు విన్నారు. సన్నని నెన్నడుములు కల ఆ గొల్లభామలు చలికి భయపడి నీటిలో ఉండ లేకపోయారు. చలికి గడగడ లాడుతూ ఆ కన్నెలలో కొందరు “బయటకు వెళదాం” అంటారు; “వెళితే శ్రీ కృష్ణుడు మన సిగ్గు తీయడం తధ్యం” అంటారు మరికొందరు; ఇంకొందరు ఎటూతోచక తమలో ఆందోళన చెందుతున్నారు. చిట్టచివరకు ఎలాగో మనసులు దిటవు పరచుకుని సన్నని నడుములు కల ఆ గోపకన్యలు నీటిలో నుండి బయటకు వచ్చారు. ఆ స్త్రీలు చిగురుటాకువలె మృదువైనవీ; నవరత్నాలు పొదిగిన బంగారుగాజుల కాంతితో మిలమిల మెరిసేవి; అయిన తమ చేతులతో మర్మాంగాలు దాచుకుని మడుగు నుండి క్రమంగా బయటకు వచ్చారు. మెల్లగ నడిచే ఆ గొల్లభామలు తమలో పెద్దవారు అయిన పడతులను ముందు నిలుపుకుని, చిరునవ్వులు చిందిస్తూ, కమలనేత్రుని ఎదుట నిలిచారు. అప్పుడు కృష్ణుడు వారితో ఇలా అన్నాడు . “అమ్మాయిలూ! ఎందుకు సిగ్గుపడతారు? చిన్నప్పటి నుంచీ మీతోనే పెరిగాను కదా. ఎప్పుడూ మీతోనే ఉన్నాను. నాకు తెలియదా. నేను చూడని రహస్యం ఏముంది. మీరు కాత్యాయనీ వ్రతదీక్షను ఆచరిస్తూ కూడా చీరలు ధరించకుండా, నియమం విడిచిపెట్టి జలకాలు ఆడవచ్చునా? ఇది అంబికాదేవికి అపరాధం చేయడమే కదా. ఈ విధముగా నోమునోచే జవ్వనులు ఎక్కడైనా ఉంటారా? వ్రతఫలం దక్కాలని మీరు అనుకుంటే చక్కగా చేతులెత్తి నాకు నమస్కరించండి. నా చెంతకు వచ్చి మీ బట్టలు పుచ్చుకోండి. సిగ్గు చెడేటట్లు చెప్పడం ఎందుకు? ఇలా దెప్పడం ఎందుకు?” అభిమానవతులైన ఆ యువతులు పరమపురుషుని పలుకులు విని ఇలా తమలో ఆలోచించుకుని. . అభిమతాలైన వ్రతాలు ఆచరిస్తూ ఒక్కసారి ఏ ఉత్తమశ్లోకుడిని స్మరిస్తే వ్రతభంగాలన్నీ తొలగిపోతాయో అట్టి వరాలు ప్రసాదించే పరాత్పరుణ్ణి ఆ గొల్లభామలు వీక్షించారు. కట్టుకోకలు విడచి స్నానమాడటం వ్రతభంగం అవ్న సంగతి తెలుసుకుని, వారు జంకారు. అందరూ అరవిందాల వంటి అందమైన తమ హస్తాలను నుదుట ఉంచుకుని కృష్ణుడికి ఒయ్యారంగా మ్రొక్కారు. శ్రీ కృష్ణుడు దయామయుడు. భక్తజన పరిపాలకుడు. అందుకనే మిక్కుటమైన చలిగాలికి వణుకుతున్న వారూ నెన్నొసట చేతులు ఉంచి మ్రొక్కుతున్నవారూ అయిన ఆ చెలువలకు వలువలు ఇచ్చేసాడు. చీర లపహరించి సిగ్గులు విడిపించి పరిహసించి యైనఁ బరఁగ మనకు ఘనుఁడు నోము కొఱఁతగాకుండ మ్రొక్కించె ననుచు హరి నుతించి రబలలెల్ల “చీరలు దొంగిలించినా, సిగ్గులు దీసినా ఎగతాళి చేసినా చివరకు వ్రతలోపం జరగకుండా మన మ్రొక్కులు అందుకున్నాడు” అంటూ ఆ సుందరులు అందరూ కృష్ణుడిని సంతోషంగా అభినందించారు. ఈ విధంగా నారాయణుడు ఇచ్చిన చీరలు ఆ నారీమణులు ధరించారు. అతని పట్ల అచంచలమైన ప్రణయం కలవారు అయినప్పటికిని, కనురెప్పలు మూయక చలింపక, అలాగే నవనీతచోరుణ్ణి అవలోకిస్తూ నిలపడ్డారు. చతురుడైన స్వామి వారి చెంతకు చేరి ఇలా అన్నాడు “ఓ శుభలక్షణవతులైన సుందరీమణులారా! బిడియపడి చెప్పటంలేదు కాని, మీ హృదయ రహస్యం నాకు తెలిసిపోయింది. మీరు నన్ను పతిగా పొందడం కోసం వ్రతం చేపట్టారు. నా వలన మీ నోము పండుతుంది. నన్ను సేవిస్తే కైవల్యమే కరతలామలకం అవుతుంది. కోరిన కోరికలు ఈడేరుతాయి. అని వేరుగా చెప్పడం ఎందుకు? ఇందుకు తోడుగా మీరు గౌరీవ్రతం పరిసమాప్తి చేస్తే రాత్రులందు నాతో కలయిక మీకు లభిస్తుంది. నా మాటలు నమ్మి, మీరు ఇండ్లకు వెళ్ళిపొండి.” అని కృష్ణుడు పలికాడు గోపికలు తపస్సు ఫలించిందని హరి పాదపద్మాలు మదిలో తలచుకుంటూ ఆనందంగా వ్రేపల్లెవాడకు వెళ్ళిపోయారు.

🚩🚩

Comments

Popular posts from this blog

🔴-అచ్చ తెలుగు పదాలు.-🔴

💥🌺గజేంద్ర మోక్షం పద్యాలు.🌺💥

🚩🚩ఉషా పరిణయం.🚩🚩