🚩🚩-వామనావతారం -🚩🚩


🚩🚩-వామనావతారం -🚩🚩

 #అదితి ""స్వామీ! నా కుమారుడయిన దేవేంద్రుడు రాజ్య భ్రష్టుడు అయ్యాడు. నా కుమారునికి రాజ్యం ఇవ్వవలసింది" అని అడిగింది. 

ఇపుడు ఈశ్వరుడు అదితిని వరం అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి! వరము అడగడానికి కూర్చున్న అదితిని #నారాయణుడు వరము అడుగుతున్నాడు. "అమ్మా! నాకు నీ కొడుకునని అనిపించుకోవలెనని ఉంది. నీ గర్భవాసము చేయాలని అనిపిస్తోంది. నీ కొడుకుగా పుడతాను" అని అడిగాడు. 

అలా అడిగేసరికి అదితి తెల్లబోయింది. ఆడపు ఆమె అంది "స్వామీ నాకు అంతకన్నా భాగ్యమా! తప్పకుండా" అన్నది. అపుడు స్వామి "నీ భర్తను ఇదే రూపంతో ఇంతకు పూర్వం ఏ భక్తితో ఉన్నావో అలా నీ భర్తను సేవించు. నేను నీ భర్తలోకి ప్రవేశించి ఆయన తేజస్సుగా నీలోకి వస్తాను" అన్నాడు. ఎంత యథాపూర్వకంగా పుట్టాడో చూడండి. ఆమె గర్భమునందు ప్రవేశిస్తే బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారు. ఇపుడు అదితి గర్భం గర్భాలయం అయింది.

 అమ్మ కడుపులో ఉండవలసిన కాలము పూర్తి అయిన తరువాత మంచి ముహూర్తం చూసుకొని శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అభిజిత్ సంజ్ఞాత లగ్నంలో ఆయన జన్మించాడు. ఆయన పుడుతూనే ఉపనయనం చేసుకోవలసిన వయస్సు పొందిన బాలుడిగా జన్మించాడు. 

పుడుతూ #శంఖ చక్ర గదా పద్మములతో#శ్రీమన్నారాయణుడిగా పుట్టాడు. అదితి స్తోత్రం చేసింది. కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు. వెంటనే ఆయన తన రూపమును ఉపసంహారం చేశారు. ఉపనయనం చేసుకునే వయస్సున్న వటువుగా బ్రహ్మచారిగా ఇంచుమించుగా ఎనిమిది సంవత్సరముల పిల్లవానిగా మారిపోయాడు. 

వటువుకి కశ్యప ప్రజాపతి ముంజెగడ్డితో చేసిన మొలత్రాడు ఇచ్చారు. తల్లి అదితి కౌపీనం ఇచ్చింది. బ్రహ్మగారు కమండలం ఇచ్చారు. సరస్వతీ దేవి అక్షమాలను ఇచ్చింది. సూర్యభగవానుడు ఆదిత్య మండలము నుండి క్రిందికి దిగి వచ్చి గాయత్రీ మంత్రంను ఉపదేశం చేశాడు. చంద్రుడు చేతిలో పట్టుకునే మోదుగ కర్రతో కూడిన దండమును ఇచ్చాడు. ఇంతమందీ ఇన్ని ఇస్తే కృష్ణాజినంతో కట్టుకునే నల్లటి జింక చర్మమును దేవతలు పట్టుకు వచ్చి ఇచ్చారు. 

యజ్ఞోపవీతమును పట్టుకుని దేవతలా గురువైన బృహస్పతి వచ్చారు. వీళ్ళందరూ ఉపనయన మంత్రములతో పిల్లవానికి సంస్కారములన్నీ చేశారు. భిక్షాపాత్రను సాక్షాత్తు కుబేరుడు ఇచ్చాడు. #భవానీ మాత వచ్చి పూర్ణ భిక్ష పెట్టింది. 

ఇది తీసుకొని మహానుభావుడు బయలుదేరి బలిచక్రవర్తి కూర్చున్న చోటికి వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. బలిచక్రవర్తి మహా తేజస్సుతో వస్తున్న వటువును చూశాడు. వటువు బ్రహ్మచారి కాబట్టి రాజును ఆశీర్వచనం చేయవచ్చు. అందుకని వటువు అన్నాడు "ఓహో! నీవేనా బలిచక్రవర్తివి. నీవేనా భూరి దానములు చేసే వాడివి. నీకు స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభము. ఇలా బలిచక్రవర్తిని చూడగానే ఆశీర్వదించాడు.

బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించాలి. అపుడు బలిచక్రవర్తి వెంటనే లేచి నిలబడి వింధ్యావళిని బంగారు పళ్ళెమును తీసుకురమ్మనమని చెప్పాడు. వటువును ఉచితాసనము మీద కూర్చోబెట్టి ఆ బంగారు పళ్ళెమును వటువు కాళ్ళ క్రింద పెట్టి ఆయన పాదములు కడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకమును శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు.⁠⁠⁠⁠

(#అష్టమ స్కంధము - వామనావతారం - )

"నాయనా వడుగా! నీవు ఎవరి వాడివి? ఎక్కడ ఉంటావు? నీవు రావడం వలన ఇవాళ ఈ కాలము మంగళప్రదమయింది. బ్రహ్మచారీ! వడుగు చేసుకొనిన వాడవు నీవు వచ్చావు. ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నీవు రాగానే అగ్నిహోత్రం మహా ప్రకాశంతో పైకి లేస్తోంది. నీరాక వలన నా వంశము నా జన్మ సఫలం అయిపోయాయి. ఇంతకుముందు 99యాగములు చేశాను. ఇది నూరవది. నా జన్మ ధన్యమయింది" అన్నాడు. ఇపుడు బలిచక్రవర్తి అడిగిన ప్రశ్నలకు వామనుడు ఒక నవ్వు నవ్వి "ఓ చక్రవర్తీ! నేను ఒకచోట ఉంటాను అని చెప్పలేను. అంతటా తిరుగుతుంటాను. ఒకళ్ళు చెప్పినట్లు వినడం నాకు అలవాటు లేదు. నే చెప్పినట్లే ఇంకొకరు వింటూ ఉంటారు. నాకు ఏది తోస్తే అది నేను చేస్తాను. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు అది చదువుకోలేదు, అది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుంది~ ప్రపంచంలో ఎన్ని చదువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చునని నీవు అనుకో! పైగా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమే. కానీ నేను మూడు రకములుగా మాత్రం ప్రవర్తిస్తూ ఉంటాను. నాకు చుట్టమనేవాడు ప్రపంచంలో ఎవడూ లేదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. బ్రహ్మచారి ఎక్కడ మంచిమాట వినబడితే అక్కడ వినాలి. అందుకని మంచి వాళ్ళదగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఎవరు నన్ను కోరుకుంటుంటారో వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను" అన్నాడు. ఆ మాటలను విన్న బలిచక్రవర్తి ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలున్నాయో అని ఆశ్చర్యపోయాడు. పొంగిపోయి "పిల్లవాడా! నిన్ను చూస్తె నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వటువువి. నేను చక్రవర్తిని కాబట్టి నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో".

వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో

హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో

కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో

ధరణీ ఖండమొ కాక ఏమడిగెదో దాత్రీ సురేంద్రోత్తమా!!

ఈ భూమిమీద పుట్టిన అద్భుతమయిన బ్రహ్మచారీ! నీకేమి కావాలో అడుగు. ధనమా? గోవులా? కన్యలా? రథములా? బంగారమా? వజ్రములా? రాజ్యములో భాగమా? నీకు ఏమి కావాలి? నేను ఏదయినా ఇవ్వగల సమర్థుడిని. నీకు ఏమి కావాలో అడుగు. నీకిచ్చేస్తాను" అన్నాడు. అపుడు వామనుడు నవ్వి "నాకు ఏది కావాలంటే అది నీవు ఇస్తావా! నేను అల్పమునకు సంతోషించేవాడిని. కాబట్టి నాకు నీవు ఇవ్వగలిగినదేమిటి? నేను తృప్తి పొందేవాడిని. అయినా ఏదో ఒకటి పుచ్చుకోమని నీవు అడిగావు కదా! నాకు ఒకటి రెండు అడుగుల నేల ఇవ్వు. చాలామంది దీనిని కూడేసి బలిచక్రవర్తి మూడడుగుల నేల ఇమ్మనమని అడిగాడు అని చెపుతారు. వామనుడు అలా అడగలేదు. నీవు నాకు ఒకటి రెండడుగుల నేలను ఇస్తే దానితో ఒక అడుగుతో ఊర్ధ్వలోకములను కొలుస్తాను. ఒక అడుగుతో అధో లోకములను కొలుస్తాను. మూడవ అడుగు పెట్టడానికి మళ్ళీ నిన్ను చోటు అడుగుతాను. నీవు కానీ ఒకటి రెండు అడుగులు నేలను ఇచ్చాను అని అంటే నేను బ్రహ్మానందమును పొందేస్తాను. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాను" అన్నాడు.

అపుడు బలిచక్రవర్తి "నీవు పిల్లవాడివి. నీకు అడగడం కూడా చేతకాదు. నీవు మూడు అడుగుల భూమిని కొలిస్తే నీకు ఎంత వస్తుంది? నేను బ్రహ్మాండముల నన్నిటిని జయించిన వాడిని. మూడడుగుల నేలా నేను నీకు ఇవ్వడం! ఇంకేదయినా అడుగు. నీవు ఏది అడిగితె అది ఇస్తాను" అన్నాడు.

వామనుడు ఆశ్రమ ధర్మమును పాటించాడు

గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,

వడుఁ గే నెక్కడ" భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ

డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

"అవన్నీ ఇస్తానంటావేంటయ్యా! నేను బ్రహ్మచారిని. బ్రహ్మచారిని పట్టుకుని వరచేలంబులు, మాడలు, ఫలములు, వన్యంబులు, గోవులు మొదలయిన వాటిని పుచ్చుకొనమంటావేమిటి? వాటిని నేను పుచ్చుకోకూడదు. నేను గొడుగు, యజ్ఞోపవీతము, కమండలము, ముంజి, దండము మొదలయిన వాటిని మాత్రమే అడగాలి. నాకెందుకు ఇవన్నీ? నాకివన్నీ అక్కరలేదు. నేను జపం చేసుకోవడానికి నేను అగ్నికార్యం చేసుకోవడానికి నాకు మూడడుగుల నేల ఇస్తే చాలు" అన్నాడు. అపుడు బలిచక్రవర్తి

"ఓ వటువా! ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను. వచ్చి నీ పాదములు ఇందులో పెట్టు. వింధ్యావళీ, బంగారు చెంబుతో నీళ్ళు పొయ్యి, ఆ పిల్లవాడి పాదములు కడిగి వానికి మూడడుగుల నేల ధారపోసేస్తాను. నీళ్ళు పట్టుకొని రా" అన్నాడు. వింధ్యావళి వటువు వంక చూసి పొందిపోతూ నీళ్ళు పట్టుకు వద్దామని లోపలి వెళుతోంది. ఈలోగా బ్రహ్మచారి బంగారు పాత్రలో పాదములు పెట్టబోతున్నాడు. అపుడు అక్కడికి శుక్రాచార్యుల వారు పరుగుపరుగున వచ్చారు. "రాజా! నీచేత విశ్వజిత్ యాగమును చేయించి ఇవాళ నీకు ఇంత వైభవమును ఇచ్చాను. వచ్చినవాడు ఎవరో తెలుసా? ఏమయినా మాట యిచ్చావా? అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి "గురువుగారూ, ఈ బ్రహ్మచారి మూడు అడుగుల నేల అడిగాడు. ఇస్తానన్నాను" అన్నాడు. అపుడు శుక్రాచార్యులు "రాజా! ఆ వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. ఎప్పుడూ ఆయన ఎవరి దగ్గర ఏదీ పుచ్చుకోలేదు. ఇవాళ నీ దగ్గర చెయ్యి చాపి దానం పుచ్చుకున్తున్నాడు. ఎందుకు పుచ్చుకుంతున్నాడో తెలుసా! ప్రహ్లాదుడికి నువ్వు మనవడివి. ఆ వంశంలో వాడిని ఆయన నిగ్రహించడు. ఒక మహాపురుషుడు వంశంలో ఉంటే ఆ క్రింద వాళ్ళకి ప్రమాదం ఉండదు. కాబట్టి నీజోలికి రాలేడు. అందుకని నీతో యుద్ధం చేయకుండా ఇప్పుడు నువ్వు ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన రాజ్యమును లాగి ఇంద్రునకు ఇస్తాడు. అందుకని మూడడుగులు పుచ్చుకుంటున్నాడు. నేను నా దివ్యదృష్టితో చూసి చెపుతున్నాను. ఆ రెండడుగులతో ఉత్తరక్షణం ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోతాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టను అని అడుగుతాడు. నువ్వు నీ నెత్తిమీద పెట్టించుకోవాలి. నా మాట విను. నేను నీ గురువుని కాబట్టి నీకొక గొప్ప ధర్మశాస్త్ర విషయం చెపుతున్నాను. తనకు మాలిన దానం గృహస్థు చేయనవసరం లేదు. మాట యిచ్చినా తప్పవచ్చు. ఇంకొక మాట కూడా చెపుతున్నాను.

వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణ విత్తమాన భంగమందు

జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందదధిప!!

శుక్రాచార్యుల వారు రాక్షస నీతి చెప్పారు. మనం చేయకూడదు. దానిని ప్రాణ భయంతో ఉన్నప్పుడు రాక్షస నీతిగా ఆయన చెప్పారు. అంతేకానీ ఈ నీతి మనందరి కోసం కాదు. ఆయన చెప్పిన విషయం "ఆడవారి విషయంలో, వివాహ విషయంలో, ప్రాణం పోయేటప్పుడు, డబ్బులు పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, అబద్ధం చెప్పవచ్చు. గోవుల విషయంలో, బ్రాహ్మణులను రక్షించే విషయంలో అబద్ధం చెప్పవచ్చు. దాని వలన పాపం రాదు. అందుకని మూడు అడుగుల నేల ఇవ్వనని చెప్పు. ఒక్క అడుగు కూడా ఇవ్వకు. ప్రమాదం. ఆయనను నమ్మకు" అన్నాడు.

అంటే బలిచక్రవర్తి శుక్రాచార్యుల వంక చూసి "ఎంతమాట అన్నారు! లక్ష్మీ నాథుడయిన వాడు వచ్చి నా దగ్గర చెయ్యి చాపాడని మీరే చెపుతున్నారు.

ఆదిన్ శ్రీసతి కొప్పుపై దనువుపై నంసోత్తరీయంబుపై

బాదాబ్జమ్ములపై గపోలతటిపై బాలిండ్లపై నూత్న మ

ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్

గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే!!

"ఆయన చేయి లక్ష్మీ అమ్మవారి కొప్పుపై పడుతుంది. ఆచేయి ఆవిడ శరీరమును నిమురుతుంది. ఒక్కొక్కసారి చేతితో ఆవిడ పమిట పట్టుకుని ఆడుకుంటాను. ఒక్కొక్క సారి ఆ చేతితో ఆవిడ పాదములు పట్టుకుంటాడు. అమ్మవారి బుగ్గలను నిమురుతాడు. ఆ చెయ్యి లక్ష్మీదేవిని పొంగి పోయేటట్లు చేయగలిగిన చెయ్యి. కొన్ని కోట్లమంది ఏ తల్లి అనుగ్రహమునకై చూస్తున్నారో అటువంటి తల్లి ఆ చెయ్యి పడితే పొంగిపోతుంది. దేవదానవులను శిక్షించిన చెయ్యి. భక్తుల కోర్కెలు తీర్చిన చెయ్యి. పాంచ జన్యమును పట్టుకునే చెయ్యి. ఏ చేయి వరదముద్ర చూపిస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చెయ్యి భిక్ష కోసమని క్రింద నిలబడుతోంది. నా చేయి పైదవుతోంది. నాకీ అదృష్టం చాలదా! మళ్ళీ పుడతానా? రాజ్యం ఉండిపోతుందా? దేహం ఉండిపోతుందా? పోతే పోనీ ఈ రాజ్యముకాదు, ఈ శరీరము కాదు నేను కాదు ఏది పోయినా పరవాలేదు".

కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?

వారేరీ సిరిమూటఁగట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ.

బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై.

యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యి క్కాలమున్? భార్గవా!!

"ప్రపంచంలోనికి ఎంతోమంది రాజులు వచ్చారు. వచ్చిన వారందరూ తాము భూమికి పతులమని పరిపాలించామని అన్నారు. వారేరి? నాది నాదని ఇంత సంపాదించాను అని అన్నారు. ఏ కొద్ది కూడా పట్టుకెళ్ళిన వాడు ఈ భూమిమీద లేడు. కీర్తిని ఆశించి ఆనాడు శిబి మొదలయిన మహాపురుషులు అద్భుతమయిన దానములు చేశారు. వాళ్ళు యశోశరీరులై నిలబడిపోయారు. అంతేకానీ ఇవన్నీ మూట కట్టుకుని నేను దాచుకుంటే ఈ రాజ్యం ఉండిపోతుందా! ఈ శరీరం ఉండిపోతుందా! నాకు రాజ్యం తీసేస్తాడు, దరిద్రుడను అయిపోతానని అంటున్నావు కదా! నా స్వామి చేతికి నా రాజ్యం అంతా ఇచ్చిన వాడిని నేను అనిపించుకుని నేను భిక్షువునై తిరుగుతాను. నాకు బెంగలేదు. నాకు దరిద్రం రావచ్చు, జీవితం పోవచ్చు, నా ధనం పోవచ్చు. మాట పోయిన తరువాత ఆ మనిషి బ్రతికినా ఒకటే వెళ్ళిపోయినా ఒకటే. భూదేవి మనుషుల సంఖ్యను చూసి భయపడదు. మాట తప్పే వాళ్ళ బరువును తాను మోయలేనని ప్రార్థన చేస్తుంది. నేను అటువంటి జాబితాలో చేరను. నేను దానం చేసేస్తాను" అన్నాడు. అపుడు శుక్రాచార్యుడు "నేను నా తపశ్శక్తితో అమృతం తాగిన వాళ్ళని ఓడిపోయేటట్లు చేశాను. ఇవాళ మళ్ళీ నీవు నీ గురువు మాట కాదన్నావు. కాబట్టి ఇపుడు నిన్ను శపిస్తున్నాను. ఉత్తర క్షణం నీవు రాజ్యభ్రష్టుడవు అవుతావు గాక!" అని శపించాడు.⁠⁠⁠⁠

అష్టమ స్కంధము - వామనావతారం - 3

వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారు పళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి అక్కడ కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ అమృత పాత్ర నాగలి అలాంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లని పాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూశాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదమేదున్నదో ఆ పాదమును చూశాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూశాడు. చూసి పొంగిపోయి బంగారు పాత్ర ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకోని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూశాడు. బాలి చక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇచ్చేస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నాడు. కానీ నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి, చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచే సరికి కళ్ళు పెట్టి చూస్తున్న శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది అపుడు బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసేశాడు.

వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.

ఇంతింతై వటుడింతై. ఇంతింతై, వటుడింతై, మరియు తానింతై, నభోవీధి పై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై!!

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలో నుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై

శ్రవ ణాలంకృతి యై గళాభరణ మై సౌవర్ణ కేయూర మై.

ఛవిమ త్కంకణ మై కటిస్థలి నుదంచ ద్ఘంట యై నూపుర.

ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్!!

వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా ఉంది. తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. అపుడు సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయిపొయింది. ఇంకా దాటారు అపుడు పాదములకు పెట్టుకున్న అందెలా అయిపొయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్ర పీటలా అయిపోయిందట. అనగా బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలి చక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది" అని అడిగాడు. అపుడు బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ,

బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున,

నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!!

నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించదానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. అపుడు బలిచక్రవర్తి ‘వేళకాని వేళ క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు నాకు ఈ సిరిని ఇచ్చాడో వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. కాబట్టి మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసి కూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథ రక్షకుడని పేరు. నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కులా వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. ఇపుడు బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వచ్చాడు. బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడు. ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ! ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

అపుడు శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను ఇప్పుడు వీనిని రక్షించాలి. వానిని వరుణ పాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. కాబట్టి అతనికి నేను ఏమి యిస్తానో తెలుసా? సావర్ణి మనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము. కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుంటాను. నాలో కలిపేసుకుంటాను. అప్పటి వరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పది దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు. ఇది నా శాసనం. సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ ఉండవు. అటువంటి లోకాన్ని ఏలే వాడై ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. కానీ ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భృగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి యిప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు యింత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం యిస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణ పాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణి మనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.

‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి యిచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసమునిస్తాను. వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.🙏🏿🙏🏿🙏🏿


Comments

Popular posts from this blog

#శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!

🚩🚩-మను చరిత్ర - ఒక ఆలోచన! (From -Vision of Indian philosophy)

#కోటబుల్‌_కోట్స్‌_మాయాబజారు !!